చైనాలో భారీ వరదలకు 20 లక్షల మంది జీవితాలు అతలాకుతలం

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర చైనాలోని షాన్‌షీ ప్రావిన్స్‌లో వరదలు ముంచెత్తాయి. పదిహేడు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
గత వారం కుండపోతగా కురిసిన వర్షాలకు అనేక భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. 70కి పైగా జిల్లాల్లో, నగరాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
సుమారు మూడు నెలల క్రితం హెనన్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 300ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్‌లో వరద నీటితో ఉప్పొంగుతున్న నదిలో ఒక బస్సు పడిపోయింది. ఈ దుర్ఘనటలో ముగ్గురు చనిపోయారని, బస్సులో ఉన్న 51మందిలో 11 మంది గల్లంతయ్యారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అనేక పురాతన కట్టడాలకు షాన్‌షీ నిలయం. భారీ వర్షాలకు ఆ కట్టడాలన్నింటికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
1,20,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించారని, షాన్‌షీ ప్రావిన్స్ అంతటా 17,000 ఇళ్లు కూలిపోయాయని అధికారులు జిన్హువా వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొండచరియ విరిగిపడడంతో నలుగురు పోలీసు అధికారులు మరణించారని, హెనన్ వరదల కన్నా షాన్‌షీ వరదలు ఉధృతంగా ఉన్నాయని ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
షాన్‌షీ రాజధాని తైయువాన్‌లో గత వారం సగటున 185.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
"ఈ ఏడాది యెల్లో రివర్ మట్టం చాలా ఎక్కువగా ఉంది. వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు కూలిపోయాయి. అయితే, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు" అని యెల్లో నది ఒడ్డున ఉన్న నివసిస్తున్న ఓ మహిళ చెప్పారు.
షాన్‌షీ ప్రావిన్స్‌లో బొగ్గు ఉత్పత్తి అధికం. భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లో, రసాయన కర్మాగారాల్లో పనులు నిలిపివేయాల్సి వచ్చింది.
ఇప్పటికే, చైనాలో విద్యుత్ కొరత అధికంగా ఉంది. ఫలితంగా కోతలు పెరిగాయి. పోర్టులు, ఫ్యాక్టరీలలో విద్యుత్ వినియోగాన్ని అక్కడి ప్రభుత్వం పరిమితం చేసింది.
60 బొగ్గు గనుల్లో, 372 ఇతర గనుల్లో, 14 ప్రమాదకరమైన రసాయన కర్మాగారాల్లో ఉత్పత్తిని నిలిపివేశామని స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.
అక్టోబర్ 4 నుంచి 27 ఇతర బొగ్గు గనుల్లో ఇప్పటికే పనులు నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- యూపీ: ‘రైతుల్ని కారుతో గుద్ది చంపిన కేసు’లో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్
- 'గుర్తు తెలియని వస్తువు'ను ఢీకొట్టిన అమెరికా అణు జలాంతర్గామి
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- చైనా: రేప్ ఆరోపణలు రావడంతో ‘బిజినెస్ డ్రింకింగ్’ కల్చర్‌ను దుమ్మెత్తిపోసిన సోషల్ మీడియా
- ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గూటికి చేరడం వల్ల ఎలాంటి మార్పులు రావచ్చు?
- అస్సాంలో ముస్లిం యువకుడి హత్యపై ఓఐసీ ప్రకటన.. ఇస్లామిక్ దేశాల జోక్యంపై భారత్ ఏమందంటే..
- హెటిరో ఫార్మా సంస్థలో ఐటీ సోదాలు, రూ. 142 కోట్ల నగదు స్వాధీనం
- పాకిస్తాన్లో భూకంపం, స్పెయిన్‌లో బద్దలైన అగ్నిపర్వతం... ఈ వారం విశేషాల ఫోటో ఫీచర్
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








