కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అర్చకుల మధ్య వివాదానికి మూలాలేంటి

- రచయిత, ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి (మల్లన్న)ఆలయంలో ఆగమ సంప్రదాయాల వివాదం నెలకొంది. వీరశైవ ఆగమానికి పెద్ద పీట వేసి, తమ సంస్కృతిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కొమురవెల్లి స్థల పురాణం మార్చే కుట్ర జరుగుతోందని, అంటరానితనం ప్రదర్శిస్తున్నారని ఒగ్గు పూజారులు ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలు నిరాధారమని ఆలయ అధికారులు, అర్ఛకులు కొట్టిపారేస్తున్నారు. ఆలయానికి సంబంధం లేని కొంతమంది బయటి వ్యక్తులు, రాజకీయ లబ్ది కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కొమురవెల్లి పవిత్రతను దెబ్బతీసేందుకు చూస్తున్నారని ఆలయ పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.
బయటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణలకు ఆలయంలో పనిచేస్తున్న ఒగ్గు పూజారులకు ఎలాంటి సంబంధం లేదని, తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఒగ్గు పూజారులు లిఖితపూర్వకంగా తెలిపారని కూడా పాలక మండలి వెల్లడించింది.
అయితే కొమురవెల్లి ఆలయం నుండి ఒగ్గు సంస్కృతి దూరం చేస్తున్నారని, ఒగ్గు పూజారులను అంటరానివారిగా చిత్రీకరిస్తున్నారని 'తెలంగాణ ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం' హైదరాబాద్ లోని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది.

కొమురవెల్లి-స్థలపురాణం
తెలంగాణ దేవాదాయ శాఖ తన వెబ్‌సైట్ లో కొమురవెల్లి స్థల పురాణం, ఆలయ సంక్షిప్త చరిత్ర, అక్కడ జరిగే ఉత్సవాల వివరాలు ఉంచింది. అందులో ఈ ఆలయం పేరును 'శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం-కొమురవెల్లి'గా పేర్కొంది.
అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ''కొమురవెల్లి గ్రామంలోని ఇంద్రకీలాద్రీ పర్వతంపై 11వ శతాబ్ధంలో స్వామి వారు వెలిశారు. గొర్రెల కాపరికి స్వప్నంలో కనిపించి తాను ఇంద్రకీలాద్రిపై వెలిశానని చెప్పారు.
కాకతీయుల కాలం నుండి వీరశైవ ఆగమ సంప్రదాయానికి ఆలయంలో ప్రాముఖ్యత ఏర్పడింది. స్వామి వారు యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మలను వివాహమాడారు.
దేవస్థానంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం లింగ బలిజ పూజారుల ఆధ్వర్యంలో అర్చనలు జరుగుతుండగా, యాదవ కులస్తులైన ఒగ్గు పూజారులు, చౌదరుల ఆధ్వర్యంలో రంగురంగుల పట్నాలు వేసి మేడలమ్మ, కేతమ్మలతో వివాహం జరుగుతోంది. ఒగ్గు పూజారుల ద్వారా పట్నాలు వేయించడం తరతరాల ఆచారంగా వస్తోంది''
స్వామి వారి ఆలయంలోని గంగిరేగి చెట్టు, బండారీ (పసుపు)లు భక్తుల నమ్మకాల్లో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వెబ్‌సైట్ వివరించింది.
ప్రస్తుతం ఆలయంలో దేవాదాయ శాఖ ఉద్యోగులుగా 8 మంది బలిజ అర్చకులు, పట్నాలు, బోనాల టికెట్లపై వచ్చే ఆదాయంలో సగం వాటా హక్కుతో 159 మంది ఒగ్గు పూజారులు పనిచేస్తున్నారు.

కల్యాణం సందర్భంగా వివాదం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఏటా మూడు నెలల పాటు సుదీర్ఘ జాతర జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా రెండుసార్లు మల్లికార్జున స్వామికి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
బలిజ పూజారుల ఆధ్వర్యంలో మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమం ప్రకారం కల్యాణం నిర్వహిస్తుండగా శివరాత్రి సందర్భంగా 'పెద్దపట్నం' ఉత్సవాల్లో భాగంగా ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో కల్యాణం జరుగుతుంది.
కొద్దిరోజుల కింద బలిజ పూజారుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణం సందర్భంగా వివాదం మొదలైంది. కల్యాణ వేదికపైకి రాకుండా తమను అడ్డుకున్నారన్నది ఒగ్గు పూజారుల ఆరోపణ.
కల్యాణం తంతు నుండి ఒగ్గు సంస్కృతిని దూరం చేసే కుట్ర ఇదని ఆరోపించారు.
ఈ ఘటన తర్వాత ఆలయ సంప్రదాయాలు, ఆగమంపై వివాదం మొదలైంది.
‘‘మమ్మల్ని ఆలయం నుండి దూరం చేసే కుట్ర జరిగింది. వారు హక్కుదారులు, మేము ఉత్తవారిమి అయ్యాం. ప్రతి ఏటా కల్యాణం సందర్భంగా మోడలమ్మ, కేతమ్మలకు పుస్తె, మట్టెలు, ఒడి బియ్యం సమర్పిస్తాం. అయితే మాకు అక్కడ ఏమాత్రం విలువ ఇవ్వరు. పోలీసులు మమ్మల్ని నెట్టేస్తారు.
తరాలుగా ఆలయ విశిష్టతను గ్రామాల్లో ప్రచారం చేశాం. ఆలయ ఔన్నత్యానికి అన్నిరకాల పనులు చేశాం. కానీ, మాకు ఆలయ కార్యాలయంలో కూడా విలువ లేదు’’ అని ఆలయ ఒగ్గు పూజారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొద్దుల కిష్టయ్య ఆరోపించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలయంలో ఎలాంటి సమస్యలు లేవని పత్రికా ప్రకటన విడుదల చేయడం విశేషం.

అయితే వేదికపై స్థలాభావంతో బయటి ప్రాంతం నుండి బందోబస్తుకు వచ్చిన పోలీసులు కొంతమంది ఒగ్గుపూజారులను నెట్టివేశారని, ఇందులో తమ తప్పు లేదని ఆలయ పాలక మండలి చైర్మన్ భిక్షపతి బీబీసీకి తెలిపారు.
కొమురవెల్లి ఆలయంలో ఒగ్గు సంస్కృతిని పక్కనపెడుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సందర్భంగా పలు ఆరోపణలు చేసింది.
ఒగ్గు సంప్రదాయం ప్రకారం జరగాల్సిన కల్యాణం ఆగమశాస్త్ర పద్దతిలో జరపడం, ఆలయంలో బండారు ప్రాధాన్యత తగ్గించడం, ఒగ్గు పూజారులను ఉదయం గర్భాలయానికి దూరంగా ఉంచి ఇనుప తలుపుల సందులో నుండి మైక్ ద్వారా మేలు కొలుపు సేవ చేయిస్తున్నారని ఆరోపించారు.
వీటితోపాటు ఆలయంలో వివిధ ఆర్జిత సేవా టికెట్లపై ఒగ్గు పూజారులకు డబ్బులు ఇవ్వొద్దంటున్నారని, వారిని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనీ, స్థల పురాణం మార్చే కుట్ర, ఒగ్గు సంప్రదాయం పక్కన పెట్టి కేవలం ఆగమశాస్త్రం ప్రకారమే అర్చకుల నియామకం జరపడం, మల్లన్న లగ్నతంతులో డోలు, నపీరా లాంటి సంప్రదాయ ఒగ్గు వాయిద్యాల స్థానంలో కేరళకు చెందిన సింగారిమేళం, బ్యాండ్ బృందాలకు స్థానం ఇవ్వడం ప్రధానమైనవని వారు చెబుతున్నారు.

ఇవన్నీ కొమురవెల్లి ఆలయంలో ఒగ్గు సంప్రదాయాన్ని దూరం చేసే కుట్రలని ఆరోపణలు చేశారు.
''మల్లన్న దేవుడు బండారీ (పసుపు) దేవుడు. సాంస్కృతీకరణ ఎప్పుడైతే మొదలయ్యిందో, అసంఘటితంగా ఉన్న ఒగ్గు సంస్కృతిని మెల్లిగా పక్కకు జరిపి ఆగమశాస్త్రం గర్బగుడిలో చొరబడింది.
కొమురవెల్లిలో నేర్పాల్సింది ఒగ్గు సంప్రదాయం. ఇక్కడ వేదపాఠశాల నెలకొల్పడంలోనే బండారు సంప్రదాయం గంగలో కలపాలనే ఉద్దేశం దాగి ఉంది. స్వామివారి కల్యాణంలో సింగారిమేళం ప్రవేశపెట్టి ఒగ్గు సంస్కృతిని గంగలో కలిపే హక్కు వారికి ఎవరిచ్చారు.?'' అని తెలంగాణ ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం ప్రతినిధి 'ఒగ్గు రవి' బీబీసీతో అన్నారు.
'బండారు సంప్రదాయం పోగొడితే పోయేది కాదు. భగవంతుని ఇచ్ఛ అది. భక్తులు ఈ సంప్రదాయాన్ని మానరు. త్వరలో వారే ప్రశ్నిస్తారు. ఈ అంశం భక్తుల వరకూ పోయింది. ఇది సాంస్కృతిక దాడి మాత్రమే కాదు బహుజన సంప్రదాయాన్ని అణగదొక్కే కుట్ర' అని రవి ఆరోపించారు.

వీరశైవ ఆగమమే గర్భాలయ సంప్రదాయం-బలిజ అర్ఛకుల వాదన
ప్రాచీన కాలం నుండి కొమురవెల్లిలో వీరశైవ పద్దతిలో ఆలయ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఆలయంలో అంటరానితనం అన్నది అవాస్తవమని లింగ బలిజ అర్చకులు అంటున్నారు.
‘‘ఇక్కడ వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారంగా కల్యాణం చేయడం వందల సంవత్సరాల నుండి ఉంది. ఒగ్గు పూజారులకు ముందు ఆలయంలో యాదవ కులానికి చెందిన చౌదరీలు ఉండేవారు.
నిజాం ద్వారా వచ్చిన చౌదరీలు తీసుకువచ్చిన ఒగ్గు పూజారులతో ఆలయంలో 'పట్నాలు'(ఆలయంలో వేసే పవిత్రమైన ముగ్గు) వచ్చాయి. వారు రాకకు ముందే ఈ దేవాలయం ఉంది. మేము అర్చన, పూజా కార్యక్రమాలు, స్వామివారి కళ్యాణం చేస్తున్నాం'' అని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్ బీబీసీతో అన్నారు.
‘‘మల్లికార్జున స్వామి దగ్గర అంటరానితనం లేదు. మల్లన్న దేవుడు అందరివాడు. ఇక్కడున్నది బహుజన పూజారులు. వాళ్లు బీసీలే మేము బీసీలమే. ఇక్కడెవరూ అగ్రవర్ణాల వారులేరు. ఎవర్నీ మేము దూరం పెట్టేది లేదు. ఇవన్నీ అవాస్తవమైన ఆరోపణలు’’ అని మల్లికార్జున్ చెప్పారు.

అధికారులు, పాలకమండలి ఏమంటోంది?
ఈ వివాదంపై ఆలయ కార్యనిర్వహణ అధికారి బాలాజీ బీబీసీతో మాట్లాడారు. ఆలయంలో 400 ఏళ్ల నుండి బలిజ పూజారుల ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ సంప్రదాయం ఉందని తెలిపారు. బలిజ, ఒగ్గు పూజారుల మధ్య కొన్ని పొరపొచ్చాలు వాస్తవమేనని, ఆధిపత్య ధోరణి ఉంటే ఉండొచ్చని వాటిని తొలగిస్తామని ఆయన అన్నారు.
బ్యాండ్, కేరళ వాయిద్యాల స్థానంలో కళ్యాణం సమయంలో ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామని, బయటి వ్యక్తులు ప్రచురించిన ఆలయ స్థల పురాణం చరిత్రతో తమకు సంబంధం లేదని, 'బండారీ' సంస్కృతి ప్రాధాన్యత ఎక్కడా తగ్గించలేదన్నారు.
గర్భాలయంలో స్వామివారి ఎడమ చేతిలో ప్రతినిత్యం బండారి పోస్తామని అదే భక్తులకు బొట్టుగా ఇస్తామని అన్నారు.
‘‘మాకు ఎలాంటి గొడవలు, అభ్యంతరాలు లేవని ఒగ్గుపూజారులు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. బయటి వ్యక్తులకు ఈ దేవాలయంలో పనిచేసే ఒగ్గు పూజారులతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయంగా ఎదగడానికి, పబ్బం గడుపుకోడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే మా పూజారులే వారిపై తిరగబడతారు’’ ఆలయ పాలక మండలి చైర్మన్ భిక్షపతి అన్నారు.
‘‘లింగ బలిజ అనువంశక అర్చకులు తమ మీరాశి హక్కులు వదులుకుని దేవస్థాన ఉద్యోగులుగా చేరారు. ఒగ్గు పూజారులకు పట్నాలు, బోనాల టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సగం వాటాగా ఇస్తున్నాం. ఇది సంవత్సరానికి సుమారు కోటిన్నర రూపాయలుగా ఉంది. తెలంగాణలో అన్ని ఆలయాల్లో మిరాశీ హక్కులు రద్దయినా అవి కొనసాగిస్తున్న ఏకైక ఆలయం కొమురవెల్లి మాత్రమే’’ అన్నారు భిక్షపతి.

సంప్రదాయల మార్పువల్ల కాలక్రమేణ జానపద సాహిత్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సాహిత్యకారులు అభిప్రాయపడుతున్నారు.
‘‘సమాజంలో భిన్న సంప్రదాయాలుంటాయి. పరస్పరం ఒకరి సంప్రదాయాన్ని ఒకరు గౌరవించినంత వరకు అంతా బాగుంటుంది. కానీ, వాటిని దెబ్బతీయాలని అనుకోవడం జానపదుల ఆచారాలు, నమ్మకాలను దెబ్బతీయడంగా కనిపిస్తుంది.
ఇంతకాలం సమస్య ఎందుకు రాలేదు అంటే... బలిజవారు పూజావిధానాలు నిర్వహించినప్పటికీ ఒగ్గు వారి పూజావిధానాలను అనుసరించి నిర్వహించారు. ఇవాళ ఒగ్గు విధానాల స్థానంలో ఆగమ శాస్త్రాన్ని అమలు చేయాలనుకోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది'' అని ఒగ్గు కథా సంప్రదాయాలపై పరిశోధన నిర్వహించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- ఏపీలో కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు ఎంత తగ్గుతున్నాయి, పెన్షనర్లకు ఎంత నష్టం? ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలా
- విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు: ఎవరీ వినోద్ జైన్, టీడీపీ, వైసీపీల వాదనలేంటి, సూసైడ్ లెటర్లో ఏముంది?
- మీ దగ్గర స్టార్టప్ పెట్టే టాలెంట్ ఉంటే 50 లక్షల వరకూ నిధులు.. రూ. 5 కోట్ల వరకూ గ్రాంటు పొందండి ఇలా..
- RRB: ఇరుకు గదులు.. ఖాళీ జేబులు.. కళ్లల్లో కొలువుల కలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













