కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు: నదుల అనుసంధానం, కిసాన్ డ్రోన్లు, డిజిటల్ రూపీ

‘‘ప్రజా సంక్షేమం కోసం రాజు ఎలాంటి మెతకవైఖరి లేకుండా ఏర్పాట్లు చేసి తీరాలి.. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాలి’’ అంటూ మహాభారతంలోని శాంతి పర్వం నుంచి ఒక సూక్తిని ఉటంకించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో.
ఆ పురాణం నుంచి జ్ఞానం అందుకుని తాము ప్రగతి పథంలో ప్రయాణం కొనసాగిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రత్యక్ష పన్నుల సంస్కరణల గురించి వివరిస్తూ ఆమె ఈమాట అన్నారు.
ఆదాయ పన్ను స్లాబుల్లో ఏమైనా మార్పు ఉంటుందేమోనని ఉద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ.. ఆర్థికమంత్రి ఆ ప్రస్తావనే లేకుండా ప్రసంగం ముగించారు.
అయితే.. పన్ను చెల్లింపుదారులు, పన్ను రిటర్నుల్లో పొరపాట్లు ఏవైనా ఉంటే సరిచేయటానికి.. సదరు అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన సవరించిన రిటర్నును రెండేళ్ల వరకూ దాఖలు చేయటానికి అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
మరోవైపు.. కార్పొరేట్ సర్‌చార్జ్‌ను, కో-ఆపరేటివ్ సర్‌చార్జ్‌ను 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
అదేసమయంలో.. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ ద్వారా వచ్చే ఆదాయం మీద 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
అలాగే.. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో తయారైన డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ తరహాలో.. భారతదేశపు డిజిటల్ రూపీని ఆర్‌బీఐ ఈ ఏడాది ప్రవేశపెడుతుందని ప్రకటించారు. 2022-23 సంవత్సరం నుంచి ఈ డిజిటల్ రూపీ అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిద్వారా ఆర్థికవ్యవస్థకు భారీ మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, @SANSADTV
39.44 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. 16.60 లక్షల కోట్లు అప్పు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 39,44,909 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులు రూ. 22,04422 కోట్లు కాగా.. పెట్టుబడి రాబడులు రూ. 17,40,487 కోట్లుగా ఉంటాయని చెప్పారు. పెట్టుబడి రాబడుల్లో రూ. 16,60,444 కోట్లు అప్పులుగా చూపించారు.
బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం అంచనా 10.58 లక్షల కోట్లుగా తెలిపారు. ఇది జీడీపీలో 4.1 శాతమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, బలంగా ఉండటానికి ద్రవ్యలోటు స్థాయిని 4.5 శాతం కన్నా తక్కువగా ఉంచాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈరకంగా సేకరించిన రూ. 78,000 కోట్లకన్నా ఇది తక్కువ.
2022 జనవరిలో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ. 1,40,985 కోట్లుగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్‌టీ అమలులోకి వచ్చినప్పటి నుంచీ ఇదే అత్యధిక ఆదాయమన్నారు.
రాబోయే పాతికేళ్ల ఆర్థిక వ్యవస్థకు పునాది...
భారత స్వాతంత్ర్యం 75 వసంతాల నుంచి శతవార్షికోత్సవం జరుపుకునే రాబోయే 25 ఏళ్లను ‘అమృత కాలం’గా అభివర్ణించిన ఆర్థికమంత్రి.. ఆ కాలంలో ఆర్థికవ్యవస్థకు ఈ బడ్జెట్ పునాది నిర్మిస్తుందని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.27 శాతం వృద్ధి రేటును సాధించినట్లు అంచనాగా చెప్పారు. ‘‘మనం ఒమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నాం. మన వ్యాక్సినేషన్ వేగం చాలా ఉపయోగపడింది. అందరి కృషితో మనం బలమైన అభివృద్ధిని కొనసాగిస్తామని నేను ధీమాగా ఉన్నాను’’ అని ఆమె పేర్కొన్నారు.
మొత్తం మీద.. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, ద్రవ్యోల్బణం పెరుగుతున్న పరిస్థితుల్లో.. ఆర్థికవృద్ధిని బలోపేతం చేసే దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు కనిపిస్తోంది. ముఖ్యాంశాలివీ...

ఫొటో సోర్స్, Sansad TV
‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించటానికి చేపట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సహ పథకానికి (పీఎల్ఐ స్కీమ్‌కు).. అద్భుత స్పందన లభించిందన్నారు.
దీనిద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించే అవకాశముందని, రాబోయే సంవత్సరాల్లో అదనంగా మరో 30 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని చెప్పారు.
2022-23లో నేషనల్ హైవే నెట్‌వర్క్‌ను 25,000 కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు.
వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయటం.. కోవిడ్ మహమ్మారి ప్రస్తుత వేవ్‌ను దేశవ్యాప్తంగా బలంగా ఎదుర్కోవటం అందరికీ కనిపిస్తోందని చెప్పారు.

ఫొటో సోర్స్, PIB
రాష్ట్రాలకు 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు...
ఆర్థికవ్యవస్థలో పెట్టుబడులను బలోపేతం చేయటం కోసం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు సాయంగా ఇచ్చే రుణాలను రూ. 15,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు.
ఈ మొత్తాన్ని 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలుగా అందిస్తామని.. సాధారణ రుణాలకు అదనంగా ఇవి ఇస్తామని తెలిపారు.
ఈ నిధులను పీఎం గతిశక్తి తదితర ఉత్పాదక రంగంలో పెట్టుబడి వ్యయాలుగా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, @sansadtv
ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు రూ. 48,00 కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటానికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ. 48,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలో 3.8 కోట్ల గృహాలకు కుళాయిల ద్వారా తాగునీటిని అందించటానికి రూ. 60,000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ఆత్మనిర్భరతను పెంపొందించటానికి, రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి.. రక్షణ కొనుగోళ్లకు సంబంధించి పెట్టుబడి బడ్జెట్‌లో 68 శాతాన్ని.. దేశీయ పరిశ్రమలకు కేటాయిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు. ఇది గత బడ్జెట్‌లొ 58 శాతంగా ఉండగా.. దానిని మరో 10 శాతం పెంచుతున్నట్లు తెలిపారు.
కెన్ బేత్వా అనుసంధాన ప్రాజెక్టును రూ. 44,605 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేస్తామన్నారు. దీనివల్ల 9 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీటి ప్రయోజనాలు అందుతాయని, 62 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుందని, 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, PIB
సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెస్తాం
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం.. యువత ఉపాధికి ఎంతో అవకాశమున్న రంగమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
‘‘ఇది సాకారం కావటానికి అవసరమైన సిఫారసుల కోసం, మన మార్కెట్లకు, గ్లోబల్ డిమాండ్లకు సేవలందించే సామర్థ్యాన్ని దేశీయంగా నిర్మించటానికి.. భాగస్వాములందరితో ఒక ఏవీజీసీ ప్రొమోషన్ టాస్క్‌ఫోర్‌్ ను ఏర్పాటుచేస్తాం’’ అని చెప్పారు.
వ్యాపారాలు, బిజినెస్ హబ్‌ల అభివృద్ధి కోసం స్పెషల్ ఎకానమిక్ జోన్స్ చట్టం స్థానంలో కొత్త చట్టం తెస్తామన్నారు.

ఫొటో సోర్స్, @SANSADTV
వ్యవసాయ గ్రామీణ పరిశ్రమల కోసం నాబార్డు నిధి
కనీస మద్దతు ధర కింద వరి, గోధుమలను సేకరణ కోసం ప్రభుత్వం రూ. 2.37 లక్షల కోట్లు చెల్లిస్తుందని చెప్పారు.
2022-23 సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు.
వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు నాబార్డుకు నిధిని అందిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు.
పంటలను అంచనా వేయటానికి, భూమి రికార్డులు డిజిటైజ్ చేయటానికి, పురుగుమందులు, ఎరువులు చల్లటానికి కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వినియోగాన్ని బదిలీ చేయటానికి.. జీరో ఫాజిల్ ఫ్యూల్ పాలసీతో కూడిన ప్రత్యేక మొబిలిటీ జోన్లను ప్రవేశపెడతామని చెప్పారు.

ఫొటో సోర్స్, Sansad tv
ప్రపంచ స్థాయి విద్యను అందించే డిజిటల్ యూనివర్సిటీ
‘‘యువతకు నైపుణ్యాలు కల్పించే కార్యక్రమాలను పునఃప్రవేశపెడతాం. ఇందుకోసం డిజిటల్ దేశ్ ఈ-పోర్టల్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రాంతీయ భాషల్లో 1 నుంచి 12 తరగతుల వరకూ అదనపు విద్యను అందించటానికి.. ‘ఒన్ క్లాస్ – ఒన్ టీవీ చానల్’ను.. 12 నుంచి 200 టీవీ చానళ్లకు పెంచుతామన్నారు.
విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించటానికి ఒక డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మానసిక ఆరోగ్యం మీద కౌన్సిలింగ్ కోసం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామన్నారు.
కృష్ణా-గోదావరి-పెన్నా నదుల అనుసంధానం
దేశంలో నదుల అనుసంధానానికి పెద్ద పీట వేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని చెప్పారు.
2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు.
రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించటానికి వీలుగా.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర ప్యాకేజీలను ప్రవేశపెడతామన్నారు.
ప్రపంచ స్థాయి విద్యను అందించే డిజిటల్ యూనివర్సిటీ
‘‘యువతకు నైపుణ్యాలు కల్పించే కార్యక్రమాలను పునఃప్రవేశపెడతాం. ఇందుకోసం డిజిటల్ దేశ్ ఈ-పోర్టల్‌ను ప్రారంభిస్తాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రాంతీయ భాషల్లో 1 నుంచి 12 తరగతుల వరకూ అదనపు విద్యను అందించటానికి.. ‘ఒన్ క్లాస్ – ఒన్ టీవీ చానల్’ను.. 12 నుంచి 200 టీవీ చానళ్లకు పెంచుతామన్నారు.
విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించటానికి ఒక డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మానసిక ఆరోగ్యం మీద కౌన్సిలింగ్ కోసం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తామన్నారు.
‘పీఎం గతి శక్తి’కి రూ. 20,000 కోట్లు
చిన్న రైతులు, వ్యాపారుల కోసం రైల్వేలు సమర్థవంతమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తాయన్నారు. స్థానిక ఉత్పత్తుల సప్లై చైన్‌కు సాయం చేయటానికి ‘ఒక స్టేషన్ – ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. పీఎం గతి శక్తి కింద రాబోయే కొన్నేళ్లలో 100 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తామన్నారు.
పీఎం గతి శక్తి కింద.. రాష్ట్రాల మధ్య మల్టీ-మోడల్ అనుసంధానానికి ఏడు చోదకాలు ఉంటాయని చెప్పారు. ఈ పథకాన్ని వేగవంతం చేయటానికి ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు.
మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు అందించటానికి, వేగవంతంగా అమలు చేసేయటానికి ప్రభుత్వం వినూత్న మార్గాలను ప్రోత్సహిస్తుందని నిర్మల చెప్పారు. ప్రజా రవాణాకు, రైల్వే స్టేషన్లకు మధ్య మల్టీమోడల్ అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అలాగే.. రాబోయే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లను తయారు చేయటం జరుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలటానికి కారణాలేమిటి
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు: ఎవరీ వినోద్ జైన్, టీడీపీ, వైసీపీల వాదనలేంటి, సూసైడ్ లెటర్లో ఏముంది?
- మీ దగ్గర స్టార్టప్ పెట్టే టాలెంట్ ఉంటే 50 లక్షల వరకూ నిధులు.. రూ. 5 కోట్ల వరకూ గ్రాంటు పొందండి ఇలా..
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










