కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా... ఆ రోజు ఏం జరిగింది

కల్పనా చావ్లా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2003 ఫిబ్రవరి 1. అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న రోజు.

అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.

భారత్‌కు చెందిన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఆ ప్రమాదంలో చనిపోయారు.

ఆ రోజు ఏం జరిగింది?

16 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి పయనమైంది కల్పనా చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది.

భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయంత్రం సుమారు 6 గంటల 40 నిమిషాలు అవుతోంది. భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు.. అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్.

కల్పనా చావ్లా

ఫొటో సోర్స్, AFP

ఇంత వరకు ప్రయాణం బాగానే సాగింది. కానీ ఆ తరువాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ నుంచి అబ్‌నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్‌కు రావడం మొదలైంది. స్పేస్ క్రాప్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచి పోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్‌కు సంబంధించిన డేటా కూడా కనిపించకుండా పోయింది.

దాంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూం. 7 గంటల 29 నిమిషాల ప్రాంతంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని మిషన్ కమాండర్, రిక్ హజ్‌బెండ్ నుంచి రెస్సాన్స్ వచ్చింది.

కానీ అది ‘రోజర్’ అనే ఒక్క పదంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత కొద్ది సెకన్లకు మిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూంతో కొలంబియాకు పూర్తి సంబంధాలు తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తిరిగి కమ్యూనికేట్ కాలేక పోయారు.

చివరకుసాయంత్రం 7 గంటల 32 నిమిషాల ప్రాంతంలో అమెరికా మీద సుమారు 61 కిలోమీటర్ల ఎత్తులో కాలి పోయి ముక్కలుగా విడిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.

కొలంబియా

ఫొటో సోర్స్, Getty Images

మూడు రాష్ట్రాల్లో శకలాలు

ఆకాశంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ముక్కలుగా విడిపోవడాన్ని చూశామని, ఆ సమయంలో తమకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని టెక్సస్ రాష్ట్రంలోని కొందరు ప్రజలు చెప్పారు.

అమెరికాలోని టెక్సస్, లూజియానా, ఆర్కాన్సా రాష్ట్రాలలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. వెంటనే శకలాలను గుర్తించేందుకు సెర్చ్ టీమ్స్‌ను పంపించింది నాసా. ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయినట్లు మరుసటి రోజు ప్రకటించింది.

ఈ ప్రమాదంలో కల్పనా చావ్లాతో సహా బృందంలోని మొత్తం ఏడుగురూ చనిపోయారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ స్పేస్ సెంటర్‌లో ల్యాండ్ కావాల్సిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్, గాలిలోనే అర్ధంతరంగా కాలి కూలి పోయింది.

మొత్తం మీద 84 వేలు... అంటే కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో 40శాతం శకలాలను మాత్రమే నాసా రికవరీ చేయగలిగింది.

కొలంబియా

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదానికి కారణాలు ఏంటి?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంలో భాగంగా చేపట్టిన మిషన్ కోసం 2003 జనవరి 16న అంతరిక్షంలోకి వెళ్లింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. అది దానికి 28వ ప్రయాణం. ఫ్లోరిడాలోని కేప్ కనేవరల్ నుంచి నింగిలోకి దూసుకు పోయేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్‌కు ఒక ప్రమాదం జరిగింది.

వాతావరణంలోని ఒత్తిడి, ఘర్షణ వల్ల ఇంధన ట్యాంక్‌కు సమస్యలు తలెత్తకుండా దానిపై ఫోం ఇన్సులేషన్‌ అప్లై చేసింది నాసా. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ ఉండే ఫోం ఇన్సులేషన్‌లో కొంత భాగం ఊడిపోయింది. ఒక సూటు కేసు సైజులో ఉన్న ఆ ముక్క, స్పేస్ షటిల్ ఎడమ రెక్కకు డ్యామేజ్‌ చేసింది.

దాంతో అత్యంత వేడి నుంచి రెక్కలను కాపాడే హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్న రంధ్రం కూడా పడింది. దాంతో వెళ్లేటప్పుడు అంతా బాగానే ఉన్నా తిరిగి భూమి మీదకు వచ్చేటప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది.

అంతరిక్షం నుంచి అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్‌కు కలిగే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 1,300, 1,400 సెల్సియస్ డిగ్రీలు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్‌ను డిజైన్ చేస్తారు.

వీడియో క్యాప్షన్, అంతరిక్ష రంగంలో ఇండియా నిజంగా సూపర్‌ పవరేనా?

అందులో హీట్ రెసిస్టెంట్ టైల్స్‌దే కీలక పాత్ర. 1,650 డిగ్రీల వరకు వేడిని తట్టుకునేలా వాటిని డిజైన్ చేసింది నాసా. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు, లాంచింగ్ అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో తలెత్తిన పగుళ్ల కారణంగా వాతావరణంలోని వేడిని, ఘర్షణను తట్టుకోలేక పోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.

అంతరిక్షం నుంచి బయలుదేరిన తరువాత భూవాతావరణంలోకి ప్రవేశించగానే అత్యంత వేడిగా ఉండే వాయువులు, ఎడమ రెక్కలోని చిన్న రంధ్రం గుండా స్పేస్‌ క్రాఫ్ట్‌లోకి ప్రవేశించాయి. ఫలితంగా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని కీలక వ్యవస్థలు పని చేయకుండా పోయి చివరకు ముక్కలుగా విడిపోయి కాలి పోయింది.

కల్పనా చావ్లా

ఫొటో సోర్స్, Getty Images

ముందుగానే తెలుసా?

ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫోం ఇన్సులేషన్ ఊడిపడటాన్ని ముందుగానే గుర్తించినట్లు ఆ తరువాత విచారణలో తేలింది. కానీ అంతకు ముందు కూడా కొన్ని సార్లు ఇలాగే జరగడం, అప్పుడు కూడా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా కిందకు రావడం వల్ల దాన్ని సిబ్బంది అంత సీరియస్‌గా తీసుకోలేదు.

అయితే తాను ప్రమాదం గురించి ముందుగానే హెచ్చరించినా మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ జాన్ హార్‌పోల్డ్ పట్టించుకోలేదని కొంత కాలం తరువాత ఆరోపించారు మాజీ ఫ్లయిట్ డైరెక్టర్ వేనీ హేలీ.

నాడు కొలంబియా మిషన్ కోసం పని చేసిన వారిలో హేలీ ఒకరు. ‘ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదని, స్పేస్ క్రాఫ్ట్‌లోని సిబ్బందికి ఆ విషయం చెప్పక పోవడమే మంచిదంటూ’ జాన్ చెప్పుకొచ్చారని హేలీ తన పర్సనల్ బ్లాగులో రాసుకున్నారు.

నాసా

ఫొటో సోర్స్, Getty Images

నాసా మీద విమర్శలు

కొలంబియాకు జరిగిన ప్రమాదంపై ఏర్పాటు చేసిన ద కొలంబియా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్, ప్రమాదం జరిగిన తీరుపై నివేదిక వెల్లడించింది. అలాగే నాసాలో పేరుకుపోయిన నిర్లక్ష్యపూరిత వైఖరిని విమర్శించింది.

ఫోమ్ ఇన్సులేషన్ నుంచి ఇతర భద్రతా లోపాలను చాలా కాలంగా నాసా పట్టించుకోలేదని రిపోర్ట్‌ పేర్కొంది. లోపాల గురించి ఎప్పటికప్పుడు తెలిపేలా సిబ్బంది మధ్య ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోవడాన్ని బోర్డు తప్పుబట్టింది. పాతతరం స్పేస్ క్రాఫ్ట్స్ మీద ఆధారపడకుండా కొత్త తరం స్పేస్ షటిల్స్‌ను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది.

కొలంబియా ప్రమాదం జరిగిన మూడేళ్లకు 2006లో అంతరిక్షంలోకి సేఫ్‌గా వెళ్లి వచ్చింది ఎండీవర్ స్పేస్ క్రాఫ్ట్. చివరకు 2011లో స్పేస్ క్రాఫ్టులను అంతరిక్షంలోకి పంపడాన్ని నిలిపి వేసింది నాసా.

మళ్లీ 2020లో స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘క్రూ డ్రాగన్ ఎండీవర్’ ద్వారా అమెరికా భూభాగం నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు ఆస్ట్రోనాట్స్.

నాసా

ఫొటో సోర్స్, Getty Images

27 సార్లు సక్సెస్

భూమి నుంచి అంతరిక్షానికి, మళ్లీ అక్కడి నుంచి తిరిగి నేల మీదకు రావడానికి స్పేస్ క్రాఫ్ట్స్ ఉపయోగపడతాయి. అలా ప్రాణం పోసుకున్న కొలంబియా స్పేస్ షటిల్ 1981లో తొలిసారి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ కట్టేందుకు స్పేస్ షటిల్స్ ఎంతో అవసరం. సిబ్బందిని, సామాగ్రిని వీటి ద్వారానే తరలిస్తారు. 1981 నుంచి 1985 మధ్య కొలంబియా, డిస్కవరీ, చాలెంజర్, అట్లాంటిస్ అనే నాలుగు స్పేస్ క్రాఫ్ట్స్‌ను నాసా ఉపయోగించేది.

అయితే 1981లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా 27 సార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. కానీ 2003లోని 28వ ప్రయాణాన్ని పూర్తి చేయడంలో అది విఫలమైంది. దీంతో ప్రమాదానికి గురైన రెండో స్పేస్ క్రాఫ్ట్‌గా నిలిచింది కొలంబియా.

అంతకు ముందు 1986 జనవరి 28న అంతరిక్షంలోకి వెళ్తూ టేకాఫ్ అయిన కొద్ది సేపటిలోనే పేలి పోయింది చాలెంజర్. అందులోని సిబ్బంది అంతా ఆ ప్రమాదంలో చనిపోయారు. 1992లో చాలెంజర్ స్థానంలో ఎండీవర్ వచ్చింది.

కల్పనా చావ్లా

ఫొటో సోర్స్, BRUCE WEAVER

కల్పనా చావ్లా ఎవరు?

1962 మార్చి 17న హరియాణాలో జన్మించారు కల్పనా చావ్లా. విమానాల మీద చిన్నతనం నుంచే ఆసక్తి పెంచుకున్న కల్పనా చావ్లా 1982లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.

1984లో టెక్సస్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. అందులోనే డాక్టరేట్ పూర్తి చేసిన కల్పనా చావ్లా ఆ తరువాత అమెరికా సిటిజెన్‌గా మారారు.

కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పరిశోధకురాలిగా 1988లో నాసాలో చేరారు కల్పనా. ఫ్లూయిడ్ డైనమిక్స్ ద్వారా విమానాలు, అంతరిక్ష వాహనాలపై వాతావరణంలోని వాయువులు చూపే ప్రభావాన్ని తెలుసుకుంటారు.

నాసా అంతరిక్షయానానికి సంబంధించి స్పేస్ క్రాఫ్ట్స్‌లో మిషన్ స్పెషలిస్ట్‌గా పని చేసే అవకాశాన్ని 1994లో దక్కించుకున్నారు కల్పనా చావ్లా. ఏడాది పాటు అందుకు కావాల్సిన కఠినమైన శిక్షణను ఆమె పొందారు.

కల్పనా చావ్లా

ఫొటో సోర్స్, HUM Images

1997: తొలిసారి అంతరిక్షంలోకి కల్పనా చావ్లా

కల్పనా చావ్లా తొలిసారి 1997లో అంతరిక్షంలోకి వెళ్లారు. 1997 నవంబరు 19న కొలంబియా స్పేష్ క్రాఫ్ట్‌లో ప్రయాణించిన ఆమె, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయురాలిగా చరిత్రను సృష్టించారు.

తొలి మిషన్‌లో భాగంగా సుమారు 15రోజుల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు కల్పనా చావ్లా. 2001లో రెండోసారి నాసా స్పేస్ మిషన్‌కు ఆమె సెలెక్ట్ అయ్యారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలు, స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్‌లోని లోపాల వల్ల దాదాపు రెండేళ్లపాటు వాయిదా పడింది ఆ మిషన్.

చివరకు 2003 జనవరి 16న ఆమె రెండోసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. ఆమెకు అదే చివరి స్పేస్ మిషన్ కూడా.

ఎన్నో సార్లు ఎంతో మందిని సురక్షితంగా అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్, కల్పనా చావ్లా బృందంలో విషయంలో దారుణంగా విఫలమైంది.

వీడియో క్యాప్షన్, సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)