జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?

విశాఖలో చెట్ల నరివేత
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అనేవి ఉత్తమాటలేనని విశాఖలో వీఐపీలు, వీవీఐపీలు తమ పర్యటనల్లో రుజువు చేస్తున్నారు.

తాజాగా విశాఖలోని చినముషిడివాడ నుంచి శారదా పీఠానికి వెళ్లేదారిలో డివైడర్లపై 8 ఏళ్ల వయసున్న చెట్లను ఆంధ్రప్రదేశ్ సీఎం పర్యటన సందర్భంగా నరికేశారు.

అంతే కాకుండా, రెండు రోజుల ముందే శారదాపీఠానికి సమీపంలో ఉన్న తమ దుకాణాలను కూడా మూసేయమన్నారని చిరు వ్యాపారులు చెప్తున్నారు.

గతేడాది నవంబరులో ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిసరాల్లోని భారీ వృక్షాలు, చెట్లను తొలగించారు. అలాగే, పార్కింగ్ స్థలాలు సిద్ధం చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తొలగించారు.

ఇలా సీఎం, పీఎం పర్యటనల సందర్భంగా చెట్లను నరికివేయడం, వ్యాపార దుకాణాలను మూసివేయడం, తొలగించడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

అయితే, దీనిపై వివరణ కోరడానికి జీవీఎంసీ అధికారుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే వారు స్పందించేందుకు నిరాకరించారు.

విశాఖలో చెట్ల నరివేత

శారదాపీఠం మార్గంలో చెట్లు ఎందుకు నరికివేశారు?

ఈ నెల 28న సీఎం జగన్‌ విశాఖ వస్తున్నారు. ఆ రోజు శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనడంతో పాటు అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడి వివాహ విందుకు కూడా హాజరవుతారు.

శారదాపీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో పాల్గొనేందుకు సీఎం వస్తుండటంతో గత నాలుగు రోజులుగా చినముషిడివాడ జంక్షన్ నుంచి శారదాపీఠం మార్గమంతా కూడా సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరగుతున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఆ వేదికకు అడ్డంగా ఉన్న డివైడర్ మధ్య చెట్లను తొలగించారు. మళ్లీ కొత్తగా అక్కడ కుండీలను పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

శారదాపీఠం పరిసర ప్రాంతమంతా పోలీసులు రక్షణ చర్యలు చేపడుతుంటే, జీవీఎంసీ అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు.

చినముషిడివాడ నుంచి శారదాపీఠానికి వెళ్లే మార్గంలోని డివైడర్‌పై 5 నుంచి 8 ఏళ్ల వయసున్న మొక్కలున్నాయి. వీటిని కూలీలు, యంత్రాల సహాయంతో నరికివేశారు.

అక్కడ చెట్లను పూర్తిగా తొలగించి డివైడర్‌పై మట్టి వేశారు. దానిపై కృతిమ గడ్డి వేయడం, బ్యూటిఫికేషన్ ప్లాంట్స్‌ను పెట్టడం చేస్తారని అక్కడ పని చేస్తున్న వర్కర్స్ బీబీసీతో చెప్పారు. గత మూడు రోజులుగా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.

గత ఏడాది నవంబర్ 12న ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు కూడా ఆంధ్రా యూనివర్సిటీలోని 20 ఎకరాల మేర భారీ వృక్షాలను నరికి వేశారు. అక్కడే మోదీ సభ ప్రాంగణాన్ని తయారు చేశారు.

విశాఖలో చెట్ల నరివేత

‘వేదిక పీఠం వద్ద.. మార్గమంతా చెట్లు నరికివేత’

కాలుష్య నివారణ, సుందరీకరణ కోసం 5 నుంచి 8 ఏళ్లుగా ఈ చెట్లను పెంచుతున్నారు.

దీని బాధ్యతలను జీవీఎంసీయే చూస్తున్నది. ఇప్పుడు అదే జీవీఎంసీ సీఎం పర్యటన సందర్భంగా ఆ చెట్లను కూలీలను పెట్టి మరీ తొలగించింది.

సీఎం కోసం వేదికను శారదాపీఠం వద్ద నిర్మిస్తున్నారు. అక్కడ అవసరమనుకుంటే చెట్లు తొలగించినా పర్వాలేదు కానీ, మొత్తం శారదాపీఠానికి వచ్చే దారి పొడవునా ఉన్న చెట్లను తొలగించడం ఎందుకని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు.

విశాఖలో చెట్లు నరికివేత, వాల్టా యాక్ట్ అమలు అంశాలపై కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు మూర్తి యాదవ్.

“ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రజలకు సీఎం కనపడకుండా పరదాలు కప్పుతున్నారు. అలాగే రక్షణ పేరుతో పచ్చని చెట్లు కూడా నరికేస్తున్నారు. పచ్చని చెట్లు ముఖ్యమంత్రి పర్యటనను ఏం అడ్డుకుంటాయి? శ్రీకాకుళంలో కానీ, తూర్పు గోదావరి జిల్లాలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ ముఖ్యమంత్రి వస్తే చెట్లు తొలగించాల్సిన అవసరం ఏముంది? ఇటీవలే ప్రధాని సభ ఏయూలో పెట్టారని చెప్పి 20 ఎకరాల్లో వృక్షాలను తొలగించారు. పర్యావరణాన్ని కాపాడండంటూ పదే పదే ప్రచారం చేసే నాయకులే వాళ్ల అధికారం ఉపయోగించి ఇలా ప్రకృతి విధ్వసం చేయడం ఎంత వరకు న్యాయం?” అని మూర్తి యాదవ్ బీబీసీతో చెప్పారు.

విశాఖలో చెట్ల నరివేత

‘ప్రజలు కట్టిన పన్నులతో నాటిని చెట్లవి’

రాష్ట్రంలో ఏదైనా జిల్లాకు లేదా ఒక ప్రాంతానికి సీఎం వస్తే అక్కడ కనీసం రోడ్డయినా బాగు చేస్తారని ఆశిస్తుంటారు.

కానీ, ఏపీ సీఎం జగన్ వస్తుంటే మాత్రం తమ ప్రదేశంలోని చెట్లు, వృక్షాలను రక్షణ పేరుతో అధికారులు నాశనం చేస్తున్నారని, అలాగే ట్రాఫిక్ జామ్‌లతో తమ పనులు, ప్రయాణాలకు ఆటంకం కలుగుతుందని భయపడిపోతున్నారని సీనియర్ జర్నలిస్టు యుగంధర్ రెడ్డి అన్నారు.

గతంలో సీఎం శారదాపీఠానికి వచ్చినప్పుడు ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లో ఎయిర్ ప్యాసింజర్లు ఎయిర్ పోర్టుకు వెళ్లలేక ఫ్లైట్స్ అందుకోలేకపోయారని ఆయన గుర్తు చేశారు.

“నేవీ డే సందర్భంగా దేశంలోనే హై ప్రొటోకాల్ ఉన్న రాష్ట్రపతి విశాఖ వస్తే నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, కానీ సీఎం వస్తే ప్రతిసారి ఏదో వివాదమే అవుతుంది. ఎవరైనా వీఐపీలు వస్తే వారి రాకకు సూచికగా చెట్లు నాటుతారు. కానీ సీఎం జగన్ వస్తుంటే బాగా ఎదిగిన చెట్లను సైతం నరికేస్తున్నారు. డివైడర్ మధ్యలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో నాటిన మొక్కలను తీసేయడం చాలా బాధకరం. సెక్యూరిటీ రీజన్స్ అయితే కొమ్మలు కొట్టవచ్చు, కానీ చెట్లను తొలగించడం ఏం సంప్రదాయమో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి వస్తే వృక్ష వినాశనమేనా? ఈ పద్దతైతే మంచిది కాదు” అని యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

సీఎం శారదాపీఠానికి వచ్చి గంటన్నర ఉంటారు. రక్షణ చర్యల్లో భాగంగా సీఎం వచ్చే ఆ పూట వ్యాపారులకు మూసేయమని చెప్తే సరే కానీ, కార్యక్రమానికి రెండు రోజుల ముందుగానే చిరువ్యాపారుల దుకాణాలను మూయించడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు.

చిరు వ్యాపారులతో బీబీసీ మాట్లాడినప్పుడు, దుకాణాలను రెండు రోజుల ముందే మూసేయాలనే విషయాన్ని తమకు 24వ తేదీనే చెప్పారని దుకాణాల యాజమానులు చెప్పారు.

విశాఖలో చెట్ల నరివేత

‘రోజుకు రూ. 500 వస్తుంది, రెండు రోజులు మూసేయమంటున్నారు’

అధికారులు రెండు రోజుల కిందట (జనవరి 23) మా దగ్గరకు వచ్చి శుక్ర, శనివారాల్లో షాపులు మూసేయమని చెప్పారని శారదాపీఠానికి వెళ్లే మార్గంలో పూజసామగ్రి అమ్మే దుకాణ యాజమాని రాజు బీబీసీతో చెప్పారు.

"అలాగే దుకాణాల ముందు మేం పెంచుకున్న చెట్లను సైతం తీసేయమన్నారు. అధికారులు వీఐపీల రక్షణ పేరుతో మా జీవనోపాధిని దెబ్బతీయడం తగదు. వ్యాపారం చేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి. రెండు రోజులు దుకాణాలు మూసేయమంటే మాకు కుటుంబపోషణ ఎలా?" అని రాజు ప్రశ్నించారు.

శారదాపీఠానికి వెళ్లే దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా చాలా దుకాణలు ఉన్నాయి. వాటిలో చిరు వ్యాపారుల దుకాణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా కూరగాయాలు, పూజసామాగ్రి, టిఫిన్ షాపులు, చెరుకురసం బళ్లు, చిరు తిళ్లు అమ్మే బడ్డీలు, చిన్న చిన్న కిరణా షాపులు ఉన్నాయి. వీరిలో చాలా మంది రోజుకు రూ. 2 నుంచి రూ. 3 వేల వ్యాపారం చేస్తామని బీబీసీతో చెప్పారు. అయితే అందులో మిగిలేది రూ. 500 రూపాయలేనని అన్నారు.

విశాఖలో చెట్ల నరివేత

‘భయపడి అడగలేదండి’

"మా దుకాణాల ఎదురుగా డివైడర్లపై ఉన్న చెట్లను నరికేశారు. మేం మా షాపుల వద్ద నాటుకున్న మొక్కలను సైతం తీసేయమంటున్నారు. సీఎం టూర్ ఉందని చెప్తున్నారు. గట్టిగా అడగాలని ఉన్నా, భయంతో అడగలేకపోయాం" అని చెరుకు రసం అమ్మే దేవుడు అనే వ్యాపారి బీబీసీకి చెప్పారు.

“వ్యాపారం చేసుకుని బతికే మాకు రెండు రోజుల పాటు కూలీనాలీ లేకుండా ఉంటే ఇబ్బంది కదండీ మాకు. నా చెరుకు రసం బండి రోడ్డు పక్కనే ఉంది. తీసేయమని చెప్పారు. మాట వినకపోతే అని పోలీసులు తీసి పారేస్తారేమోనని, నేనే ముందుగా అన్ని తీసేసి మరో చోట పెట్టుకున్నాను. ఈ నాలుగు రోజులు పని లేనట్లే. ఇంకో చోట ఎక్కడైనా కూలీ దొరుకుతుందేమోనని చూసుకోవాలి" అని దేవుడు చెప్పారు.

దేవుడు అప్పుడే తన టూ వీలర్ పై ముషిడివాడ నుంచి పెందుర్తి వెళ్లి వచ్చారు. తనకు పని దొరుకుతుందేమోనని ఒక బిల్డరు దగ్గరకు వెళ్లి వస్తున్నట్లు చెప్పారు.

విశాఖలో చెట్ల నరివేత

చెట్లను నరికేయవచ్చా?

నిబంధలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతి లేకుండా చెట్టును తొలగిస్తే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రూ. 10 వేలు అపరాధ రుసుం, 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తారు. అసలు చెట్లను నరకడం లేదా పాక్షికంగా నాశనం చేయడం కూడా నేరమని, బ్యూటిఫికేషన్ ప్లాంట్స్ అయినా కూడా ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం తొలగించాలంటే స్థానిక తహాశీల్ధారు అనుమతి పొందాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.

అదే భారీ స్థాయిలో లేదా విలువైన చెట్లు, వృక్షాలు తొలగించాలంటే తహాశీల్దార్ తర్వాత అటవీశాఖ అనుమతి కూడా తప్పనిసరి అని చెప్పారు.

“ఇళ్లలో పెంచుకుంటున్న మొక్కలు తొలగించాలన్నా స్థానిక తహాశీల్దార్ అనుమతి అవసరమే. మర్రి చెట్టు, వేప, అశోకచెట్టు వంటివి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి. వీటితో పాటు కలప కోసం ఉపయోగించే టేకు, మద్ది, ఆకేష, కంబ వంటి చెట్లను నరకాలంటే తహాశీల్దార్ తో పాటు ఫాం-2, ఫాం-4లను భర్తీ చేసి, అందులో ఆ చెట్లను నరకడానికి లేదా తొలగించడానికి కారణాలు తెలుపుతూ అటవీశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నీటినీ పరిశీలించాక అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అనుమతులు విషయంపై మేం నిర్ణయం తీసుకుంటాం. మోదీ పర్యటన, ఇప్పుడు సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్లను నరికివేస్తున్నవారు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో తెలియదు. ప్రభుత్వ కార్యక్రమమైనా కూడా అనుమతి తప్పనిసరి. ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం 2021లో రెండు వందల మీటర్ల మేర కొన్ని చెట్లను నరికివేస్తే ఆ సంస్థ భారీ ఫైన్లను చెల్లించాల్సి వచ్చింది” అని ఫారెస్ట్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

విశాఖలో చెట్ల నరివేత

‘కోవిడ్ రోజులు మర్చిపోయినట్లున్నారు’

వీవీఐపీలు, వీఐపీలు విశాఖ వస్తే రక్షణ ఏర్పాట్ల పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఎంత మాత్రం సరైన చర్య కాదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న మొక్క నాటి, భారీగా ప్రచారాలు చేసుకునే ప్రభుత్వ పెద్దలు, ఇలా తమ పర్యటనల సందర్భంగా జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

“కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కోసం అల్లాడిపోయిన రోజులు మర్చిపోయినట్లున్నారు. అసలు సీఎంలు, పీఎంలు లేదా ఎవరైనా వీఐపీలు వస్తే చెట్లను నరకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్న పచ్చని చెట్లను నరికేసి, కృత్రిమంగా సుందరీకరణ చేయడం వలన ఏం ఉపయోగం? అధికారులు కూడా మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టిలో పడేందుకు తాము చేస్తున్నది ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలి. కొమ్మలు, కాండాలు తొలగిస్తే సరే కానీ, ఏకంగా చెట్లనే తీసేస్తున్నారు. మళ్లీ ఒక చెట్టు పెరగాలంటే ఏళ్లు పడుతుంది. నరడానికి క్షణం చాలు. చెట్లను నరికేస్తున్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్తాం” అని గ్లోబల్ క్లైమేట్ విశాఖ ఛాప్టర్ ప్రతినిధి జి. మోహన్ బీబీసీతో చెప్పారు.

చెట్ల నరికివేతపై జీవీఎంసీ అధికారులను వివరణ కోరడానికి బీబీసీ ప్రయత్నించింది. అయితే వారు స్పందించలేదు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)