ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

శ్రీకాకుళం జిల్లా హీర మండలంలోని ఈ గ్రామంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్లు లేవు, టీవీల్లేవు. అసలు విద్యుత్తే ఉండదు. అంతేకాదు ఈ గ్రామస్థులంతా తమకి కావలసిన ధాన్యం, కూరగాయలు వాళ్లే పండించుకుంటారు.

వారికి కావలసిన దుస్తులను కూడా వారే తయారు చేసుకుంటారు. ఇనుము, సిమెంట్‌తో కాకుండా మట్టి, సున్నంతో ఇల్లు నిర్మించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ గ్రామం పేరు కూర్మగ్రామం. ఇక్కడ పూర్వీకుల జీవన విధానాలను పాటిస్తూ జీవిస్తారు.

ఈ గ్రామంలో నివసించేవారంతా కృష్ణతత్వం అనుసరిస్తారు. వైదిక వర్ణాశ్రమంగా పిలుచుకునే ఈ గ్రామంలో అధునిక జీవితపు హంగులు, అర్భాటాలు లేకుండా వందల ఏళ్ల నాటి జీవిత విధానం కనిపిస్తుంది.

మూడున్నరేళ్ల కిందట ఏర్పాటైన ఈ గ్రామంలో ప్రస్తుతం 50 వరకు ఇళ్లు ఉన్నాయి. మరిన్ని ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ కొందరు కుటుంబాలతో ఉంటే మరికొందరు బ్రహ్మచారులు కూడా ఉన్నారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, త్రిబంగ ఆనంద దాస్

‘కొత్త పద్దతేమి కాదు’

తాము ఇక్కడ సంప్రదాయ, ఆధ్మాత్మిక జీవనం అనే రెండు విధానాలను పాటిస్తామని ఇక్కడ నివాసముండే గ్రామస్థులు చెప్తున్నారు. ఈ గ్రామం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్న త్రిబంగ ఆనంద దాస్ ఇక్కడి విశేషాలను వివరించారు.

“ఈ కూర్మగ్రామం ఏర్పాటై మూడున్నరేళ్లు అవుతుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా గ్రామాలున్నాయి. కృష్ణతత్వాన్ని పాటించాలని భావించే మాలాంటి వాళ్లం అంతా కలిసి ఈ తరహా గ్రామాలను ఏర్పాటు చేసుకుని పూర్వీకుల జీవన పద్ధతులను పాటిస్తాం. ఇక్కడ నివసించే వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. బతకడానికి నిత్యవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని సమకూర్చుకుంటాం. దంపుడు బియ్యాన్ని వండుకుని తింటున్నాం. కావాల్సిన బట్టలను కూడా మేమే నేరుగా మగ్గాలపై నేసుకుంటాం. ఇదే సరళ జీవనమంటే” అని త్రిబంగ ఆనంద్ దాస్ చెప్పారు.

“రెండోది ఉన్నత ధ్యేయం. లేదా ఉన్నత చింతనం. సంప్రదాయ సరళ జీవనం ద్వారా సగం సమస్యలు తీరిపోగా... రెండో పద్ధతైన ఉన్నత చింతనమైన భక్తి మార్గం ద్వారా మిగతా సమస్యలు తీరిపోతాయి. ఇవన్నీ కూడా మన పూర్వీకులు శాస్త్రీయంగా ఆచరించిన విధానాలే. ఆధునిక జీవన శైలి వలన వచ్చిన సమస్యలన్ని ఈ రెండు మార్గాల ద్వారా పరిష్కారమవుతాయి. ఇవి కొత్త పద్ధతులేమి కాదు. పూర్వీకులు పాటించినవి, మనం మర్చిపోతున్నవి”అని త్రిబంగ ఆనంద్ దాస్ చెప్పారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘విద్యుత్ ఎందుకు ఉండదంటే...’

ఈ రోజుల్లో విద్యుత్ చాలా అవసరం. కూర్మగ్రామానికి సమీప గ్రామాలన్నింటిలోనూ విద్యుత్ సౌకర్యం ఉంది. విద్యుత్ తీసుకునే అవకాశం ఉన్నా కూడా కూర్మగ్రామస్థులు రాత్రి వేళ్లలో కూడా విద్యుత్‌తో కాకుండా దీపాలతోనే గడుపుతున్నారు. అసలు విద్యుత్ ఎందుకు ఉపయోగించరో హరిదాస్ వివరించారు.

“మేమంతా కృష్ణచైతన్య సమాజం పేరుతో కూర్మగ్రామంలో నివాసముంటున్నాం. కుటుంబాలతో ఉండే గృహస్థులు, కృష్ణతత్వం నేర్చుకునే విద్యార్థులు, కొందరు బ్రహ్మచారులు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. మేమంతా సరళ జీవన విధానంలో జీవిస్తున్నాం. విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే సౌకర్యాలు పెరుగుతాయి. వాటి కోసం డబ్బు ఖర్చు చేయాలి. మళ్లీ డబ్బు కావాలంటే పరుగుల, ఉరుకుల జీవితానికి అలవాటు పడాలి. అందుకే సౌకర్యాలకు దూరంగా ఉంటూ సనాతన జీవిత విధానాలను పాటిస్తున్నాం. ఇది మాకెంతో ఆనందంగా ఉంది” అని హరిదాస్ వివరించారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘వస్తు మార్పిడి పద్దతి పాటిస్తాం’

ఉదయం నాలుగు గంటలకి కృష్ణ భజనలతో రోజు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎవరికి వారు వారు ఆ రోజు చేయాల్సిన పనులపై వెళ్లిపోతారు. అంతా కూడా సంప్రదాయ దుస్తులనే ధరిస్తారు. ఫ్యాంట్, షర్టులు ధరించరు. పేడతో అలికిన మట్టి గట్టులపై (టేబుల్ తరహా) భోజనాలు చేస్తారు.

“మా బట్టలు మేమే నేత పని ద్వారా తయారు చేసుకుంటాం. అలాగే ధరించిన బట్టలను సబ్బులతో కాకుండా కుంకుడు రసంతో ఉతుక్కుంటాం. ఎవరికి కావలసిన నీళ్లు వాళ్లే బావిలో నుంచి తోడుకోవాలి. ఇంటి ముందు, పొలాల్లో సైతం కూరగాయలను పండిస్తాం. వాటినే ఆహారంగా తీసుకుంటాం. ఒకరికి కావలసిన వస్తువులను మరొకరికి అందించుకుంటూ వస్తు మార్పిడి పద్ధతిలో జీవిస్తాం” అని నరోత్తమ్ దాస్ బీబీసీతో చెప్పారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘సమాచారం ఇచ్చి ఎవరైనా రావొచ్చు’

ఈ గ్రామం 60 ఎకరాల్లో ఉంది. ఈ గ్రామంలో ఉన్న ఇళ్లన్నీ పెంకు, తాటాకులు, గడ్డితో నిర్మించినవే. ఇక్కడ సింమెంట్ వాడరు. కానీ నిర్మాణ సమయంలో అవసరమైన సున్నాన్ని కంకర, మెంతులు, బెల్లంతో సంప్రదాయ పద్ధతిలో గానుగుతో తయారు చేస్తారు. ఇక్కడికి ఎవరు వచ్చినా వారు ఇలాంటి ఇళ్లలోనే నివసించాలి, తర్వాత కట్టే ఇళ్లలకు కూలీలుగా, మేస్త్రీలుగా పని చేయాలనేది నియమం.

‘‘ఈ గ్రామంలో నివసించడానికి ఎవరైనా రావచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మేం పాటించే సరళ, ఆధ్యాత్మిక జీవన విధానాలను పాటించాలి. ఒక వేళ పాటించలేకపోతే వెళ్లిపోవచ్చు. పాటించగలిగితే ఎంతకాలమైనా ఉండవచ్చు’’ అని రాధాకృష్ణ చరణ్ దాస్ చెప్పారు.

“ఇప్పటికే ప్రచారంలో ఉన్న మా గ్రామ నియమ, నిబంధనలు చాలా మందికి తెలుసు. వాటిని పాటిస్తామని మాకు లేఖల ద్వారా సమాచారం ఇస్తే మేం వారి కోసం నివాసాలను సిద్ధం చేస్తాం. వారు వచ్చిన తర్వాత ఇక్కడ నియమాలను పాటిస్తూ జీవించవచ్చు. ఒక్కరైనా, కుటుంబాలతోనైనా రావొచ్చు. వచ్చిన వారందరికి ఇక్కడ అన్నీ ఉచితమే. శ్రమ చేస్తూ కృష్ణ భజనలు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ గడపవచ్చు” అని చరణ్ దాస్ చెప్పారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘ఇన్ఫోసిస్ నుంచి కూర్మగ్రామానికి...’

ప్రశాంతమైన వాతావరణంలో హీర మండలంలోని అటవీ ప్రాంత సమీపంలో కొండలకు దిగువన ఉన్న ఈ గ్రామంలో నివసిస్తున్నవారంతా ఇక్కడికి రాకముందు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసిన వారే. ఉద్యోగ జీవితం కంటే కష్టించి పని చేసుకుంటూ సౌకర్యాలకు దూరంగా సనాతన పద్ధతిలో జీవించడమే ఆనందంగా ఉందంటున్నారు ఇన్ఫోసిస్‌లో పని చేసి కూర్మగ్రామ నివాసిగా మారిన రాధాకృష్ణ చరణ్ దాస్ వంటి వారు.

“ప్రకృతితో సహజీవనం ఎంతో బాగుంది. మా పిల్లలకు ఇదే అలవాటు చేస్తున్నాం. అయితే ఇక్కడ పిల్లలు గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యనభ్యసిస్తున్నారు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు నేర్పుతారు. ఎందుకంటే రేపు వారు బాహ్య ప్రపంచంలోకి వెళ్లి బతకాలంటే భాష ముఖ్యం కాబట్టి. వాళ్లని ఇక్కడే జీవించాలని మేం కోరం. ఉదయం భజనలు చేసి ప్రసాదం తీసుకుని రోజువారీ పనులకు వెళ్తారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణంలో పాల్గొంటాం. సాయంత్రం నుంచి ఆధ్యాత్మిక జీవితం గడుపుతాం. సనాతన వైదిక ధర్మం, భారతీయ జీవన విధానాలను పునరుద్ధరణకు మేం చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే ఇది” అని చరణ్ దాస్ తెలిపారు.

ఈ గ్రామంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎంఎన్సీ కంపెనీల్లో పని చేసి వచ్చిన వారు ఉన్నారు. వారంతా ఇక్కడ ఆనందంగా గడుపుతున్నామని చెప్పారు.

కూర్మగ్రామం

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

‘మేం కోరుకున్న జీవితం ఇక్కడే లభించింది’

‘‘మాది శ్రీకాకుళమే. నేను, నా భార్య ఇద్దరం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాలను వెళ్లదీసేవాళ్లం. కానీ మాకెందుకుతో జీవితంలో ఆనందం కలగలేదు. అందుకే వీలున్నప్పుడల్లా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేవాళ్లం. కానీ ఎక్కడ సంతృప్తి కలగలేదు. చివరకు మా జిల్లాలోనీ కూర్మగ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ మాకు కావలసిన జీవితం కనిపించింది. దాంతో మా కుటుంబంతో ఇక్కడికి వచ్చేశాం. ఇక్కడ నియమాలు పాటిస్తూ ఆనందంగా జీవిస్తున్నాం’’అని మోహన్ బీబీసీతో చెప్పారు.

 “గతంలో ఉదయం లేస్తే సెల్ ఫోన్ ముఖమే చూసేవాళ్లం. ఆ జీవితం చాలా యంత్రికంగా అనిపించేది. కానీ ప్రస్తుతం కూర్మగ్రామంలో విద్యుత్, మెబైల్ ఫోన్లు వాడకుండా ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నాం. ఎందుకంటే, జీవితంలో సుఖంగా ఉండటానికి ఇవన్నీ అవసరం లేదని ఇక్కడికి వచ్చాక మాకు అనిపించింది. ప్రపంచంలో చాలా సౌకర్యాలున్నాయి. కానీ ఆ సౌకర్యాల్లో జీవించడం కంటే మన కావాలసిన ధాన్యం, కూరగాయలు మనమే పండించుకుంటూ ఆధునిక పోకడలకు, విధానాలకు దూరంగా ఉంటే జీవితం ఎంతో హాయిగా అనిపిస్తోంది” అని మోహన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆ ఇంట్లో రోజూ కూరగాయలకు అయ్యే ఖర్చు రూ. 1200

‘గ్రామాన్ని చూసేందుకు వస్తున్నారు’

గ్రామంలో ఎటువంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా పూర్వీకుల జీవన విధానాలను పాటిస్తూ జీవిస్తున్నారనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. బావి నుంచి నీళ్లు తీసుకోవడం నుంచి ఎవరి దుస్తులు వాళ్లే నేత పని చేసి తయారు చేసుకోవడం వంటివి అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రావడం కనిపించింది.

ఈ గ్రామాన్ని చూసిన తర్వాత డబ్బుతో పని లేకుండా ఎంతో ఆనందంగా ఎలా జీవించవచ్చో తెలిసిందని అనిత అనే కళాశాల విద్యార్థిని బీబీసీతో అన్నారు. సరదాగా చూడటానికి వచ్చామని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఎలా జీవించాలో తెలిసిందని ఆమె చెప్పారు.

“మనకు అన్నీ సదుపాయాలుండి మనమేమీ నేర్చుకోలేదు. చేతిలో సెల్ ఫోన్లతో తిరుగుతూ అంతా తెలుసునని అనుకుంటున్నాం. కానీ, అందంతా తప్పని ఇక్కడకు వచ్చాక అర్థమైంది. కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా ఎంతో హాయిగా వీళ్లు జీవిస్తున్నారు. మట్టితో చేసిన ఇళ్లలో ప్రకృతితో కలిసి హాయిగా జీవిస్తున్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్న వీళ్ల విధానాలు బాగున్నాయి. అప్పుడప్పుడైనా ఇక్కడికి వచ్చి రెండు రోజులు గడిపే వెళ్లే బాగుంటుందనిపించింది”అని అనిత అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్ర గిరిజన కళల్ని ప్రపంచానికి చూపిస్తున్న యువ యూట్యూబర్స్

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)