స్వోర్న్ వర్జిన్స్: వీళ్లు అమ్మాయిలా పుట్టి జీవితాంతం మగాడిలా బతుకుతామని ప్రమాణం చేస్తారు - ఎందుకంటే...

వలెర్జానాతో జిస్టినా

ఫొటో సోర్స్, BBC/DERRICK EVANS

ఫొటో క్యాప్షన్, వలెర్జానాతో జిస్టినా
    • రచయిత, టుయ్ మెక్‌లీన్
    • హోదా, బీబీసీ 100 మహిళలు

పురాతన బాల్కన్ సంప్రదాయానికి చెందిన ‘స్వోర్న్ వర్జిన్స్’ అనే మహిళలు ఇప్పుడు ప్రపంచంలో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు.

స్వోర్న్ వర్జిన్స్ అంటే జన్మతః ఆడవారిగా పుట్టినవారు ఆ సంప్రదాయం ప్రకారం జీవితాంతం మగవారిలా బతుకుతారు.

‘‘అల్బేనియా ఒక పురుష ప్రపంచం. ఇక్కడ మనుగడ సాగించాలంటే వారిలా బతకడమే ఏకైక మార్గం’’ అని జిస్టీనా గ్రీషజ్ అన్నారు.

ఉత్తర అల్వేనియాలోని పర్వత ప్రాంతంలో నివసించే ఆమె 23 ఏళ్లప్పుడు తన జీవితాన్ని మార్చే నిర్ణయాన్ని తీసుకున్నారు.

బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తున్నానని, మిగిలిన జీవితమంతా పురుషుడిలా జీవిస్తానని ఆమె ప్రమాణం చేశారు.

ఇది శతాబ్దాలుగా మనుగడలో ఉన్న ఆచారం. దీని ప్రకారం మహిళలు తమ జీవిత కాలమంతా పురుషుడిలా జీవిస్తామంటూ గ్రామ పెద్దల ముందు ప్రమాణం చేస్తారు.

ఇలా ప్రమాణం స్వీకరించిన మహిళలను ‘బుర్నేషాట్’ అని లేదా ‘స్వోర్న్ వర్జిన్స్ (ప్రమాణం చేసిన కన్యలు)’’ అని పిలుస్తారు.

జిస్టినా

ఫొటో సోర్స్, VALERJANA GRISHAJ

జస్టీనా కుటుంబీకులు 100 ఏళ్లకు పైగా లుపుషేలోని మలేసి మధే రీజియన్‌లో నివసిస్తున్నారు. బుర్నేషా సంప్రదాయం ఇప్పటికీ ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి.

‘‘ప్రపంచంలో ఎంతోమంది అవివాహితులు ఉన్నారు. కానీ వారంతా బుర్నేషాట్‌లు కాదు. ‘బుర్నేషా’లుగా జీవించేవారు కేవలం తన కుటుంబం, పని, తన స్వచ్ఛతను కాపాడుకోవడానికే కట్టుబడి ఉంటారు’’ అని ఇప్పుడు 57 ఏళ్ల వయస్సులో ఉన్న జస్టీనా అన్నారు.

పురుషులు మాత్రమే అనుభవించగలిగే స్వేచ్ఛను పొందడానికి పూర్వకాలంలో జన్మించిన స్త్రీలకు తమ లైంగికత, పునరుత్పత్తి, సామాజిక గుర్తింపును మార్చుకోవడమే ఒక మార్గంగా ఉండేది.

బుర్నేషాగా మారడం వల్ల మహిళలకు పురుషుల్లాగా దుస్తులు ధరించడం, కుటుంబ పెద్దగా వ్యవహరించడం, సమాజంలో స్వేచ్ఛగా తిరగడం, పురుషులకే పరిమితమైన పనులను వృత్తిగా ఎంచుకోవడం వంటి పనులు చేయడానికి అనుమతి దక్కుతుంది.

జిస్టినాను తన సన్నిహితులు ‘డ్యూనీ’ అని పిలుస్తారు. యవ్వనంలో చురుకైన యువతి అయిన జిస్టినా, తానెప్పటికీ స్వతంత్రంగా జీవించాలని అనుకున్నారు. పెళ్లి, గృహిణిగా బాధ్యతలు, సంప్రదాయ మహిళల దుస్తులు ధరించడం వంటి సంప్రదాయ జీవితాన్ని ఆమె ఎప్పుడూ ఊహించలేదు.

తన తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని నడిపించడానికి, ఆర్థికంగా అండగా నిలబడటానికి ‘బుర్నేషా’గా మారాలని ఆమె నిర్ణయించుకున్నారు.

వలెర్జానా

ఫొటో సోర్స్, BBC/DERRICK EVANS

ఫొటో క్యాప్షన్, గ్రామీణ ప్రాంతాల కంటే నగరాల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని వలెర్జానా అన్నారు

‘‘మేం అప్పుడు చాలా పేదరికంలో ఉండేవాళ్లం. మా నాన్న చనిపోయారు. మేం ఆరుగురు సంతానం. మా అమ్మకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బుర్నేషాగా మారాలని కష్టపడి చేయాలని నేను నిర్ణయించుకున్నా’’ అని ఆమె చెప్పారు.

ఒక మారుమూల ప్రాంతంలో జిస్టినా నివసిస్తున్నారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడ తక్కువగా ఉంటాయి. కరెంట్ కోతలతో పాటు శీతాకాలంలో మంచుతో రోడ్లన్నీ మూసుకుపోతాయి.

ఆమె ఒక అతిథి గృహాన్ని నిర్వహిస్తున్నారు. జంతువులను పెంచుతున్నారు.

ఒక బుర్నేషాగా, ఇంటి పెద్దగా తన తండ్రి నుంచి సంక్రమించిన ఔషధ మూలికల కళను కూడా ఆమె కొనసాగిస్తున్నారు. ఔషధ మూలికలతో తేనీరు, తైలాలను ఆమె తయారు చేస్తారు.

‘‘ఆయన ఔషధ మూలికల గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఆ పాఠాలను నాకు బోధించారు. నా మేనకోడలు వలెర్జానా వేరే జీవనోపాధిని వెదుక్కున్నప్పటికీ ఈ అభ్యాసాన్ని నా నుంచి ఆమె వారసత్వంగా పొందాలని నేను కోరుకుంటున్నా’’ అని జిస్టినా చెప్పారు.

‘‘ఈరోజుల్లో ఎవరూ కూడా బుర్నేషా అవ్వడానికి ప్రయత్నించరు. బుర్నేషా అవ్వడం గురించి కూడా ఆడపిల్లలు ఆలోచించరు. నేనే దానికి నిజమైన ఉదాహరణ’’ అని వలెర్జానా అన్నారు.

అల్బేనియా

ఫొటో సోర్స్, BBC/DERRICK EVANS

ఫొటో క్యాప్షన్, శీతాకాలంలో అక్కడి గ్రామాల్లో నివసించడం చాలా కష్టం

లుపుషేలో జిస్టినా వద్ద వలెర్జానా పెరిగారు. ఆ ప్రాంతంలో మహిళలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని వలెర్జానా చెప్పారు. కేవలం చిన్నతనంలో వివాహం చేసుకునే అవకాశం మాత్రమే అక్కడి మహిళలకు ఉంటుందని అన్నారు.

‘‘ప్రాథమిక పాఠశాలలో నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. తొమ్మిదో తరగతి చదివే నా స్నేహితురాలికి నిశ్చితార్థం అయింది. అప్పుటికి ఆమె వయస్సు 14 ఏళ్లు.

పై తరగతులు చదివేందుకు తన భర్త అనుమతించడని ఆమె నాతో చెప్పింది. ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయన మాటకు కట్టుబడి ఉండాలని ఆమె నాకు చెప్పింది’’ అని వలెర్జానా గుర్తు చేసుకున్నారు.

అయితే వలెర్జానా చిన్నతనంలోనే వివాహం చేసుకోలేదు, బుర్నేషాగా కూడా మారలేదు. ఆమె మరో మార్గాన్ని ఎంచుకున్నారు. 16 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి బయటకు వెళ్లి అల్బేనియా రాజధాని టిరానాలో థియేటర్ దర్శకత్వం, ఫొటోగ్రఫీ వంటివి నేర్చుకున్నారు.

డ్రాండే

ఫొటో సోర్స్, BBC/DERRICK EVANS

ఫొటో క్యాప్షన్, డ్రాండే

‘‘టిరానాలో బాలికలకు, మహిళలకు ఎక్కువ అవకాశాలు, ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామంలో పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది’’ అని ఆమె చెప్పారు.

కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ ఉత్తర అల్బేనియా, కొసోవో ప్రాంతంలో ఇప్పుడు కేవలం 12 మంది బుర్నాషాట్‌లు మాత్రమే మిగిలి ఉన్నారని అంచనా వేస్తున్నారు.

1990లలో కమ్యూనిజం పతనం అయినప్పటి నుంచి అల్బేనియా అనేక సామాజిక మార్పులను చూసింది. అక్కడ మహిళలకు మరిన్ని హక్కులు లభించాయి.

బుర్నేషా సంప్రదాయం కనుమరుగు కావడాన్ని సానుకూల అంశంగా వలెర్జానా చూస్తున్నారు.

‘‘పురుషుల్లాగా మారడానికి ఈరోజు ఆడపిల్లలు పోరాడాల్సిన పని లేదు. పురుషుడిలా మారకుండానే వారితో సమాన హక్కుల కోసం ఆడపిల్లలు పోరాడాలి’’ అని ఆమె అన్నారు.

2019లో టిరానాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో మహిళా హక్కుల కార్యకర్త రియా నెప్రవిస్టా నిరసన తెలిపారు.

‘బుర్నేషా’ అనే పదాలు రాసి ఉన్న పెద్ద ప్లకార్డులతో ఆమె వీధుల్లోకి వచ్చారు. ఆ పదాల కింద ‘శక్తిమంతమైన మహిళ’ అని కూడా రాసి ఉంది.

‘‘ఒక మహిళను శక్తిమంతమైన మహిళగా అభివర్ణించాలనుకున్నప్పుడు అల్బేనియన్ భాషలో ‘బుర్నేషా’ అనే పదాన్ని వాడతాం.

జిస్టినా

ఫొటో సోర్స్, BBC/Derrick Evans

రెండు భాగాలతో కలిసి ఈ పదం ఏర్పడింది. ఇందులో ‘బుర్రే’ అంటే అర్థం పురుషుడు. శక్తిమంతమైన మహిళను సూచించడానికి ‘పురుషుడు’ అనే పదాన్ని వాడకూడదు’’ అని రియా చెప్పారు.

దేశం పురోగతి దిశగా సాగుతుందని, చాలా తక్కువ సమయంలోనే ఈ మేరకు అనేక ముందడుగులు పడ్డాయని ఆమె నమ్ముతున్నారు.

ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రకారం, ఇటీవలి కాలంలో అల్బేనియాలో రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యంలో పురోగతి ఉంది.

2017 నాటికి పార్లమెంట్‌లో 23 శాతం, స్థానిక కౌన్సిలర్లలో 35 శాతం మహిళలు ఉన్నారు.

‘‘అల్బేనియాలో దురదృష్టవశాత్తు స్త్రీ వివక్ష, లింగానికి సంబంధించిన మూసధోరణులు, లింగ ఆధారిత హింస ఇంకా విస్తృత స్థాయిలో ఉంది’’ అని రియా అన్నారు.

ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం సూచించిన లెక్కల ప్రకారం 15-49 ఏళ్ల మధ్య ఉన్న 60 శాతం మహిళలు గృహ హింసను అనుభవించారు.

కేవలం 8 శాతం మంది మహిళలు మాత్రమే సొంత భూమిని కలిగి ఉన్నారని ఐక్యరాజ్యసమితి ట్రీటి బాడీ డేటాబేస్ వెల్లడించింది. మిగతా మహిళలంతా వారసత్వ అంశాల్లో అట్టడుగున ఉన్నారని తెలిపింది.

జిస్టినా

ప్రత్యేక హోదా

బుర్నేషా సంప్రదాయం మూలాలు ‘కనున్’ నుంచి పుట్టుకొచ్చాయి. కనున్ అనేది ఒక పురాతన రాజ్యాంగం. దీన్ని 15వ శతాబ్దంలో కొసోవో, ఉత్తర అమెరికాలో ఉపయోగించారు. ఈ రాజ్యాంగం ఆధారంగానే ఆల్బేనియా సమాజం ఏర్పాటైంది. ఈ పితృస్వామ్య చట్టాల ప్రకారం, స్త్రీలను వారి భర్తల ఆస్తిగా పరిగణించేవారు.

‘‘స్త్రీలకు తమ సొంత జీవితాన్ని ఎన్నుకునే హక్కు లేదు. ఒక అమ్మాయికి నిశ్చితార్థం కూడా ఆమె అంగీకారం లేకుండా, ఆమెకు చెప్పకుండానే చేసేవారు’’ అని బుర్నేషాట్ గురించి అధ్యయనం చేసిన ఎథ్నోగ్రాఫర్ అఫెర్డిటా ఓనుజీ చెప్పారు.

ఈ సంప్రదాయం చుట్టూ ఇంకా అనేక అపోహలు ఉన్నాయి. బుర్నేషాగా మారడం అనేది సాధారణంగా లైంగికత, లింగ గుర్తింపుపై ఆధారపడిన నిర్ణయం కాదు. ఇది ప్రమాణం చేసిన వారికి సంబంధించిన ప్రత్యేక హోదాపై ఆధారపడి ఉంటుంది.

‘‘అమ్మాయిలు, బుర్నేషాగా మారడానికి లైంగికతతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఆ అమ్మాయి మరో పాత్ర పోషించడానికి, కుటుంబంలో మరో స్థానాన్ని తీసుకోవడానికి సంబంధించిన అంశం’’ అని అఫెర్డిటా తెలిపారు.

వరుడి కుటుంబాన్ని అగౌరవ పరచకుండా, వివాహం నుంచి తప్పించుకోవడానికి బుర్నేషాగా మారడం కూడా ఒక మార్గం.

‘‘ఈ నిర్ణయం ఆ రెండు కుటుంబాల మధ్య రక్తపాత పోరును నివారించవచ్చు’’ అని అఫెర్డిటా చెప్పారు.

ఇలా రక్తపాతాన్ని నివారించే అనేక నియమాలు ‘కనున్‌’లో చాలా కాలం క్రితమే క్రోడీకరించారు. ఈ నియమాలు ఉత్తర అల్బేనియాలోని గిరిజనుల జీవితాలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ఉత్తర అల్బేనియా విలీనం అయిన సమయంలో ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి.

వీడియో క్యాప్షన్, బీబీసీ 100 మంది మహిళలు 2021

బుర్నేషా సంప్రదాయంలో సిగరెట్ తాగడం, ఆల్కహాల్ సేవించడం కూడా భాగమే.

పురుషుల కోసమే ప్రత్యేకంగా కేటాయించిన ఆల్బేనియన్ స్పిరిట్, రాకియా వంటివి తాగడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా మారిపోయాయి.

డ్రాండే ఇప్పుడు వాటిని తాగడమే కాదు ప్రత్యేకంగా తయారు చేయగలరు కూడా.

బుర్నేషాగా మారాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల తనకు సమాజంలో మరింత గుర్తింపు దక్కిందని డ్రాండే అన్నారు.

‘‘ఎక్కడికెళ్లినా నాకు ప్రత్యేక గౌరవం లభించింది. ఒక మహిళ తరహాలో కాకుండా ఒక పురుషుడిలాగా నన్ను గౌరవించేవారు. ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా నాకు మరింత స్వేచ్ఛ దొరికినట్లు అనిపించింది’’ అని డ్రాండే చెప్పారు.

బుర్నేషా కావడం కోసం చేసిన త్యాగాల పట్ల గర్విస్తున్నప్పటికీ, ఒక్కోసారి ఒంటరితనం వేధిస్తుందని డ్రాండే చెప్పారు.

‘‘నా బాగోగులు చూసే ఒక సొంత బిడ్డ ఉంటే ఎలా ఉంటుందోనని నేను ఒక్క క్షణం పాటు ఆలోచించా. నేను చాలా ఆనారోగ్యం పాలయ్యా. నన్ను చూసుకునేవారు, నాకు సహాయపడేవారు ఎవరూ లేదు. కానీ, ఇది ఒక్క క్షణం మాత్రమే బాధించింది’’ అని డ్రాండే చెప్పారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన వంద మంది మహిళల్లో ఇద్దరు భారతీయులున్నారు.

మహిళలకు పరిమితమైన అవకాశాలున్న సమాజంలో సాధికారత సాధించడం కోసం ఏకైక మార్గంగా ‘బుర్నేషా’గా మారడాన్ని మహిళలు ఎంచుకున్నారు. ఇది బలిదానంగా మారిన ఒక రకమైన నిరసన అని అఫెర్డిటా అన్నారు.

అయితే, పురుషులుగా మారడం ద్వారా స్త్రీలు తక్కువ వారనే భావాన్ని వారు అంగీకరిస్తున్నారు.

దేశ రాజధానిలో కూడా ఈరోజుకీ యువతుల జీవనం కష్టంగానే ఉంది. మహిళల హక్కులకు సంబంధించిన సహాయం చేయడం కోసం సోషల్ మీడియాను వాలెర్జానా ఉపయోగిస్తున్నారు.

‘‘నాకు పురుషుల నుంచి భయంకరమైన మెసేజ్‌లు వచ్చాయి. ప్రాణాలు తీస్తామని కూడా కొందరు బెదిరించారు. మహిళల హక్కుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ నన్ను సవాలు చేస్తున్నారు’’ అని వాలెర్జానా చెప్పారు.

ముగిసిపోతున్న ఈ సంప్రదాయాన్ని డాక్యుమెంటరీగా చూపించడం కోసం వాలెర్జానా తన అత్తతో పాటు ఇతర బుర్నేషాల ఫొటోలు తీస్తున్నారు.

‘‘భవిష్యత్ తరాలు ఈ అంశంపై ఆసక్తి కనబరుస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మా చరిత్రలో ఒక సంప్రదాయం.

ఇప్పుడు స్వేచ్ఛను అనుభవించడానికి మీరు బుర్నేషాగా మారాల్సిన అవసరం లేదు. ఆధునిక మహిళకు ఇలాంటి ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు’’ అని వాలెర్జానా అన్నారు.

‘‘ఇక బుర్నేషాట్‌లు ఉండరు. నేనే చివరి బుర్నేషా అవుతాను. నేను బుర్నేషాగా మారినందుకు గర్వపడతా. ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు ’’ అని జిస్టినా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)