నిర్భయ అత్యాచారానికి పదేళ్లు: దిల్లీ సామూహిక అత్యాచారం తర్వాత వీరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి

నిర్భయ కేసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ 100 విమెన్

పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో దేశ రాజధాని దిల్లీలో దారుణమైన సామూహిక అత్యాచారం చోటుచేసుంది. దీనిపై పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని మహిళలపై హింస గురించి జాతీయ స్థాయిలో చర్చలు కూడా మొదలయ్యాయి.

(ఈ కథనంలో లైంగిక హింస సహా కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

దిల్లీలో తను ప్రయాణస్తున్న బస్సులోనే డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురు దోషులు 23 ఏళ్ల జ్యోతి సింగ్‌పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ప్రపంచ మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. జ్యోతిని ‘‘నిర్భయ’’అంటే భయం ఎరుగని యువతిగా మీడియా అభివర్ణించింది.

తీవ్రమైన గాయాలతో నిర్భయ చాలా పోరాడింది. కానీ, ఆమె అంతర్గత అవయవాలకు చాలా గాయాలయ్యాయి. పైగా నడుస్తున్న బస్సులో నుంచి ఆమెను తోసేశారు. దారుణమైన ఈ ఘటనకు రెండు వారాల తర్వాత ఆమె మరణించారు.

ఆ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ దిల్లీలో వందల మంది నిరసనలు చేపట్టారు. ఎముకలు కొరికే చలిలో, పోలీసుల జల ఫిరంగులకు ఎదురెళ్లి వారు నిరసన తెలిపారు.

ఆశా దేవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆశా దేవి

ఆ దారుణమైన అత్యాచారంపై వార్తలు చదివినప్పుడు నాకు మొదట భయం వేసింది. ఆమె శరీరంలోకి రాడ్డును చొప్పించి, పేగులు బయటకు తీశారని వార్తలు చదివినప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను. దిల్లీలో పెరిగిన నేను వీధుల్లో ఆకతాయిల వేధింపులు చాలా చూశాను. కానీ, ఇలాంటి ఘటన గురించి వినడం అదే మొదటిసారి.

ఆ 2012నాటి నిరసనలు కొన్ని మార్పులను కూడా తీసుకొచ్చాయి. మహిళలపై హింసను మరింత సవివరంగా నిర్వచించడం, దోషులకు మరణి శిక్షతోపాటు కఠినమైన శిక్షలు విధించడం లాంటి సవరణలతో కొత్త చట్టాలు తీసుకొచ్చారు.

దశాబ్ద కాలం తర్వాత, అంటే నేటికీ మహిళలను చాలా ముప్పులు వెంటాడుతున్నాయి. గత పదేళ్లలో మహిళలపై పాల్పడే నేరాలకు సంఖ్య 50 శాతానికిపైగా పెరిగింది.

అయితే, అత్యాచారాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి పోరాడిన ఒక మహిళ గురించి మనం చెప్పుకోవాలి. ఆమె జ్యోతి సింగ్ తల్లి ఆశా దేవి.

సామూహిక అత్యాచారానికి బలైన తన కుమార్తె పేరుపై ‘‘నిర్భయ జ్యోతి ట్రస్టు’’ను ఆమె ఏర్పాటుచేశారు. అత్యాచార బాధితుల పేర్లను గోప్యంగా ఉంచాలని భారత్‌లో చట్టాలు చెబుతున్నాయి. అయితే, ‘‘దారుణమైన నేరాలకు పాల్పడేవారు సిగ్గుపడాలి. బాధితుల కుటుంబాలు కాదు’’అని చెబుతూ తన కుమార్తె పేరును ఆమె 2015లో మీడియాకు వెల్లడించారు.

సీమా కుశ్వాహా, ఆశా దేవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీమా కుశ్వాహా, ఆశా దేవి

తన కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడటంతోపాటు ఎంతోమంది వివక్షకు గురయిన బాధితులకు ఆశ అండగా నిలిచారు. చాలా మంది సాయం కోరుతూ ఏళ్లుగా ఆమె దగ్గరకు వస్తున్నారు.

‘‘కొన్నిసార్లు జీవితంలో ముందుకు వెళ్లేందుకు వారికి కావాల్సింది భరోసా మాత్రమే. మన దేశంలో కోర్టుల్లో న్యాయం జరిగేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో వారికి సాయం ఎలా పొందాలో నేను మార్గనిర్దేశం చేస్తాను’’అని ఆమె నాతో చెప్పారు.

ఆశ జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేశాను. అలా నేను కలిసిన వారిలో సీమా కుశ్వాహా ఒకరు.

జ్యోతిపై సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు చేపట్టిన వారిలో సీమా కూడా ఒకరు. సీమాతోపాటు జీవించే అమ్మాయిల్లో సగం మందిని వారి కుటుంబాలు భయంతో తమ ఊళ్లకు వచ్చేయాలని పిలిచాయి. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. కానీ, సీమా మాత్రం ఇక్కడే ఉంది.

లా చదివుకునే సీమా.. జ్యోతి కేసు విచారణకు హాజరయ్యేవారు. న్యాయం కోసం ఆశ చేస్తున్న పోరాటంలో ఎలాగైనా తను సాయం చేయాలని సీమా భావించేవారు. 2013లో ఈ కేసులో దోషులకు మరణశిక్ష పడేందుకు పోరాడిన న్యాయవాదుల బృందంలో ఆమె కూడా ఉన్నారు.

ఆ దోషులను ఉరితీయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నేరుగా ఆశ ఇంటికి సీమా వచ్చారు. జ్యోతి ఫోటో ముందు మోకాళ్లపై నిలబడి తను చేసిన ప్రతిజ్ఞ నెరవేరిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

‘‘ఆ రోజు దేశం మొత్తం చూసింది. ఆ రేపిస్టులను ఉరితీయడం చాలా ముఖ్యం’’అని ఆమె అన్నారు.

మహిళలపై నేరాలు

దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ప్రజలను శాంతింప చేసేందుకు దారుణమైన ఈ అత్యాచార కేసుల్లో మరణశిక్షణ విధించేలా చట్టాల్లో మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు చదువుకోనివారు, నిరుద్యోగులు, ఏ మాత్రం పరిచయంలేని వారే ఇలాంటి అత్యాచారాలకు తెగిస్తారని కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.

మరోవైపు నిర్భయ సామూహిక అత్యాచార దోషుల ప్రొఫైల్స్ కూడా దీనికి సరిపోయాయి. అయితే, ఆ తర్వాత గణాంకాలను పరిశీలించినప్పుడు షాక్‌కు గురయ్యే విషయాలు తెలిశాయి.

భారత ప్రభుత్వం విడుదలచేసే నేరాల సమాచారాన్ని పరిశీలిస్తే, 95 శాతం అత్యాచార కేసుల్లో నిందితులు బాధిత మహిళలకు తెలిసివారేనని వెల్లడైంది. బంధువులో, స్నేహితులో, కలిసి పనిచేసేవారో లేదా ఇరుగుపొరుగువారో ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.

మహిళలపై నేరాలు

నిర్భయ లాంటిదే..

ఇలాంటి నేరాలతో తలకిందులైన కుటుంబాల్లో పంకజ్ (పేరు మార్చాం) కుటుంబం ఒకటి. అతడి 13 ఏళ్ల సోదరిపై అత్యాచారం జరిగింది. ఇంటికి సమీపంలోని పొలంలో ఆమెను హత్యచేశారు.

ఆమె శరీరాన్ని మొదట గుర్తించింది పంకజ్. తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులో ఆమె శరీరం కనిపించింది. ఆమె మెడ వెనుక నుంచి వెదురుకర్రను శరీరంలోకి గుచ్చారు. కత్తితో శరీరంపై గాయాలు చేశారు.

జ్యోతి సామూహిక అత్యాచారానికి ముందు వెసవిలో పంకజ్ సోదరి దారుణ హత్యకు గురయ్యారు. తన సోదరి ఎలా కనిపించిందో చూపిస్తానని ఆ ఫోటోలను నాకు ఆయన చూపించారు. ఆ ఫోటోలను నేను ఎప్పటికీ మరచిపోను.

వీడియో క్యాప్షన్, ‘22 ఏళ్లలో తొలిసారి హీరోతో సమానంగా పారితోషికం తీసుకున్నా’’

తూర్పు భారత్‌లోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. కొన్ని స్థానిక పత్రికలు మాత్రమే దీనిపై వార్తలు ప్రచురించాయి.

‘‘ఆమె కథ బయటకు రాలేదు. న్యాయం కోసం ఎవరూ నిరసనలు చేపట్టలేదు’’అని పంకజ్ నాతో చెప్పారు. అసలు వారు అంత అమానవీయ ఘటనకు ఎలా ఒడిగట్టారోనని ఆయన అన్నారు.

నాకు మళ్లీ భయం వేసింది. జ్యోతి కేసులో దాడిచేసిన వారంతా ఆమెకు పరిచయం లేనివారే. కానీ, పంకజ్ సోదరిపై అత్యాచారం కేసులో అరెస్టైన నలుగురు వ్యక్తులూ ఆమెకు తెలిసినవారే. దీనిలో ఆమె పొరుగునుండే ఒక వ్యక్తి, ఆమెకు ప్రైవేటు పాఠాలు చెప్పే టీచర్ కూడా ఉన్నారు.

‘‘పోలీసులు ఆ టీచర్‌ను అరెస్టు చేసినప్పుడు వారు పొరపాటు పడ్డారేమో అనుకున్నాను. అయితే, ఆయన నేరం ఒప్పుకున్నప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఆయన దగ్గర నుంచి దాడిచేసిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు’’అని పంకజ్ చెప్పారు.

మహిళలపై నేరాలు

ఈ కేసులో నిందితులను 2016లో స్థానిక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అయితే, వీరిని 2021లో నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ఆ ఘటన చాలా దారుణమైనది అయినప్పటికీ సాక్ష్యాలను చూపించడంలో అధికారులు విఫలమయ్యారు. మరోవైపు టీచర్‌తోపాటు అందరూ తాము ఆ హత్య చేయలేదని మాట మార్చారు.

ఆధారాలను సరిగా సేకరించకపోవడం, వాంగ్మూలాల్లోనూ లోపాల వల్ల చాలా మంది నేరస్థులను కోర్టులు నిర్దోషులుగా ప్రకటిస్తున్నాయి. గత నెలలోనూ ఇలాంటి కేసులో నిందితులను సుప్రీం కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

పంకజ్ కుటుంబం విషయంలోనూ ఇదే జరిగింది. మరోవైపు ఆ నిందితులు తమ కుటుంబాన్ని బెదిరించారని పంకజ్ కుటుంబం వెల్లడించింది.

‘‘వారు మా గ్రామ మార్కెట్‌కు వచ్చారు. చంపేస్తానని నన్ను బెదిరించారు’’అని ఆయన చెప్పారు. అయినప్పటికీ పంకజ్ వెనుకడుగు వేయలేదు. తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ ఆయన దిల్లీకి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు చేతిలో ఒక వార్తాపత్రిక ముక్క ఉండేది. దానిలో ఆశా దేవి గురించి వార్త రాశారు.

ఆశా దేవిని కలవడంతో పంకజ్‌కు చాలా విషయాలు అర్థమయ్యాయి. జ్యోతి కేసు వాదించిన సీనియర్ న్యాయవాదే ఇప్పుడు పంకజ్ సోదరి కేసునూ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

‘‘వారికి మరణ శిక్ష పడుతుందని నాకు తెలుసు. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది’’అని పంకజ్ చెప్పారు.

స్నేహ జవాలే
ఫొటో క్యాప్షన్, స్నేహ జవాలే

 గృహ హింస కూడా..

భారత న్యాయ వ్యవస్థను కేసుల పెండింగ్ సమస్య వేధిస్తోంది. అయితే, అత్యాచార కేసుల విషయంలో కోర్టులు వేగంగా స్పందిస్తున్నాయి. మీడియాలో ఈ కేసుల గురించి వార్తలు రావడం, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడమే దీనికి కారణం. అయితే, ఇంట్లో మహిళలపై హింస గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు.

భారత్‌ మహిళలు ఎదుర్కొంటున్న నేరాల్లో గృహ హింస మొదటి స్థానంలో ఉంటోంది. అత్యాచారాలతో పోలిస్తే, నాలుగు రెట్లు ఎక్కువగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి.

దీనిపై మీడియాలో చర్చ జరగాలని 45 ఏళ్ల స్నేహా జవాలే అంటున్నారు.

వరకట్నం తీసుకురావాలని తన భర్త తనను కొట్టేవారని బీబీసీ 100 విమెన్‌కు ఆమె చెప్పారు. కానీ, 2000 డిసెంబరు 24న పరిస్థితి తీవ్రమైంది.

‘‘ఆ రోజు రాత్రి నాపైకి నా భర్త కిరోసిన్ విసిరారు. ఆ తర్వాత అగ్గిపుల్ల వెలిగించారు. దీంతో నా మొహం, ఛాతి, చేతులు కాలిపోయాయి’’అని ఆమె చెప్పారు. తన కొడుకు ముందే ఆమెకు నిప్పు పెట్టారు.

తను ఆసుపత్రిలో కోలుకుంటున్నప్పుడే తనపై దాడిచేసింది తన భర్తేనని తన కుటుంబానికి ఆమె వెల్లడించారు. కానీ, వారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. అంతే దూరపు చుట్టాలకు తను చనిపోయిందని కూడా కుటుంబం సభ్యులు చెప్పారని, ఆ విషయం తెలుసుకొని షాక్‌కు గురయ్యానని ఆమె చెప్పారు.

రోజూ గృహహింసపై ఎన్నో వార్తలు చదివే నా లాంటి జర్నలిస్టుకు కూడా ఇది షాక్‌కు గురిచేసే విషయం. ఇంత క్లిష్టమైన సమయంలో బాధితులను వారి కుటుంబ సభ్యులు ఎలా వదిలిపెట్టగలిగారు.

స్నేహ ఎదుర్కొన్న హింస తన ఇంట్లో నాలుగు గోడలకు మాత్రమే తెలుసు. కానీ, 12 ఏళ్ల తర్వాత నిర్భయపై జరిగిన దాడితో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

వీడియో క్యాప్షన్, ఇంటా బయటా వారిపై ఉన్న ఒత్తిడే కారణమంటున్న నిపుణులు..

నిర్భయ పేరుతో చిత్రీకరించిన ఓ ప్లేలో నటించాలని 2013లో స్నేహను నిర్వాహకులు కోరారు. గృహహింస బాధితులపై దీన్ని సిద్ధంచేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తర్వాత నాలుగేళ్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆమె తన కథను పరిచయం చేశారు. ఈ ప్లేలో కనిపించిన వారిలో స్నేహ తప్పా అందరూ నటులే.

‘‘ఆ కార్యక్రమం నాకు చాలా కొత్త విషయాలు నేర్పించింది. దాని వల్ల నా జీవితమే మారిపోయింది’’అని స్నేహ చెప్పారు.

‘‘మా ప్రదర్శన తర్వాత ప్రేక్షకుల్లో కొంత మంది మాట్లాడేవారు. వారు తమ కథలను చెప్పేవారు. అవి వింటుంటే నాలో బాధ క్రమంగా తగ్గింది. నేను ఒంటరిని అనే బాధ కూడా తొలగిపోయింది’’అని ఆమె చెప్పారు.

బర్ఖా బజాజ్
ఫొటో క్యాప్షన్, బర్ఖా బజాజ్

మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్

బాధను మరచిపోవడానికి, సాయం కోసం, కోర్టుల్లో పోరాటాలు చేసేవారిలో ఎక్కువ మంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు.

ఇబ్బందుల్లో ఉండే మహిళల కోసం బర్ఖా బజాజ్ ఒక హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టారు. సైకాలజిస్టు అయిన ఆమె అమెరికాలో లైంగిక వేధింపుల బాధితుల కోసం పనిచేశారు. ఆమె జీవితంలోనూ నిర్భయ కేసు ఒక మలుపు లాంటిది.

2012లో ఆమె ఈశాన్య భారత్‌లో ఒంటరిగా రైలులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే జ్యోతిపై జరిగిన దాడి ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆమెకు చాలా భయం వేసింది.

వెంటనే బూట్లు వేసుకొని, కారం పొడి పక్కనే పెట్టుకొని నిద్రపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమెకు సాయం కూడా దొరికే అవకాశం లేదు.

‘‘ఆ అనుభవమే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనకు నాంది పలికింది’’అని పుణె నుంచి ఆమె ఒక వీడియో కాన్ఫెరెన్స్‌లో నాతో చెప్పారు.

మొదట ఆమె అత్యాచార బాధితుల కోసం ఆ హెల్ప్‌లైన్‌ను పెట్టారు. కానీ, గత తొమ్మిదేళ్లుగా ఎక్కువగా తనకు గృహహింస బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆమె వివరించారు.

‘‘వేధింపుల నుంచి బయటపడేందుకు మహిళలకు ప్రభుత్వం కూడా సాయం చేయాలి. కోర్టులో పోరాటం చేసేందుకు న్యాయవాదులను అందుబాటులో ఉంచాలి’’అని బర్ఖా అన్నారు.

మహిళలపై నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇలా మహిళలపై హింస, వేధింపుల గురించి మాట్లాడేందుకు రాజకీయాలను సీమా ఎంచుకున్నారు.

2022 మొదట్లో దళితుల పార్టీగా చెప్పుకునే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో ఆమె చేశారు.

దళిత వర్గానికి చెందిన ఆమె జెండర్ జస్టిస్ కోసం, దళితుల హక్కుల కోసం పోరాడుతుంటారు. కుల, జెండర్ వివక్షపై రాజకీయ నాయకులు మెరుగ్గా పోరాడగలరని ఆమె భావిస్తున్నారు.

‘‘ఇక్కడ లైంగిక హింస గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కానీ, సమాజంలోని అసమానతలు మన కుటుంబాలు, పెళ్లిళ్లు, రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ మారాలి’’అని ఆమె అన్నారు.

మహిళల భద్రత విషయంలో మార్పులు రావడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుందని నిర్భయ తల్లి ఆశా దేవి భావిస్తున్నారు.

‘‘మహిళల కోసం పరిస్థితులను మెరుగుపరచాలని మేం భావించాం. కానీ, ఏమీ చేయలేకపోతున్నాం’’అని ఆమె వ్యాఖ్యానించారు.

పోలీసులు, ప్రభుత్వం నియమిస్తున్న లాయర్లతో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆమె భావిస్తున్నారు. కోర్టు ప్రక్రియలు కూడా చాలా క్లిష్టమైనవని, బయటకు సమాచారం రావడం చాలా కష్టమని ఆమె అన్నారు. అయితే, ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో చాలా కొత్త విషయాలను ఆమె నేర్చుకుంటున్నారు.

‘‘నేను చదువుకోలేదు. కానీ, పోరాటం చేస్తున్నాను. మా అమ్మాయికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను’’అని ఆమె అన్నారు.

‘‘ఇతరుల బాధ వినేటప్పుడే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయితే, వారికి అండగా నిలబడుతున్నాననే విషయం నాకు మనశ్శాంతినిస్తోంది’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, బాలికలుగా ఉండగానే వారికి గర్భనిరోధక సాధనాలు అమర్చారని ఆందోళన....
బీబీసీ వంద మంది మహిళలు

బీబీసీ ప్రతీ ఏడాది ప్రపంచంలోని 100 మంది స్ఫూర్తిమంతమైన, ప్రభావశీలురైన మహిళల పేర్లతో ‘బీబీసీ 100 విమెన్’ జాబితాను ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌లో భాగంగా ఈ కథనాన్ని అందిస్తున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)