పిల్లల గురించి, పిల్లల ముందే ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే ఏం చేయాలి?

ఆడపిల్లలు

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

    • రచయిత, నటాషా బద్వార్
    • హోదా, బీబీసీ కోసం

ఇది ఇప్పటి మాట కాదు. కొన్ని సంవత్సరాల కిందటి విషయం. అప్పటికి మా పిల్లలు చిన్నవాళ్లు. అయిదుగురు ఉన్న మా కుటుంబంలో అమ్మా నాన్నలమైన మేం ఇద్దరం పెద్దవాళ్లం, మాకు ముగ్గురు పిల్లలు.

మేం దక్షిణ దిల్లీలోని ఒక స్నేహితుల ఖాళీ ఫ్లాట్‌ గురించి ఒక జంటను కలవడానికి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ విదేశాలలో ఉంటున్నారు. వారి ఇల్లు అద్దెకు ఇవ్వడంలో మేం సాయం చేస్తున్నాం.

వాళ్ళిద్దరూ అచ్చం మాలాగే ఉన్నారు. దిల్లీకి చెందిన వారే. మంచి స్కూళ్లలో చదువుకున్నారు. దిల్లీ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన తర్వాత ఆమె బిజినెస్ చేస్తున్నారు.

అద్దె ఇంటి కోసం వెతుకుతుండగా, మా స్నేహితుడి ఇల్లు కనిపించింది. తాళాలు మా దగ్గర ఉండటంతో ఇల్లు చూపించడానికి మేము ఐదుగురం వెళ్లాం.

ఇది పెద్దగా ఆసక్తిలేని పని. పైగా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు బయటకు వెళ్లడం ఒక సాహసం లాంటిది.

''హాయ్, నేను నటాషా'' అంటూ నన్ను నేను ఆమెకు పరిచయం చేసుకున్నాను. ఆమె నా పిల్లలను చూశారు. ఆ తర్వాత నావైపు చూశారు.

ఆడపిల్లలు

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

చదువుకున్న వారి అజ్ఞానం

''మీరు కొడుకు కావాలనుకున్నారా'' అని అడిగారు.

నేను ఆమె ముఖంలోకి చూశాను, నా ముఖంలో ప్రశ్న గుర్తు కనిపించింది.

ఆమె మళ్లీ అడిగారు "మీరు కొడుకు కావాలనుకున్నారా?"

నేను కొంచెం అయోమయంతో 'లేదు' అన్నాను.

ఆమె ఏమి అడుగుతున్నారో నాకు అర్థం కావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె నా చిన్న కూతురు నసీమ్ వైపు చూస్తోంది. నసీమ్ తనలో తాను మునిగిపోయి ఉంది. ఆమె ఖాళీగా, దుమ్ముతో నిండిన ఆ ఇంటిలో పొర్లుతూ ఏదో పాటను హమ్ చేస్తోంది.

తర్వాత నసీం, ఇంటి బయట స్తంభాన్ని కొబ్బరి చెట్టులాగా పట్టుకుని ఎక్కే ప్రయత్నంలో ఉంది.

తర్వాత వాళ్ల నాన్నను స్తంభంగా భావించి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది.

అఫ్జల్ (నసీమ్ తండ్రి) పాప బరువుకు చెట్టులా కాస్త ఒరిగారు. తర్వాత బ్యాలన్స్ చేసుకుని తిరిగి నిలబడ్డారు.

ఆ మహిళ "ఇది అమ్మాయే, మిగతా ఇద్దరూ ఆడపిల్లలేనా" అని అడిగారు.

వీడియో క్యాప్షన్, ఐటీ రంగంలో మహిళల భాగస్వామ్యం ఎలా ఉంది?

అప్పుడు నేను ఆ మహిళతో "నాతో కాస్త బయటకు వస్తారా?" అని అడిగాను.

ఇంటి మెయిన్ డోర్ తెరిచి ముందుకు వెళ్లాను. నా ఉద్దేశ్యం ఆమెకు అర్థం కాలేదు.

"ఇటు రండి" అని ఆమెను పక్కకు తీసుకెళ్లాను. అక్కడే ఉన్న నా పెద్ద కూతురు సహర్‌ను పిలిచాను. ''సహర్, నేను ఆమెతో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను'' అని చెప్పాను.

ఆ సమయంలో సహర్ తన సోదరి అలీజాతో అల్మారాలో కూర్చుని ఆడుకుంటోంది. 'అమ్మా ఏంటి' అని పాప అడిగింది.

నేను ఈమెతో మాట్లాడటానికి వచ్చాను, మీరు జాగ్రత్తగా ఆడుకోండి అని ఆమెకు సైగలతో చెప్పాను.

సహర్‌కు అప్పటికి తొమ్మిదేళ్లు. మేమిద్దరం ఒకరి ముఖం నుంచి మరొకరం భావోద్వేగాలను పంచుకుంటూ ఉండేవాళ్లం.

తర్వాత నేను ఫ్లాట్ చూడటానికి వచ్చిన మహిళవైపు తిరిగాను. ఆమె దృష్టి నా పిల్లల వైపు నుంచి మరలింది.

''ఏం మాట్లాడుతున్నారు మీరు'' అని ఆమెను అడిగాను.

''మీరు కొడుకు కోసం ఎదురు చూశారా. అందుకే మూడుసార్లు ప్రయత్నించారా అని అడిగాను'' అన్నారామె.

ఆడపిల్లలు

ఫొటో సోర్స్, UMESH NEGI

ప్రేమ, కుటుంబాల ప్రాముఖ్యత

''మీకో విషయం తెలుసో తెలియదో. కొంతమందికి పిల్లలు కావాలని ఉంటుంది. కొందరు పిల్లలు అవసరం లేకుండా తామిద్దరే ప్రేమగా ఉండాలనుకుంటారు. ఇది పిచ్చి ఆలోచన అనిపించవచ్చు. అన్ని వేళలా వర్కవుట్ కాకపోవచ్చు కూడా. కానీ, మనలో చాలామంది అలా ఉంటున్నారు'' అన్నాను.

''కానీ, మీకు ముగ్గురూ ఆడపిల్లలే కదా'' అని తన మూడు వేళ్లను చూపిస్తూ అన్నారామె.

''నేను మీ గురించి చెడుగా ఆలోచించే ముందు మీరు చేస్తున్న నాన్సెన్స్ పని గురించి చెప్పనివ్వండి. పిల్లల ముందు అలా మాట్లాడటం తప్పు అన్న ఆలోచన ఉందా మీకసలు'' అన్నాను.

''పిల్లల ముందు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కోరుకోలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు జీవించే హక్కు లేదా? ఆడ పిల్లలను చూసి బయటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిదేనా?'' అని ప్రశ్నించాను.

''మీరు ఆడపిల్లలను అంతగా తక్కువగా చూడటానికి కారణం ఏంటి '' అని నేను ఆమెను అడిగాను.

సహజంగానే ఈ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు.

ఆడపిల్లలు

ఫొటో సోర్స్, SHYLENDRAHOODE

అయితే, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఈమె ఒక్కరే కాదు. చాలామంది ఉన్నారు.

మనం మనకిష్టమైన నిర్ణయాలు తీసుకుంటాం. అవి సరైనవేనని భావించి, ఆలోచించకుండా కూడా నిర్ణయాలు తీసుకుంటాం. మన ప్రాధాన్యతలను గుర్తించకుండా, కొందరు మనకు లేబుల్స్ తగిలించడానికి ప్రయత్నిస్తుంటారు.

మూర్ఖుల మాటలను కంట్రోల్ చేయాలంటే, వారితో గట్టిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కానీ, దీన్ని నేను సహజంగా చేయలేకపోతున్నాను.

నాకు కోపం వస్తుంది. కానీ ఆ కోపం ఎక్కడో చీకటిలోకి జారిపోతుంది. లేదా దాక్కుంటుంది. నాకు కోపంతో వణుకు మొదలైంది.

కోపాన్ని అణుచుకోవడం కూడా నేర్చుకుంటున్నాను. మాటలు జారడం వల్ల నేను ఇబ్బందుల్లో పడొచ్చు.

అయితే, కోపంతో మనలో మనం రగిలిపోవడంకన్నా, ఇతరులను మేల్కొలిపే ప్రయత్నం చేయడం మంచిది.

సహర్, అలీజా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి, "అమ్మా, నాన్న నిన్ను పిలుస్తున్నారు" అన్నారు.

"ఏం మాట్లాడుకుంటున్నారు?" అని అడిగింది సహర్.

"నేను నీ నుంచి నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నా" అన్నాను.

వీడియో క్యాప్షన్, పది మంది దళిత మహిళలు బ్యాండు మేళం ఏర్పాటు చేశారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)