డ్రోన్లు: భారతదేశం 2030 నాటికి ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరిస్తుందా... అవకాశాలు, అవరోధాలు ఏమిటి?

ఫొటో సోర్స్, Uddesh Nath
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, ముంబై
కొత్తగా అర్హత పొందిన డ్రోన్ పైలట్ ఉద్దేశ్ ప్రతీమ్ నాథ్.. తన కొత్త నైపుణ్యంతో వచ్చే అవకాశాల గురించి ఉద్వేగంగా ఉన్నారు.
''సర్టిఫికెట్ సంపాదించటం వల్ల నాకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. నేను సర్వే మ్యాపింగ్, అసెట్ ఇన్‌స్పెక్షన్, అగ్రికల్చర్ వంటి చాలా రంగాల్లో పని చేస్తూ ఉన్నాను'' అని చెప్పారాయన.
డ్రోన్లు చాలా రూపాల్లో, చాలా పరిమాణాల్లో ఉంటాయి. అతి చిన్న డ్రోన్లకు మూడు లేదా నాలుగు రోటర్లు ఉంటాయి. కెమెరా వంటి చిన్న పరికరాలను అవి మోయగలవు. అతి పెద్ద డ్రోన్లు చిన్నపాటి విమానాల్లాగా కనిపిస్తాయి. సాధారణంగా సైన్యం వీటిని వాడుతుంటుంది. ఇవి గణనీయమైన బరువును మోయగలవు.
ఉద్దేశ్ (23) డ్రోన్లు డిజైన్ చేస్తూ ఉండేవారు. అయితే వాటిని నడపటానికి సర్టిఫికెట్ సంపాదించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా పనిలో మరింత సంతృప్తి, ఇంకా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించటానికి ఐదు రోజుల కోర్సు ఆయనకు సరిపోయింది. ఇప్పుడు ఆయన మ్యాపింగ్ కోసం ఉపయోగించే డ్రోన్లు ఎగరటాన్ని పరీక్షిస్తున్నారు.
ఆ తర్వాత మరింత భారీ అయిన, సంక్లిష్టమైన డ్రోన్లను నడపాలని కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం డ్రోన్ల రంగానికి ఇస్తున్న భారీ మద్దతు నుంచి ఉద్దేశ్ ప్రయోజనాలు పొందుతున్నారు.
భారతదేశం ఈ ఏడాది ఫిబ్రవరిలో.. సైన్యానికి లేదా పరిశోధన, అభివృద్ధికి అవసరమైనవి మినహా మిగతా ఎలాంటి డ్రోన్ల దిగుమతినైనా నిషేధించింది.
దేశంలోనే డ్రోన్లను డిజైన్ చేసి, అసెంబుల్ చేయటంతో పాటు.. వాటిలో ఉపయోగించే పరికరాలను కూడా ఇక్కడే తయారు చేసే స్వదేశీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
''డ్రోన్లను ఉపయోగించటం చాలా తేలిక, విభిన్న రంగాల్లో వాటిని వాడవచ్చు. ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో మరింతగా ఉపయోగపడతాయి. కాబట్టి అవి ఈ రంగంలో గణనీయమైన ఉపాధి, ఆర్థికాభివృద్ధి అవకాశాలు సృష్టించగలవు'' అంటున్నారు పౌర విమానయాన శాఖ మాజీ జాయింట్ సెక్రటరీ అంబర్ దూబే.

ఫొటో సోర్స్, Asteria Aerospace
''భారతదేశానికి వినూత్న ఆవిష్కరణలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చౌకైన ఇంజనీరింగ్‌లో సాంప్రదాయికంగా ఉన్న బలాలతో పాటు, దేశీయంగా భారీ డిమాండ్ ఉండటం వల్ల.. 2030 నాటికి ప్రపంచ డ్రోన్ కూడలిగా మారే సామర్థ్యం భారతదేశానికి ఉంది'' అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
రాబోయే మూడేళ్లలో ఈ రంగంలో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
పదేళ్లుగా డ్రోన్లు నిర్మిస్తున్న ఆస్టీరియా ఏరోస్పేస్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు నీల్ మెహతా. ఈ రంగాన్ని బలోపేతం చేయటానికి ప్రభుత్వ కృషిని ఆయన ఆహ్వానించారు.
దానివల్ల ఆయన కంపెనీ రక్షణ రంగం కోసం డ్రోన్ల నిర్మాణమే కాకుండా సరికొత్త రంగాలకు విస్తరించటానికి వీలు కలిగింది.
''డ్రోన్ కంపెనీలకు ఇప్పుడు స్పష్టమైన వృద్ధి ప్రణాళిక ఉంది. భారీ ఆర్డర్లు, భరోసా ఇచ్చే భవిష్యత్తు మార్గం కనిపిస్తోంది. దేశంలో ఇప్పుడు నిజమైన ప్రపంచంలో, భారీ స్థాయిలో, ప్రభావవంతంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండేలా డ్రోన్లు ఉపయోగిస్తున్నాం'' అని నీల్ మెహతా చెప్పారు.
ప్రస్తుతం దేశంలో డ్రోన్లు అన్ని రకాల పనులూ చేస్తున్నాయి. ట్రాఫిక్‌ను పర్యవేక్షించటానికి పోలీసులు డ్రోన్లను వాడుతున్నారు. స్మగ్లర్లు, ట్రాఫికర్లను గాలించటానికి సరిహద్దు భద్రతా బలగాలు డ్రోన్లను వాడుతున్నారు.
వ్యవసాయ రంగంలోనూ వీటి వినియోగం అంతకంతకూ సాధారణమవుతోంది. పైరు ఆరోగ్యాన్ని పర్యవేక్షించటానికి, ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేయటానికి డ్రోన్లను వాడుతున్నారు.
అయితే.. భారత డ్రోన్ రంగం విషయంలో ఉద్విగ్నత, పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ.. జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగంలో ఉన్నవారు సూచిస్తున్నారు.
''భారతదేశం 2030 నాటికి డ్రోన్ హబ్ కావాలన్న లక్ష్యం పెట్టుకుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం దీనికి సంబంధించిన సంపూర్ణ వ్యవస్థ, సాంకేతిక ముందడుగులు బలంగా లేవు'' అంటున్నారు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ నారంగ్.

ఫొటో సోర్స్, Getty Images
భద్రతను పర్యవేక్షించటంతో పాటు, డ్రోన్ల కోసం ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేయటానికి దోహదపడే ఒక బలమైన నియంత్రణ వ్యవస్థ ఈ రంగానికి అవసరమని ఆయన పేర్కొన్నారు.
డ్రోన్ పరిమాణం పెద్దదయ్యే కొద్దీ ఈ నియంత్రణ వ్యవస్థలు ఉండటం మరింత ముఖ్యమని ఆయన అంటారు.
''దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచే చొరవ రావాలి. 2030 నాటికి గ్లోబల్ హబ్ కావాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే.. ఒక సంస్థ కానీ, మంత్రిత్వశాఖ కానీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది'' అని చెప్పారాయన.
డ్రోన్ తయారీకి అవసరమైన పరికరాలు, విడిభాగాలన్నిటినీ తయారు చేసే సంస్థల వ్యవస్థ కూడా భారతదేశంలో లోపించింది.
ప్రస్తుతం.. బ్యాటరీలు, మోటార్లు, ఫ్లైట్ కంట్రోలర్లు సహా చాలా భాగాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ప్రోత్సాహక పథకం ద్వారా దేశీయ సంస్థలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ధీమాగా ఉంది.
''ఈ పరికరాల పరిశ్రమ నిర్మాణం కావటానికి రెండు, మూడేళ్ల సమయం పడుతుంది'' అని దూబే పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరిమితులు ఉన్నాకూడా.. డ్రోన్లకు, వాటిని నడిపే వారికి డిమాండ్ ఉంటుందని సంస్థలు నమ్ముతున్నాయి.
దేశంలో డ్రోన్ల వినియోగంపై నిబంధనలను 2021లో తొలుత సడలించినప్పటి నుంచీ.. డ్రోన్ డెస్టినేషన్ సంస్థ 800 మందికి పైగా పైలట్లు, ఇన్‌స్ట్రక్టర్లకు శిక్షణ నిచ్చింది.
రాబోయే ఐదేళ్లలో దేశంలో దాదాపు 5,00,000 మంది సర్టిఫైడ్ పైలట్లు అవసరమవుతారని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిరాగ్ షారా అంచనా వేస్తున్నారు.
''త్వరలో 5జీ రాబోతోంది. దీంతో డ్రోన్ టెక్నాలజీ తన పూర్తి సామర్థ్యంతో రెక్కులు విప్పుకునే వేదిక లభిస్తుంది. ప్రత్యేకించి దీర్ఘ శ్రేణి, అధిక సామర్థ్య ఆపరేషన్లు విస్తరిస్తాయి'' అని ఆయన పేర్కొన్నారు.
కొన్ని కంపెనీలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే అటానమస్ డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. ఇవి తమకు తాముగా తమ గమ్యాలకు చేరుకుంటాయి. దీనివల్ల భవిష్యత్తులో డ్రోన్ పైలట్ల అవసరం లేకుండా పోతుందా?
కొత్తగా సర్టిఫికెట్ పొందిన ఉద్దేశ్ నాథ్‌కు దీనిపై ఆందోళనమీ లేదు.
''డ్రోన్లకు ఎల్లప్పుడూ ఒక పైలట్ కానీ, రిమోట్‌గా ఉండి నియంత్రించే, పర్యవేక్షించే వ్యక్తి కానీ అవసరం. వేర్వేరు డ్రోన్లను వేర్వేరుగా నిర్వహిస్తారు. ఏఐ ఇంకా అంతగా అధునాతనం కాలేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''ఒకవేళ అది తనను తాను నియంత్రించుకోవటం నేర్చుకున్నా కూడా.. ప్రతి పరిస్థితిలోనూ ప్రతిస్పందించటాన్ని మనం డ్రోన్‌కు నేర్పలేం'' అంటారాయన.
ఇవి కూడా చదవండి:
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















