డిజిటల్ స్కిల్స్: ఉద్యోగం రావాలన్నా, వచ్చిన తరువాత నిలవాలన్నా ఇవి కావాల్సిందే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ క్రిస్టియన్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
కంప్యూటర్ ఆపరేట్ చేయడం... ఇ-మెయిల్ పంపడం... టైప్ చేయడం...
ఇవి ఒకప్పుడు మనకు అవసరమైన డిజిటల్ స్కిల్స్.
నేడు డిజిటల్ స్కిల్స్ అనేదానికి అర్థం మారిపోయింది. వాటి పరిధి మరింత విస్తరించింది.
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటి డిజిటల్ డివైసెస్ ఉపయోగించి సమాచారం పొందేందుకు లేదా పంపేందుకు కావాల్సిన నైపుణ్యాలనే డిజిటల్ స్కిల్స్ అంటారు.
నేడు అనేక రకాల టూల్స్, డివైసెస్, ప్లాట్‌ఫామ్స్ వంటివి ఉద్యోగంలో భాగం అవుతున్నాయి.
ఆఫీసు, వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ మోడల్... ఏదైనా సరే పని సాఫీగా జరిగేందుకు కొన్ని రకాల డిజిటల్ టూల్స్ ఉద్యోగులకు తెలిసి ఉండాలి. రియల్ టైంలో ఇతర ఉద్యోగులతో కలిసి పని చేయడానికి, చాట్ చేయడానికి రకరకాల సాఫ్ట్‌వేర్ టూల్స్‌తో పని చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని నేడు సంస్థలు ఎంతగానో ఆశిస్తున్నాయి. పని చేయడానికి అవసరమైన టూల్స్ మాత్రమే కాదు, టెక్నాలజీలో వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేడు డిజిటల్ స్కిల్స్ అనేవి ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఏ ఒక్కరికో అవసరమైనవి కావు. 'నేడు అందరికీ డిజిటల్ స్కిల్స్ అవసరమవుతున్నాయి' అని సర్రే యూనివర్సిటీలోని 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్ రీసెర్చ్ సెంటర్' డైరెక్టర్ యింగ్ జువా అన్నారు.
ఆన్‌లైన్‌లో ఉద్యోగుల కోసం ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లలో సుమారు 82శాతం ప్రకటనలు డిజిటల్ స్కిల్స్ కోరుతున్నాయని బ్రిటన్ ప్రభుత్వం 2019లో చేపట్టిన సర్వే చెబుతోంది.
డిజిటల్ స్కిల్స్ నేర్చుకోకుండా అలాగే ఉండేవారి కెరియర్ రిస్కులో పడుతుందని యింగ్ అంటున్నారు. 'కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఉద్యోగులు దాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. డిజిటల్ స్కిల్స్, టెక్నాలజీ మధ్య అదొక రేసు. ఎంత వేగంగా టెక్నాలజీలో మార్పులు వస్తుంటాయో ఉద్యోగులు కూడా అంతే వేగంగా వాటిని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ' అని యింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అందరికీ డిజిటల్ లిటరసీ ఎందుకు అవసరం?
'డిజిటల్ లిటరసీ అనేది చాలా విస్తృతమైన అంశం.
డిజిటల్ డివైసెస్ సాయంతో మనం చిన్నచిన్న పనులు చేయొచ్చు. ఎంతో క్లిష్టమైన పెద్దపెద్ద టాస్కులను పూర్తి చేయొచ్చు.
షాప్‌లో ఇన్‌వాయిస్ ప్రింట్ చేయడం, వర్డ్ ప్యాడ్ వాడటం, స్ప్రెడ్ షీట్స్ వినియోగించడం వంటివి సింపుల్ పనులు అనుకుంటే... వెబ్ డిజైన్, డేటా ఎనాలిసిస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి క్లిష్టమైన పనులు అనుకోవచ్చు' అని యింగ్ అన్నారు.
1980ల నుంచి డిజిటల్ లిటరసీకి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. బ్రిటన్‌లో డిజిటల్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని యింగ్ తెలిపారు.
నేడు టెక్నాలజీతో సంబంధం లేని ఉద్యోగాల్లోనూ డిజిటల్ స్కిల్స్ అవసరమవుతున్నాయి. వేర్ హౌస్ ఆపరేటర్స్‌కు క్లౌడ్ ఆధారిత మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ తెలిసి ఉండాలి. టెలి మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడాలంటే రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ టూల్స్ నేర్చుకోవాలి. నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు ప్రాజెక్టులను మేనేజ్ చేసేందుకు మొబైల్ కొలాబరేషన్ యాప్స్‌ను వాడటం తెలుసుకోవాలి. మొత్తానికి టెక్నాలజీ అనేది ఏ ఒక్క రంగానికో పరిమితమైనది కాదు.

ఫొటో సోర్స్, Getty Images
నేడు రిమోట్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వల్ల ఉద్యోగులు డిజిటల్ టూల్స్‌ను నేర్చుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది. ఉద్యోగులకు అవసరమైన డిజిటల్ స్కిల్స్ ఉన్నాయో లేవో సంస్థల యాజమాన్యాలు చూస్తున్నాయి.
'పని మరింత మెరుగ్గా చేసేందుకు ఆఫీస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ వంటి ఉద్యోగులు నేర్చుకోవాలి' అని హైరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌డీడ్‌కు చెందిన డానీ స్టసీ అంటున్నారు.
అయితే డిజిటల్ స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది అంటే దాని అర్థం ఉద్యోగులు అన్ని సాఫ్ట్‌వేర్స్‌ను నేర్చుకోవాలని కాదు. తమ ఉద్యోగం చేసేందుకు అవసరమైన స్కిల్స్ వారికి పూర్తిగా తెలిసి ఉండాలి.
నేడు డిజిటల్ స్కిల్స్‌ను నిరంతరం నేర్చుకుంటూ అప్ టు డేట్‌గా ఉండాలనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలి. జాబులో చేరినప్పుడు అందుకు అవసరమైన డిజిటల్ స్కిల్స్ తెలిసి ఉండాలి లేదా సాధ్యమైనంత త్వరగా వాటిని నేర్చుకోవాలి.
'ఇంతకు ముందు ఏ పని చేశారు అనేదానితో సంబంధం లేకుండా ఇప్పుడు చేసే ఉద్యోగానికి అవసరమైన అన్ని రకాల డిజిటల్ స్కిల్స్ ఉద్యోగులకు తెలిసి ఉండాలని ఎంప్లాయర్స్ కోరుకుంటున్నారు' అని యింగ్ చెబుతున్నారు.
ఆఫీసులో వాడే పదజాలం ఎలా ఉన్నప్పటికీ నేటి తరానికి కొన్ని డిజిటల్ స్కిల్స్ ముందే తెలిసి ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్ టాప్స్ వంటివి చదువుకునే రోజుల నుంచే వాడుతూ ఉండటం వల్ల అందరికీ ఇ-మెయిల్స్, మెసేజెస్ పంపడం వంటివి తెలిసే ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ తగిన డిజిటల్ స్కిల్స్ లేవు అనుకుంటే వాటిని నేర్చుకునేందుకు ఉద్యోగుల ముందు అనేక మార్గాలు ఉన్నాయి.
ఇందులో ఒక మార్గం... కంపెనీలు తమ ఉద్యోగులు కొత్త స్కిల్స్ నేర్చుకునేలా ట్రైనింగ్ ఇస్తుంటాయి. చేసే ఉద్యోగానికి అవసరమైన డిజిటల్ స్కిల్స్‌ను అవి నేర్పిస్తుంటాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉన్నందున, ఉన్న ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించేందుకు సంస్థలు మొగ్గు చూపుతుంటాయి.
ఇక మరొక మార్గం... ఆన్‌లైన్ కోర్సులు. నేడు అనేక రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్ నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇంటి దగ్గర కూడా తరచూ టెక్నాలజీ వాడుతుండటం వల్ల డిజిటల్ లిటరసీని పెంచుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి వాటి సాయంతో కొత్త టూల్స్ నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ మాట్లాడటం. సోషల్ మీడియా వల్ల ఇన్‌ఫార్మల్ కమ్యూనికేషన్ మెరుగు పడుతుంది.
'డిజిటల్ స్కిల్స్ వల్ల జాబ్ మార్కెట్‌లో తమను తాము ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ఉద్యోగులకు అవకాశం కలుగుతుందని' యింగ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













