యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్‌ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు

ఫొటో సోర్స్, Girikumar Patil
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ న్యూస్
యుక్రెయిన్‌లోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లోనే కొన్ని నెలలుగా తన రెండు పెంపుడు పులులతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వైద్యుడు చివరకు వాటిని వదిలిపెట్టాల్సి వచ్చింది.
ఈ ఏడాది ప్రారంభంలో యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పుడు గిరి కుమార్ పాటిల్ తన పెంపుడు పులులు లేకుండా అక్కడి నుంచి కదలనని పట్టు పట్టారు. ఆయన స్వవతోవ్‌లో తూర్పు యుక్రెయిన్ లో లుహాన్స్క్ ప్రాంతంలో సెవెరోదోన్యస్క్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్‌గా పని చేశారు.
42 ఏళ్ల పాటిల్ 2016 నుంచి యుక్రెయిన్ పౌరునిగా ఉన్నారు. ఆయన రెండేళ్ల క్రితం యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని జూ నుంచి ఈ జంతువులను కొనుక్కున్నారు. అరుదైన హైబ్రిడ్ జాతికి చెందిన మగ పులి "లెప్ జ్యాగ్" వయసు 24 నెలలు. ఆడ జాగ్వర్ వయసు 14 నెలలు.
రెండు వారాల క్రితం పాటిల్ దగ్గరున్న డబ్బులు అయిపోవడంతో ఆయన బ్రతుకు తెరువు కోసం పోలండ్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఆయన పని చేస్తున్న ఆస్పత్రిని యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే మూసేశారు. ఇటీవల ఆ ఆస్పత్రి బాంబు దాడిలో ధ్వంసమైంది.
ప్రస్తుతం పాటిల్ ఇతర యుక్రెయిన్ శరణార్ధులతో కలిసి పోలండ్ రాజధాని వార్సాలోని ఒక హాస్టల్ డార్మిటరీలో ఉంటున్నారు.
ఆయన ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు. మరో వైపు, తన పెంపుడు పులుల కోసం ఆందోళన చెందుతున్నారు.
రెండు వారాల క్రితం స్వవతోవ్‌లో ఇంటర్‌నెట్ పని చేయడం ఆగిపోయినట్లు పాటిల్ చెప్పారు.
ప్రస్తుతం ఆయన పెంపుడు పులులను ఒక స్థానిక రైతుకు అప్పగించి వచ్చారు. ఆయనకు రోజూ ఫోన్ చేసి వాటి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు.
"ఆ జంతువులు నన్ను మిస్ అవుతున్నట్లు వాటిని సంరక్షిస్తున్న కేర్‌టేకర్ చెప్పారు. వారం రోజుల నుంచి లెప్ జ్యాగ్ సరిగ్గా తిండి తినడం లేదని ఆయన చెప్పారు. వాటిని ఎలా అయినా నాతో పాటు తెచ్చుకోవాలని ఉంది. కానీ, ఎలాగో అర్ధం కావడం లేదు" అని పాటిల్ బీబీసీకి చెప్పారు.
ఆయన యుక్రెయిన్ నుంచి కేవలం దుస్తులు, 100 డాలర్లు (సుమారు రూ. 8000), కొన్ని వేల రూబుల్స్ తో యుక్రెయిన్ నుంచి బయటపడాల్సి వచ్చినట్లు చెప్పారు. ఆయన ఆదా చేసిన డబ్బులన్నీ అయిపోగా, ఉన్న కొంత పొలం, రెండు అపార్ట్మెంట్లు, రెండు కార్లు, మోటార్ సైకిల్, కెమెరాను 100,000 డాలర్లకు (సుమారు రూ.81,63,840) అమ్మేసినట్లు చెప్పారు.
యుద్ధం మొదలైన తర్వాత కేవలం పులులకు తిండి పెట్టేందుకు ఆయన రోజుకు 300 డాలర్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. వాటికి రోజుకు 5 కేజీల మాంసం పెడతారని చెప్పారు.
"యుక్రెయిన్ లో పరిస్థితి తీవ్రతరమై, నా ఇంటి దగ్గర బాంబు దాడులు పెరగడం, మరో వైపు చేతిలో డబ్బు కూడా అయిపోవడంతో, వాటిని వదిలిపెట్టి సరిహద్దులు దాటి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ కొంత డబ్బు సంపాదించి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను" అని గిరి చెప్పారు.
ఆయన ఆ పులులకు మూడు నెలలకు సరిపడే ఆహారాన్ని ఫ్రీజర్ లో పెట్టి కేర్ టేకర్‌కు మూడు నెలల జీతంగా 2400 డాలర్లు ఇచ్చినట్లు చెప్పారు.
కానీ, ఆయన ఊహించినట్లుగా ఏమి జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
12 గంటల పాటు బస్సులో ప్రయాణం చేసి సరిహద్దులకు చేరుకున్న తర్వాత గస్తీ కాస్తున్న రష్యన్ సైనికులు ఆయనను బస్సు నుంచి కిందకు దించి విచారణ కోసం మూడు రోజుల పాటు ఒక భూగర్భంలో ఉన్న గదిలో బంధించారని పాటిల్ చెప్పారు.
"నన్ను బస్సు నుంచి కిందకు దించేశారు. నా కళ్ళకు గంతలు కట్టి అక్కడొక భూగర్భంలో ఉన్న గదిలోకి తీసుకుని వెళ్లారు. నాకు సూప్, బ్రెడ్ ఇచ్చి విచారణ మొదలుపెట్టారు. నా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు కీయెవ్ కు చెందినవి కావడంతో యుక్రెయిన్ సైన్యానికి చెందిన గూఢచారినని అనుకున్నారు" అని చెప్పారు.
యుద్ధంలో ఎవరి పక్షం వహించలేదని ఆయన రష్యన్ సైనికులకు చెప్పినట్లు చెప్పారు. పులుల గురించి ఒక యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తానని, తన చానెల్ కు 60,000 మంది అనుచరులున్నట్లు వారికి చెప్పారు.
ఆయన జంతువులతో కలిసి ఇంట్లో చిక్కుకుపోయినట్లు తెలిపారు. "నా వీడియోలు, చానెల్ వారికి చూపించాను" అని చెప్పారు.
"మూడు రోజుల నిర్బంధం తర్వాత ఒక రష్యన్ అధికారి నా దగ్గరకు వచ్చి, ఆయన భార్య నా వీడియోలను చూశారని చెప్పారు. నేను గూఢచారిని కానని, జంతు ప్రేమికుడినని తెలిసినట్లు చెప్పారు. "ఈ రోజు కంటి నిండా నిద్రపో" అని చెప్పి వెళ్లారు.

ఫొటో సోర్స్, Girikumar Patil
ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు నన్ను విడిచి పెట్టారు. వాళ్ళు ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకుని, ఒక ధ్రువీకరణ లేఖను ఇచ్చినట్లు పాటిల్ చెప్పారు.
రష్యన్ అధికారులు ఆయనను పోలండ్ సరిహద్దుల దగ్గర వదిలిపెట్టారు. సరిహద్దుల దగ్గర అధికారులకు బయో మెట్రిక్స్ ఇచ్చి, వారికి ఆయన కథ వినిపించి అక్కడి నుంచి బయటపడ్డారు.
పోలిష్ అధికారులు ఆయనకు పోలండ్‌లో ఉండేందుకు పేపర్ వీసా ఇచ్చారు. దీంతో ఆయన పోలండ్‌లో 90 రోజులు ఉండేందుకు వీలవుతుంది.
అలా ఆయన వార్సాలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఆయన ఉండే ఊరిలో పరిస్థితి దారుణంగా మారుతుండటంతో, పాటిల్ ఇంటికి తిరిగి ఎప్పటికి వెళతారనే విషయం పట్ల స్పష్టత లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కుటుంబం ఆయన ఖర్చులకు డబ్బులు పంపిస్తున్నారు.
"నా పులులను యుక్రెయిన్ నుంచి బయటకు పంపగలరేమోనని అడుగుతూ కీయెవ్‌లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయానికి ఫోన్ చేశాను. వాట్సాప్‌లో సందేశాలు పంపాను. అయితే, వాళ్ళు క్రూర మృగాలకు వీసాలు ఇచ్చే పని చేయడం లేదని చెప్పారు" అని తెలిపారు.
"వార్సాలో ఉన్న ఒక జూను సందర్శించి జంతువులను యుద్ధ ప్రాంతం నుంచి బయటకు తెప్పించగలరేమో అని కనుక్కున్నాను" అని చెప్పారు.
"నా పులులు నాకు కావాలి. భారత ప్రభుత్వం వాటిని తెప్పించి భారత్‌లో ఉన్న జూ లేదా అడవిలో పెట్టగలిగితే మంచిది. ఎలా అయినా వాటిని రక్షించాలని ఉంది".
ఇవి కూడా చదవండి:
- 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- ‘పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’
- ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












