యుక్రెయిన్‌కు వెళ్లిన భారతీయ మహిళ స్వదేశానికి రానంటున్నారు, ఎందుకో తెలుసా?

ఫొటో సోర్స్, TEJAL PATEL
- రచయిత, భార్గవ పరీఖ్
- హోదా, బీబీసీ కోసం
రష్యా దాడి కారణంగా యుక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, గుజరాత్‌కు చెందిన ఓ మహిళ మాత్రం భారత్‌కు రాలేనని అంటున్నారు. అందుకు ఆమె ఆసక్తికర కారణాలు చెబుతున్నారు.
యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌లో ఉంటోన్న గుజరాత్ మహిళ తేజల్ పటేల్, రెండు రోజుల పాటు కాలినడకన పోలండ్ చేరుకున్నారు. ''నేను ఒక ఏజెంట్‌కు లక్షల రూపాయల చెల్లించి, నా పిల్లల్ని భారత్‌లోనే వదిలేసి డబ్బులు సంపాదించడానికి 5 నెలల క్రితం యుక్రెయిన్ వచ్చాను. అంతలోనే యుద్ధం మొదలైంది'' అని ఆమె చెప్పారు.
తేజల్ చెప్పిన ప్రకారం, తన కుటుంబానికి అండగా నిలవడానికి ఆమె యుక్రెయిన్ వెళ్లారు. ఏజెంట్‌కు ఇవ్వడం కోసం చేసిన అప్పును వారు ఇంకా తీర్చాల్సి ఉంది. కానీ, యుద్ధంతో వారి పరిస్థితి తలకిందులైంది.
ఖార్కియెవ్‌లో ఆమె కొన్ని నెలలుగా పని చేస్తున్నారు. యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కియెవ్‌పైనే రష్యా తీవ్రదాడులకు పాల్పడుతోంది.
రష్యా దాడుల కారణంగా ఫిబ్రవరి 24 నుంచి యుక్రెయిన్‌లోని ప్రజలంతా ప్రాణాలను కాపాడుకోవడానికి బంకర్లలో తలదాచుకోవాల్సి వస్తోంది.
లక్షలాది మంది యుక్రెయిన్లు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. పోలండ్, రొమేనియా వంటి దేశాలకు నడుచుకుంటూ తరలివెళ్తోన్న వారిలో వేలాదిమంది భారతీయులు కూడా ఉన్నారు.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ' కార్యక్రమాన్ని చేపట్టింది.

ఫొటో సోర్స్, TEJAL PATEL
ఆర్థిక కారణాలతో....
కరోనా మహమ్మారి కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో సంపాదన కోసం తేజల్ యుక్రెయిన్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.
''కరోనా వల్ల కుటుంబ సమస్యలు పెరిగాయి. నా భర్త ప్రవీణ్ ఒక పాఠశాల వ్యాను డ్రైవర్. నేను ఒక ప్రైవేటు కంపెనీలో రూ. 8000 జీతానికి పనిచేసేదాన్ని. మా పని ఆగిపోవడంతో సంపాదన కష్టమైంది'' అని బీబీసీతో తేజల్ తెలిపారు.
''గత రెండేళ్లలో చాలా జ్యూవెల్లరీ అమ్మేశాం. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పుడు, పిల్లల ఫీజులు చెల్లించేందుకు కూడా మా దగ్గర డబ్బులు లేవు'' అని అన్నారు.
యుక్రెయిన్‌కు వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నారని అడగగా ఆమె దానికి సమాధానం ఇచ్చారు.
''మా ఆయన స్నేహితుడు ఒకరు విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఉద్యోగాలు, వీసాలు ఇప్పించే ఏజెంట్‌గా పనిచేసేవారు. మా కష్టాల గురించి చెప్పినప్పుడు, విదేశాల్లో ఉద్యోగాల గురించి ఆయన చెప్పారు. ముందు నా భర్త ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు తగిన పని దొరకలేదు. యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు వంటపని చేసే ఉద్యోగం ఉందని చెప్పడంతో ఆ పని చేయాలని నేను నిర్ణయించుకున్నా. దీని గురించి మా ఆయన, పిల్లలతో మాట్లాడాను. ఏజెంట్‌కు రూ. 7.5 లక్షల రూపాయలు చెల్లించి ఇక్కడకు వచ్చాను'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, TEJAL PATEL
నగలను తనఖా పెట్టి యుక్రెయిన్‌కు...
''విదేశాల్లో పనిచేసే ఏజెంట్ మా ఆయనకు స్నేహితుడు కాబట్టి నా నగలన్నీ ఆయన దగ్గర తనఖా పెట్టాను. ప్రతీ వారం నా జీతాన్ని ఆయనకు పంపిస్తూ అప్పు తీర్చాలని మేం నిర్ణయించుకున్నాం'' అని తేజల్ చెప్పారు.
''గతేడాది ఆగస్టులో యుక్రెయిన్ వచ్చాను. భారతీయ హోటల్‌లో పని చేస్తున్నా. నా తిండి, వసతి ఖర్చులు కూడా హోటల్ వారే భరించుకుంటారు.''
''రోజూ ఉదయం 27 మంది అబ్బాయిలకు వండిపెట్టేదాన్ని. వారి కోసం 75 పరాఠాలు, పప్పు, కూరలు తయారు చేసేదాన్ని. వారంతా మా హోటల్ నుంచే భోజనం తీసుకుంటారు. నెల జీతంలో నా కోసం కొంత ఉంచుకొని, రూ. 30 వేలు ఇంటికి పంపించేదాన్ని.''
''ఈ 5 నెలల్లో మా పరిస్థితి కాస్త మెరుగుపడింది. కానీ ఇంకా రూ. 5.5 లక్షల అప్పు మిగిలే ఉంది. ఇప్పుడు యుద్ధంతో అంతా మారిపోయింది'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
యుక్రెయిన్ నుంచి పోలండ్‌కు ఎలా చేరుకున్నారో కూడా తేజల్ వివరించారు.
''అక్కడి కాలేజీ విద్యార్థులతో కలిసి పోలండ్‌కు బస్సులో బయల్దేరాం. కానీ భారీ రద్దీ కారణంగా యుక్రెయిన్-పోలండ్ సరిహద్దుకు 28 కి.మీ దూరంలోనే బస్సును నిలిపేశారు.''
''గుజరాతీ విద్యార్థులతో కలిసి నడుచుకుంటూ పోలండ్ సరిహద్దుకు చేరుకున్నాను. దారిలోనే మేం తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. కేవలం 2 బ్రెడ్ ముక్కలు, నీటితో ఒక రోజంతా గడిపాం. పోలండ్-యుక్రెయిన్ సరిహద్దులో భారీగా జనాలు ఉన్నారు. అక్కడికి చేరుకోవడానికి 48 గంటల సమయం పట్టింది. దారిలో నా ఫోన్ కూడా పోయింది'' అని తన ప్రయాణం గురించి చెప్పారు.
అధికారిక గణాంకాల ప్రకారం యుక్రెయిన్‌లో మొత్తం 76 వేల విదేశీ విద్యార్థులు ఉండగా, అందులో 20 వేల మంది భారతీయులే. వీరిలో ఎక్కువగా అక్కడి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్ చదువుతున్నవారే.
'ఆపరేషన్ గంగ' కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 76 విమానాల్లో 16 వేల మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, TEJAL PATEL
'పోలండ్‌లో పని చేస్తా'
యుక్రెయిన్‌లో యుద్ధంతో తేజల్ పటేల్ చాలా నిరాశ చెందారు. కానీ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు.
''యుక్రెయిన్‌కు వచ్చాక మంచి వేతనం లభించింది. అంతలోనే యుద్ధం ప్రారంభమైంది.''
''బీకామ్ చేసినప్పటికీ భారత్‌లో నాకు కష్టంగా రూ. 8000 జీతం లభించేది. నా భర్త కూడా గ్రాడ్యుయేట్. కానీ తగిన ఉద్యోగం దొరకలేదు. అందుకే వ్యాన్ కొనుక్కొని ఒక పాఠశాలలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.''
ఇప్పుడు ఆమె పోలండ్‌లో పని చేయాలి అనుకుంటున్నారు.
''ఇక్కడి ఒక మాల్‌లోని భారతీయ దుకాణంలో నాకు పని దొరికింది. కానీ పోలండ్‌లో ఉండటానికి ఇల్లు కోసం నా బంగారు చెవి పోగులు అమ్మాల్సి వచ్చింది'' అని ఆమె చెప్పారు.
పోలండ్‌లో వర్క్ పర్మిట్ గురించి మాట్లాడుతూ... ''మా ఆయన స్నేహితుడు ఒక ఏజెంట్. ఆయన పోలండ్‌లో వర్క్ పర్మిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఇప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లలేను'' అని అన్నారు.
''వంట చేయడం లేదా వేరే ఏ పని దొరికినా ఇక్కడే ఉండి చేస్తాను. ఎందుకంటే భారత్‌లో కన్నా నాకు ఇక్కడే ఎక్కువ డబ్బు వస్తుంది. అందుకే ఇక్కడే ఏదో పనిచేసుకుంటూ ఒక ఏడాదిలో మా అప్పులు తీర్చాలి అనుకుంటున్నా. మా అబ్బాయి చదువుకునేందుకు ఇంటికి డబ్బులు పంపాలి. వచ్చే ఏడాది తను ఇంటర్మీడియట్‌లో చేరతాడు. అప్పుడు ట్యూషన్ ఫీజుతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.''
''నా కూతురి పెళ్లి ఖర్చుల కోసం కూడా నేను పోగు చేసుకోవాలి. ఆమె ఇప్పుడు ఏడో తరగతి చదువుతోంది. మా అవసరాలకు సరిపడినంత డబ్బు సంపాదించిన తర్వాతే నేను భారత్‌కు తిరిగి వస్తా. భారత ప్రభుత్వం ఉచితంగానే ప్రజలను ఇక్కడ నుంచి తీసుకొస్తుంది. కానీ నేను మాత్రం రాను'' అని ఆమె వివరించారు.
దీని గురించి బీబీసీతో ఆమె భర్త ప్రవీణ్ మాట్లాడారు. ''అక్కడ నా భార్య క్షేమంగా ఉంది. నాకు అది చాలు. ఆమె అక్కడ కుదురుకున్న తర్వాత నా పిల్లల్ని మా అమ్మనాన్న వద్ద వదిలి నేను కూడా అక్కడికే వెళ్లిపోతాను. నా కోసం కూడా ఆమె అక్కడ ఏదో ఒక పని వెతికే ప్రయత్నంలో ఉంది. ఇద్దరం కలిసి పనిచేస్తేనే, మా పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించగలుగుతాం'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...
- మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు ఎలా మొదలైంది
- యుక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి
- తెలంగాణ: 80,039 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేషన్ - కేసీఆర్
- భారత్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకునేవారు పెరుగుతున్నారా? పిల్లల పెంపకంలో తండ్రుల పాత్రను ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













