యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఈ సంక్షోభంలో భారత్ ఎటువైపు ఉంది? అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోందా?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ విషయంలో భారత్‌ వైఖరి రష్యాకు వ్యతిరేకంగా లేదు. భారతదేశం తన అధికారిక ప్రకటనలలో రష్యాను ఖండించలేదు. మరోవైపు యుక్రెయిన్ సార్వభౌమత్వాన్ని నొక్కిచెప్పలేదు.

అయితే, ఇది భారత్‌లో కొత్త ట్రెండ్ కాదు. కొన్ని ఇతర ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు రష్యా విషయంలో ఇదే వైఖరిని అనుసరించాయి.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయి. భారత్ ఏదో ఒక పక్షం తీసుకోకుండా ఉండటం అంత సులభం కాదు.

భారత్, అమెరికా ప్రధాన రక్షణ భాగస్వాములు. అయితే రష్యా విషయంలో రెండు దేశాలు కలిసి ఉన్నాయా? ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ‘‘ఈ రోజు భారత్‌తో అమెరికా మాట్లాడనుంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఏకాభిప్రాయం దొరకలేదు’’అని అన్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా- యుక్రెయిన్ సంక్షోభంలో భారత్ మీద అమెరికా ఒత్తిడి పెరుగుతోందా?

ఐరాసలో ఓటు వేయండి

యుక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు ముందు బైడెన్‌ను భారత్ గురించి విలేకరులు ఈ ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు అధ్యక్షుడు బైడెన్ రష్యాపై కఠినమైన ఆంక్షలు ప్రకటించారు. యుక్రెయిన్‌పై భారత్‌ వైఖరి అమెరికాకు అసౌకర్యంగా ఉందన్నారు.

పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి కళ్లెం వేయడంలో భారత్‌ను ముఖ్యమైన దేశంగా అమెరికా పరిగణిస్తోంది. ఇటీవల కాలంలో యుఎస్‌తో భారత్ సాన్నిహిత్యం పెరిగింది.

అయితే భారత్ రష్యాతోనూ చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికీ భారత్‌కు రక్షణ పరికరాలలో రష్యా అతిపెద్ద సరఫరాదారు అని చెప్పాలి.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

భద్రతా మండలిలోని 15 దేశాల్లో భారత్ కూడా ఒకటి. యుక్రెయిన్‌పై దాడికి ఖండన, షరతులు లేకుండా రష్యా దళాల ఉపసంహరణల తీర్మానంపై శుక్రవారం ఓటింగ్ జరగవచ్చని బైడెన్ పాలక వర్గంలోని సీనియర్ అధికారి ఒక వార్తా సంస్థతో చెప్పారు.

ఈ తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యులలో రష్యా కూడా ఒకటి. శాశ్వత సభ్యులకు వీటో హక్కు ఉంటుంది. అంటే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం పెడితే వీటో ద్వారా ఆగిపోవచ్చు.

అయితే రష్యా వీటో అధికారాలను ఉపయోగించినప్పటికీ, భద్రతా మండలిలో దానిని ఒంటరిగా చేయాలని అమెరికా కోరుకుంటోందని మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి.

అమెరికా తనకు అనుకూలంగా కనీసం 13 ఓట్లను కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ఓటింగ్‌కు దూరంగా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

భారత్ పాత్ర ఏమిటి?

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో గురువారం మాట్లాడారు. హింసను ఆపాలని పుతిన్‌ను ప్రధాని మోదీ కోరారు.

అంతర్జాతీయ వేదికలపై పుతిన్ ఒంటరిగా మారుతారని బైడెన్ అన్నారు. యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణకు మద్దతిచ్చే ఏ దేశమైనా తుడిచిపెట్టుకుపోతుందని బైడెన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రష్యా చర్యలకు గట్టి ప్రతిస్పందన అవసరమని, ఇది తక్షణమే జరిగేలా చూడాలని చెప్పినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

షరతులు లేని కాల్పుల విరమణ, యుక్రెయిన్‌లో పరిస్థితిపై అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడినట్లు భారత విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. తాను ఏం మాట్లాడాడో జైశంకర్ తన ట్వీట్‌లో చెప్పలేదు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో కూడా జైశంకర్ మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని జైశంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రష్యా నుంచి భారత్ ఎస్-400 గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది. అమెరికా 2017లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం భారత్‌కు ఈ విషయంలో ఆంక్షల ముప్పు ఉంది. రష్యాతో వ్యాపార లావాదేవీలు కొనసాగించే దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో ప్రజలు

భారత్-రష్యా సంబంధాలు

గత ఏడాది డిసెంబర్‌లో రష్యా, భారత్‌ల మధ్య పలు వాణిజ్య, ఆయుధ ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ ఒప్పందాలలో భారత్‌లో 600,000 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్ ఉత్పత్తి కూడా ఉంది.

అమెరికా కాంగ్రెస్‌లో భారత్‌ను ఆంక్షల నుంచి మినహాయించాలని చర్చ జరిగినా.. యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్‌పై ఆంక్షల ముప్పు పెరిగింది.

ఏదైనా ఆంక్షలు విధిస్తే, చైనా విస్తరణకు వ్యతిరేకంగా ఏర్పాటైన క్వాడ్‌లో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలతో భారత్ సహకారం ప్రభావితం అయ్యే ముప్పుంది.

మరోవైపు యుక్రెయిన్‌పై దాడికి సంబంధించి రష్యాపై ఉమ్మడి స్పందన కోసం భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు యుక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించడంతో గురువారం ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి.. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.

వీడియో క్యాప్షన్, రష్యా-జర్మనీ మధ్య ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ఎందుకు?

భారత్ వైఖరి ఇదీ..

తూర్పు యుక్రెయిన్‌పై భారత్ ప్రతిస్పందన స్వతంత్రంగా ఉంటుందని భారత్‌లోని రష్యా తాత్కాలిక రాయబారి రోమన్ బాబుష్కిన్ ది హిందూతో అన్నారు.

రష్యాపై కొత్త ఆంక్షల కారణంగా భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థల డెలివరీపై ఎలాంటి ప్రభావం ఉండదని రోమన్ చెప్పారు. రష్యా నుంచి భారత్‌ ఎలాంటి సైనిక పరికరాలను కొనుగోలు చేసినా దాని సరఫరాపై ఎలాంటి ప్రభావం పడదని చెప్పారు.

మరోవైపు టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, “యుక్రెయిన్‌లో పరిస్థితిని రెండు రోజుల క్రితమే భద్రతా మండలిలో చర్చించాం. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని, దౌత్య చర్యలతో అన్ని సమస్యలను పరిష్కరించాలని భారత్ సూచించింది’’అని అన్నారు.

అయితే ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు సమయం ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేసినా వినిపించుకోకపోవడం శోచనీయం. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, తీవ్ర సంక్షోభం వైపు వెళుతోంది.

టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ, "దీనిపై మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత ప్రమాదంలో పడతాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాం. పరిస్థితిని మరింత దిగజార్చే చర్యలను నివారించాలని సూచిస్తున్నాం. అన్ని దేశాలూ తమ ప్రయోజనాల విషయంలో తమ మధ్య విభేదాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ నియమాలు, ఆయా దేశాల ఒప్పందాల ప్రాతిపదికన వివాదాల పరిష్కారాన్ని భారత్ ప్రోత్సహిస్తుంది’’అని ఆయన చెప్పారు.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)