యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ‘ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లండి’

యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, Ajith

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

యుక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌర విమానాశ్రయాలను మూసేశారు. భారత్‌కు వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని యుక్రెయిన్‌లోని కార్కివ్‌లో ఉంటున్న తెలుగు విద్యార్థులు బీబీసీకి తెలిపారు.

అలాగే పిల్లలు తిరిగి వస్తున్నారని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విమానాలు రద్దు కావడంతో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.

విశాఖలోని కూర్మన్నపాలెంలో నివాసముంటున్న కుషల్ సాయి యుక్రెయిన్‌లో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విశాఖకు వచ్చేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 25న (రేపు) విశాఖపట్నం వస్తున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థి

అయితే నిన్న సాయంత్రం నుంచి యుక్రెయిన్‌లో విమానాశ్రయాలు మూతపడటంతో తాము ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

"మా అబ్బాయి రేపు ఇంటికి వచ్చేస్తాడని అనుకున్నాం. యుక్రెయిన్‌లో చాలా రోజులుగా ఉద్రిక్త వాతావరణం ఉండటంతో ఇంటికి వచ్చేయమని చెప్పాం. గత మూడు రోజుల వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్లు చెప్పాడు.

అయితే ఉద్రిక్తతలు పెరగడంతో ఇంటికి వచ్చేస్తున్నట్లు, టిక్కెట్లు బుక్ చేసుకున్నామని, సాయి అతడి స్నేహితులు చెప్పారు. కానీ ఇప్పడిలా జరిగింది. మా అబ్బాయితో పాటు అక్కడున్న వారి పరిస్థితి ఎలా ఉందో అనే అందోళన పెరిగిపోతుంది" అని కుషల్ సాయి తండ్రి వైకుంఠం బీబీసీతో చెప్పారు. వైకుంఠం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి.

'యుక్రెయిన్‌లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి పంపించే ఏర్పాట్లు చేయండి' అని యుక్రెయిన్‌లో చదువుకుంటున్న విశాఖ జిల్లాకు చెందిన శ్రీజా విజ్ఞప్తి చేశారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, ugc

'24 గంటల్లో పరిస్థితి మారింది'

యుక్రెయిన్‌లో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న అజిత్‌తో బీబీసీ మాట్లాడింది. 24 గంటల్లో పరిస్థితి మారిపోయిందని యుక్రెయిన్ కార్కివ్‌లో నివాసముంటున్నఅజిత్ చెప్పారు. మరో ఇద్దరితో కలిసి రూమ్‌లో ఉంటున్నానని తెలిపారు.

"పరిస్థితి అంతా బాగానే ఉందని అనుకున్నాం. ఇప్పుడు కాస్త టెన్షన్ మొదలైంది. 24 గంటల ముందు వరకు అయితే మేం మా రోజూవారీ కార్యక్రమాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోగలిగాం. కానీ ఇవాళ యుద్ధ వాతావరణంతో కాస్త భయంగా ఉంది.

నిన్నటి వరకు ఇంటర్నెట్ పనిచేసింది. ఇవాళ ఉదయం నుంచి ఇంటర్నెట్ రావట్లేదు. మా స్నేహితులు కొందరు రేపు, ఎల్లుండి ఇండియా వెళ్లిపోదామని టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండండి అంటూ మేం చదువుతున్న యూనివర్సిటీ నుంచి మేసేజ్ వచ్చింది. దాంతో మేం ఎక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడం లేదు" అని అజిత్ తెలిపారు.

అజిత్ తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన విద్యార్థి.

'ఏం చెప్పాలో తెలియడం లేదు'

మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడున్న పరిస్థితిని వాళ్లు టీవీల్లో చూసి కంగారు పడిపోతున్నారు. మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాం. కానీ రేపు, ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఆ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నాం. ఏం చెప్పినా కంగారు పడిపోతారు అని అన్నారు.

యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు

ఫొటో సోర్స్, Ajith

ఏపీ నుంచి 69 మంది నమోదు

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) యుక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో మాట్లాడేందుకు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. యుక్రెయిన్‌లో విద్య, ఉద్యోగాల్లో ఉన్న 69 మంది ఇప్పటివరకు తమ వివరాలను సొసైటీకి తెలియజేశారు. ఇదంతా కూడా APNRTS వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

బుధవారం నాటికి గుంటూరు జిల్లా నుంచి 13, కృష్ణా జిల్లా నుంచి 10, విశాఖ జిల్లా నుంచి 9, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏడుగురు, కడప జిల్లా నుంచి ఆరుగురు, ప్రకాశం జిల్లా నుంచి ఆరుగురు, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు, చిత్తూరు జిల్లా నుంచి ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముగ్గురు, నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు, విజయనగరం జిల్లా నుంచి ఒకరు యుక్రెయిన్‌లో ఉన్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ విభాగం తెలిపింది.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Prasad Nampally

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో నీళ్ల కోసం క్యూ కట్టిన స్థానికులు

"ఏపీ నుంచి వెళ్లినవారు యుక్రెయిన్‌లో మూడు వందలకు పైగా ఉన్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా అందరూ తమ వివరాలను అందించలేకపోతున్నారు. దాంతో ఇప్పటివరకు వెబ్‌సైట్‌లో తక్కువ మందే నమోదు చేసుకోగలిగారు.

మరోవైపు విమాన టిక్కెట్ల ధరలు కూడా బాగా పెరిగిపోవడంతో అక్కడ నుంచి తిరిగి తమ సొంత ప్రాంతాలకు రావాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. ఈలోగా పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి" అని ఏపీఎన్ఆర్టీఎస్ ఉద్యోగి చెప్పారు.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఏపీ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించింది. నోడల్ అధికారిగా రవి శంకర్ ఫోన్ నెంబర్ 9871999055 (ఏపీ భవన్), అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ (సంప్రదించాల్సిన నెంబర్ 7531904820)లకు బాధ్యతలు అప్పగించింది.

'డబ్బులు పెట్టినా ఇప్పుడు రాలేని పరిస్థితి'

మేం వచ్చేద్దామని అనుకున్నా కూడా విమాన ఛార్జీలు అధికంగా ఉండటంతో రాలేకపోయాం. ధరలు తగ్గుతాయని, ఉద్రిక్తతలు కూడా అదుపులోకి వస్తాయని భావించాం. కానీ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు డబ్బులు ఎంతైనా పెట్టి వచ్చేద్దామని అనుకునేవారు కూడా రాలేని పరిస్థితి ఉంది అని కార్వివ్‌లో ఉంటున్న మెడికల్ విద్యార్థి అజిత్ చెప్పారు.

"మాకు తెలిసి ఇప్పటివరకు ఎవరూ ఇండియాకు వెళ్లలేదు. మేం చదువుతున్న యూనివర్సిటీ పక్కనే మరో యూనివర్సిటీ కూడా ఉంది. రెండు చోట్ల కూడా భారతీయ విద్యార్థులు ఎక్కువగానే కనిపిస్తారు. సాధారణ సమయంలో యుక్రెయిన్ నుంచి విమాన ఛార్జీలు ఒక్కో ప్రయాణీకుడికి రూ. 30,000 నుంచి రూ. 45,000 వరకు ఉండేవి. కానీ ఇప్పడు లక్ష రూపాయలకు చేరింది. టిక్కెట్ ధర రూ. 60 వేలు ఉంటే నేను వెళ్లిపోదామని అనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఎలాగైనా వచ్చేద్దాం అనుకుంటే విమానాశ్రయాలు మూతపడ్డాయి" అని అజిత్ చెప్పారు.

ఇవాళ ఇంటర్నెట్ కట్, రేపటి పరిస్థితి ఏంటో?

"నిన్నటి దాకా అంతా బాగానే ఉందని అనుకున్నాం. పెద్దగా టెన్షన్ కూడా పడలేదు. కానీ ఇవాళ మార్నింగ్ ఇంటర్నెట్ కట్ కావడంతో ఆందోళన మొదలైంది. ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. ప్రస్తుతమైతే మాలో కూడా టెన్షన్ మొదలైంది. మేం రూం వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు" అని అజిత్ తెలిపారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో ఉన్న తెలంగాణ విద్యార్థిని సుమాంజలి

యుక్రెయిన్‌లో ఉన్న తెలంగాణ విద్యార్థుల యోగక్షేమాలపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

అక్కడున్న తమ కూతురును సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన వైద్య విద్యార్థిని కడారి సుమాంజలి కుటుంబ సభ్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కలిసి విన్నవించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ను మెయిల్ ద్వారా కోరినట్టుగా బండి సంజయ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

రామడుగుకు చెందిన సుమాంజలి యుక్రెయిన్‌లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం సుమాంజలితో పాటు తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థినులు రమ్యశ్రీ, గూడ శ్రీనిధి, సి.హెచ్. లిఖితలు రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

''మరో రెండు నెలల్లో నా కూతురు ఎంబీబీఎస్ చదువు పూర్తవుతుంది. ఇంతలోనే అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. ఏమీ కాదని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడేంత వరకు పది రోజుల కోసం ఇండియా వెళ్లిరావాలని అన్నారు. అయితే ఖర్చుకు వెనకాడి రాలేదు. యుక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ సూచనలతో నా కూతురును స్వదేశానికి రప్పించాలని విమానం టికెట్ల కోసం అప్పు చేసి డబ్బులు పంపాను" అని సుమాంజలి తండ్రి మీడియాతో చెప్పారు.

భారత్ తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న సుమాంజలి నిన్న రాత్రి జఫ్రోజియా యూనివర్సిటీ నుండి బయలుదేరి కీవ్ ఎయిర్ పోర్ట్ చేరేసరికి ఎయిర్ పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే చిక్కుకుంది. తినడానికి తిండి లేదు. టికెట్ ఖర్చులకు అప్పుచేసినా ఫలితం లేకుండా పోయింది'' అని సుమాంజలి తండ్రి కడారి రాజయ్య వాపోయారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని చిక్కుకున్న విద్యార్థులను స్వదేశం రప్పించాలని కోరారు.

ఎయిర్‌పోర్ట్ మూసేయడంతో ఇటు స్వదేశానికి రాలేక అటు యూనివర్సిటీకి తిరిగివెళ్లలేక 20 మంది తెలుగు విద్యార్థులు ఎయిర్ పోర్ట్ వద్దే అవస్థలు పడుతున్నారు. మా చెల్లి ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకుపోయిన విషయాన్ని ఫోన్ చేసి వివరించింది. తమను ఎటూ వెళ్లనీయడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పిందని సుమాంజలి సోదరుడు కడారి స్వామి తెలిపారు.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)