మేకపాటి గౌతమ్ రెడ్డి: డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే ఆయన్ను కాపాడే వీలుండేదా? డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి?

మేకపాటి Mekapati Goutham Reddy

ఫొటో సోర్స్, fb/Mekapati Goutham Reddy

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే ఆయన మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు బీబీసీతో చెప్పాయి.

ఇటీవల కాలంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుకు గురై మరణించారు. కోవిడ్ సోకిన తర్వాత గుండెపోటు మరణాలు పెరిగినట్లు కూడా వార్తలొచ్చాయి. మంత్రి మేకపాటి కూడా జనవరి నెలలో కోవిడ్ బారిన పడ్డారు.

అయితే, ఆయనకు డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే ప్రాణాలు కాపాడగలిగేవారా? డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి? ఎవరికి చేస్తారు? ఏయే పరిస్థితుల్లో చేయవచ్చు? దీని వల్ల ప్రయోజనాలేంటి? ఈ వివరాలను హైదరాబాద్‌కు చెందిన కార్డియాక్ ఫీజీషియన్ డాక్టర్ విరించి బీబీసీకి వివరించారు.

డీఫిబ్రిలేషన్

ఫొటో సోర్స్, NurPhoto/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డీఫిబ్రిలేషన్

డీఫిబ్రిలేటర్ అంటే ఏంటి?

డీఫిబ్రిలేటర్ అనేది ఒక వైద్య పరికరం. డీఫిబ్రిలేటర్ అనే పరికరం ద్వారా కరెంటును అతి తక్కువ మోతాదులో (12 ఏఎంపి)ను ఎక్కువ పవర్ (100-300 వోల్టులు) కేవలం కొన్ని మిల్లీ సెకండ్ల పాటు ఇస్తారు.

విద్యుత్‌ను అతి తక్కువ మోతాదులో ఎక్కువ శక్తితో మిల్లీ సెకన్ల పాటు ఇవ్వడమే డీఫిబ్రిలేషన్ అని అంటారు.

గుండె పోటు వచ్చిన వారికి అరిథ్మియా ఏర్పడినప్పుడు డీఫిబ్రిలేషన్ చేయవచ్చు. గుండె ఒక రిథమ్‌లో కొట్టుకుంటూ పేస్ మేకర్ నియంత్రణలో ఉంటుంది. గుండె ఎప్పుడైనా పేస్ మేకర్ నియంత్రణలోంచి బయటకు వచ్చినప్పుడు, గుండెలో ఉన్న ప్రతి కణమూ నియంత్రణ కోల్పోతుంది. ఆ సమయంలో డీఫిబ్రిలేషన్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది.

గుండెపోటు వచ్చినట్లు చూపిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

అరిథ్మియా అంటే ఏంటి?

గుండె కండరాల్లో తీవ్రంగా లోపాలు ఏర్పడినప్పుడు గుండెలో పేస్ మేకింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది. దీనినే అరిథ్మియా అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఒక్క నిమిషంలోనే ప్రాణాలు పోయే అవకాశముంటుంది. ఈ పరిస్థితి గుండె పోటు వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా కలగవచ్చు. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందనేది ఊహించడం కూడా కష్టం.

అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ ఏర్పడినప్పుడు గుండె కండరాలు బలహీనమవుతాయి. ఒకసారి బలహీనమైన కండరం తిరిగి సాధారణ స్థితికి రావడం సాధ్యం కాదు. ఇందుకోసం కండరాలు మరింత పాడవ్వకుండా కాపాడుకోవడమే దీనికి ప్రధానమైన చికిత్స. పాడయిన కండరానికి వెంటనే చికిత్స చేసేందుకు థ్రోమ్బోలైసిస్ లేదా పీసీఐ ప్రక్రియ పనికొస్తుంది. ఈ చికిత్సను వెంటనే మొదలుపెట్టాలి.

ఈ కండరాలు తీవ్రంగా పాడైన స్థితిలో గుండె పంపింగ్ సామర్ధ్యం 30% కంటే తక్కువకు పడిపోతుంది. ఇటువంటి స్థితిలో రోగికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నూటికి 80 శాతం రోగులు మరణించే ప్రమాదం ఉంది.

డీఫిబ్రిలేటర్

ఫొటో సోర్స్, Newscast/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డీఫిబ్రిలేటర్

అరిథ్మియాలో రకాలేంటి?

అరిథ్మియాలో గుండె క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటుంది. అరిథ్మియాలో వెంట్రిక్యులర్ టాకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అనే రెండు రకాల గుండె పోట్లు సంభవిస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనిషి ఉన్న చోటే కుప్ప కూలిపోతారు. ఇదే ఆసుపత్రిలో జరిగితే ఈసీజీలో కనిపించే రిథమ్‌కు అనుగుణంగా డీఫిబ్రిలేటర్‌తో ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు.

ఎలక్ట్రోడ్‌లను ఛాతీ పై ఉంచి అవసరమైనంత తీవ్రతలో షాక్ ఇస్తారు. గుండె తన ఇష్టమైన రీతిలో కొట్టుకుంటున్నప్పుడు దానిని కరెంటు సరఫరా వైర్లను ఒక్క కుదుపు కుదిపి సరి చేసేందుకు డీఫిబ్రిలేషన్ పనికొస్తుంది. గుండె కండక్షన్ విధానంలో ఉండే ఎలక్ట్రికల్ చర్యలన్నీ ఈ షాక్ తో సరి అవుతాయి. అప్పుడు గుండె తిరిగి తన సహజ పేస్ మేకర్ రిథమ్‌లోకి మారే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇంజెక్షన్లు చేస్తారు.

ఆగిపోయిన గుండెకు షాక్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనముండదు.

అరిత్మీయలో షాక్, సీపీఆర్ వెంట వెంటనే ఇస్తారు. దీని వల్ల ఆగిన గుండెను సీపీఆర్ ద్వారా చైతన్యం చేసే అవకాశముంది.

పెరుగుతున్న గుండెపోటు మరణాలు

NCBI అందిస్తున్న సమాచారం ప్రకారం, కార్డియోవాస్కులర్ వ్యాధుల మూలంగా ప్రపంచంలో ఏటా 1.7 కోట్ల మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాల్లో ఇవి 30 శాతం.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ఐవీ, మలేరియా, టీబీ వ్యాధుల మూలంగా సంభవిస్తున్న మొత్తం మరణాలకు రెట్టింపు సంఖ్యలో ఈ మరణాలున్నాయి.

గుండె సంబంధిత వ్యాధుల ఫలితంగా సంభవిస్తున్న మరణాలలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌తో జరుగుతున్న మరణాలు 40-50 శాతం వరకు ఉంటాయి.

డీఫిబ్రిలేషన్

ఫొటో సోర్స్, UniversalImagesGroup/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డీఫిబ్రిలేషన్

సీపీఆర్ ఎప్పుడు చేస్తారు?

గుండె పోటు వచ్చి పూర్తిగా గుండె ఆగిపోయిన పక్షంలో సిపిఆర్ చేస్తారు. ఆ సమయంలో ఈసీజీ మానిటర్ పూర్తిగా ఆగిపోతుంది. ఆ సమయంలో సీపీఆర్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో డీఫిబ్రిలేషన్ పని చేయదు. సీపీఆర్ చేయడం వల్ల ఆగిపోయిన గుండె రిథమ్‌లోకి వచ్చి కొట్టుకోవడం మొదలుపెట్టే అవకాశముంటుంది.

మెకానికల్ శక్తి ఎలక్ట్రికల్ ఎనర్జీ గా మారి పేస్ మేకర్ ను చైతన్యం చేస్తుంది. నిమిషానికి 100 సార్లు చొప్పున గుండె పై ఒత్తిడి కలుగచేస్తారు. దానికి కూడా శాస్త్రీయ మెళకువలు ఉంటాయి. దీనిని కూడా గుండె ఆగిన 5-10 నిమిషాల లోపు చేస్తేనే ప్రయోజనముంటుంది.

ఒక్కసారి డీఫిబ్రిలేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి గుండెపోటు వస్తుందా?

డీఫిబ్రిలేషన్‌ను 3 - 4 సార్లు కంటే ఎక్కువ సార్లు ఇవ్వలేరు. గుండెపోటు వచ్చిన తర్వాత డీఫిబ్రిలేషన్ చేసిన తర్వాత కూడా తిరిగి గుండెపోటు వచ్చే అవకాశముంటుంది. ఒక్కసారి డీఫిబ్రిలేషన్ చేసినంత మాత్రాన తిరిగి గుండెపోటు రాదని చెప్పేందుకు లేదు. వారికి తిరిగి 3-4 రోజుల వరకు అరిథ్మియా సంభవించే అవకాశముంది.

ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసిడి)‌ను గుండె లోపల ఎప్పుడు అమరుస్తారు?

అరిథ్మియా ఎక్కువగా ఏర్పడుతున్న ఉన్న వారికి ఇంప్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసిడి)ను గుండెలో అమరుస్తారు. ఇది గుండెలో అసాధారణ రిథమ్ ను కనిపెట్టగానే షాక్ ఇస్తుంది. దీంతో, గుండె సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరికరం అమర్చేందుకు రూ.1 లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చయ్యే అవకాశముంది. దీనిని శస్త్ర చికిత్స చేసి గుండె లోపల అమరుస్తారు.

వీడియో క్యాప్షన్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? ఇది ఎందుకు ప్రాణాలు తీస్తోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)