ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ: ‘దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉంది.. ప్రాంతీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ – కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు.
ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబయి చేరుకున్న కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం 'వర్షా'కు వెళ్లి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులిద్దరూ జాతీయ రాజకీయాలపై చర్చించారు.
సమావేశం అనంతరం మాట్లాడిన కేసీఆర్... త్వరలోనే మీరంతా మంచి ఫలితాలను చూస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
కేసీఆర్ ఏమన్నారంటే..
''దేశాభివృద్ధిని వేగవంతం చేయడానికి, దేశంలో కొన్ని నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడానికి, విధానాలను మార్చేందుకు చర్చలు జరిపాం. దాదాపు అన్ని విషయాల్లో మా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. రాబోయే కాలంలో కలిసి పనిచేయాలని మేం నిశ్చయించుకున్నాం.
మా తరహాలోనే దేశం గురించి ఆలోచించే సోదరులు కొంతమంది ఉన్నారు. వారితో కూడా నేను చర్చలు జరుపుతున్నా. త్వరలోనే హైదరాబాద్ లేదా మరో ప్రదేశంలో వారితో సమావేశం అవుతాం. చర్చలు జరిపి ఒక మార్గాన్ని కనుగొంటాం.
మహారాష్ట్రతో మాది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పగలను. మహారాష్ట ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రజలకు అదృష్టం వరించింది. వారి మద్దతుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం.
రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. చాలా విషయాల్లో మేం ఒకరికొకరు సహాయం అందించుకుంటున్నాం.
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో రావాల్సినంత మార్పు రాలేదు. దేశంలో ఒక పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ సమయం ఆసన్నమైంది.
ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు చెందిన పలువురితో మాట్లాడి మేం ఒక నిర్ణయం తీసుకుంటాం. మహారాష్ట్ర నుంచి వచ్చే ఏ ఉద్యమమైనా విజయవంతం అవుతుందని నా నమ్మకం. ఛత్రపతి శివాజీ, మరాఠా యోధుల నుంచి దేశానికి లభించిన ప్రేరణతోనే మేం కూడా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యం కోసం మేం పోరాడాలని అనుకుంటున్నాం.
ఈరోజు వర్షా భవనంలో ఒక మంచి పనికి పునాది పడింది. మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల ఫలితంగా మీరు మంచి పరిణామాలను చూడబోతున్నారు.
మహారాష్ట్రలో నాకు ప్రేమ లభించింది. దీన్ని భద్రంగా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నా. తిరిగి ఇదే ప్రేమను మా నుంచి కూడా మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం'' అని కేసీఆర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే నష్టపోతుందని కేసీఆర్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
'కేంద్ర ఏజెన్సీలను చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని మేం ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి. లేదంటే నష్టపోతుంది' అని కేసీఆర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేసీఆర్ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా మాట్లాడారు.
''మన హిందుత్వం, తప్పుడు రాజకీయాలను బోధించదు. దేశం సర్వనాశనం అవుతున్నప్పటికీ, కొందరు మాత్రం తమ అజెండా కోసమే పనిచేస్తారు. దేశాన్ని సరైన దారిలోకి మనమే తీసుకురావాలి. ఆ తర్వాత ప్రధాని ఎవరు అనే దాని గురించి చర్చిద్దాం. ఈరోజు నుంచి మేం చాలామంది రాజకీయ నాయకులను కలుస్తాం'' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

ఫొటో సోర్స్, ugc
శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ
ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం కేసీఆర్ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తోనూ భేటీ అయ్యారు.
దేశం కొత్త అజెండా, కొత్త విజన్‌తో పని చేయాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని శరద్ పవార్‌తో చర్చించానని సీఎం కేసీఆర్ చెప్పారు. తాము కలిసి పని చేస్తామని, భావ సారూప్యత ఉన్న పార్టీలతో త్వరలోనే చర్చలు జరుపుతామని కేసీఆర్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ ఉన్నట్టుండి స్వరం పెంచారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటే, అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని కూడా ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ వెంట ముంబయి వెళ్లిన వారిలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Ani
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లతో భేటీ ద్వారా కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
జీఎస్ రామ్మోహన్, బీబీసీ తెలుగు ఎడిటర్
జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్ మాటకు విలువ ఉంది. ఆయనతో సమావేశం అయ్యి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు కేసీఆర్. ఆయనకున్న పలుకుబడిని కేసీఆర్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.
ఇక ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై తర్వాత చర్చించొచ్చని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అంటే ఇటువైపు ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. ఇప్పుడు ఉన్న వారిని అధికారం నుంచి తప్పించడమే వారి మొదటి ప్రాధాన్యతగా కనిపిస్తోంది.
ఇక మూడో విషయం.. ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ ఫొటో సెషన్‌లో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కనిపించారు. కేవలం భావసారూప్యత కలిగిన రాజకీయ నాయకులను మాత్రమే కాదు.. సివిల్ సొసైటీలోని సెక్యులర్, లిబరల్, అసమ్మతి స్వరాలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.
'కేసీఆర్ గతంలోనూ ఈ ప్రయత్నం చేశారు'
కేసీఆర్ ముంబయి పర్యటనపై సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాస రావు మాట్లాడారు.
"కేసీఆర్ గతంలోనూ ఈ ప్రయత్నం చేశారు. అప్పట్లో దిల్లీదాకా వెళ్లారు. ఎన్నికలు ఏడాది రెండేళ్లు ఉన్నాయనగా ఇలాంటివి రావడం సహజం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడూ ఇలా అందరూ జట్టు కట్టే ప్రయత్నం చేశారు. ఒక్క జయప్రకాశ్ నారాయణ హయాంలో మాత్రమే ఇలాంటివి సఫలం అయ్యాయి. అప్పుడు అన్ని పార్టీలూ, అన్నీ వదిలేసి ఇందిరాను ఓడించాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేసి సఫలం అయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే కలగూరగంపగా ఫెయిల్ అయింది.
ఎవర్నో దింపడానికి తప్ప, వారికొక విధానం లేదన్న అనుమానం ప్రజల్లో వస్తుంది. అధికారంలోకి వచ్చాక ఎవరి సిద్ధాంతాలు వారు బయటకు తెస్తారు. అప్పుడు సమస్య వస్తుంది. ఉదాహరణకు కర్ణాటక-తమిళనాడు మధ్య సమస్యలున్నాయి. అక్కడి పార్టీలు కలసి పనిచేయగలవా?
అయితే ఈ ప్రయోగాన్ని తప్పు పట్టలేం. కాకపోతే ఎక్కడ తేడా వస్తుందంటే, ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకునే దగ్గర. వీరందరూ తమ విభేదాలు పక్కన పెట్టి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసే శక్తి ఉన్నదా అన్నది ప్రశ్న. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అందరూ కలసి కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ కల నిజం చేయడం కూడా ఈ ప్రయత్నంలో ఉండొచ్చు. ఎందుకంటే ఒకరు పోతేనే రెండో వారికి చోటు దక్కుతుంది.
ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఈ ప్రయత్నం మొదలుపెట్టిన వారికే మెడలో దండ పడుతుందని చెప్పలేం. అన్నిటికీ మించి ఎన్నికల వరకూ ఈ ప్రయత్నాలు లాగుతారా లేక మధ్యలోనే వదిలేస్తారా అనేది కూడా చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నప్పుడే ఇలాంటి ఫ్రంట్‌లకు అవకాశం ఉంటుంది" అని భండారు శ్రీనివాస రావు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- రాజా సింగ్: బుల్డోజర్ వ్యాఖ్యలపై కేసు నమోదుచేసిన హైదరాబాద్ పోలీసులు
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- సింగపూర్: అడవిలో ఈయన ఒంటరిగా 30 ఏళ్లు ఉన్నారు
- పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












