తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?

ఫొటో సోర్స్, k.n. Prasad
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుమలలో ప్రైవేటు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను తొలగించాలన్న టీటీడీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న పాలక మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించిన టీటీడీ బోర్డ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
వీటిలో తిరుమలలో ప్రైవేటు రెస్టారెంట్లను పూర్తిగా తొలగించాలని, దేశ ప్రధాని నుంచి సామాన్య భక్తుల వరకు అందరూ టీటీడీ అన్న ప్రసాదమే తినాలి అనే నిర్ణయమూ దీనిలో ఒకటి.
దీనిపై సోషల్ మీడియాలో, తిరుమలలో ఉపాధి పొందుతున్న వారి నుంచి భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.
తిరుమలలో జీవనోపాధి పొందే వేలాది మందిపై ఇది ప్రభావం చూపిస్తుందని కొందరు చెబుతుంటే, కొండపై శతాబ్దాల నుంచి యాత్రికులకు ఆహారం విక్రయించే వారనడానికి మేమే ఆధారం అని స్థానికులు చెబుతున్నారు.
మరో వైపు రోజూ తిరుమలకు వచ్చే భక్తులకు, వివిధ రాష్ట్రాల ప్రజలందరి ఆహారపు అలవాట్లకు తగినట్లు ఉచిత అన్న ప్రసాదం వండి అందించడం టీటీడీకి కష్టం అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, k.n. Prasad
టీటీడీ ఏం చెప్పింది?
ఫిబ్రవరి 17న పాలక మండలి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చే భక్తులందరికీ పూర్తి స్థాయిలో ఉచిత అన్న ప్రసాదం అందించడానికి వీలుగా కొండపై ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతో పాటూ, ప్రైవేటు రెస్టారెంట్లు పూర్తిగా తొలగించే కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.
“వీఐపీలు, బోర్డు మెంబర్లు, చైర్మన్, మంత్రులు, ముఖ్యమంత్రి.. ఇలా ఎవరైనా ఒకే కిచెన్‌లో తయారయ్యే స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అందరికీ పెడదాం. ఏ పదవిలో ఉన్నా స్వామివారి భక్తుడే కాబట్టి.. వాళ్లందరికీ ప్రసాదం అందించే కార్యక్రమం చేద్దాం. దానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించాం. నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు చేద్దాం.. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండచ్చు. ఆ ఇబ్బందులు ఎలా అధిగమించాలో భక్తుల దగ్గర అభిప్రాయాలు కూడా సేకరిద్దాం. ప్రసాదం నచ్చని వారికి, వేరే రకం ఆహారం తీసుకునే వారికి ఏం చేయాలి అనేది కూడా ప్రత్యామ్నాయాలు చూద్దాం. ఏదేమైనా దానిని స్వామివారి ప్రసాదంగానే ఇద్దాం. కొని, తినే కార్యక్రమం లేకుండా చేద్దాం. దీనివల్ల జీవనోపాధి కోల్పోయే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయచ్చో ఆలోచించాలని అధికారులకు చెప్పాం”అని సుబ్బారెడ్డి అన్నారు.

కొండపై హోటల్ యజమానులేమంటున్నారు?
టీటీడీ సమగ్రంగా ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తిరుమలలోని చిన్న హోటళ్ల యజమానులు చెబుతున్నారు.
యాత్రికుల మంచి కోసం టీటీడీ తీసుకునే నిర్ణయాలను మేం వ్యతిరేకించం అంటూనే, తమ గురించి దేవస్థానం ఆలోచించాలని చిన్న హోటల్స్ అసోసియేషన్ సెక్రటరీ కెఎం సత్యనారాయణ బీబీసీకి చెప్పారు.
“ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు. కానీ, భక్తులకు సరిగా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. అది, ప్రాక్టికల్‌గా ఎలా సాధ్యం అనేది ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. కొండపై మేం చాలా ఏళ్ల నుంచీ ఉన్నాం కాబట్టి అది మాకు తెలుసు. భక్తులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే టీటీడీ అలా చెప్పింది. అందుకే మా జీవనోపాధి పోకుండా సాయం చేయమని కోరుతున్నాం. అంతేగానీ దేవస్థానం పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకతా లేదు. మేం కూడా యాత్రికులకు సేవ చేయాలనే అనుకుంటున్నాం. టీటీడీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే మేం కోరుతున్నాం”అని ఆయన అన్నారు.
టీటీడీ చిన్న హోటళ్ల మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా పెద్ద పెద్ద హోటళ్లకు వచ్చే యాత్రికులకు మాత్రం ఉచిత అన్నదానం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చిన్న హోటళ్ల యజమానులు చెబుతున్నారు.
మొదట తమకు లైసెన్సులు ఇచ్చిన టీటీడీ ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటే, తాము ఇబ్బందులకు గురవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని చిన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి పైగా ఆధారపడుతున్నారని స్మాల్ హోటల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిరి బీబీసీకి చెప్పారు.

"మేం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేం అక్కడ వ్యాపారం చేసుకుని దానిపైనే బతుకుతున్నాం. యాత్రికుల కోణంలో చూస్తే గతంలో టీటీడీ ఏర్పడక ముందు నుంచీ అక్కడున్న పీఠాధిపతులు, మఠాధిపతులు, ఉద్యోగులే వాళ్లకు కావల్సిన అన్ని భోజన వసతులూ చూసేవారు. వారికి సేవ చేస్తూ బతికేవారు. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. ఉచితాన్నదానం చేస్తున్నా దేశవ్యాప్తంగా రకరకాల యాత్రికులు వస్తుంటారు. వారికి కావాల్సిన చైనీస్ ఫుడ్, చపాతీలు లాంటివి ఎన్నో మేం అందిస్తున్నాం. ఇప్పుడు టీటీడీ వాటిని రద్దు చేసి అన్నప్రసాదంలా పెడతాం అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు'' అని గిరి అభిప్రాయపడ్డారు.
ఇన్నేళ్ల టీటీడీ అభివృద్ధి వెనుక స్థానికుల కృషి ఉందని, దేవస్థానం ఏర్పడక ముందు నుంచీ యాత్రికులకు సేవలు అందించిన తాము ఇప్పుడు హోటళ్లు మూసేస్తే ఎలా బతకాలని హోటల్ యజమాని కె.ఎన్ ప్రసాద్ ప్రశ్నించారు.
“టీటీడీ మొదటి కాంప్లెక్స్ కట్టక ముందు అక్కడ ఒక మఠం దగ్గర పూటకూళ్ల మిట్టలో యాత్రికులకు భోజనాలు పెట్టేవాళ్లం. 60, 70ల్లో యాత్రికులు మా స్థానికుల ఇళ్లలోనే తినేవారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మా ఇళ్లు ఇచ్చి మేం బయట పడుకుని వారికి సేవ చేశాం. టీటీడీకి ముందు వందేళ్ల నుంచీ స్థానికులు ఇక్కడ యాత్రికులకు అన్నీ అందించారు. ఎద్దుల బండ్లు కట్టుకుని వచ్చిన గ్రామస్థులకు దర్శనం చేయించి తిరిగి క్షేమంగా వారి ఊరికి చేరిస్తే మా పెద్దలకు మహంతులు బత్తెం ఇచ్చేవాళ్లు. పూటకూళ్లలో కూడా నాలుగు రకాల భోజనాలు పెట్టేవారు. అదే ఇప్పుడు సుపథం ఎంట్రన్స్ అయ్యింది” అని కె.ఎన్. ప్రసాద్ బీబీసీకి చెప్పారు.

‘భక్తుల ఇష్టాలను గౌరవించాలి’
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులకు గురికావచ్చని, కొండపై జీవనోపాధి పొందేవారి గురించి కూడా టీటీడీ ఆలోచించాలని హైదరాబాద్ నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన స్వప్న అభిప్రాయపడ్డారు.
"టీటీడీ అందించే ఆహారం చాలా బాగుంటుంది. కానీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మరో రకం ఆహారం తినాలని అనిపించవచ్చు. ఒకరోజు రెండ్రోజులైతే తినగలరు. కొందరు ఇక్కడే మూడునాలుగు రోజులు ఉండాలని, దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారు టీటీడీ భోజనం ఒక్కసారి మాత్రమే తినగలరు. మిగతా రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం కూడా వస్తారు. వాళ్లకు కూడా మీరు ప్రత్యామ్నాయం ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అందుకే ఇవన్నీ ఆలోచించాకే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి''అని స్వప్న బీబీకి చెప్పారు.

ఫొటో సోర్స్, k.n. Prasad
‘కొండపై పనిచేస్తూ చదువుకుంటున్నా, అది ఆగిపోతుంది’
తిరుమలలో రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వారి నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొండపై ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పార్ట్ టైమ్ పనిచేస్తూ, వచ్చే సంపాదనతో బీటెక్ చేస్తున్న విజయ.. ఎక్కడ తినాలి, ఏం తినాలి అనేది టీటీడీ భక్తుల నిర్ణయానికే వదిలేయాలని అంటున్నారు.
‘‘నేను చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాను. బీటెక్ ఫైనలియర్ చేస్తున్నా, కరోనా వల్ల కలిగిన ఇబ్బందులను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ వచ్చే సంపాదనతో నా ఫీజులు కడుతున్నా. హోటళ్లు మూసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. తిరుమలలో ఉచిత అన్నదానం, రెస్టారెంట్లు ఉంటే భక్తులు తమకు ఏది కావాలో అది ఎంచుకుంటున్నారు. అందుకే హోటళ్లు తీసేసే నిర్ణయంపై టీటీడీ మరోసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం''అని ఆమె బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, k.n. Prasad
‘మళ్లీ రోడ్డున పడతాం’
తన కుటుంబం తిరుమలలో ఒక హోటల్‌పై ఆధారపడే జీవిస్తోందని, కరోనా వల్ల ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడిన తాము, టీటీడీ నిర్ణయంతో మళ్లీ రోడ్డున పడాల్సి ఉంటుందని ఒక హోటల్లో పనిచేసే లక్ష్మి బీబీసీకి చెప్పారు.
‘‘నాకు ఇద్దరు పిల్లలు, నేనూ నా భర్త ఇక్కడే ఓ హోటల్లో పనిచేస్తాం. కరోనా వల్ల గత రెండు మూడేళ్లు తిండికి, పిల్లల ఫీజులకు, రెంట్ కూడా కట్టులేక చాలా కష్టాలు పడ్డాం. ఈ మధ్యే హోటల్ తెరవడంతో మళ్లీ ఇక్కడ పనిచేసి బతుకుతున్నాం. ఇప్పుడు ఇవి తీసేస్తే మేం మళ్లీ రోడ్డున పడతాం. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోవడంతోపాటూ మేం మళ్లీ ఇబ్బందుల్లో పడిపోతాం. మాకు వేరే పని కూడా చేతకాదు''అన్నారామె.

‘తిరుమల భక్తులకు అప్పట్లో ఆధారం పూటకూళ్లే’
తిరుమలలో హెడ్మాస్టర్‌గా పనిచేసిన ఎస్.కృష్ణారెడ్డి తిరుమల చరిత్ర గురించి అధ్యయనం చేశారు. తిరుమల, దేవస్థానం చరిత్ర గురించి ఆయన రాసిన పుస్తకాలను టీటీడీ ప్రచురించింది.
తిరుమలలో టీటీడీ ఏర్పడక ముందు పూటకూళ్లే భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు అందించేవని ఆయన బీబీసీకి వివరించారు.
"తిరుమలలో ప్రస్తుతం ఆలయానికి ఆగ్నేయ భాగంలో హథీరాంజీ మఠం ఉంది. దానికి ఆనుకుని కింది భాగంలో ఎడమవైపు పూటకూళ్ల మిట్ట అని ఉండేది. అక్కడ యాత్రికులకు పూటకు అన్నం పెట్టి డబ్బులు తీసుకుని, ఇతర సౌకర్యాలు చూసేవాళ్లు. అందుకే దాన్ని అలా అనేవాళ్లు. గుళ్లో ప్రసాదం పెడితే దానితోభక్తుల ఆకలి తీరేది కాదు. దాంతో వారంతా పూటకూళ్ల మిట్టకు వచ్చి ముందే భోజన ఏర్పాట్లు చేసుకునేవారు.”
కృష్ణారెడ్డి తిరుమలలో ఎస్వీ హైస్కూల్ హెడ్మాస్టర్‌గా చేరి, అక్కడే 16 ఏళ్లు పనిచేశారు.
తిరుమలలో పూటకూళ్ల మిట్టలో యాత్రికులకు భోజనం పెట్టి, డబ్బులు తీసుకునే పద్ధతి చాలా కాలం కొనసాగిందని, తర్వాత మఠాలు, సత్రాల్లో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాట్లు పెరగడంతో అలా చేసేవారు తగ్గిపోయారని కృష్ణారెడ్డి చెప్పారు.

‘ఉద్దేశం మంచిదే కానీ అమల్లో ఇబ్బందులు..’
"పూటకూళ్ల మిట్టలో దాదాపు 77 ఇళ్లు ఉండేవి. క్రమంగా వారు వేరే పనులు, వృత్తుల్లో పడి దానిని ఆపేశారు. తర్వాత తిరుమలలో చాలా మఠాలు, సత్రాలు వచ్చాయి. వాటిలో యాత్రికులకు వసతి, భోజన సౌకర్యాలు అందించేవారు. 1970లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించినపుడు గుడి ముందు సన్నగా ఉన్న దారిని వెడల్పుగా చేయడానికి పూటకూళ్ల మిట్టలో ఇళ్లు కొట్టేశారు. అక్కడున్న వారికి ప్రస్తుతం మ్యూజియం ఉన్న చోటు వెనుక రిహాబిలిటేషన్ సెంటర్ కట్టి అక్కడ వసతి కల్పించారు''అని కృష్ణారెడ్డి చెప్పారు.
ప్రస్తుత టీటీడీ నిర్ణయం గురించి మాట్లాడిన కృష్ణారెడ్డి దానిని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని, టీటీడీ మళ్లీ హోటళ్లకు అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
"అది మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే హోటల్‌కు వెళ్లిన వారు తమకు నచ్చింది ఆర్డర్ ఇచ్చి తింటారు. టీటీడీ దేవుడి ప్రసాదమే తినాలి అంటే కొందరికి అది నచ్చకపోవచ్చు, కొందరి ఆరోగ్యానికి అది పడక పోవచ్చు. హోటళ్లలో అన్ని రకాలూ ఉంటాయి. వాళ్లకు అవసరమైనవి టీటీడీ తయారు చేయలేరు. రకరకాల వెరైటీలు చేసి అందరికీ వడ్డించి, అందరినీ తృప్తిపరచలేరు. టీటీడీ ఇప్పుడు ఇలా అనుకున్నా, వారు మళ్లీ హోటళ్లను అనుమతించాల్సి వస్తుంది. ఈ ఉద్దేశం మంచిదే అయినా దీని అమల్లో ఇబ్బందులు ఉన్నాయి'' అన్నారు.
ప్రస్తుత బోర్డు హయాంలోనే సంప్రదాయ భోజనం పేరిట ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టి, తర్వాత విమర్శలు రావడంతో టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఫొటో సోర్స్, k.n. Prasad
పూటకూళ్లు అంటే ఏంటి?
ప్రస్తుత హోటళ్ల లాగే గతంలో పూటకూళ్లు అనేవి ఉండేవని కృష్ణారెడ్డి వివరించారు. "పూటకూళ్లలో ఏం కావాలో ముందుగానే కనుక్కొని పెట్టేవారు. ఆ కాలంలో హోటళ్లు లేవు కాబట్టి పూటకూళ్ల పద్ధతి వచ్చింది. ఎవరైనా ఒక ఇంటివాళ్లు బయట నుంచీ ఎంతమంది వచ్చారని తెలుసుకుని వారు చెప్పిన దానిప్రకారం ఆహార పదార్థాలను తయారు చేసి వారికి పెట్టి డబ్బులు తీసుకునే వారు. బయట నుంచీ వచ్చిన వారికోసం ఏర్పడినది వ్యవస్థ అది. క్రమంగా అవి వసతి గృహాలుగా, హోటళ్లుగా మారిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని పట్టణాలలో మారుమూల ప్రదేశాలలో గంపల్లో అన్నం పెట్టుకుని కొన్ని కూరలు పెట్టుకుని ప్లేట్ మీల్స్ లాగా చేతికి అందించి డబ్బులు తీసుకునే పద్ధతి ఉంది''అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:
- అటల్ బిహారీ వాజ్‌పేయీ: ప్రేమించిన అమ్మాయిని వాజ్‌పేయీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- ఫ్రెంచ్ సైన్యం మాలిని వదిలిపెట్టి ఎందుకు వెళుతోంది?
- అమెరికాతో ఒప్పందంపై నేపాల్ ప్రభుత్వం ఎందుకు వివాదంలో చిక్కుకుంది? దీనికి భారత్ ఆమోదం ఎందుకు?
- టీ స్టార్టప్‌లు: అల్లం టీ, యాలకుల టీ, తులసి టీ, గ్రీన్ టీ మాత్రమే కాదు.. సరికొత్త రుచుల్లో భారతీయ తేనీరు
- ఫాల్స్ ఫ్లాగ్ అటాక్: ఏమిటీ వార్ ప్లాన్? యుక్రెయిన్‌పై దాడికి రష్యా వ్యూహం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















