ఫాల్స్ ఫ్లాగ్ అటాక్: ఏమిటీ వార్ ప్లాన్? యుక్రెయిన్‌పై దాడికి రష్యా వ్యూహం ఇదేనా?

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Reuters

తూర్పు యుక్రెయిన్‌లో సంక్షోభం నానాటికీ ముదురుతోంది. కొన్నిచోట్ల ‘‘ఫాల్స్ ఫ్లాగ్స్’’ దాడులు చేపట్టాలని రష్యా ప్రణాళికలు రచిస్తోందని బ్రిటన్, అమెరికా అనుమానిస్తున్నాయి. ఈ దాడులను సాకుగా చూపించి ఆక్రమణలకు పాల్పడాలని రష్యా భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే యుక్రెయిన్ సైన్యం తమపై వరుస దాడులు చేపడుతోందని రష్యా మద్దతున్న వేర్పాటువాదులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి పోవాలని సాధారణ పౌరులకు వారు సూచిస్తున్నారు.

ఏమిటీ ఫాల్స్ ఫ్లాగ్ దాడులు?

ఫాల్స్ ఫ్లాగ్ దాడులను రాజకీయ లేదా సైనిక చర్యలుగా చెప్పుకోవచ్చు. ప్రత్యర్థులు చేసినట్లుగా ఆరోపిస్తూ సొంత సభ్యులపై తామే ఈ దాడులు చేపడతారు.

దాడులు చేసిన తర్వాత వీటిని ప్రత్యర్థులు చేపట్టారని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత వీటిని సాకుగా చూపిస్తూ యుద్ధానికి చర్యలు మొదలుపెడతారు.

16వ శతాబ్దంలో ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. అప్పట్లో సముద్రపు దొంగలు తమ నౌకలపై మిత్ర దేశాల నౌకల జెండాలు ఎగురవేసేవారు. దీంతో వాటిని మిత్రదేశాల నౌకలుగా భావించి కొన్ని నౌకలు దగ్గరగా వచ్చేవి. ఆ సమయంలో వాటిపై దొంగలు దాడులు చేసేవారు.

ఈ ఫాల్స్ ఫ్లాగ్స్ దాడులకు సుదీర్ఘ చరిత్ర ఉంది.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

1930: పోలండ్‌పై జర్మనీ దండయాత్ర

పోలండ్‌పై జర్మనీ దండయాత్రకు ముందురోజు రాత్రి, ఏడుగురు జర్మనీ సైనికులు పోలండ్ సైనికులుగా చెప్పుకొంటూ జర్మనీ సరిహద్దుల్లోని గ్లీవిట్జ్ రేడియో టవర్‌పై దాడులు చేశారు. ఆ స్థావరాన్ని పోలండ్ ఆక్రమించిందని వారు రేడియో స్టేషన్ నుంచి ఒక సందేశాన్ని పంపించారు.

దాడి జరిగిన చోట, పోలండ్ సైనికుల బట్టలు తొడిగిన ఓ పౌరుడి మృతదేహాన్ని కూడా వారు వదిలిపెట్టారు. దాడిలో ఆయన చనిపోయినట్లు ఆధారాలు సృష్టించారు.

ఆ మరుసటి రోజు గ్లీవిట్జ్ దాడితోపాటు ఇలాంటి మరికొన్ని దాడులను ఉటంకిస్తూ అడాల్ఫ్ హిట్లర్ ఓ ప్రసంగాన్ని చేశారు. ఈ దాడులను సాకుగా చూపించి పోలండ్‌పై దాడిని ఆయన సమర్థించుకున్నారు.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

1939: రష్యా-ఫిన్లాండ్ యుద్ధం

అదే ఏడాది రష్యా గ్రామం మైనిలాపై షెల్స్‌తో దాడులు జరిగాయి. ఈ గ్రామం ఫిన్లాండ్ సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఫిన్లాండ్ ఈ దాడులను చేపట్టిందని చెబుతూ.. రష్యా వింటర్ వార్‌ను మొదలుపెట్టింది.

నిజానికి మైనిలాపై ఆనాడు మొదట దాడి చేపట్టిందని ఫిన్లాండ్ కాదని చరిత్రకారులు తేల్చారు. ఆనాడు కావాలనే సోవియట్ ఎన్‌కేవీడీ భద్రతా సంస్థే సొంత సభ్యులపై ఈ దాడి చేపట్టిందని దర్యాప్తులో తేలింది.

1994లో ఈ విషయాన్ని అప్పటి రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్ అంగీకరించారు. వింటర్ వార్‌ను తొలుత మొదలుపెట్టింది రష్యానే అని ఆయన చెప్పారు.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

1964: టొంకిన్ గల్ఫ్ యుద్ధం

1964 ఆగస్టు 2న అమెరికా యుద్ధ నౌక, ఉత్తర వియత్నాం టార్పిడో పడవల మధ్య.. వియత్నాం తీరంలోని టొంకిన్ గల్ఫ్‌లో యుద్ధం జరిగింది.

రెండు వైపులా నౌకలకు నష్టం సంభవించింది. ఉత్తర వియత్నాం నలుగురు సైనికులను కోల్పోయింది. మరో ఆరుగురికి గాలయ్యాయి.

రెండు రోజుల తర్వాత ఇలాంటి దాడి మరొకటి కూడా జరిగిందని అమెరికా జాతీయ భద్రతా సంస్థ చెప్పుకొచ్చింది.

వీటిని సాకుగా చూపిస్తూ టొంకిన్ గల్ఫ్‌లో ఉత్తర వియత్నాంపై అమెరికా వైమానిక దాడులను ఉధృతం చేసింది.

అయితే, రెండోసారి ఉత్తర వియత్నాం ఎలాంటి దాడులూ చేపట్టలేదని చరిత్రకారులు తేల్చారు.

యుక్రెయిన్ సంక్షోభం

ఫొటో సోర్స్, Reuters

తమ యుద్ధ నౌకను శత్రు పడవలు చుట్టుముట్టాయని అమెరికా యుద్ధనౌకను నడిపిన కెప్టెన్ మొదట్లో చెప్పారు. అయితే, ప్రతికూల వాతావరణం నడుమ అక్కడ ఏం జరుగుతుందో తనకు సరిగా కనిపించలేదని తరువాత ఆయన మాటమార్చారు.

2005లో దీనికి సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు బయటకువచ్చాయి. దీంతో అసలు అమెరికా నౌకపై ఉత్తర వియత్నాం ఎలాంటి దాడులూ చేపట్టలేదని వెలుగులోకి వచ్చింది.

కానీ, ఆనాడు అమెరికా నౌకా దళాన్ని రెచ్చగొట్టేలా ఉత్తర వియత్నాం రెండు దాడులు చేపట్టిందని కాంగ్రెస్‌కు అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ చెప్పారు.

దీంతో టొంగిన్ గల్ఫ్ తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం ఉత్తర వియత్నాంపై బాంబు దాడులను ఆయన మొదలుపెట్టించారు.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

2014: క్రిమియాలో లిటిల్ గ్రీన్ మెన్

క్రిమియాను రష్యా ఆక్రమించే ముందు కొంతమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతూ కనిపించేవారు. వీరు అచ్చం రష్యా సైనికుల్లానే గ్రీన్ యూనిఫామ్‌లు వేసుకునేవారు.

వీరు స్థానిక సాయుధ పోరాట సంస్థల సభ్యులని రష్యా చెప్పేది. క్రిమియాను రష్యాలో కలపాలని వారు కోరుకుంటున్నారని వివరించేది.

లిటిల్ గ్రీన్ మెన్‌గా పిలిచే వీరు ఎలాంటి ఆధారాలను వీధుల్లో వదిలిపెట్టేవారు కాదు. కానీ, వీరి యూనిఫామ్‌లు, ఆయుధాలు మాత్రం రష్యావేనని చరిత్రకారులు తేల్చారు. అయితే, వారు యూనిఫామ్‌లు, ఆయుధాలను స్థానిక షాపుల్లో కొనేవారని రష్యా చెప్పేది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

2020: కశ్మీర్ సరిహద్దుల్లో..

వివాదాస్పద కశ్మీర్ సరిహద్దుల వెంబడి ఫాల్స్ ఫ్లాగ్ దాడులు చేపడుతున్నారని భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు తరచూ ఆరోపణలు చేసుకుంటుంటారు.

2020లో తమ సరిహద్దుల్లో ఐక్యరాజ్యసమితి పరిశీలకులు ప్రయాణిస్తున్న వాహనంపై భారత బలగాలు దాడులు చేపట్టాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.

పాకిస్తాన్, అంతర్జాతీయ సమాజాన్ని తాము ఎంత మాత్రమూ పట్టించుకోమనే సందేశాన్ని ఈ దాడుల ద్వారా భారత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. తమ సరిహద్దులను భద్రంగా ఉంచుకోవడంలో విఫలమైన పాకిస్తాన్ తమపై ఆరోపణలు చేస్తోందని భారత్ వివరించింది.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)