నదీ కాలుష్యం: ఫార్మా రసాయనాలతో నదులు కలుషితం... ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

ట్యూనిష్‌లోని బ్లూ రివర్: ఔషధ కాలుష్యం అత్యధికంగా ఉన్న నది

ఫొటో సోర్స్, DR JOHN WILKINSON

ఫొటో క్యాప్షన్, ట్యూనిష్‌లోని బ్లూ రివర్: ఔషధ కాలుష్యం అత్యధికంగా ఉన్న నది
    • రచయిత, జోనా ఫిషర్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్మెంట్ కరెస్పాండెంట్

ఫార్మా కంపెనీల మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదులు కలుషితమవుతున్నాయని, అది 'పర్యావరణానికి, ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది' అని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.

యూనివర్సిటీ ఆఫ్ యార్క్ నదీ కాలుష్యంపై చేసిన అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నదీ జలాల్లో పారాసెటమాల్, నికోటిన్, కెఫీన్, ఎపిలెప్సీ, డయాబెటిస్ మందుల ఆనవాళ్లను గుర్తించింది.

ఈ పరిశోధన భారీయెత్తున ప్రపంచస్థాయిలో నిర్వహించారు. అత్యంత కలుషిత నదులున్న దేశాల్లో పాకిస్తాన్, బొలీవియా, ఇథియోపియాలు ఉన్నాయి. ఐస్‌ల్యాండ్, నార్వే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నదులు అన్నింటా ఉత్తమంగా ఉన్నాయి.

ఔషధ తయారీ సంస్థలు మాములుగా వదిలేసే పదార్థాలు నదుల్లో కలవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పటికీ వివరంగా తెలియదు. అయితే, గర్భనిరోధక మాత్రలు వంటివి నీటిలో కలవడం వల్ల చేపల పునరుత్పత్తిపై దుష్ప్రభావం కలుగుతుందని ఇప్పటికే నిర్ధరించారు. నదుల్లో యాంటీబయాటిక్స్ కలవడం పెరుగుతున్న కొద్దీ ఆ మందుల ప్రభావం కూడా క్షీణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ అధ్యయనం కోసం 100కు పైగా దేశాల్లో 1,000కి పైగా ప్రదేశాల నుంచి నీటి నమూనాలు సేకరించారు.

మొత్తంగా, నమూనాలు సేకరించిన 268 నదుల్లో నాలుగోవంతు వాటిల్లో "క్రియాత్మక ఔషధ పదార్థాలు" ఉన్నాయని తేలింది. అవి నీటిలో ఉండే ప్రాణులకు ప్రమాదకర స్థాయిల్లో ఉన్నాయని కూడా ఈ పరిశోధన తేల్చి చెప్పింది.

"మామూలుగా ఏం జరుగుతుందంటే, మనం ఈ రసాయనాలను తీసుకుంటాం. వాటి వల్ల కొంత ఆశించిన ప్రభావం కలుగుతుంది. ఆ తరువాత అవి మన శరీరం నుంచి వెళ్లిపోతాయి" అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ జాన్ విల్కిన్సన్ బీబీసీతో చెప్పారు.

లావోస్‌లోని నామ్‌కాన్ నదిలోని ఈ ప్రాంతంలో ఔషధ కాలుష్యం తక్కువ

ఫొటో సోర్స్, DR JOHN WILKINSON

ఫొటో క్యాప్షన్, లావోస్‌లోని నామ్‌కాన్ నదిలోని ఈ ప్రాంతంలో ఔషధ కాలుష్యం తక్కువ

'వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కూడా వీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేయలేవు'

"ఈ రసాయన పదార్థాలను మనకిప్పుడు అందుబాటులో ఉన్న వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా పూర్తి స్థాయిలో శుద్ధి చేయలేవు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వాటి ఉనికిని నాశనం చేయలేకపోవడంతో అవి చెరువుల్లో, నదుల్లో కలుస్తున్నాయి" అని ఆయన వివరించారు.

చాలా ఎక్కువగా కనిపించిన రెండు ఫార్మా పదార్థాల్లో ఒకటి కార్బామెజాపైన్. మరొకటి మెట్‌ఫార్మిన్. మొదటిది ఫిట్స్, నరాల బలహీనతకు ఉపయోగిస్తే, రెండోది మధుమేహం రోగులకు ఇస్తుంటారు.

"జీవనశైలిలో భాగంగా తీసుకునే"విగా చెప్పుకునే కెఫీన్ (కాఫీ), నికొటిన్ (సిగరెట్లు, నొప్పిని నివారించే పారాసెటమాల్ వంటివి కూడా అధిక మోతాదుల్లో కనిపించాయి. ఆఫ్రికాలోని నదుల్లో మలేరియా చికిత్స కోసం ఇచ్చే ఆర్టిమిసైనిన్ మందును అధిక మోతాదులో గుర్తించారు.

"నదుల్లో కలిసే ఔషధ రసాయనాలు హాని కలిగిస్తాయని మామూలుగా చెప్పుకోవచ్చు. కానీ, ఒక్కో ఔషధ పదార్థం ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది దేనికదే ప్రత్యేకంగా పరిశోధించాల్సి ఉంటుంది" అని బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ యూనివర్సిటీలోని జలజీవావరణవేత్త డాక్టర్ వెరోనికా ఎడ్మండ్స్-బ్రౌన్ బీబీసీతో చెప్పారు.

"పరిస్థితి మరింత విషమించే సూచనలే కనిపిస్తున్నాయి. శారీరక, మానసిక రుగ్మతలన్నింటికీ ఔషధాలు వాడే పరిస్థితి నానాటికీ పెరుగుతుండడంతో ఈ కాలుష్యం కూడా పెరుగుతూనే ఉంటుంది" అని వెరోనికా వివరించారు.

నదీ జలాల్లో యాంటీబయాటిక్స్ శాతం పెరగడం వల్ల వాటిని నిరోధించగల బాక్టీరియా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మందుల ప్రభావం తగ్గిపోతుంది. అంటే, అది చివరకు "ప్రపంచ పర్యావరణానికి, ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది."

కెన్యాలోని నైరోబీ నదిలో కాలుష్యం ఇలా

ఫొటో సోర్స్, DR JOHN WILKINSON

ఫొటో క్యాప్షన్, కెన్యాలోని నైరోబీ నదిలో కాలుష్యం ఇలా

మరి, దీన్ని నియంత్రించడం ఎలా?

పేద దేశాలు, ఓ మోస్తరు ఆర్థిక స్థితిగతులున్న దేశాల్లో ఈ కాలుష్యం అధికంగా ఉంది. చెత్తను నదుల్లో వదిలేసే ప్రాంతాల్లో, నీటి ప్రక్షాళన నిర్వహణ సరిగా లేని చోట్ల, ఫార్మా కంపెనీలు అధికంగా ఉన్న చోట్ల ఈ తరహా కాలుష్యం పెరుగుతోంది.

"నైజీరియాలో, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా ఔషధ, రసాయనాలతో కలుషితమైన నదులను మేం చూశాం. అందుకు కారణం అక్కడ వాటర్ మేనేజ్మెంట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకపోవడమే" అని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో ఎమర్జింగ్ కంటామినంట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్లా చెప్పారు.

"ఇది చాలా ఆందోళనకరం. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు సక్రమంగా లేని చోట్ల ఎంతో మంది ప్రజలు ఈ కాలుష్యానికి దగ్గరలో ఉన్నారు" అని ఆయన అన్నారు.

మరి ఈ ఆందోళనకర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు ఈ అధ్యయన నివేదిక రచనకు నాయకత్వం వహించిన డాక్టర్ విల్కిన్సన్ ఒకింత నిరాశతోనే బదులిచ్చారు.

"ఈ సమస్యను పరిష్కరించాలంటే నా కన్నా తెలివైన వాళ్లెందరో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికప్పుడు చేయాల్సిన పనేమంటే, ఔషధాలను సక్రమంగా, అవసరమైనంత వరకే వాడుకోవడం" అని ఆయన చెప్పారు.

దీనర్థం, యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించాలి. మందుల డోసులను వీలైనంత పరిమితం చేయాలి.

ఈ అధ్యయనం పూర్తి నివేదికను ఈ లింక్‌ను క్లిక్ చేసి చదువుకోవచ్చు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)