భోగాపురం ఎయిర్‌పోర్ట్: ‘పరిహారం ఇవ్వలేదు, పునరావాస కాలనీలు కట్టలేదు. కానీ ఊళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు’

భోగాపురం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన వారు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమని గ్రామాల నుంచి ఎలా వెళ్లిపోమ్మంటారని ప్రశ్నిస్తున్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటి...? నిర్వాసితులు చెప్తున్నదేంటి...?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశం

మూడేళ్ల క్రితం శంకుస్థాపన

ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయిలో భారీ హంగులతో భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించేందుకు తలపెట్టారు. ఆ ఆలోచనకు మూడేళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. మొదట్లో 15వేల ఎకరాలతో ప్రారంభమైన ఇక్కడి భూ సేకరణ చివరకు 2,700 ఎకరాలకు పరిమితమైంది.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అధునాతనంగా, భారీ ఎత్తున తలపెట్టిన ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి తొలుత 15 వేల ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఎయిర్ పోర్టు కోసం ఇంత భూమి ఎందుకంటూ మేం చేసిన అందోళనలతో ముందు 5 వేల ఎకరాలు, ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఆ శిలాఫలకం తప్ప ఇంకో ఇటుక కూడా పడలేదు. భూములిచ్చిన మేం నిర్వాసితులుగా మారిపోయి మా భూములను వదులుకున్నాం. ప్రభుత్వం ఇస్తానన్న ప్యాకేజీపై ఏ అధికారీ మాట్లాడటం లేదు" అని నిర్వాసిత గ్రామాల్లో ఒకటైన రిల్లిపేట గ్రామ నివాసి తాతారావు బీబీసీతో చెప్పారు.

పరిహారంపై అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు
ఫొటో క్యాప్షన్, పరిహారంపై అధికారులను ప్రశ్నిస్తున్న ప్రజలు

'భయపెడుతున్నారు..'

ఫిబ్రవరి లేదా మార్చిలో విమానాశ్రయ నిర్మాణ పనున్ని ప్రారంభించాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందులో భాగంగా నిర్వాసితులను గ్రామాల నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పరిహారం చెల్లింపులు, పునరావాస కాలనీల నిర్మాణం పూర్తవ్వకుండా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్తామని నిర్వాసితులు అంటున్నారు.

"విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెం, రిల్లిపేట...ఈ నాలుగు గ్రామాలు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్వాసిత గ్రామాలు.

ఈ నాలుగు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలు ఉన్నాయి. నిర్వాసితులుగా మారిన మా కుటుంబాలలోని 18 ఏళ్ల లోపు ఉన్న వారికి భూమి, ఉద్యోగం ఇవ్వడం, పునరావాస కాలనీల నిర్మాణం, వివిధ కుల వృత్తుల వారికి నెలవారీ పెన్షను వంటి అనేక హామీలు ఇచ్చారు.

ఇవేమి నెరవేర్చకుండా అధికారులు రోజూ వచ్చి ఎప్పుడు ఖాళీ చేస్తారంటూ బెదిరిస్తున్నారు. గ్రామంలోని కొన్ని చోట్ల ఇళ్లు పడగొట్టారు, చెట్లు కూడా నరికేశారు. ఇదంతా మమ్మల్ని భయపెట్టి ఖాళీ చేయించడానికే" అని మరడపాలెం నివాసి కె. రాము ఆరోపించారు.

తహసిల్దార్ రమణమ్మ

డెడ్‌లైన్ పెట్టలేదు: తహసిల్దార్

నిర్వాసితులను భయపెడుతున్నామని అనడం అవాస్తవమని భోగాపురం తహసిల్దార్ రమణమ్మ బీబీసీతో చెప్పారు. ఎవరైతే ప్యాకేజీ సొమ్ము అందుకుని స్వచ్చంధంగా తమ స్థలాలను అప్పగించారో వాటిలో నిర్మాణాలు, మొక్కలు ఉంటే తొలగిస్తున్నామని... అలాంటి వారు ఐదారుగురుకంటే ఎక్కువ లేరని చెప్పారు.

"ఎయిర్ పోర్టు కోసం సేకరించిన భూములపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. అంతేకానీ భయపెట్టడం అనే మాటల్లో నిజం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందాకే వారు అక్కడ నుంచి వెళ్లవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఎటువంటి డెడ్ లైన్ లేదు. స్వచ్ఛందంగా స్థలాలు, ఇళ్లు అప్పగించిన వారికి నిర్మాణానికి అయిన వ్యయం కూడా ఇస్తున్నాం. మిగిలిన వారిని ఎవరికి కూడా ఇప్పుడు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్పడం లేదు. అలాగే ఎలాంటి నోటీసులు ఇవ్వడం కానీ జరగలేదు" అని తహసిల్దార్ రమణమ్మ తెలిపారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులు

'బాంబులు కొనడానికే డబ్బులైపోతున్నాయి'

నిర్వాసిత గ్రామాలైన మరడపాలెంలో 223, ముడసర్ల పేటలో 39, బొల్లింకలపాలెంలో 55, రిల్లిపేటలో 65 కుటుంబాల పునరావాసం కోసం రెండు కాలనీలను నిర్మిస్తున్నారు. గూడెపువలసలో 17 ఎకరాలు, లింగాలవలసలో 25 ఎకరాల్లో ఈ కాలనీల నిర్మాణం జరుగుతోంది. ఒక్కొక్కరికి ఐదేసి సెంట్లు భూమిని కేటాయించారు.

వీటి పనులు గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి.

"అయితే కొండపై ఈ కాలనీలకు స్థలం ఇవ్వడంతో అక్కడ స్థలం చదును చేయడానికే ఖర్చు ఎక్కువైపోతుంది. బాంబులు పెట్టి ఈ కొండలను పేల్చుతున్నాం. దానికి లక్షల్లో ఖర్చవుతుంది. ఆ కోలనీల్లో ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో నగదు అందజేస్తామని చెప్పారు.

తొలి విడతగా 50 వేలు ఇచ్చారు. కానీ పునాదులు తీసేందుకు కొండను పేల్చాల్సి వచ్చింది. దానికే బాంబు, ఇతర ఖర్చలు కలిసి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చయిపోతోంది. కొండలపై మాకు కాలనీలు కేటాయించారు. దీంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోయాయి. దీనిని ప్రభుత్వం భరించాలి. కాలనీలు పూర్తికాకుండా పశువులు, మేకల మందలతో ఎక్కడికి పోగలం..?" అని మరడపాలెం నివాసి అనురాధ అన్నారు.

నిర్వాసిత గ్రామం
ఫొటో క్యాప్షన్, నిర్వాసిత గ్రామం

'సంబంధాలు కుదరడం లేదు'

ఎయిర్ పోర్టు రావడంతో మా గ్రామాల్లోని పిల్లలకు సంబంధాలు తెగ వచ్చేవి. అయితే ప్యాకేజీ పూర్తిగా రాకపోవడం, ఉన్న భూములను పొగొట్టుకోవడంతో మా పిల్లలకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. గతంలో మాతో వియ్యం పొందుతామని చెప్పిన వారే ఇప్పుడు ముఖం దాచేస్తున్నారని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు.

"భూములు, ఇల్లు లేని మీతో మేం సంబంధాలు కలుపుకోలేం, మా పిల్లలను మీకు ఇవ్వం అని మా బంధువులే అంటున్నారు. మా బతుకులెలాగు అయిపోయాయి...కనీసం మా పిల్లల బతుకులు బాగుపడతాయని అనుకుంటే భూములు తీసుకుని పూర్తి ప్యాకేజీ ఇవ్వడం లేదు.

18 ఏళ్లు నిండిన వారికి భూమి, ఉద్యోగం ఇస్తానని భూములు తీసుకున్నప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. న్యాయం జరక్కపోతే ఎలా? ఈ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే నిద్ర పట్టడం లేదు" అని నరసమ్మ అనే నిర్వాసితురాలు చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశాఖ నగరం మధ్యలో ఓ అడవి... ఆ అడవి లోపల ఓ గిరిజన గ్రామం

'ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందే'

ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాలైన ప్యాకేజీలను ఇస్తే...గ్రామాలను ఖాళీ చేస్తాం. లేదంటే కదిలేదే లేదని నిర్వాసితులు అంటున్నారు. పునరావాస ప్యాకేజీలో అర్హులైన వారికి ప్రభుత్వం అన్నీ ఇస్తుందని అధికారులు చెప్తున్నారు.

"భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన వారికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామిని నెరవేరుస్తుంది. నిర్వాసితులు ఇచ్చిన భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. దానిని ఎయిర్ పోర్టు అథారిటీకి అసైన్ చేయడం జరిగింది.

భూ సేకరణ చేసిన నాలుగు గ్రామాల్లోని అర్హులకు ఎటువంటి అన్యాయం జరగదు. పునరావాసం కల్పిస్తున్నాం. దానికి కొంత టైమ్ ఇస్తున్నాం. అమౌంట్ ఇస్తున్నాం. వాళ్లు కట్టుకుంటున్నారు. అవన్నీ తీసుకుని, ఇతర కారణాలు చూపించి ఖాళీ చేయం అంటే కుదరదు. ప్యాకేజీ విషయంలో అభ్యంతరాలుంటే అధికారులను సంప్రదించాలి. నిర్వాసితులు ఎప్పటికైనా ఆ గ్రామాల్ని ఖాళీ చేయక తప్పదు" అని తహసిల్దార్ రమణమ్మ చెప్పారు.

విమానాశ్రయ ప్రాంతం మ్యాప్
ఫొటో క్యాప్షన్, విమానాశ్రయ ప్రాంతం మ్యాప్

'భోగాపురంలో కొనడానికి భూమే లేదు'

ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగి మూడేళ్లైనా నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి భోగాపురం చుట్టూ పక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం జోరందుకుంది.

"ఎయిర్ పోర్ట్ రాకముందు భోగాపురం హైవేకి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఎకరా రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎకరా రూ. 2 కోట్లు పలుకుతోంది. హైవే సమీపంలో అయితే ఎకరా ధర సుమారు రూ. 10 కోట్లు ఉంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రకటించడంతో ఈ ధరలు మరింత పెరిగాయి.

అయితే ప్రస్తుతానికి భోగాపురంలో స్థానిక రైతులు వద్ద భూమి లేదు. అంతా పెట్టుబడులు కోసం కొనుకున్నవారి వద్దే ఉంది. భోగాపురంలో ఉన్న రిసార్టులైతే మరెక్కడ ఉండవు. రియల్ ఎస్టేట్ వెంచర్లైతే లెక్కకు కూడా అందవు" అని రియల్ ఎస్టేట్ వ్యాపారి కొల్లి రామారావు బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం.. మిగతా ప్రాంతమంతా అడవే...

'భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృధ్ది'

వన్‌ డిస్ట్రిక్ట్‌ - వన్‌ ఎయిర్‌పోర్టు పేరుతో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలని.. ముందుగా విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ పనులను ప్రారంభించాలని కొద్ది రోజుల క్రితం పోర్టులు, ఎయిర్ పోర్టులు అంశంపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

"వన్‌ డిస్ట్రిక్ట్‌ - వన్‌ ఎయిర్‌పోర్టు కాన్పెప్ట్‌లో భాగంగా ఏపీలో ఎయిర్‌పోర్టులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, కడప జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి.

మరికొన్ని విమానాశ్రయాల కోసం ప్రభుత్వం ఎప్పటి నుంచో చర్చలు జరుపుతోంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం రక్షణశాఖ ఆధీనంలో ఉంది.

విశాఖ ఎయిర్ పోర్టును భోగాపురానికి తరలించడం ద్వారా విశాఖ విమానాశ్రయాన్ని కేవలం రక్షణ అవసరాలకు పరిమితం చేయవచ్చు. అదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి ద్వారా ఉత్తరాంద్రలోని మిగిలిన రెండు జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి." అని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)