అనంతపురం - ధర్మవరం: స్నేహలత హత్య కేసు నిందితులకు ‘దిశ’ చట్టం ఎందుకు వర్తించడం లేదు ?

అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే యువతి హత్యకు గురైంది

ఫొటో సోర్స్, RAMOJI HANUMANTHACHARI

ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే యువతి హత్యకు గురైంది
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

సంచలనం సృష్టించిన ధర్మవరం యువతి స్నేహలత హత్య కేసును ‘దిశ’ చట్టం కింద విచారించే అవకాశం కనిపించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులో మార్పులు సూచిస్తూ కేంద్రం దాన్ని వెనక్కి పంపడంతో ఆ చట్టం కింద విచారించడం సాధ్యంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అయితే సర్కారు వైఫల్యంవల్లే ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపించగా, ‘దిశ’ చట్టం లేకపోయినాఇలాంటి కేసుల విచారణ సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఘటనా స్థలంలో పోలీసులు
ఫొటో క్యాప్షన్, ఘటనా స్థలంలో పోలీసులు

అనంతపురంలో మరో ‘దిశ’

అనంతపురం జిల్లాలో జాతీయస్థాయి జూనియర్స్ హాకీ ప్లేయర్ స్నేహలత హత్య కలకలం రేపింది. మంగళవారం రాత్రి, ధర్మవరం శివార్లలో స్నేహలతను హత్యచేసి, మృతదేహానికి నిప్పంటించారు.

ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని చెబుతున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల నిర్లక్ష్యమే బాధితురాలి ప్రాణం తీసిందని దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, స్నేహలత హత్యపై ఆమె తల్లి ఏమంటున్నారు? పోలీసుల వాదన ఏమిటి?

అసలేం జరిగింది?

డిసెంబర్ 23న ధర్మవరం సమీపంలో ఓ యువతి మృతదేహం తగలబడుతోందని పోలీసులకు సమాచారం అందింది.

మృతురాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మవరం బ్రాంచిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి స్నేహలత అని ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు గుర్తించారు.

స్నేహలత అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీలో హాకీ నేర్చుకున్నారు. హాకీ ఆటలో ప్రతిభ కనబర్చి, ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

తమ కూతురు కనిపించడంలేదని అంతకు ముందురోజు రాత్రే, అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని స్నేహలత తల్లిదండ్రులు చెబుతున్నారు.

స్నేహలతను వేధిస్తున్నాడంటూ రాజేష్‌పై పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, వారి నిర్లక్ష్యమే తమ కుమార్తె ప్రాణం తీసిందని తల్లి రోదిస్తున్నారు.

హత్య జరిగిన మర్నాడు డిసెంబర్ 24న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి స్నేహలత కుటుంబాన్ని పరామర్శించారు.

ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

స్నేహలత హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాల నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారు. పలకరింపులతో ప్రయోజనం లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులు ఏమంటున్నారు?

స్నేహలతను రాజేష్ వేధిస్తున్నాడన్న విషయం తమ దృష్టికి రాలేదని అనంతపురం వన్‌టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి మీడియాతో అన్నారు. స్నేహలత తల్లిదండ్రులు, హత్యజరిగిన ముందురోజు మాత్రమే స్టేషన్‌కు వచ్చి, తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు.

ఏడాదిగా స్నేహలత, రాజేష్‌ ప్రేమించుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజుల ముందు స్నేహలత తనకు ఎస్బీఐలో ఉద్యోగం వచ్చాక, అప్పటికే చెడు అలవాట్లున్న రాజేష్‌ను దూరం పెట్టిందని సీఐ ప్రతాప్ రెడ్డి అన్నారు.

దీంతో ఆమెపై కోపంగా ఉన్న రాజేష్... డిసెంబర్ 23 సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తున్న స్నేహలతను అనంతపురంలో దిగబెడతానని చెప్పి బైక్‌ ఎక్కించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ధర్మవరం శివార్లలోని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు తెలుస్తోంది అయితే, స్నేహలతపై అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలిందని సీఐ ప్రతాప్ రెడ్డి అన్నారు.

స్నేహలత తల్లిని ఓదారుస్తున్న కలెక్టర్ చంద్రుడు

నిందితుల అరెస్ట్

ప్రధాన నిందితుడు రాజేశ్‌తోపాటు, అతనికి సహకరించిన స్నేహితుడు కార్తీక్‌ని కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

నిందితులు వినియోగించిన అపాచీ బైక్‌, 4 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ధర్మవరం మండలం బడన్నపల్లి సమీపంలోని పొలాల్లో మంగళవారం రాత్రి స్నేహలతను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

నిందితులు స్నేహలతను ధర్మవరం నుంచి అపాచీ వాహనంపై ఘటనాస్థలానికి తీసుకొచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ హత్యపై ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఐపీసీ సెక్షన్లు 201, 302, 34తోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(2)(V) కింద కేసులు నమోదయ్యాయి.

వాసిరెడ్డి పద్మ
ఫొటో క్యాప్షన్, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.

‘నిందితులకు కఠిన శిక్షలు తప్పవు’

“జాతీయ స్థాయిలో హాకీ ఆడిన క్రీడాకారిణి బ్యాంకు ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వస్తుందని ఆశిస్తే ఇలాంటి దారుణం జరగడం బాధాకరం. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు ” అన్నారు ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. బాధితురాలి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

24 గంటల్లో అరెస్టులు, వారం రోజుల్లో ఛార్జిషీట్ల నమోదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిశ చట్టం వచ్చిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి. ఎవరినీ ఉపేక్షించం’’ అన్నారు వాసిరెడ్డి పద్మ.

అసలు ‘దిశ’ చట్టం ఉందా?

పోలీసులు ఐపీసీ సెక్షన్లతో పాటు.. మృతురాలు దళిత వర్గానికి చెందిన యువతి కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

అయితే ఈ కేసులో ఎక్కడా ‘దిశ’ చట్టం ప్రస్తావన లేదు.

వాస్తవానికి ఏపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ 13న ‘దిశ’ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది.

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఉదంతం తర్వాత ఈ బిల్లుని రూపొందించారు. మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14రోజుల్లోనే విచారణ పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.

సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్లలో పలుమార్పులను ఈ బిల్లులో పొందుపరిచారు.

ఏపీకి మాత్రమే వర్తించేలా 354E, 354G సెక్షన్లను చేర్చారు.

నిందితులను కఠినంగా శిక్షించేలా ఈ మార్పులు చేసినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

జగన్

ఫొటో సోర్స్, facebook

‘దిశ’ బిల్లు ఎందుకు చట్టం కాలేదు?

ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ చట్టం ప్రకారం ఐపీసీలో మార్పులు చేయాల్సి ఉండడంతో దానికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా మారింది.

అందుకు అనుగుణంగానే ఏపీ దిశ యాక్ట్-2019 ని కేంద్రాన్ని పంపించారు.

‘ఒక్క రాష్ట్రం కోసం ఇండియన్ పీనల్ కోడ్ మార్చలేరు’

కానీ ఏపీ ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులకు కేంద్రం సుముఖంగా లేదని, అందుకే అక్టోబర్‌లో ఆ బిల్లును కేంద్రం వెనక్కి పంపిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇది చట్టం కావడానికి ఇంకా చాలా ప్రక్రియ ఉందంటున్నారు.

“ ఏపీ దిశ చట్టంలో అనేక మార్పులున్నాయి. ఐపీసీ సెక్షన్‌ 354కి అదనంగా జోడించిన సెక్షన్ల అమలుకు కేంద్రం అంగీకరిస్తే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అలాంటి డిమాండ్‌లు వస్తాయి.

అప్పుడు ఐపీసీ సెక్షన్లే ప్రశ్నార్థకం అవుతాయి.

కాబట్టి దేశమంతా అమలులో ఉన్న చట్టాలను ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా మార్చాలనే ప్రతిపాదనకు కేంద్రం ససేమీరా అంటోంది’’ అని సీనియర్ న్యాయవాది ఎం.వెంకటేశ్వరరావు బీబీసీతో అన్నారు.

“ఇప్పుడు కేంద్రం వెనక్కి పంపించిన బిల్లుని మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లాలి. దానిలో సవరణలను ఆమోదించాలి.

ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపించాలి. అప్పుడు వారు అంగీకరిస్తేనే అది చట్టం రూపందాల్చుతుంది.

కానీ ఐపీసీలో మార్పులు అంత సులువుకాదు’’ అని వెంకటేశ్వరరావు వివరించారు.

ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందిన 'దిశ' చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది

ఫొటో సోర్స్, aplegislature.org

ఫొటో క్యాప్షన్, ఏపీ అసెంబ్లీ ఆమోదం పొందిన 'దిశ' చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంది

ఏపీ ప్రభుత్వం చేసిన మార్పులేంటి ?

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా యాక్ట్‌ -2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్ట్‌ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనెస్ట్‌ విమెన్ అండ్‌ చిల్డ్రన్‌ యాక్ట్‌-2019గా పేర్కొన్న వాటి ప్రకారం ఇందులో అనేక కీలక మార్పులు ఉన్నాయి.

  • 14 రోజుల్లోపే విచారణ పూర్తి, 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు.
  • పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదు లేదా ఉరి శిక్షకూ అవకాశం ఉంది.
  • సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించడానికి ఐపీసీలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు.
  • ఈ చట్టం ప్రకారం మొదటి అపరాధానికి రెండేళ్లు, రెండో అపరాధానికి నాలుగేళ్ల శిక్ష పడుతుంది.
  • పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారి విషయంలో దర్యాప్తును ఏడురోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తి చేసేలా చట్టం తయారు చేశారు.
  • దేశంలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాలను త్వరితగతిన విచారించేందుకు వీలుగా, ప్రతి జల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు చట్టం సిద్ధం చేశారు.
  • ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువు ఐపీసీలో ఆరు నెలలు ఉండగా, ఏపీ చట్టంలో దాన్ని3 నెలలకు తగ్గించారు

సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు.

అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.

మహిళలు, పిల్లలపై నేరాలను నమోదు చేసేందుకు డిజిటిల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడం ద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేసేందుకు వీలు కల్పించారు.

నిలదీస్తున్న దళిత సంఘాలు
ఫొటో క్యాప్షన్, నిలదీస్తున్న దళిత సంఘాల నాయకులు

చట్టం అమలు కాకున్నా ఏర్పాట్లు చేశామంటున్న ప్రభుత్వం

కేంద్రం ఆమోద ముద్ర వేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం ‘దిశ’ చట్టంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే చట్టం అమలులోకి రాకపోయినా పలు ఏర్పాట్లు చేసి మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

ఇటీవల ఏపీలో మహిళలపై దాడులు తగ్గాయని కూడా ఆయన వెల్లడించారు.

“2019తో పోలిస్తే 2020లో మహిళలపై దాడులు 7.5శాతం మేరకు తగ్గాయి.

దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

దిశ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే మహిళలు ఫిర్యాదు చేసుకునే అవకాశం వచ్చింది.

మహిళపై దాడుల కేసుల విచారణకు 2018లో ఒక్కో కేసుకు 119 రోజులు పట్టగా, 2019లో 101 రోజులకు, 2020లో ఒక్కో కేసును సగటున 53 రోజులలో విచారణ పూర్తి చేశాం.

ఇంకా వేగంగా విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

‘ప్రభుత్వ వైఫల్యాల వల్లే’

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ‘దిశ’ బిల్లు చట్టంగా మారకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

“ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే రాష్ట్రంలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారు. వేధింపులపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లే ఈ అఘాయిత్యం జరిగింది.

ఘటన జరిగి 24గంటలు గడిచినా ప్రభుత్వంగానీ, పోలీసులుగానీ ఎందుకు స్పందించలేదు ? మహిళా హోంమంత్రి ఎక్కడున్నారు ?

రాష్ట్రంలో మహిళా కమిషన్ పనిచేస్తోందా? ప్రకటనలకు తప్ప ప్రజలకు రక్షణ కల్పించలేని చట్టాలను జగన్‌ ప్రభుత్వం చేస్తోంది.

ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారాలి’’ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీబీసీతో అన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)