బహదూర్ షా జఫర్: కేవలం 100 మందితో వచ్చిన బ్రిటిష్ జనరల్ ఒక మొఘల్ చక్రవర్తిని ఎలా లొంగదీసుకున్నారు

బహదూర్ షా జఫర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బహదూర్ షా జఫర్
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1857వ సంవత్సరం.. బ్రిటిషర్లు దిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను నిర్బంధించడానికి కెప్టెన్ విలియం హడ్సన్ సుమారు 100 మంది సైనికులతో బయలుదేరారు.

హడ్సన్ సేన హుమయూన్ సమాధి చేరుకుంది. హడ్సన్‌కు దిల్లీ వీధుల్లో తిరుగుబాటుదారులు కాల్పులు జరపవచ్చనే భయం కలిగింది. వెంటనే సమాధి పక్కన శిథిలాల్లో దాక్కున్నారు.

1857 తిరుగుబాటు గురించి అమర్‌పాల్ సింగ్ రాసిన పుస్తకం 'ది సీజ్ ఆఫ్ ఢిల్లీ' గత ఏడాది పబ్లిష్ అయింది. ప్రస్తుతం అమర్‌పాల్ సింగ్ లండన్‌లో ఉంటున్నారు.

బహదూర్ షా జాఫర్‌ నిర్బంధం గురించి అమర్‌పాల్ సింగ్ ఇలా వివరించారు.

"సమాధి భవనం ప్రధాన ద్వారం నుంచి వెళ్లి మహారాణి జీనత్ మహల్‌ను కలవమని, బహదూర్ షా జాఫర్‌ను లొంగుబాటుకు సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తూ తన ప్రతినిధులైన మౌల్వీ రజబ్ అలీ, మీర్జా ఇలాహి బక్ష్‌లను పంపారు హడ్సన్.

The Sieze of Delhi

ఫొటో సోర్స్, HarperCollins

చక్రవర్తి జాఫర్‌ ఎదురు దాడికి దిగిన సూచనలేమీ కనిపించలేదు. ఓ రెండు గంటల పాటు ఎలాంటి సమాచారం రాకపోయేసరికి తన ప్రతినిధులను లోపలే చంపేసి ఉంటారని హడ్సన్ ఊహించారు.

మరి కొద్దిసేపటికి వాళ్లిద్దరూ బయటకు వచ్చారు. చక్రవర్తి జాఫర్, హడ్సన్ ముందు మాత్రమే లొంగుతారని, అది కూడా తన ప్రాణాలను కాపాడతానని జనరల్ ఆర్చ్‌డేల్ విల్సన్ చేసిన వాగ్దానాన్ని ఖాయం చేస్తేనే లొంగిపోతానన్నారనే సందేశం తీసుకువచ్చారు."

అయితే, బహదూర్ షా జాఫర్ ప్రాణాలకు భయం లేదని ఎవరు ఎప్పుడు మాటిచ్చారనే విషయంపై ఆంగ్లేయుల శిబిరంలో గందరగోళం నెలకొంది.

మరోవైపు, పెద్ద, చిన్న స్థాయిలలో తేడా లేకుండా విద్రోహులు లొంగిపోవాలనుకుంటే ఎలాంటి షరతులు, పరిమితులు ఉండకూడదని గవర్నర్ జనరల్ ఆదేశాలు మొదటి నుంచి అమలులో ఉన్నాయి.

ఆంగ్లేయుల చొరబాటు

మొదట ఆంగ్లేయులు దిల్లీని స్వాధీనం చేసుకున్నరన్న వార్త వినగానే, రాజ భవనం విడిచి బయటకు రాకూడదని బహదూర్ షా జాఫర్ నిర్ణయించుకున్నారు.

1857 సెప్టెంబరు 16న బ్రిటిష్ సైన్యం, కోటకు కొన్ని వందల గజాల దూరంలో ఉన్న తిరుగుబాటుదారుల స్థావరాలను ముట్టడించిందని, తమ సైనికుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాళ్లు కోటలోకి ప్రవేశించే సాహసం చేయట్లేదనే వార్త చక్రవర్తి జాఫర్‌కు అందింది.

దాంతో, సెప్టెంబరు 19న తన పరివారం, సిబ్బందితో కలిసి రాజ భవనాన్ని విడిచిపెట్టి అజ్మేరీ గేటు నుంచి పురానా ఖిలా (పాత కోట)కు తరలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు జాఫర్.

అయితే, సెప్టెంబరు 20న జాఫర్ పురానా ఖిలా నుంచి బయలుదేరి హుమాయూన్ సమాధి చేరుకున్నారని గూఢచారుల ద్వారా ఆంగ్లేయులకు సమాచారం అందింది.

ఇక్కడ ఒక సందేహం రావొచ్చు. ఒకవైపు ఆంగ్లేయులు తిరుగుబాటుదారులను నిర్దయగా ఉరితీస్తూ, చక్రవరిని మాత్రం ప్రాణాలతో విడిపెట్టడానికి ఎందుకు అంగీకరించారు?

"ఒకటి, బహదూర్ షా జాఫర్ వృద్ధుడు, ఈ తిరుగుబాటుకు ఆయన కేవలం నామమాత్రపు నాయకుడు. రెండు, ఆంగ్లేయులు దిల్లీని తిరిగి స్వాధీనం చేసుకోగలిగారుగానీ మిగతా ఉత్తర భారతదేశంలో పలుచోట్ల యుద్ధాలు ఇంకా జరుగుతున్నాయి. చక్రవర్తి ప్రాణాలు తీస్తే తిరుగుబాటుదారులను రెచ్చగొట్టినట్లు అవుతుందనే భయం ఆంగ్లేయులకు ఉంది. అందుకే, లొంగిపోతే ప్రాణాలకు ముప్పు తలపెట్టమని విల్సన్ చక్రవర్తికి హామీ ఇచ్చారు" అని అమర్‌పాల్ సింగ్ వివరించారు.

బహదూర్ షా జఫర్

ఫొటో సోర్స్, Getty Images

బహదూర్ షా జాఫర్ తన ఆయుధాలను హడ్సన్‌కు అప్పగించారు

విలియం హడ్సన్ తన పుస్తకం 'ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ది సోల్జర్స్ లైఫ్ ఇన్ ఇండియా'లో ఈ విషయాలను వివరించారు.

"ఒక బ్రిటిష్ అధికారి తన సోదరుడికి రాసిన లేఖలో ఇలా రాశారు. సమాధి భవనం నుంచి మొదట మహరాణి జీనత్ మహల్ బయటకు వచ్చారు. తరువాత, పల్లకీలో చక్రవర్తి జాఫర్ వచ్చారు."

హడ్సన్ ముందుకొచ్చి, ఆయుధాలు పడవేయమని చక్రవర్తిని ఆదేశించారు.

"మీరేనా హడ్సన్ అంటే? ఆంగ్లేయులు నాకిచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెడతారా?" అని జాఫర్ అడిగారు.

"అవును, నేనే. మీ ఆయుధాలు పడవేసినట్లయితే, మీకు, జీనత్ మహల్, ఆమె కుమారుడికి ప్రాణభిక్ష పెడతామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. కానీ, మీరు పారిపోవాలని ప్రయత్నిస్తే ఇక్కడే మిమ్మల్ని కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తాను" అన్నారు హడ్సన్.

వెంటనే జాఫర్ తన ఆయుధాలను హడ్సన్‌కు అప్పగించారు.

జనరల్ విల్సన్

ఫొటో సోర్స్, PENGUIN BOOKS

ఫొటో క్యాప్షన్, జనరల్ విల్సన్

నేల చూపులు చూస్తున్న చక్రవర్తి

చక్రవర్తి జాఫర్‌ను మొదట బేగం సమ్రు ఇంట్లో ఉంచారు. హెచ్ఎం 61కు చెందిన 50 మంది సైనికులను ఆయనకు కాపలాగా ఉంచారు.

జాపర్‌కు కాపలాగా పెట్టిన అధికారుల్లో కెప్టెన్ చార్లెస్ గ్రిఫిత్ కూడా ఉన్నారు. ఆయన 'ది నెరేటివ్ ఆఫ్ ది సీజ్ ఆఫ్ ఢిల్లీ' అనే పుస్తకం రాశారు.

"మొఘల్ రాజవంశానికి చివరి ప్రతినిధి బయట వసారాలో ఒక మామూలు మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నారు. ఆయన తెల్లటి గడ్డం పొడుగ్గా గుండెల వరకు పెరిగింది తప్పితే ఆయన ముఖంలో ఎలాంటి వెలుగూ లేవు. 80 ఏళ్ల చక్రవర్తి తెల్లటి దుస్తులు ధరించారు. తెల్లటి తలాపాగా చుట్టుకున్నారు. నెమలీకలతో చేసిన విసరకర్రలు విసురుతూ ఇద్దరు సేవకులు ఆయన వెనుక నిల్చుని ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారు. నేల చూపులు చూస్తూ ఉన్నారు.

ఆయనకు మూడడుగుల దూరంలో మరో మంచం మీద ఒక బ్రిటిష్ అధికారి కూర్చుని ఉన్నారు. ఇరువైపులా ఇద్దరు బ్రిటిష్ సైనికులు నిలబడ్డారు. చక్రవర్తిని తప్పించే ప్రయత్నాలు జరిగితే వెంటనే ఆయన్ను తుపాకీతో కాల్చి చంపమని ఆ అధికారికి ఆదేశాలు అందాయి" అని గ్రిఫిత్ రాశారు.

చక్రవర్తి జాఫర్‌ను నిర్బంధించాక, సెప్టెంబర్ 22న హుమయూన్ సమాధి భవనంలో మిలిగిన రాజ పరివారాన్ని ఏం చేయాలో జనరల్ విల్సన్ నిర్ణయించుకోలేకపోయారు. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి ముందే అదుపులోకి తీసుకోవాలని హడ్సన్ అభిప్రాయపడ్డారు.

ఆ రాజ పరివారంలో తిరుగుబాటుదారుల దళంలో ప్రముఖులైన మీర్జా మొఘల్, ఆయన కుమారుడు మీర్జా అబూబక్ర్, మీర్జా ఖిజ్ర్ సుల్తాన్ ఉన్నారు.

జనరల్ విల్సన్ అనుమతితో, లెఫ్టినెంట్ మెక్‌డావెల్ సహాయంతో 100 మంది సైనికులతో ఒక దళాన్ని ఏర్పాటుచేశారు హడ్సన్. ఈ బృందం గుర్రాలపై హుమాయూన్ సమాధి చేరుకుంది.

చక్రవర్తి మేనల్లుడిని, మరొక కుటుంబ సభ్యుడిని తనతో తీసుకెళ్లారు హడ్సన్. మిగత పరివారమంతా ఆయుధాలు విడిచిపెట్టి తమకు లొంగిపోతే ప్రాణ భిక్ష పెడతామని, వాళ్లని ఒప్పించే పని మీదేనని వాళ్లిద్దరితో మంతనాలు జరిపారు.

ఎన్నో ప్రయత్నాల తరువాత మిగిలిన రాజ కుమారులు, పరివారం ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయారు.

మహారాణి జీనత్ మహల్

ఫొటో సోర్స్, Getty Images

ముగ్గురు రాకుమారులను కాల్చి చంపారు

ఈ పనంతా చక్కబెట్టుకుని వెనుదిరిగారు హడ్సన్, మెక్‌డావెల్.

"దిల్లీకి అయిదు మైళ్ల దూరంలో ఉండగా, ఈ యువరాజులను ఏం చేయాలని హడ్సన్, మెక్‌డావెల్ చర్చించుకున్నారు. వాళ్లని ఇక్కడే చంపేయాలని మెక్‌డావెల్ అన్నారు. అక్కడే గుర్రాలు నిలిపి, ముగ్గురు యువరాజులను దిగమని చెప్పి, బట్టలు విప్పమన్నారు. తిరిగి వాహనం పైకి ఎక్కించారు. వారి దగ్గర ఉన్న నగలు, ఉంగరాలు, రత్నాలు పొదిగిన కత్తులు లాక్కున్నారు. వాహనానికి ఇరువైపులా పదిమంది సైనికులను మోహరించారు హడ్సన్. తన గుర్రంపై నుంచి దిగి ముగ్గురు రాజకుమారులను రెండేసి సార్లు తుపాకీతో కాల్చారు. వాళ్లు అక్కడికక్కడే మరణించారు" అని అమర్‌పాల్ సింగ్ చెప్పారు.

హడ్సన్ అంతకు తెగిస్తారని రాకుమారులు ఊహించి ఉండరు. బట్టలు విప్పి తమను ఊరేగించి అవమానిస్తారని భావించి ఉండవచ్చు. కానీ, హడ్సన్ వారిని కాల్చి చంపారు.

ఆ తరువాత కొద్దిసేపటికి చక్రవరి దగ్గర పనిచేసే ఒక హిజ్రా, మరొక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించారు. మెక్‌డావెల్ తన సైన్యంతో వారిని వెంబడించి పట్టుకుని చంపేశారు.

"రాకుమారుల మృతదేహాలను తీసుకుని నగరంలోకి ప్రవేశించారు హడ్సన్. ప్రజలు వారి దుస్థితిని చూసేలా ఒక బహిరంగ ప్రదేశంలో వారిని పడుకోబెట్టారు. వాళ్ల ఒంటి మీద బట్టలు లేవు. కొన్ని గుడ్డ ముక్కలతో మర్మాంగాలను మాత్రం కప్పారు. సెప్టెంబర్ 24 వరకు వారి మృతదేహాలు అక్కడే ఉన్నాయి. నాలుగు నెలల క్రితం వారు మా స్త్రీలను ఇదే ప్రదేశంలో హత్య చేశారు" అని మెక్‌డావెల్ రాశారు.

"మన ఆడవాళ్లను, పిల్లలను చంపినది వీళ్లే. వీరికి ప్రభుత్వం శిక్ష విధించింది అని ప్రజలకు చెప్పాను. వాళ్లని నేనే స్వయంగా చంపేశాను. వాళ్ల మృతదేహాలను చాందినీ చౌక్‌లో ఉన్న కొత్వాలి వేదికపై పడవేయమని నేనే ఆదేశించాను. నేను నిర్దయుడిని కాను. కానీ, వీరిని ప్రాణాలతో చంపడంలోని ఆనందాన్ని అనుభవించాననే చెప్పాలి" అంటూ హడ్సన్ తన సోదరుడికి రాసిన ఉత్తరంలో తెలిపారు.

రెవరెండ్ జాన్ రాటెన్ తన పుస్తకం 'ది చాప్లిన్స్ నేరేటివ్ ఆఫ్ ది సీజ్ ఆఫ్ ఢిల్లీ'లో ఈ సంగతులను వివరిస్తూ, "పెద్ద రాకుమారుడు ధృడమైనవాడు. రెండోవాడు ఆయన కంటే కాస్త చిన్నవాడు. మూడోవాడికి ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. వారి మృతదేహాలను మూడు రోజుల పాటు అలాగే ఉంచి, తరువాత అవమానకర రీతిలో స్మశానంలో పూడ్చిపెట్టారు. అంతకు కొన్ని నెలల ముందు బ్రిటిష్ వారి పరివారాన్ని చంపినందువల్లే, వారిపై అంత కక్ష సాధించారు" అని రాశారు.

సెప్టెంబరు 27న, మిగిలిన రాకుమారులను పట్టుకోవడానికి బ్రిగేడియర్ షావర్స్‌ను సైన్యంతో పంపారు. అదే రోజు షావర్స్ మరో ముగ్గురు యువరాజులు మీర్జా బక్తావర్ షా, మీర్జా మెండు, మీర్జా జవాన్ భక్త్‌లను నిర్బంధించారు.

అక్టోబర్ ప్రారంభంలో మరో ఇద్దరు రాకుమారులను బంధించి, కాల్చి చంపారు. వారిద్దరూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ వారిపై హత్యాకాండకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. వీరిని కాల్చి చంపమని ఫైరింగ్ స్క్వాడ్‌ను ఆదేశించారు. 60 మంది రైఫుల్ జవాన్లు, కొంతమంది గూర్ఖా సైనికులు కలిసి వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. చిత్రంగా రాకుమారులకు ఒక్క బుల్లెట్ కూడా తగల్లేదు.

దాంతో, ఒక ప్రొవోస్ట్ సార్జెంట్ ఆ యువరాజుల తలలకు గురిపెట్టి కాల్చి చంపాడు.

హడ్సన్‌కు లొంగిపోయిన బహదూర్ షా జఫర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హడ్సన్‌కు లొంగిపోయిన బహదూర్ షా జఫర్

సిక్కు రిసల్దారు ఇద్దరు రాకుమారులను రక్షించారు

అయితే, బహదూర్ షా జాఫర్ ఇద్దరు కుమారులు మీర్జా అబ్దుల్లా, మీర్జా క్వాయిష్ బ్రిటిష్ వారి నుంచి తప్పించుకోగలిగారు.

అర్ష్ తైమూరీ రాసిన 'కిలా ఎ మూల్లా కి ఇలాకియా ' పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించారు.

"ఈ ఇద్దరు రాకుమారులను హుమయూన్ సమాధి భవనంలోనే ఉంచి ఒక సిక్కు రిసల్దారును కాపలాగా పెట్టారు. ఆ రిసల్దారుకు ఈ రాకుమారుల మీద జాలి కలిగింది. బ్రిటిష్ వారు తిరిగొచ్చేలోగా మీరిద్దరూ పారిపోండి అని ఆయన వారిని పంపించేశారు. ఊపిరి తీసుకోవడానికి కూడా అగొద్దు, ఏదో ఒక దేశానికి పారిపోండి అని చెప్పి పంపించారు. రాకుమారులిద్దరూ చెరొకవైపూ పరిగెత్తారు."

మీర్ క్వాయిష్ ఫకీర్ వేషంలో ఉదయపూర్ చేరుకోగలిగారు. అక్కడి మహారాజు ఆయన్ను కాపాడి, రోజుకు రెండు రూపాయల వేతనంతో తన సభలో ఉద్యోగం ఇచ్చారు. క్వాయిష్ కోసం హడ్సన్ తీవ్రంగా గాలించారు. కానీ, ఫలితం లేకపోయింది.

మీర్జా అబ్దుల్లా కూడా ఆంగ్లేయులకు చిక్కలేదు. కానీ, తరువాతి జీవితమంతా టోంక్ రాజ్యంలో అత్యంత పేదరికంలో గడిపారు.

బహదూర్ షా జాఫర్ మిగిలిన కుమారుల్లో కొంతమందిని ఉరి తీశారు. కొంతమందికి జీవిత ఖైదు విధించి కాలా పానీ జైలుకు పంపారు. కొందరు రాకుమారులను ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్ జైళ్లలో బంధించి చిత్రహింసలు పెట్టారు. వీరిలో చాలామంది రెండేళ్లల్లో ప్రాణాలు విడిచారు.

ఆంగ్లేయులు బహదూర్ షా జాఫర్‌ను చంపలేదు. దిల్లీకి దూరంగా బర్మా పంపించారు. అక్కడ 1862 నవంబర్ 7 ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)