Dalit Bandhu: ఆ 100 మందిని ఎలా ఎంచుకుంటున్నారు? లబ్ధిదారుల ఎంపికలో అక్రమాల ఆరోపణలు ఎందుకొస్తున్నాయి?

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతోంది. నియోజకవర్గానికి వంది మందిని దళిత బంధుకు ఎంపిక చేయాల్సి ఉండగా, ఆ వంద మందినీ ఎవరు ఎలా ఎంపిక చేస్తారన్న విషయం వివాదంగా మారుతోంది.
'దళిత బంధు' పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల నగదును బ్యాంకులో వేస్తారు.
మొదటి దశలో తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 11,900 మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావించింది.
ఇందుకోసం ఇప్పుడు 1200 కోట్లు కేటాయించినట్టు, రాబోయే మూడు నాలుగేండ్లలో రూ.35 - 40 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
కుల వివక్ష పోరాట సమితి అంచనా ప్రకారం రాష్ట్రంలో 18 లక్షలకు పైగా దళిత కుటుంబాలు ఉండగా, వారందరికీ దళిత బంధు ఇవ్వడానికి రూ. 1 లక్షా 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనంగానే ఇస్తామని కేసీఆర్ ఒక సందర్భంలో ప్రకటించారు.
నిజానికి హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈ పథకం ప్రకటించారు. అక్కడి నుంచే దీన్ని మొదలు పెట్టాలి అనుకున్నారు. అయితే ఈ పథకం ప్రకటన సమయం నుంచీ అనేక విమర్శలు వచ్చాయి.
ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ప్రకటించడంతో, ఆ ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడగానే అందరూ చూశారు.
పథకం విధి విధానాలు, నిధులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎన్నడూ లేనిది, ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించి ఈ స్కీమ్ గురించి వివరించారు.
ఈ పథకాన్ని ముందుగా భావించినట్టు హుజూరాబాద్ నుంచి కాకుండా, ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు.
ఆ తరువాత హుజురాబాద్, ఖమ్మంలోని చింతకాని, సూర్యాపేటలోని తిరుమలగిరి, నాగర్ కర్నూల్ లోని చరగొండ, కామారెడ్డిలోని నిజాంసాగర్ మండలాలలో మొదలుపెట్టారు.
దీనిని మరింత విస్తరిస్తూ అన్ని నియోజకవర్గాలలో, నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి నాటికి ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఫొటో సోర్స్, FB/TELANGANA CM0
అసలు సమస్య ఎక్కడ?
సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా లబ్ధిదారుల ఎంపిక కోసం కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఎంపిక జరగాలి. కానీ దళిత బంధుకు ఏ మార్గదర్శకాలూ లేవు.
దీంతో ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్థానిక రాజకీయ, అధికారుల విచక్షణపై, పూర్తిగా వారి చేతల్లోకి వెళ్లిపోయింది.
ఉమ్మడి మహబూబనగర్ జిల్లాలోని గండీడ్ మండల్ వెన్నచెడ్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల వెంకట రాములు దళిత బంధు తనకి వస్తుంది అని ఆశపడ్డారు.
కనీసం తనకి కాకపోయినా, అర్హులయిన నిరుపేద కుటుంబం వారికైనా వస్తుందేమో అనుకున్నారు. కానీ వారి ఊరి నుంచి ఎంపికైన వారి పేర్లు చూసి ఆశ్చర్యపోయారు.
"మా మండలంలో దళిత బంధు కోసం పేర్లు ఇచ్చిన వారిలో ఒక ఎంపీటీసీ భర్త కూడా ఉన్నారు. పేర్లు ఇచ్చిన ఇతర కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, కాంట్రాక్టులో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అనుచరులు, వారికి దగ్గర మనుషులను ఎంపిక చేసారు. వారి పేర్లనే ఎమ్మెల్యే కలెక్టర్ కి పంపారు. ఉదాహరణకు ఒక్క మా ఊరిలోనే 21 దళిత కుటుంబాలకు ఒక్క సెంటు భూమి కూడా లేదు. కానీ వారిలో ఎవరూ దళిత బంధుకు ఎంపిక కాలేదు'' అని రాములు బీబీసీతో చెప్పారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, కోస్గి మండలం లోని దోరేపల్లి గ్రామం లోని దళిత వాడలో ఐదుగురిని ఎంపిక చేసారు. అయితే వారిలో నలుగురు అధికార టీఆర్ఎస్ పార్టీకి బాగా తెలిసిన వారు, ఆస్తులు ఉన్న వారు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పేదరికంలో ఉన్నవారిని కాదని, వారిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు.
అలాగే జగిత్యాలలోని గోదూరులో కూడా పేదలకు కాకుండా అనర్హులకు అవకాశం ఇస్తున్నారని అక్కడ కొందరు దళితులు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టి బొమ్మ దహనం చేసారు.
గత కొన్ని రోజులుగా లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో పర్యటిస్తున్న నేతలు, అధికారులకు, పలువురు దళితుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది.

ఫొటో సోర్స్, https://cm.telangana.gov.in/
ఎంపిక చేయాల్సింది ఎవరు?
ఇదే ప్రశ్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ని అడిగింది బీబీసీ. " దీని కోసం కమిటీ ఉంది, అందులో ఎమ్మెల్యే లు, కలెక్టర్లు ఉంటారు, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీ, అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ కూడా ఉంది. వీరంతా కలసి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే వారికి మార్గదర్శకాలు ఏమి లేవు. నిరుపేద కుటుంబాలు, 65 ఏళ్ల లోపు వారిని ఎంపిక చేయమని చెప్పాం" అని మంత్రి వివరించారు.
ప్రభుత్వం ఈ విషయంలో ఒక రకంగా స్థానిక నాయకత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది. దాన్ని ఒక్కొక్కరూ ఒక్కలా ఉపయోగిస్తున్నారు.
చాలామంది ఎమ్మెల్యేలు, ప్రతీ గ్రామం నుంచీ కొందరిని ఎంపిక చేస్తే సమస్య రావచ్చన్న ఉద్దేశంతో మొత్తం లబ్ధిదారులను ఒకటీ లేదా రెండు గ్రామాల నుంచే ఎంపిక చేస్తున్నారు.
స్థానికంగా దళితుల్లో మాల, మాదిగలతో కలిపి కమిటీలు వేస్తారు. గ్రామానికి ఆరుగురు, మండలానికి, నియోజకవర్గానికి 15 మంది, జిల్లాకు 24 మందితో కమిటీలు వేస్తారు. ఈ కమిటీలు పేర్లను వెరిఫై చేస్తాయి.
ఎస్సీ కార్పొరేషన్ లో ఐదేళ్ల లోపు లోన్ తీసుకున్న వారు, ఒంటరి మహిళలు దీనికి అనర్హులు. నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారి ఉంటారు. జాబితా ఎమ్మెల్యే పంపితే కలెక్టర్ ఫైనల్ చేస్తారు.

ఫొటో సోర్స్, https://cm.telangana.gov.in
ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కొక విధానం
"మేం అందర్నీ రెండు గ్రామాల నుంచే ఎంపిక చేశాం. ఒక గ్రామం నుంచి 54 మందినీ, మరో గ్రామం నుంచి 46 మందినీ ఎంపిక చేశాం. ఇలా చిన్న గ్రామం మొత్తం ఎంపిక చేసుకోవడంతో ఇబ్బంది రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వలేదు అన్న సమస్య లేదు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కావచ్చు. మేము ఎంచుకునేటప్పుడు, పొలం, ఆస్తులు లేని వారిని చూస్తున్నాం. అలానే 55-60 ఏళ్లు బడిన వారికి ఇవ్వడం లేదు. అటువంటి వారి పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్నాం'' అన్నారు ఆందోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.
దాదాపు ఇదే పద్ధతినే అనుసరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.
"వారు ఒక గ్రామాన్నే ఎంచుకోండి అని చెబితే బాగుండేది. దీనిని ఒక మోడల్‌గా తీర్చిదిద్దితే బాగుంటుంది కదా. అందుకే నేను ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలోని అర్హులైన అందరకీ దళిత బంధు వచ్చే ప్రయత్నం చేస్తాను" అని భట్టి విక్రమార్క బీబీసీతో చెప్పారు.
అయితే పరిస్థితి అన్నిచోట్లా ఇలానే లేదు. ముందుగా చెప్పిన తరహాల్లో ప్రతీ ఊరి నుంచీ కొందర్ని ఎంపిక చేసే పద్ధతి చాలాచోట్ల జరుగుతోంది.
''దళితుల సంఖ్య చాలా తక్కువ ఉన్న రెండు గ్రామాల్లో మొత్తం అందరికీ ఇచ్చాం. మిగిలిన చోట్ల ఊరికి ఐదుగురిని, మునిసిపాలిటీలో పది మందిని ఎంపిక చేశాం. ఐదుగురిని ఎందుకంటే, అందరూ కలసి ఉమ్మడిగా ఒక డైరీ పెట్టుకోవచ్చు. లేదా ఒక హార్వెస్టర్ మిషన్ తెచ్చుకోవచ్చు. ఉమ్మడిగా లబ్ధి పొందుతారని ఇలా చేశాం. ఆస్తులు ఉన్న వారికి, ఉద్యోగాలు ఉన్న వారికి ఇవ్వడం లేదు. అయితే చాలామందిలో ఒక ఆందోళన ఉంది. ఇప్పుడు ఇవ్వకపోతే, తరువాత ఇక ఎప్పటికీ ఇవ్వరేమోనని భయంతో వారు ఆందోళన చేస్తున్నారు. అలాంటి వారికి ఏప్రిల్ లో ఇస్తామని సర్ది చెబుతున్నాం.'' అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేల జోక్యమే తప్పు అంటున్నారు ప్రజసంఘాల నేతలు. రాజకీయ జోక్యం వల్ల అవినీతి పక్షపాతం కనిపిస్తున్నాయి వారు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, https://cm.telangana.gov.in/
ముఖ్యంగా పేర్ల ఎంపిక చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే సొమ్ములో ఎంతో కొంత స్థానిక పెద్దలకు సమర్పించుకునేలా ఒప్పందం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పలుచోట్ల , వికారాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, జగిత్యాలతో సహా అనేకచోట్ల నిరసనలు జరిగాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలు మొత్తం ఎంపిక ప్రక్రియనే పక్కన పెట్టేస్తున్నారు.
మరి కొంతమంది నేతలు, వచ్చే జాబితాలో మీ పేరు తప్పక వస్తుంది అని లబ్ధిదారులను బుజ్జగించే పనిలో పడ్డారు.
''పథకాన్ని సమర్థిస్తున్నాం. కానీ అమలులో సమస్య ఉంది. టీఆర్‌ఎస్ వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. ఎమ్మెల్యేల ద్వారా ఎంపికవడం వల్ల ఆర్థికంగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత వస్తుంది. ఈ ప్రక్రియ ఎమ్మెల్యేల జోక్యం లేకుండా పూర్తిగా అధికారుల సమక్షంలో జరగాలి. దళిత వాడల్లో బహిరంగ సభలు నిర్వహించి ఎంపిక చేయాలి'' అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ బీబీసీతో అన్నారు.
''ఎమ్మెల్యేలు ముందే కలెక్టర్లకు లిస్టు ఇస్తున్నారు. ఆ లిస్టు తీసుకుని గ్రామాల్లో సర్వే చేసినట్టు అధికారులు నటిస్తున్నారు. ఎమ్మెల్యే లిస్టులో ఉన్న పేర్లే సెలెక్ట్ అయినట్టు చూపిస్తున్నారు. సర్వే అంతా నాటకం. వికారాబాద్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో నాకు తెలిసి లక్ష, రెండు లక్షల వరకూ డబ్బులు ముట్ట చెప్పేలా ఒప్పందం కుదిరింది. దీనిపై మేం సొంతంగా సర్వచేసి త్వరలో ఆధారాలతో బయటపెడతాం'' అని వెస్లీ అన్నారు.
అయితే ఇలాంటి అవినీతికి అవకాశం లేదంటున్నారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.
''ఈ పథకంలో డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది, ఆ డబ్బు కూడా ఫ్రీజ్ చేస్తారు. వారు ఎంపిక చేసుకునే వ్యాపారాన్ని బట్టి, ప్రభుత్వం సూచించిన ఏజెన్సీలలోనే వారు ఆ వ్యాపారానికి తగ్గ సామాగ్రి లేక పశువులను కొనుక్కోవాల్సి ఉంటుంది. అవన్నీ సరిచూసుకున్న తరవాత నేరుగా ఏజెన్సీల వారికి డబ్బులు అందుతాయి. ఇక్కడ డబ్బులు చేతులు మారే ప్రసక్తే లేదు'' అన్నారు క్రాంతి కిరణ్.
''అకౌంట్‌లో డబ్బును లాక్ చేసి తిరిగి నేరుగా వ్యాపార సంస్థకే ఖర్చు పెడతారు కాబట్టి, ఇందులో అవకతవకలు జరిగే అవకాశమే లేదు. ఎంపిక బాధ్యత గ్రామస్థాయిలో ఎస్సీలతో వేసిన కమిటీకే ఇచ్చాం. మాలమాదిగ రెండు కులాల వారూ కమిటీలో ఉంటారు'' అన్నారు పట్నం నరేందర్ రెడ్డి.
ఈ పద్ధతిలో కూడా మరో సమస్య ఉంది. అది ఈ ఏజెన్సీల ఎంపిక పారదర్శకంగా జరగకపోవడం.

ఈ ఆరోపణలపై మంత్రి ఈశ్వర్ బీబీసీతో మాట్లాడారు.
''ఈ విషయం నా దృష్టికి వచ్చింది. కానీ, ప్రతి నియోజకవర్గంలో 35 నుంచి 45 వేలు దళిత కుటుంబాలు ఉంటాయి. నియోజకవర్గానికి వందమంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేయడం ఇబ్బందికరమే. వీరిలో ఎవరికి ఇచ్చినా మిగిలిన వారు సంతృప్తి పడరు. ఆ మిగిలిన వారి ఆవేదనను నిరసనగా చూడకూడదు'' అన్నారాయన.
దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందనే చూడాలన్న మంత్రి, వచ్చే బడ్జెట్ లో 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు దీనికి కేటయిస్తామన్నారు. అప్పుడు ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ. 2000 కోట్లనైనే వస్తుందని, అప్పుడు లబ్ధిదారుల సంఖ్య 400 - 500 కు పెరుగుతుందని మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి:
- సినిమా టిక్కెట్ల ధరల సమస్య ముగిసినట్లే, నెలాఖరుకు జీవో రావొచ్చు: చిరంజీవి
- కర్ణాటక హిజాబ్ వివాదం: ‘తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మతపరమైన వస్త్రధారణ వద్దు’, విచారణ ఫిబ్రవరి 14కి వాయిదా
- ‘పొరుగు దేశాన్ని ఆక్రమించినందుకు రూ. 24 వేల కోట్లు పరిహారం చెల్లించండి’
- ‘నేను భారతీయురాలినని నిరూపించుకోవడానికి ఐదేళ్లు కష్టపడ్డాను’
- ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాల్లో దాక్కున్నా వెంటాడి చంపేసే ఆయుధాలు
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?
- ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












