CAA-NRC: ‘‘నేను భారతీయురాలినని నిరూపించుకోవడానికి ఐదేళ్లు కష్టపడ్డా, ఇప్పుడు నా భర్త వంతు వచ్చింది’’

ఫొటో సోర్స్, DILIP SHARMA
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
"నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు చాలాసేపు మా ఇంటి ముందు కూర్చున్నారు. పోలీసులను చూసిన తర్వాత వెనుక గేటు నుంచి పారిపోయి ఒక ముస్లిం ఇంట్లో దాక్కున్నాను. రాత్రయ్యాక గానీ ఇంటికి రాలేకపోయాను. భయం కారణంగా అన్నం కూడా సహించేది కాదు. రాత్రిపూట నిద్ర కూడా సరిగా రాదు'' అని షెఫాలీ రాణీ దాస్ అనే మహిళ వెల్లడించారు.
దాదాపు ఐదు సంవత్సరాల పోరాటం తర్వాత ఆమె తిరిగి భారత పౌరసత్వాన్ని పొందారు. కానీ, నాటి పరిస్థితులు ఇప్పటికీ ఆమెను భయపెడుతున్నాయి.
గువాహటీ హైకోర్టు జోక్యం తర్వాత, 42 ఏళ్ల షెఫాలీ దాస్ గత నెలలో ఫారినర్స్ ట్రిబ్యునల్ (FT) ముందు తన పౌరసత్వం కేసులో వాదనలు వినిపించారు. 2017 లో ఆమె పౌరసత్వం కోల్పోగా, ఇప్పుడు మళ్లీ భారతీయ పౌరురాలయ్యారు.
అస్సాంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ లో పౌరసత్వం కేసులు ఎదుర్కొంటున్న వారు, తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి జనవరి 1, 1966 కు ముందు భారతదేశంలో తమ నివాసం ఉన్నట్లు పత్రాలను సమర్పించాలి.
అయితే, ఆగస్ట్ 15, 1985న భారత ప్రభుత్వం, అస్సాం ఉద్యమ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందంలో, విదేశీయులుగా గుర్తించి, వారిని దేశం నుంచి పంపించి వేయడానికి కటాఫ్ తేదీ మార్చి 25, 1971గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 6 ను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం భారత పౌరసత్వం కోసం జనవరి 1, 1966 కు ముందు పత్రాలను చూపించాలి.
పౌరసత్వానికి సంబంధించిన మొదటి కేసు 2012 సంవత్సరంలో కాచర్ జిల్లా మోహన్‌ఖాల్ గ్రామానికి చెందిన షెఫాలీ దాస్ పై నమోదైంది. తర్వాత ఈ కేసును సిల్చార్‌లోని ఫారినర్స్ ట్రిబ్యునల్-6కి రిఫర్ చేశారు.
అక్కడ 4 డిసెంబర్ 2015న ఈ కేసు (నం.404/2015) ) మళ్లీ నమోదు చేశారు. షెఫాలి ముగ్గురు పిల్లలు, వికలాంగుడైన భర్తతో కలిసి ఇక్కడ నివసిస్తున్నారు. వారి కోసం పోలీసులు వెతుక్కుంటూ ఈ మారుమూల ప్రాంతానికి వచ్చారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA
భారతీయ మహిళ బంగ్లాదేశీ ఎలా అయ్యారు?
"2017లో మొదటిసారిగా పోలీసులు మా ఇంటికి వచ్చినప్పుడు నేను, నా భర్త ఇంట్లో లేం. నా చిన్న కొడుకుకు నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ, వాడు తీసుకోలేదు. తర్వాత నా కొడుకు అమ్రాఘాట్‌కు వెళ్లగా, అక్కడ పోలీసులు అతని చేతిలో బలవంతంగా నోటీసులు పెట్టి వెళ్లిపోయారు'' అని షెఫాలీ వివరించారు.
'' మీరు బంగ్లాదేశీలు అన్న ఆ నోటీసు చదవగానే నా శరీరం వణికిపోయింది. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నాం. ఈ రోజు హఠాత్తుగా ఎలా బంగ్లాదేశీయులమయ్యాం? అనే ప్రశ్న నా మదిలో పదే పదే మెదులుతూనే ఉండి పోయింది'' అని షెఫాలీ అన్నారు.
సెప్టెంబర్ 2017లో ఫారినర్స్ ట్రైబ్యునల్ 'ఏకపక్ష' నిర్ణయంతో షెఫాలీని విదేశీయురాలిగా ప్రకటించింది. షెఫాలీ కేసులో 2017 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం ఐదు విచారణలు జరిగాయి. షెఫాలీ దాస్ విచారణకు గైర్హాజరయ్యారని ఫారినర్స్ ట్రైబ్యునల్ తన ఆర్డర్‌లో రాసింది. ఇది తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొంది.
'కోర్టుకు వెళ్లడం ఖర్చుతో కూడిన వ్యవహారం'
''మాకు రెండు పూటలా తినడానికి తిండే లేదు. కేసు కోసం డబ్బు ఎవరిస్తారు? విచారణ కోసం కోర్టుకు అనేకసార్లు వెళ్లాను. మా ఊరు నుంచి సిల్చార్ వరకు వచ్చిన ప్రతిసారి ప్రయాణ ఖర్చులు, లాయర్ ఫీజుల భారం మోయడం మాకు చాలా కష్టంగా ఉండేది'' అని షెఫాలీ బీబీసీతో అన్నారు.
కేసు కోసం డబ్బు సిద్ధం చేసుకోవడానికి తాను అందరి ఇళ్లలో పని చేసేదానినని ఆమె చెప్పారు. వికలాంగుడైన తన భర్త ఇటుకలు మోసేవాడని, ఇంత కష్టపడినా ఒక్కోసారి చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదని ఆమె అన్నారు.
విచారణకు హాజరుకాని నిందితుల విషయంలో ట్రైబ్యునల్ ఇలా ఏకపక్ష తీర్పులు ఇస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఫారిన్ ట్రైబ్యునల్ సభ్యుడొకరు బీబీసీతో చెప్పారు.
చట్టం ప్రకారం ఈ కేసును విచారించడానికి 60 రోజుల సమయం ఇస్తారు. కానీ, కేసులు ఏళ్లపాటు సాగుతాయి. నిందితులు తమ పౌరసత్వ నిరూపణకు అన్ని పత్రాలను సమర్పించడానికి సమయం ఉంటుంది. కానీ, చాలామంది కోర్టుకు హాజరు కాలేరు. చివరకు వారిని విదేశీయులంటూ ఏకపక్షంగా ప్రకటిస్తారు'' అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA
ఫారినర్స్ ట్రైబ్యునల్స్ ఎలా పని చేస్తాయి?
అస్సాం హోం అండ్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 100 ట్రైబ్యునళ్లు పనిచేస్తున్నాయి. ఇది పూర్తిస్థాయి న్యాయ వ్యవస్థ కాదు. ఫారినర్స్ ట్రైబ్యునల్ చట్టం, 1941, ఫారినర్స్ ట్రైబ్యునల్ ఆర్డర్ 1964 ప్రకారం న్యాయమూర్తులు, న్యాయవాదులు ట్రైబ్యునల్ సభ్యులుగా నియమితులయ్యారు.
గతంలో ఈ రాష్ట్రంలో అక్రమ వలసదారుల నిర్ధారణ ట్రిబ్యునళ్లు (ఇల్లీగల్ మైగ్రాంట్స్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్స్-ఐఎండీటీ) 11 ఉండేవి. కానీ, 2005లో ఐఎండీటీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తర్వాత వీటిని ఫారినర్స్ ట్రైబ్యునల్స్‌గా మార్చారు.
2014 తర్వాత పని ఒత్తిడి పెరగడంతో ట్రైబ్యునల్ లో పెద్ద సంఖ్యలో న్యాయవాదులను ఎఫ్‌టి సభ్యులుగా నియమించారు. అప్పటి నుంచి ట్రైబ్యునల్ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.
భారత పౌరసత్వానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నప్పటికీ, ప్రజలను, ముఖ్యంగా బెంగాలీ మాట్లాడే హిందువులు, ముస్లింలను ఏకపక్ష నిర్ణయంతో విదేశీయులుగా ప్రకటించారని ట్రైబ్యునళ్లపై ఆరోపణలున్నాయి.
షెఫాలీ మీద ఫిర్యాదు ఏంటి?
1971 తర్వాత షెఫాలీ కుటుంబం బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చినట్లు కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది. అంటే ఆమె భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయురాలు. ఇక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. షెఫాలీ భారతదేశంలో ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా తిరగడాన్ని అడ్డుకోవాలని, ఓటరు జాబితా నుంచి ఆమె పేరును తొలగించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, ఈ విషయాలన్నింటినీ ఆర్డర్‌లో రాయాల్సిన అవసరం లేదని ధర్మాసనంలోని ఓ మహిళా సభ్యురాలు అంటున్నారు. ఎవరినైనా విదేశీయులుగా ట్రిబ్యునల్ ప్రకటించినప్పుడు, అక్కడే ఉన్న సరిహద్దు పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుంటారని ఆ మహిళా సభ్యురాలు చెప్పారు.
ఒక వ్యక్తి దగ్గర భారత పౌరసత్వానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయో లేదో చూడడమే ట్రైబ్యునల్ పని అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, DILIP SHARMA
షెఫాలీ భర్త కేసు ఇంకా పరిష్కారం కాలేదు
60 శాతం హిందువుల జనాభా ఉన్న మోహన్‌ఖాల్ గ్రామంలో, షెఫాలీలాంటి 15 హిందూ కుటుంబాలు ఉన్నాయి. వీరందరి పౌరసత్వం విషయంలో కేసులు నడుస్తున్నాయి. వారిలో షెఫాలీ దాస్ భర్త ప్రబోధ్ రంజన్ దాస్ ఒకరు.
62 ఏళ్ల దాస్ 1978లో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్ ఉంది. 1960లో తన తండ్రికి అస్సాం ప్రభుత్వం ఇచ్చిన శరణార్థుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా తన వద్ద ఉందని దాస్ అంటున్నారు.
"మోదీ పాలనలో సంతోషంగా జీవిస్తామని ఆయనకు ఓటు వేశాం. కానీ మేం ఇక్కడే పుట్టినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, పోలీసులు మమ్మల్ని విదేశీయులంటున్నారు. ఐదేళ్ల తర్వాత నా భార్య పౌరసత్వం కేసు పరిష్కారమైంది. కానీ నా కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. మేం హిందుత్వవాదులం కాబట్టి మోదీ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుందని అనుకుంటున్నా'' అన్నారు దాస్.
భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూ బంగ్లాదేశ్ శరణార్థులకు పౌరసత్వం పై హామీ ఇచ్చింది. కానీ పౌరసత్వ చట్టం ఇంకా అమలు కాలేదు.
షెఫాలీ రాణి దాస్ నివాసం ఉండే అసెంబ్లీ నియోజకవర్గం ధోలాయ్ ఎమ్మెల్యే పరిమళ్ శుక్లా బైద్య అస్సాం ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా పని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తమను డీ-ఓటర్ల (అనుమానస్పద వ్యక్తులు) జాబితాలో చేర్చారన్న విషయం విదేశీయులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇంకా తెలియదు.
అయితే, ఇది చట్టపరమైన అంశమని శుక్లా బైద్య చెప్పారు. వీరికి న్యాయ సహాయం కోసం ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
షెఫాలీ రాణి దాస్ గురించి మంత్రిని అడిగినప్పుడు ''ఆమె నా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. కానీ, మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ జీవించడం చాలా కష్టం. ఆమె తన పేపర్లను జాగ్రత్త చేసుకోవాల్సింది. కానీ, అలా చేసుకోలేదు. అందుకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలులోకి వస్తే చాలామందికి ఈ సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి అన్నారు.
''షెఫాలీ నా వద్దకు వచ్చినప్పుడు, పౌరసత్వాన్ని రుజువు చేసే అన్ని పత్రాలు ఆమె దగ్గర ఉన్నాయి. గత సంవత్సరం గౌహతి హైకోర్టులో కేసు వేశాము. అది షెఫాలీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసును మళ్లీ విచారించాల్సిందిగా ఫారినర్స్ ట్రైబ్యునల్ ను ఆదేశించింది'' అని షెఫాలీ కేసును వాదించిన లాయర్ మోహితోష్ దాస్ బీబీసీతో అన్నారు.
అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత జనవరి 17న, ట్రిబ్యునల్-6, తన పాత తీర్పును రద్దు చేసి, షెఫాలీని భారతీయ పౌరురాలిగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, DILIP SHARMA
స్ట్రీమ్ లైన్ ఫారినర్స్ అంటే ఎవరు?
షెఫాలీ భర్త ప్రబోధ్ రంజన్ దాస్ ను స్ట్రీమ్‌లైన్ ఫారినర్‌గా సిల్చార్‌లోని ట్రిబ్యునల్ ప్రకటించింది.
''అస్సాం ఒప్పందంలోని క్లాజ్ 6(ఎ) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి, లేదా అతని తల్లిదండ్రులు లేదా తాతయ్యలు 1966 జనవరి 1వ తేదీకి ముందు భారతదేశంలోకి ప్రవేశించలేదని, జనవరి 1, 1966 ముందు ఏదైనా పత్రాన్ని సమర్పించి, దాని లింకేజీని రుజువు చేస్తే, అప్పుడు అతను భారత పౌరసత్వాన్ని పొందుతాడు'' అని న్యాయవాది మోహితోష్ దాస్ అన్నారు.
''జనవరి 1, 1966 కంటే ముందు ఎటువంటి పత్రాలు లేకున్నా, మార్చి 24, 1971 నాటికి ఏవైనా పత్రాలు అంటే, జనవరి 1, 1966 నుండి మార్చి 24, 1971 మధ్య ఏదైనా పత్రం ఉంటే, ఆ వ్యక్తి వాటి లింక్‌ను ధృవీకరించినట్లే. అలాంటి వ్యక్తిని స్ట్రీమ్ లైన్ ఫారినర్‌గా చెబుతారు'' అని దాస్ వెల్లడించారు.
అలాంటి వ్యక్తులు భారతదేశంలో నివాసం ఉండొచ్చు. కానీ, 10 సంవత్సరాల తర్వాత అతని పౌరసత్వం రద్దు అవుతుంది. ఈ కాలంలో వాళ్లకు ఓటు హక్కుగానీ, ప్రభుత్వ పథకాలుగానీ అందవు. ఈ చట్టం కింద వారు పాస్‌పోర్టును మాత్రమే పొందగలరు. పదేళ్ల తర్వాత ఆ వ్యక్తి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సుదీర్ఘ పోరాటం తర్వాత షెఫాలీ తిరిగి భారతీయురాలైంది. కానీ, ఇన్నాళ్లు కోర్టు విచారణల కోసం ఆమె చేసిన అప్పులు ఎప్పుడు తీరతాయో తెలియదు. ఆమె పిల్లలు చదువులకు దూరమయ్యారు.
''ఏ వ్యక్తికైనా పౌరసత్వంకన్నా ముఖ్యమైంది ఏదీ లేదు. గత ఐదేళ్లలో నా కుటుంబం, నా పిల్లలు అనుభవించిన భయానక పరిస్థితులకు మించిన బాధకరమైనది నా జీవితంలో మరొకటి లేదు. ఈ బాధను జీవితాంతం మరచిపోలేను'' అన్నారామె.
''ఇప్పుడు నా భర్త భారతీయుడిగా నిరూపించుకోవడానికి మరో యుద్ధం చేయాల్సి ఉంది'' అని షెఫాలీ దిగులుగా అన్నారు.

ఇవి కూడా చదవండి:
- ‘నేను ప్రేమించటానికి ఎవరైనా కావాలి’
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
- అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- లతా మంగేష్కర్ భౌతికకాయం దగ్గర షారుఖ్ ఖాన్ ప్రార్థనపై వివాదం, అసలేం జరిగిందంటే..
- హిజాబ్‌పై ముదురుతున్న వివాదం, కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేసిన ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















