రాయల్ ఎన్‌ఫీల్డ్: 50 ఏళ్ల కిందటి తన బుల్లెట్ బండి కోసం 75 సంవత్సరాల వృద్ధుడి ఆరాటం చివరకు ఎలా ముగిసింది ?

తన బుల్లెట్ బండి కొన్న మిత్రుడితో శ్రీనివాసన్ (గళ్లచొక్కా వ్యక్తి )

ఫొటో సోర్స్, N.Srinivasan

ఫొటో క్యాప్షన్, తన బుల్లెట్ బండి కొన్న మిత్రుడితో శ్రీనివాసన్ (గళ్లచొక్కా వ్యక్తి )
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రేమ, ఆప్యాయతల కోసం మనుషులలో అన్వేషణ నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అది శాశ్వతంగా కూడా మారుతుంది. కానీ, ఒక లోహపు యంత్రం కోసం ఓ వ్యక్తి అన్వేషణ ఒకటిన్నర దశాబ్దంపాటు సాగిందంటే, అది వినడానికే వింతగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

75 ఏళ్ల శ్రీనివాసన్ తన మోటర్‌ బైక్‌ మీద పెట్టుకున్న అచంచలమైన అభిమానం ఆయన కుటుంబాన్ని కొత్త తరహాలో అన్వేషణకు పురికొల్పింది.

రోడ్డు మీద వెళుతున్నప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కనిపించిందంటే శ్రీనివాస్ గతంలోకి వెళ్లిపోతారు. బ్యాంక్ లోన్ పెట్టి తాను కొనుక్కున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి ఆయనకు మదిలో మెదులుతుంది.

ఇప్పటికి ఆయన ఆ మోటార్‌ బైక్‌ను కొని సుమారు 50 ఏళ్లకు పైగా అయ్యింది. అయితే, ఆ బండిని తన స్నేహితుడి ఇంట్లో ఉండగా, దొంగతనానికి గురైంది. ఇది 90లలో జరిగింది.

బుల్లెట్ బండి మీద చాలామందికి మోజు ఉంటుంది

ఫొటో సోర్స్, www.royalenfield.com

ఫొటో క్యాప్షన్, బుల్లెట్ బండి మీద చాలామందికి మోజు ఉంటుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ బండికే ప్రత్యేకమైన డుగ్ డుగ్ డుగ్ అనే సౌండ్ వినపడుతూనే శ్రీనివాసన్‌‌ను గతంలోకి లాక్కెళుతుంది. దొంగతనానికి గురైన తన బండి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని బెంగళూరు రోడ్ల మీద వెతికి వెతికి ఆయన కళ్లు అలసి పోయాయి.

ఆయన తన కొడుకు అరుణ్ శ్రీనివాసన్‌కు తన తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి గురించి గుర్తు చేస్తుండేవారు. మణిపాల్‌లో దొంగతనానికి గురైన ఆ బండి అసలు ఎక్కడైనా ఉందో లేదోననుకుంటూ ఆయన మదన పడుతుంటారు.

''నేను ఆయనను ఎక్కడికైనా తీసుకెళుతుంటే, బుల్లెట్ బండి దూరంగా ఉన్నట్లు అనిపించగానే నా వాహనాన్ని స్లో చేస్తాను. బుల్లెట్ కనిపించినా, దాని సౌండ్ వినిపించినా ఆయన చాలా ఎమోషనల్ అయిపోతారు'' అని శ్రీనివాసన్ కొడుకు అరుణ్ బీబీసీతో అన్నారు.

అరుణ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

''అప్పట్లో బుల్లెట్ బండ్లు చాలా ఖరీదైనవి. నేను ఓ ప్రైవేట్ బ్యాంక్ ఫీల్డాఫీసర్‌గా పని చేస్తున్నప్పుడు రూ.6400 పెట్టి బుల్లెట్ కొనుక్కున్నాను. బ్యాంకు నుంచి నాకు పూర్తి లోన్ వచ్చింది. కానీ, నాకు మంగళూరు నుంచి లఖ్‌నవూ ట్రాన్స్‌ఫర్ కావడంతో నేను దాన్ని అక్కడికి తీసుకెళ్లలేకపోయాను'' అని వెల్లడించారు శ్రీనివాసన్.

ఆయన తన బండిని స్నేహితుడికి అమ్ముతూ, ఒక కండిషన్ పెట్టారు. ఎప్పుడైనా ఆ బండిని తిరిగి అమ్మాలనుకున్నప్పుడు తనకే అమ్మాలన్నది ఆ షరతు. ''నా ఫ్రెండ్ దానికి ఓకే అన్నాడు. కానీ, దాన్ని దొంగలు తీసుకెళ్లిపోయారు'' అని శ్రీనివాసన్ వివరించారు.

శ్రీనివాసన్ కొడుకు అరుణ్ జాగ్రత్త చేసిన పాతకాలపు వాహనాలు

ఫొటో సోర్స్, N.Srinivasan

ఫొటో క్యాప్షన్, శ్రీనివాసన్ కొడుకు అరుణ్ జాగ్రత్త చేసిన పాతకాలపు వాహనాలు

బండి దొంగతనానికి గురి కావడంతో శ్రీనివాసన్ పోలీస్ కేసు పెట్టారు. కానీ, ఫలితం లేదు. అయితే, అది హసన్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో దొంగతనానికి గురైన వాహనంగా పదేళ్లపాటు పడి ఉందన్న విషయం పోలీసుల దృష్టికి రాలేదు. అది అక్కడికి ఎలా చేరిందో శ్రీనివాసన్‌ కు కూడా తెలియదు.

అయితే, శ్రీనివాసన్ కొడుకు అరుణ్ కూడా పాత వాహనాలను బాగా ఇష్టపడతారు. తన తండ్రి బుల్లెట్ బండిని ఎలాగైనా కనుక్కోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

''నాకు పాత కార్లన్నా, మోటార్ బైక్‌లన్నా చాలా ఇష్టం. మా నాన్న పాత కారు, మా మామయ్య 1960లలో కొన్న కారు అంటే నాకు ఇష్టం. మా ఇంట్లో ఆరేడు పాత వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. వాటిలో ఏదీ అమ్మను. మా దగ్గర మిస్సయ్యింది ఒక్క మా నాన్న బుల్లెట్ బండే'' అని అరుణ్ వివరించారు.

''వాడు చిన్నోడుగా ఉన్నప్పుడు ఆ బండి మీద తీసుకెళ్తే ఎంజాయ్ చేసేవాడు'' అని గుర్తు చేసుకున్నారు శ్రీనివాసన్.

''మా నాన్న దాన్ని పాతికేళ్లు నడిపారు. నేను, నా సిస్టర్స్ దాని మీద తిరుగుతూ పెరిగాం. అది మా ఇంట్లో కొన్న మొదటి వాహనం. మా నాన్న ఆ బండిని తన ఫ్రెండ్‌కు ఇచ్చేటప్పటికి నేను ఆరో తరగతిలో ఉన్నాను. మా ఇంటి ముందు ఆ బండి పార్క్ చేసి ఉండటం నాకు బాగా గుర్తు'' అన్నారు అరుణ్.

శ్రీనివాసన్ చెంతకు చేరిన 50 ఏళ్ల కిందటి బుల్లెట్

ఫొటో సోర్స్, N.Srinivasan

ఫొటో క్యాప్షన్, శ్రీనివాసన్ చెంతకు చేరిన 50 ఏళ్ల కిందటి బుల్లెట్

తండ్రి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ బుల్లెట్ బండిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని కంకణం కట్టుకున్న అరుణ్, తన తండ్రి గతంలో పని చేసిన బ్యాంక్ ప్రధాన కేంద్రం ఉన్న మణిపాల్ వెళ్లారు. అక్కడ తండ్రి తన బుల్లెట్‌ను సర్వీస్ చేసే గ్యారేజ్ ఓనర్‌ను కలుసుకున్నారు.

''గ్యారేజ్ ఓనర్‌ ఒక్కడే బండి విషయంలో మా సెంటిమెంట్‌ను అర్థం చేసుకున్నాడు'' అన్నారు అరుణ్. మిగిలిన గ్యారేజ్‌ల వాళ్లు కొందరు రెస్పాండ్ కాకపోగా, మరికొందరు ఆ పాత బండి కోసం ఎందుకు సమయం వృథా చేసుకుంటారు, కొత్తది కొనుక్కోవచ్చు కదా అంటూ అరుణ్‌ను నిరాశపరిచారు.

కానీ, అరుణ్ వెనకడుగు వేయలేదు.

''రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులు సహా, ఎక్కడ నాకు డేటా దొరక లేదు. పోలీసు స్టేషన్లలో కూడా వెతికాను. వాళ్లూ తెలియదన్నారు. కానీ, ఆ మధ్య ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మొత్తాన్ని డిజిటలైజ్ చేశారు. బండి ఎక్కడుందో ట్రాక్ చేయడానికి అది నాకు ఉపయోగపడింది'' అని అరుణ్ వెల్లడించారు.

2021 ఆరంభంలో గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో తాను వెతుకుతున్న MYH 1731 వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు తేలింది. (అప్పట్లో కర్ణాటకలో మైసూర్ స్టేట్ పేరుతో MYH అని రిజిస్ట్రేషన్ జరిగేది.)

వీడియో క్యాప్షన్, డుగ్గు.. డుగ్గు..బుల్లెట్ బండి పాటపై ఆ జంట ఏమన్నారంటే..

చాలా నెలలు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగిన అరుణ్, చివరకు ఈ బండి మైసూరు జిల్లాలో టి.నరసిపుర అనేక గ్రామానికి చెందిన ఒక రైతు దగ్గర ఉన్నట్లు గుర్తించారు.

ఆయనతో మాట్లాడి, దీని కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. తన తండ్రిని సంతోష పెట్టడానికి ఆ బండి తనకు కావాలని అడిగారు అరుణ్.

హసన్ జిల్లా పోలీసులు నిర్వహించిన వేలంలో ఓ డీలర్ ఈ బండిని కొనుక్కోగా, ఆయన నుంచి ఆ రైతు దాన్ని కొనుగోలు చేశారు. హసన్ పోలీసులు తమ వద్ద పేరుకు పోయిన పాత వాహనాలను వదిలించుకునేందుకు వేలం నిర్వహించిన సమయంలో ఈ బండి చేతులు మారింది.

దొంగతనానికి గురైన వాహనాలను వేలంలో అమ్మేసిన పోలీసులు, తాము సర్టిఫికెట్ ఇస్తామని, కొత్త నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ రైతుకు తెలిపారు.

అయితే, అదృష్టవశాత్తు ఆయన ఆ బండిని రీ రిజిస్టర్ చేయించలేదు. దీనికి కారణం, దాన్ని ఎలా రీ రిజిస్టర్ చేయించాలో ఆ రైతుకు తెలియకపోవడమే. దీంతో ఆ నంబర్ మారలేదు. అది అరుణ్‌కు కలిసొచ్చింది.

బండి మీద మనవరాలితో శ్రీనివాసన్

ఫొటో సోర్స్, N.Srinivasan

ఫొటో క్యాప్షన్, బండి మీద మనవరాలితో శ్రీనివాసన్

మొదట్లో ఆ రైతు తన బండిని అమ్మడానికి ఇష్టపడలేదు. కొన్ని నెలల తర్వాత ఆయన అరుణ్‌కు కాల్ చేశారు. బండి అమ్ముతానని అన్నారు. డీలర్ ఆ బండిని రూ.1800 కొని, రైతుకు దాన్ని రూ.45 వేలకు అమ్మారు.

''ఆ బండి కోసం నేను ఆ రైతుకు రూ. లక్షకు పైగా ఇచ్చాను. దీని రిపేర్‌కు చాలా ఖర్చయిందని ఆయన చెప్పారు. అయినా సరే. దానికా విలువ ఉంది. నా వరకు ఇది సెంటిమెంట్ బండి'' అన్నారు అరుణ్.

బండి దొరకగానే అరుణ్ టి.నరసిపుర గ్రామం నుంచి తండ్రికి ఫోన్ చేశారు. ''మీరు 15 సంవత్సరాలుగా వెతుకుతున్న బండి దొరికిందని ఆయన చెప్పగానే చాలా ఎమోషనల్ అయ్యారు. దాన్ని మళ్లీ సంపాదించడం నిజంగా గొప్ప విషయం'' అన్నారు అరుణ్.

అరుణ్, ఆయన స్నేహితుడు కలిసి ఆ బండిని మైసూరు నుంచి బెంగళూరుకు నడుపుకుంటూ వచ్చారు.

''నా బుల్లెట్ మళ్లీ ఇంటికి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నేను బండి ఛేసిస్ నంబర్‌ను చెక్ చేశాను. నా దగ్గర ఆర్సీ బుక్ కూడా ఉంది. నా బండిని నాకు తెచ్చినందుకు నా కొడుకుకు థ్యాంక్స్. ఇది పండగ చేసుకోవాల్సిన సమయం. కనిపించకుండా పోయిన గుర్రం దానంతట అదే ఇంటికి వచ్చినట్లుంది'' అన్నారు శ్రీనివాసన్.

''మేం అందరం ఆ బండి మీద కూర్చున్నాం. నేను చిన్న రైడింగ్ మాత్రమే చేశాను. ఎందుకంటే ఇది రీ రిజిస్టర్ చేయాల్సి ఉంది. నేను కాస్త పొట్టి. కానీ, బుల్లెట్ కంఫర్ట్‌గానే ఉండేది. ఇప్పుడు కూడా అదే కంఫర్ట్ ఫీలయ్యాను. ఇది నా బండే అనడానికి ఇదొక నిదర్శనం'' అని చిన్న పిల్లాడిలా తన బండిని చూసుకుంటూ అన్నారు శ్రీనివాసన్.

ప్రేమ గుడ్డిది అంటారు. ఆఖరికి 50 ఏళ్ల కిందటి మోటార్ బైక్ విషయంలో కూడా అది నిజమైంది.

వీడియో క్యాప్షన్, రాయల్ ఎన్‌ఫీల్డ్: బ్రిటన్‌లో మొదలైన ప్రయాణం భారత్ వరకూ ఎలా సాగింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)