దసరా స్పెషల్: అమలాపురం వీధుల్లో కత్తులు, కర్రల ప్రదర్శన... ఈ ఆచారం ఏనాటిది, ఎలా వచ్చింది?

చెడీ తాలీంఖానా
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దసరా ఉత్సవాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ముఖ్య కేంద్రంగా ఉన్న అమలాపురంలో కూడా ప్రత్యేకంగా ఈ వేడుకలు జరుగుతాయి.

ఇక్కడ ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్లు నిండిన వృద్ధుల వరకూ కత్తులు, కర్రలు, ఇతర యుద్ధ సామాగ్రి తీసుకుని వీధుల్లోకి వస్తారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తారు. యుద్ధ విద్యలతో అలరిస్తారు. పోటీపోటీగా తలపడతారు. చూస్తున్న వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తారు. ఇంతకీ ఈ ఆచారం ఎలా వచ్చిందో తెలియాలంటే పెద్ద చరిత్రే ఉంది.

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే...

చెడీ తాలీంఖానాగా పిలిచే ఈ యుద్ధ కళ విదేశాల నుంచి వచ్చిందని ఓ అభిప్రాయం. దానిని నేర్చుకున్న అమలాపురం వాసులు కొందరు ప్రదర్శించడం మొదలుపెట్టారు.

1834 నుంచే అమలాపురంలో ఈ చెడీ తాలీంఖానా ప్రదర్శనలు జరుగుతున్నాయి. తొలుత పట్టణంలోని కొంకాపల్లి ప్రాంత వాసులు దీనిని నేర్చుకున్నారు. ఆతర్వాత అబ్బిరెడ్డి రామదాసు అనే స్థానికుడి కృషితో ఇదో సంప్రదాయంగా మారింది.

ఏటా దసరా ఉత్సవాల్లో ఈ చెడీ తాలీంఖానా ప్రదర్శన ఆచారంగా అలవర్చుకున్నారు. అబ్బిరెడ్డి రామదాసు దగ్గర ఈ విద్యను నేర్చుకుని దానిని వీధుల్లో ప్రదర్శించడం ప్రారంభించారు. అమలాపురం దసరా వేడుకలకు ఈ చెడీ తాలింఖానాను ఓ ప్రత్యేకతగా మార్చేశారు.

చెడీ తాలీంఖానా

జాతీయ స్ఫూర్తిని చాటుతూ..

స్వాతంత్ర్యోద్యమ సమయంలోనూ ఈ చెడీ తాలీంఖానా ప్రదర్శించారు. జాతీయోద్యమ స్ఫూర్తిని చాటేందుకు వాడుకున్నారు. దసరా వేడుకలలో భాగంగా సాగించే ప్రదర్శనలో తొలుత జాతీయ జెండా చేబూని జై భారత్ వంటి నినాదాలివ్వడం అప్పటి నుంచి వస్తోంది. నేటికీ అమలాపురం దసరా ఉత్సవాలు.. జాతీయ జెండా ప్రదర్శనలు, అవే నినాదాలతో మారుమ్రోగుతుండడం విశేషం.

‘‘సిపాయిల తిరుగుబాటుకి ముందే అమలాపురంలో దేశభక్తి పూర్వకంగా చెడీ తాలీంఖానా ప్రదర్శనలు చేశారు. 1856లో దీన్ని మొదట ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా దసరా నాడు చెడీ తాలీంఖానా కచ్చితంగా ప్రదర్శిస్తూ వస్తున్నారు. అదే సమయంలో సమైక్య స్ఫూర్తిని చాటుతుంటారు’’అని అమలాపురానికి చెందిన కోనసీమ జేఏసీ ప్రతినిధి బండారు రామ్మోహన్ రావు అన్నారు.

‘‘అన్ని వీధుల నుంచి ఈ కళను నేర్చుకున్న యువత ప్రదర్శనలు ఇస్తుంటారు. పిల్లలు, పెద్దలు అనే బేధం లేకుండా ప్రదర్శనల్లో భాగస్వాములవుతారు. పండగ వేళ ఈ చెడీ తాలీంఖానా ప్రదర్శన చూసేందుకు సైతం దూర ప్రాంతాల నుంచి చుట్టాలు, మిత్రులు వస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన అమలాపురం వాసులు సైతం దసరాకి ప్రత్యేకంగా సొంతూరు వచ్చి చెడీ తాలీంఖానాలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు.’’

తాను కూడా చెడీ తాలీంఖానా ప్రదర్శన చేస్తుంటానని రామ్మోహన్ రావు బీబీసీకి తెలిపారు.

చెడీ తాలీంఖానా

ఫొటో సోర్స్, Getty Images

ఎమర్జెన్సీలోనూ ఆగలేదు..

‘‘160 ఏళ్లుగా ఏటా దసరాలో చెడీ తాలీంఖానా ప్రదర్శన జరుగుతూనే ఉంది. చివరకు ఎమర్జెన్సీలో కూడా అనేక ఆంక్షలున్నా చెడీ తాలీంఖానాకి అడ్డు చెప్పలేదు’’అని అమలాపురం మునిసిపల్ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు అన్నారు.

‘‘కొంతకాలం పాటు ఈ ఆయుధాల వల్ల ప్రమాదం వస్తుందేమోననే అభిప్రాయం ఉండేది. కానీ కేవలం దసరా రాత్రి సందర్భంగా బంధువుల మధ్య సరాదాగా సాగే పోటీనే తప్ప ఇదేమీ ప్రమాదకరం కాదని గుర్తించారు. కక్షలకు ఆస్కారం లేదని తెలుసుకున్నారు. అందుకే చెడీ తాలీంఖానా ప్రదర్శనలకు అడ్డు చెప్పడం లేదు. యువత కూడా దీనిని నేర్చుకుని ప్రదర్శనలకు ఆసక్తి చూపుతుండడం వల్లనే తరతరాలుగా ఇది కొనసాగుతోంది. తల్లిదండ్రులు కూడా ఆయుధాలతో చేసే విన్యాసాల వల్ల ఎటువంటి నష్టం లేకపోవడం వల్లనే పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటారు.’’

అమలాపురం పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కూడా చెడీ తాలీంఖానా చేస్తారని ఆయన బీబీసీకి తెలిపారు. తాను చాలాకాలంగా ఏటా దసరా వేడుకల్లో ఈ విద్య ప్రదర్శిస్తుంటానని వివరించారు. ఉత్సాహం కలిగించేందుకు పోటీపోటీగా విన్యాసాలు చేస్తూ ఉంటామని అన్నారు.

చిన్న పిల్లలకు ప్రత్యేక శిక్షణ

సహజంగా దసరాకి ముందు వచ్చే సెలవు రోజులను పిల్లలను వివిధ పద్ధతుల్లో వినియోగించుకుంటారు. కానీ అమలాపురంలో మాత్రం దానికి భిన్నం. స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వడానికి ముందే చెడీ తాలీంఖానా శిక్షణ మొదలవుతుంది. ఏ వీధికి ఆ వీధిలో ఉండే గురువులు స్థానికంగా యువతకు వివిధ రూపాల్లో శిక్షణ ఇస్తూ ఉంటారు.

‘‘నెల రోజుల పాటు చెడీ తాలీంఖానా విద్యలో శిక్షణ ఇస్తారు. కత్తి తిప్పడం, కర్రసాము, అగ్గిబరాటా, తాళ్లు తిప్పడం వంటి 30రకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు. పూర్వం 60 రకాలుగా ఈ విద్య ఉండేది. రానురాను కఠినమైన శిక్షణకు ఆస్కారం లేక కొన్ని తగ్గిపోయాయి. పిల్లలు మాత్రం ఇది నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. ఇది శారీరక వ్యాయామానికి, వ్యక్తిగత రక్షణకు తోడ్పడుతుంది. అందుకే ఏటా కొత్తతరం చెడీ తాలీంఖానా వైపు మొగ్గు చూపుతున్నారు’’అని అమలాపురానికి చెందిన మెట్ల సురేష్ బీబీసీతో అన్నారు.

దసరాకి నెల రోజుల ముందు నుంచే అన్ని వీధుల్లో కత్తులు, కర్రల శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. దసరా నాడయితే ఆ హోరు విస్తృతంగా సాగుతుంది.

చెడీ తాలీంఖానా

పదునైన ఆయుధాలతో భీకర పోరాటాలు

కత్తులు పట్టుకుని నిమ్మకాయలు చీల్చడం, వివిధ శరీర భాగాల మీద పెట్టుకున్న కూరగాయలు కత్తిరించడమే కాకుండా అగ్గిబరాటాలతో చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. లేడి కొమ్ములు వంటి ఆయుధాలతో తలపడే దృశ్యాలు అమ్మో అనిపిస్తాయి.

యుద్ధ విద్యల ప్రదర్శనలో ఆరితేరిన వారు కాకపోయిన శిక్షణలో నేర్చుకున్న వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో వారంతా శ్రద్ధ చూపిస్తారు. ఆ క్రమంలో చూసేవాళ్లలో గుర్తింపు కోసం భీకరంగా తలపడతారు. కొన్ని సార్లు శ్రుతిమించి ప్రయత్నించడంతో చిన్న చిన్న గాయాల పాలయినా అదేమీ పెద్ద విషయం కాదని చెడీ తాలీంఖానా చేస్తున్న వారంతా చెబుతారు.

వివిధ రకాల కత్తులు తిప్పుతూ కళ్లు చెదిరే రీతిలో పోటీ పడతారు. కత్తి డాలుతో దాదాపుగా యుద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇదంతా వీధి పోరాటాలుగా ఉన్నప్పటికీ తమ సంప్రదాయం, ఆచారాలను పాటించడానికి ప్రాధాన్యతనిస్తామని వారు అంటారు.

‘‘అమెరికాలో స్థిరపడిన వారు కూడా ఆరోజు ఊరిలో ఉండాలనుకుంటారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని దసరా ఉత్సవాలకు వచ్చేస్తారు. ఏళ్లుగా ఇదే జరుగుతోంది. యువతకు ఇదే పెద్ద సంబరం. చెడీ తాలీంఖానా యుద్ధ విద్య నేర్చుకున్న మా పూర్వీకులు వ్యవసాయదారులయినా మరోటయినా విద్యను వీడలేదు. తర్వాతి తరాలకు అందిస్తూనే ఉన్నారు. మేము కూడా దానికి అనుగుణంగానే కొత్త తరాన్ని సిద్ధం చేస్తున్నాం’’అని అబ్బిరెడ్డి సురేష్ అన్నారు.

చెడీ తాలీంఖానా

పోలీసుల పర్యవేక్షణలో

అసలే ఆయుధాలు అందుబాటులో ఉండడం, పైగా పోటీ కోసం కొందరు పట్టుదలకు పోవడం వంటి పరిస్థితుల్లో అంతా సామరస్యంగా సాగేందుకు పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. చేజారిపోకుండా శాంతియుతంగా దసరా వేడుకలు జరుపుకునేందుకు తోడ్పడతామని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘చిన్న పాటి మనస్పర్థలు వస్తూ ఉంటాయి. అందులోనూ సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ రాత్రంతా ఈ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని వీధుల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దాంతో ఆయా వీధుల నుంచి వచ్చే వారు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందుకే అన్ని చోట్లా ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం. గస్తీ ఏర్పాటు చేస్తాం. పలు జాగ్రత్తల మధ్య సంప్రదాయాన్ని పాటించేందుకు అనుమతిస్తాం’’ అని ఆయన తెలిపారు.

చెడీ తాలీంఖానా ఈ తరతరాల నాటి సంప్రదాయం నేటికీ కొనసాగిస్తుండడం ఓ విశేషమయితే విరామం లేకుండా శతాబ్దంన్నర కాలంగా ఆచరిస్తుండడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

వీడియో క్యాప్షన్, చెడీ తాలింఖానా యుద్ధ విద్యతో బ్రిటిష్ వారితో పోరాడిన అమలాపురం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)