స్క్విడ్ గేమ్: నెట్‌ఫ్లిక్స్‌లో మనీ హైస్ట్‌ను మించిన ఆదరణ పొందుతున్న ఈ కొరియన్ థ్రిల్లర్‌లో ఏముంది?

ఫొటో సోర్స్, Netflix
- రచయిత, వైయీ యిప్ , విలియం లీ
- హోదా, బీబీసీ న్యూస్
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌పై విడుదలయిన స్క్విడ్ గేమ్ సిరీస్ గురించి రక రకాల మీమ్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో రెండు వారాల క్రితం విడుదలయి భారీ విజయం సాధించిన ఈ హైపర్ హింసాత్మక థ్రిల్లర్ గురించి సినీ ప్రియులందరూ చర్చిస్తున్నారు.
ఈ కొరియన్ సిరీస్.. మనుగడ కోసం ఆడే దారుణమైన ఆట చుట్టూ తిరుగుతుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అతి పెద్ద ఒరిజినల్ సిరీస్‌గా రీజెన్సీ కాలం నాటి రొమాన్స్ బ్రిడ్జర్‌టన్‌ను కూడా అధిగమిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఘనవిజయం సాధించిన మనీహైస్ట్, లుపిన్ సిరీస్‌లను కూడా ఇది దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్‌లో ఎంచుకున్న కథాంశం పూర్తిగా కొత్తదైనప్పటికీ, చిత్రంలో చూపించిన ఉద్వేగంతో కూడిన సన్నివేశాలు, పాత్రలు, కల్లోలపరిచే మానవ స్వభావంపై జరిగిన అధ్యయనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరయ్యాయి.
మైదానంలో హత్యలు
స్క్విడ్ గేమ్ సిరీస్‌లో అప్పులు పాలైన 456మంది ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉంటారు. వీరంతా రక్తపాతంతో కూడిన ఒక ఆటకు వశమవుతారు. అక్కడ వారు వరసగా ఆరు ఆటల సిరీస్‌లో విజేతలుగా నిలిస్తే, 45.6 బిలియన్ కొరియన్ వన్ (39 మిలియన్ డాలర్లు) గెలుచుకోగలరు.
ఈ ఆటలో ఓడిపోతే, చనిపోతారా?
ఈ ఆటలు చాలా సరళంగానే ఉంటాయి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లాగే ఉంటాయి. అమాయకమైన పిల్లలు ఆడే ఆటలను ఆశ్చర్యకరంగా హింసాత్మకమైన మరణాలతో కలిపి చూపించడంతో ప్రేక్షకులను ఈ సిరీస్‌కు అతుక్కునేలా చేసింది.
"నిస్సహాయులైన పెద్దలు.. చిన్న పిల్లలు ఆడే ఆటలో గెలిచేందుకు వారి జీవితాలనే పణంగా పెట్టే అంశానికి ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు" అని స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హుయాన్గ్ డాంగ్ హ్యుక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఈ ఆటలు చాలా సులభంగా, సరళంగా ఉంటాయి. దాంతో క్లిష్టమైన ఆట నియమాల కంటే కూడా ప్రేక్షకులు పాత్రలపై దృష్టి పెట్టగలరు" అని చెప్పారు.
ఇందులో కాస్త నాస్టాల్జియా కూడా ఉంటుంది. ఉదాహరణకు మూడో ఎపిసోడ్‌లో కనిపించిన డల్గోనా హనీ కోమ్బ్ ఛాలెంజ్‌ను చాలా మంది కొరియన్లు బాల్యంలో ఆడిన ఆటగా గుర్తు తెచ్చుకుంటారు.

ఫొటో సోర్స్, Netflix
ఈ ఛాలెంజ్‌లో ఆటగాళ్లు కాగితం కంటే పల్చగా ఉండే హనీ కోమ్బ్ క్యాండీ (మిఠాయి) నుంచి సూదితో జాగ్రత్తగా ఒక ఆకారాన్ని కట్ చేయాలి. ఆ క్యాండీ విరిగిపోతే ఆటలో ఓడిపోయినట్లే.
"స్క్విడ్ గేమ్ చూసిన తర్వాత నాకు మళ్ళీ డల్గోనా క్యాండీ తినాలనిపించింది" అని ఒక కొరియన్ యూజర్ ట్వీట్ చేశారు. ‘‘అది తిని 20 సంవత్సరాలు పైనే అయింది. అవింకా దొరుకుతున్నాయా? అది దొరుకుతుందని అనుకోవడం లేదు" అని ట్వీట్ చేశారు.
మన చుట్టూ ఉండే మన లాంటి పాత్రలే
ఈ షోలో ఉన్న పాత్రలు కూడా ఈ సిరీస్ విజయానికి కారణమని నిపుణులంటున్నారు. అందులో చాలా మంది సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినవారుంటారు.
వాళ్లందరికీ రక రకాల ఆర్ధిక సమస్యలున్నప్పటికీ, విభిన్న నేపధ్యాల నుంచి వచ్చిన వారుంటారు.
ఉదాహరణకు సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన నిరుద్యోగ వ్యక్తి జూదం సమస్యతో బాధపడుతూ కుటుంబ ఆదరణ పొందేందుకు సతమతమవుతూ ఉంటారు. ఈ ఆట ద్వారా విషాదపూరిత నేపథ్యం ఉన్న ఒక ఉత్తర కొరియావాసిని, యజమానులతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ కార్మికుడిని ఆయన కలుస్తారు.

ఫొటో సోర్స్, Netflix
"నిజజీవితంలో తరచుగా వివక్షకు, వ్యతిరేకతను ఎదుర్కొన్న యువత ముఖ్యంగా ఈ పాత్రల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు" అని సాంగ్ మ్యున్గ్ యూనివర్సిటీలో గ్లోబల్ కల్చరల్ కంటెంట్ ప్రొఫెసర్ కిమ్ పియోంగ్ గాంగ్ చెప్పారు.
‘‘దక్షిణ కొరియాలో విపరీతమైన పోటీతత్త్వం ఉన్న సమాజం అనేక మందిని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెడుతోంది. ఎంత కష్టపడినా అందరికీ టాప్ యూనివర్సిటీలలో సీట్లు సంపాదించడం లేదా మంచి ఉద్యోగాలు సంపాదించడం సాధ్యం కాదు.
ఈ షోలో ఆడే ఆటలు, చాలా హింసాత్మకంగా ఉన్నప్పటికీ ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని చూపించాయి.
ఈ ఆటలో పాల్గొన్నవారందరూ సమానమే. బయట ప్రపంచంలో అసమానతను, వివక్షను ఎదుర్కొన్న ప్రజలకు ఒక న్యాయమైన పోటీని ఎదుర్కొనేందుకు ఈ సిరీస్‌లో అవకాశం దొరికింది" అని ఒక గేమింగ్ అధికారి చెప్పారు.
రెడ్ లైట్, గ్రీన్ లైట్
పాశ్చాత్య మీడియా సంస్థలు స్క్విడ్ గేమ్ సిరీస్‌ని , 2019లో ఆస్కార్ గెలుచుకున్న పారాసైట్‌తో పోలుస్తున్నాయి. పారాసైట్ చిత్రం కూడా ఆర్ధిక అసమానతలు, సమాజంలో నెలకొన్న అన్యాయాలను చూపించింది.
కానీ, తూర్పు ఆసియాలో ప్రేక్షకులు మాత్రం ఈ సిరీస్ 2014లో విడుదలైన జపాన్ సినిమా 'ది గాడ్స్ విల్'తో పోలుస్తున్నారు.
ఈ సినిమా కథాంశం హైస్కూల్ విద్యార్థుల చుట్టూ అల్లుకుని ఉంటుంది.
కొంత మంది ఈ సినిమాను స్క్విడ్ గేమ్ కాపీ కొట్టిందని కూడా ఆరోపణలు చేశారు.
ఉదాహరణకు, ది గాడ్స్ విల్‌లో కూడా పిల్లలు ఆడుకునే సంప్రదాయ "రెడ్ లైట్, గ్రీన్ లైట్" ఆట ఉంటుంది.
స్క్విడ్ గేమ్‌లో ఉన్న ఒక సీన్‌లో భారీ రోబో యువతి తన లేజర్ కళ్ళతో ఆటలో ఓడిపోయిన క్రీడాకారులను వెతికి పట్టుకుంటుంది. ఆ తర్వాత వారిని చంపేస్తారు.
అయితే, ఈ అభియోగాలను స్క్విడ్ గేమ్ దర్శకుడు హుయాంగ్ ఖండించారు. ఈ రెండు షోలకు ఎటువంటి సంబంధం లేదని కేవలం షో ముఖ్యాంశాన్ని బట్టీ రెంటినీ పోలుస్తున్నారని అన్నారు.
"నేను 2008 నుంచే స్క్విడ్ గేమ్ కోసం ప్లాన్ చేసుకుని, 2009లో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. ఈ రెండు సినిమాల్లో ఒకేలా ఉన్న విషయాలు యాదృచ్ఛికంగా జరిగినవే కానీ, వాటి నుంచి కాపీ కొట్టలేదు" అని ఆయన చెప్పారు.
ఏదైనా కూడా, ఈ షో చుట్టూ అలుముకున్న హడావిడి సెకండ్ సీజన్ తీయమనేంత వరకూ వచ్చింది. కానీ, అందుకోసం అభిమానులు చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది.
"నేను స్క్విడ్ గేమ్ 2 కోసం పక్కా ప్రణాళికలేమి చేయలేదు. దాని గురించి ఆలోచిస్తుంటేనే చాలా అలసటగా అనిపిస్తోంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- టీవీ ప్రకటనల్లో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, కోల్గేట్ను దాటేసిన బీజేపీ
- ప్రపంచంలోనే అత్యంత విలువైన మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్!
- కష్టాల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ను భారతీయులు ఆదుకుంటారా
- యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను కేంద్రం ఏం చేయబోతోంది
- మెనోపాజ్: మలి వయసు మహిళల పోరాటమే ప్రధానాంశంగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్, భారత సమాజం దీని గురించి ఎప్పటికి మాట్లాడగలదు?
- ఓషో పాత్రలో ఆమిర్ ఖాన్... ఆనంద్ షీలాగా ఆలియా భట్
- 'సేక్రెడ్ గేమ్స్'లో చిహ్నాల అర్థం ఏంటి?
- తాండవ్: అమెజాన్ వెబ్ సిరీస్‌పై ఆగ్రహించిన హిందువులకు క్షమాపణలు చెప్పిన నటీనటులు, సిబ్బంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













