కష్టాల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ను భారతీయులు ఆదుకుంటారా

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ వినియోగదారుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఒక చౌక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది. మొబైల్ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకొచ్చారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ సంస్థను భారత వినియోగదారులు ఆదుకుంటారా అన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. దీనిపై 'బీబీసీ'కి చెందిన జో మిల్లర్ విశ్లేషణ.
బాలీవుడ్‌కు చెందిన వందలాది మంది నటులు భారత్‌లోని సినీ, టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పడే శ్రమను తన 20 ఏళ్ల కెరీర్‌లో నిత్యం చూస్తూనే ఉన్నానంటారు వినోద రంగంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న రోహిత్ ఖిల్నానీ. అలాంటిది 2017లో హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ముంబయిలోని ఓ హోటల్‌లో హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో అమెరికా నటులూ అదే పనిలో ఉన్నారని అర్థమైందంటారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి నేరుగా భారత్ రావడం ప్రారంభించిన హాలీవుడ్ నటుల్లో బ్రాడ్‌పిట్ కూడా ఒకరు.
క్రిస్టియన్ బాలె, విల్ స్మిత్ వంటి నటులూ బ్రాడ్ పిట్ బాటలోనే సాగారు. అయితే, వీరెవరూ వార్నర్ బ్రదర్స్, సోనీ వంటి ఘనత వహించిన స్టూడియోల తరఫున భారత్‌కు రాలేదు. వారంతా అప్పటికి కొత్త వినోద రంగ సంస్థయిన నెట్‌ఫ్లిక్స్ తరఫున భారత్‌కు వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన ఈ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ గత వారం భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెట్టింది. తన సొంత దేశం అమెరికాలో 1,26,000 మంది చందాదారులను కోల్పోయిన తరువాత ఆ సంస్థ ఈ కొత్త అడుగులు వేసింది. రూ.199 (సుమారు 2.8 అమెరికన్ డాలర్లు) చందా ధరకే భారతీయ మొబైల్ వినియోగదారులు నెలంతా నెట్‌ఫ్లిక్స్‌లోని కంటెంట్ చూడొచ్చని ప్రకటించింది. చందాదారుల సంఖ్య 10 కోట్లకు పెంచుకునే లక్ష్యంతోనే నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా సంస్థలు చిత్రీకరించిన సేక్రెడ్ గేమ్స్, చాప్ స్టిక్స్, లస్ట్ స్టోరీస్ వంటి సిరీస్‌లపై భారీ మొత్తం వెచ్చించడాన్ని పక్కనపెడితే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ పరిధి సాపేక్షంగా తక్కువే.
130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆ సంస్థకు 40 లక్షల నుంచి 60 లక్షల మంది చందాదారులు మాత్రమే ఉన్నారని అంచనా. అదేసమయంలో డిస్నీకి చెందిన స్ట్రీమింగ్ సంస్థ హాట్‌స్టార్ తనకు 30 కోట్ల మంది భారతీయ చందాదారులున్నట్లు కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ గణాంకాల ఆధారంగా చెబుతోంది.
మిగతా మార్కెట్ల కంటే భారత్ భిన్నమైనదని.. ఇక్కడ చందా ధర కీలకమైని కన్సల్టింగ్ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) ఇండియా భాగస్వామిగా ఉన్న రాజీవ్ బసు చెబుతున్నారు.
'నెట్‌ఫ్లిక్స్ ఇంతవరకు ఇంటర్నేషనల్ కంటెంట్, ఇంగ్లిష్, హిందీల్లో ఉండే భారతీయ కంటెంట్‌ను మాత్రమే ఇష్టపడే విద్యాధిక వర్గాల వినియోగదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంద'న్నది ఆయన మాట.
మొబైల్ డాటా, కేబుల్ కనెక్షన్ ధరలు అత్యంత చౌకగా ఉండే భారత్‌లో తమ మేలిమి కంటెంట్ విలక్షణంగా నిలుస్తుందని, ఆ ఒక్క కారణంతో వినియోగదారులు తమను ఆదరిస్తారని నెట్‌ఫ్లిక్స్ భావించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇందుకు పూర్తి భిన్నంగా క్రికెట్ మ్యాచ్‌ల లైవ్‌లతో హాట్‌స్టార్, ప్రైమ్ ప్యాకేజీ పేరుతో ఉచితంగానే విస్తృతమైన కంటెంట్‌ను అందించి అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వీరితో పాటు మొబైల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అనేక చిన్న తరహా స్ట్రీమింగ్ సంస్థలూ భారత మార్కెట్‌లో ఆదరణ సాధించాయి.
అయితే, ఉత్తర అమెరికా, ఐరోపా మాదిరిగా భారత మార్కెట్ ఇప్పటికీ సంతృప్త స్థాయికేమీ చేరలేదు. ఇక్కడి వినియోగదారులకు ఒరిజినల్ కంటెంట్‌పై ఉన్న తృష్ణ ఇలాంటి సంస్థలకు ఇంకా అవకాశముందని సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది కాలంలో భారత్‌లో డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు ఏకంగా 262 శాతం పెరిగి రూ.1420 కోట్లకు చేరాయని కన్సల్టింగ్ సంస్థ ఈవై అంచనా వేసింది.
వీడియో ప్లాట్‌ఫాంలను వినియోగదారులు సబ్‌స్క్రైబ్ చేయడంతో ఇదంతా సాధ్యమైందని ఈవై చెబుతోంది. దేశంలో 5జీ సేవలు వస్తే ఇది మరింత పెరగుతుంది. ఈ రంగంలో కొత్త సంస్థలకూ ఇంకా అవకాశం ఉంది.
మరో కన్సల్టింగ్ సంస్థ బీసీజీ అంచనాల ప్రకారం భారతీయులు సగటున ప్రింట్, టీవీ, రేడియో, డిజిటల్ అన్ని మాధ్యమాలపైనా సగటున రోజుకు 4.6 గంటల సమయమే వెచ్చిస్తున్నారు. సగటున 11.8 గంటల సమయం ఇందుకోసం వెచ్చిస్తున్న అమెరికన్లతో పోల్చితే ఇది చాలా తక్కువ.
చందాదారులను పెంచుకునే లక్ష్యంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కానీ దాని పోటీ సంస్థలు కానీ టైర్ 2, టైర్ 3 పట్టణాలపై దృష్టి పెడుతున్నాయని పీడబ్ల్యూసీకి చెందిన రాజీవ్ బసు చెబుతున్నారు.
అయితే.. ప్రస్తుత తరహా కంటెంట్‌తోనే ముందుకు సాగితే నెట్‌ఫ్లిక్స్ తన లక్ష్యాలు చేరుకోలేదని.. సేక్రెడ్ గేమ్స్ వంటివాటితో పాటు ప్రాంతీయ భాషల్లోని కంటెంట్ కూడా అందించినప్పుడే అది సాధ్యమవుతున్నారు బసు.
ఎన్డీటీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రోహిత్ ఖిల్నానీ మాట్లాడుతూ.. 'వారు చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారులను కూడా చేరుకోవాల'న్నారు. మొబైల్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగితే ఫలితం ఉంటుందన్నారు.
అయితే, చిన్నపట్టణాలు, గ్రామాలవారిలో ఎక్కువ శాతం మంది అధిక స్టోరేజీ ఉన్న మొబైల్ ఫోన్స్ వాడలేరని.. కాబట్టి, చందామొత్తాలు భారీగా ఉంటే భరించలేరని.. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ స్ట్రీమింగ్ యాప్స్ వాడే పరిస్థితి ఉండదని.. ఉన్నవాటిలో అత్యుత్తమమైనది ఏదో అది మాత్రమే రూరల్, సెమీ అర్బన్ మార్కెట్లో ఆదరణ పొందుతుందని విశ్లేషించారు.
భారతీయ మార్కెట్లో విస్తరించడానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ప్రణాళికలు వేసుకుంటున్నా నియంత్రణ సంస్థలు జోక్యం చేసుకుంటే ఆ ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో చెప్పలేని పరిస్థితి.

ఇటీవల భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) టీవీ చానళ్ల విషయంలో చూసే చానళ్లకే డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకొచ్చినట్లుగానే.. ఈ స్ట్రీమింగ్ మార్కెట్లోనూ జోక్యం చేసుకుని నెలవారీ చందాలు కాకుండా చూసే కంటెంట్‌కే చెల్లించాలన్న విధానం తీసుకొస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రణాళికలకు ఇబ్బందే.
నెట్‌ఫ్లిక్స్ మరే ఇతర దేశంలోనూ చేయనట్లుగా భారతీయ మార్కట్లో తన పెట్టుబడులను చాలా వేగంగా పెంచుకుంటూ పోతోంది. కొత్తగా 13 సినిమాలు, 9 ఒరిజినల్ సిరీస్‌లను అందివ్వడానికి సిద్ధమవుతోంది. షారుక్ ఖాన్ వంటి భారతీయ స్టార్లతో కలిసి డ్రామా, హారర్, కామెడీ వంటి అన్ని రసాల కంటెంట్‌ను తీసుకొస్తోంది.
అమెరికాతో పోల్చితే ఇక్కడి కంటెంట్ చౌకగానే రూపొందించడం సాధ్యమవుతుంది కాబట్టి ఇవి సక్సెస్ అయితే నెట్‌ఫ్లిక్స్ పోటీలో నిలదొక్కుకోగలుగుతుందని రోహిత్ ఖిల్నానీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








