నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక

నేపాల్ ప్రాంతం హుమ్లాలో కనిపిస్తున్నా చైనా నిర్మాణాలు

ఫొటో సోర్స్, NAMKHA RURAL MUNICIPALITY

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రాంతం హుమ్లాలో కనిపిస్తున్నా చైనా నిర్మాణాలు
    • రచయిత, మైఖేల్ బ్రిస్టోవ్
    • హోదా, బీబీసీ న్యూస్

నేపాల్ తమ దేశ సరిహద్దులను చైనా ఆక్రమిస్తోందని ఆరోపిస్తూ రూపొందించిన నివేదిక ఒకటి బీబీసీకి లభించింది.

తమ భూభాగంలో చైనా జోక్యం చేసుకుంటోందని నేపాల్ అధికారికంగా వాదించటం ఇదే తొలిసారి.

నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని హమ్లా జిల్లాలోకి చైనా చొరబడుతోందన్న ఆరోపణలు రావటంతో గత సెప్టెంబర్‌లో నేపాల్ దర్యాప్తు నిర్వహించి ఈ నివేదికను రూపొందించింది.

అయితే తమ దేశం నుంచి ఎలాంటి ఆక్రమణలూ లేవని కఠ్మాండూలోని చైనా రాయబార కార్యాలయం తిరస్కరించింది.

బీబీసీ అడిగిన ప్రశ్నలకు నేపాల్ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు.

సరిహద్దుల్లో నేపాల్ సైనికులు

ఫొటో సోర్స్, BISHNU BAHADUR TAMANG

ఈ నివేదికను ఇంకా ఎందుకు బహిరంగంగా ప్రకటించలేదనే అంశంపై స్పష్టత లేదు. అయితే.. భారతదేశంతో సుదీర్ఘ కాలంగా ఉన్న సంబంధాలను ప్రతిసంతులనం చేయటానికి.. నేపాల్ ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో దక్షిణాన ఉన్న భారీ పొరుగు దేశం చైనాతో తన సంబంధాలను మెరుగుపరచుకుంది.

ఈ రిపోర్టులో కనుగొన్న అంశాలు.. చైనాతో పెరుగుతున్న సంబంధాలపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది.

నేపాల్, చైనా దేశాల మధ్య హిమాలయాల వెంట దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది. ఈ రెండు దేశాల మధ్య 1960వ దశకం తొలి నాళ్లలో పలు ఒప్పందాల ద్వారా ఈ సరిహద్దును ఖరారు చేశారు.

ఈ సరిహద్దులో చాలా భాగం చేరుకోవటానికి చాలా కష్టంగా ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉంది. కొన్ని కిలోమీటర్లకు ఒకటి చొప్పున దిమ్మెలు పాతటం ద్వారా సరిహద్దును గీశారు.

దీనివల్ల కొన్నిసార్లు సరిహద్దు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తించటం కష్టమవుతుంది.

హుమ్లా

చైనా ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఉందనే వార్తలు రావటంతో నేపాల్ ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను హమ్లా జిల్లాకు పంపించాలని నిర్ణయించింది. సరిహద్దులో నేపాల్ వైపు చైనా వరుస భవనాలను నిర్మించిందని కొందరు చెప్తున్నారు.

పోలీస్, ప్రభుత్వ ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.

ఈ బృందం తయారుచేసిన నివేదిక బీబీసీకి లభించింది. సరిహద్దు వెంట చైనా భద్రతా బలగాల నిఘా కార్యకలాపాల వల్ల నేపాల్ భూభాగంలో ఉన్న లాలుంగ్జాంగ్ అనే ప్రాంతంలో.. మతపరమైన కార్యకలాపాలు నిలిచిపోయాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.

సరిహద్దుకు ఆనుకుని చైనాలో ఉన్న మౌంట్ కైలాశ్‌కి సమీపంలో ఉండే ఈ నేపాల్ ప్రాంతానికి సంప్రదాయంగా తీర్థయాత్రికులు వస్తుంటారు. కైలాస పర్వతం హిందువులకు, బౌద్ధులకు పవిత్ర క్షేత్రం.

అలాగే నేపాల్ రైతులు తమ పశువులను మేపుకోవటాన్ని కూడా చైనా పరిమితం చేస్తోందని ఆ నివేదిక తెలిపింది.

అదే ప్రాంతంలో ఒక సరిహద్దు దిమ్మె చుట్టూ చైనా ఫెన్సింగ్ నిర్మిస్తోందని, నేపాల్ భూభాగంలో ఒక కాలువను, ఒక రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని కూడా చెప్పింది.

అయితే.. నేపాల్ భూభాగంలో నిర్మించినట్లు భావించిన చైనా కట్టడాలను నిజానికి సరిహద్దులో చైనా వైపునే కట్టారని ఈ టాస్క్‌ఫోర్స్ గుర్తించింది.

వీడియో క్యాప్షన్, నేపాల్: భూకంపాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు కోవిడ్‌తో విలవిల్లాడుతోంది

స్థానిక నేపాలీ ప్రజలు సరిహద్దు సమస్యల గురించి మాట్లాడటానికి తిరస్కరిస్తున్నారని.. సరిహద్దుకు ఆవల చైనాలోని మార్కెట్లకు వెళ్లివచ్చే వెసులుబాటు కొనసాగాలన్న ఆలోచన అందుకు కారణమని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

భద్రత కోసం ఈ ప్రాంతంలో నేపాల్ భద్రతా బలగాలను మోహరించాలని ఈ నివేదిక సిఫారసు చేసింది.

ఈ తరహా సరిహద్దు సమస్యలను పరిష్కరించటానికి గతంలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను నేపాల్, చైనాలు పునరుద్ధరించాలని కూడా సూచించింది.

‘‘సరిహద్దు వెంట నివసించే ప్రజలకు.. ఆ సరిహద్దు కచ్చితంగా ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్పాలి. దానివల్ల వారు నేపాల్ భూభాగాన్ని మరింత మెరుగుగా రక్షించగలరు’’ అని నేపాల్ సర్వే విభాగం మాజీ అధిపతి బుధ్ని నారాయణ్ శ్రేష్ట చెప్పారు.

అయితే ఆక్రమణలేవీ లేవని చైనా తిరస్కరిస్తుండటంతో.. నేపాల్ వెంట తమ సరిహద్దును బలోపేతం చేస్తుండటంలో చైనా ఉద్దేశం ఏమిటనేది తెలియటం లేదు. భద్రత ఒక కారణం కావచ్చు.

చారిత్రకంగా ఈ సరిహద్దుల గుండా ఇరు దేశాల్లోకి అనధికారికంగా తీర్థయాత్రికులు, వ్యాపారుల రాకపోకలు కొంతవరకూ జరిగేవి. కానీ ఈ కదలికలను చైనా క్రమక్రమంగా నియంత్రిస్తూ వచ్చింది.

చైనా తన ప్రాంతీయ ప్రత్యర్థి అయిన భారత్ విషయంలో ఆందోళన చెందుతుండవచ్చునని నేపాల్ మాజీ దౌత్యవేత్త విజయ్ కాంత్ కర్ణ అభిప్రాయపడ్డారు. భారత్, చైనాల మధ్య కూడా సరిహద్దు వివాదాలున్నాయి.

‘‘బయటి శక్తుల నుంచి చొరబాట్లు ఉండవచ్చునని వారు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి సరిహద్దు వెంట సంబంధాలను తెంపేయాలని వారు భావిస్తుండవచ్చు’’ అని చెప్పారాయన.

వీడియో క్యాప్షన్, తాపీ మేస్త్రీలుగా నేపాల్ మహిళలు

వ్యతిరేక దిశలో కదలికల విషయంలో కూడా చైనా ఆందోళన చెందుతుండవచ్చు.

ఈ సరిహద్దులో చైనా వైపున్న ప్రాంతం టిబెట్. ఇక్కడ చైనా నుంచి తాము అణచివేతకు గురవుతున్నామని భావిస్తున్న చాలా మంది జనం పారిపోయారు.

దాదాపు 2,000 మంది టిబెట్ శరణార్థులు నేపాల్‌లో నివసిస్తున్నారు. మిగతావారు ఇండియా, ఇతర ప్రాంతాలకు వెళ్లారు.

వారు పారిపోవటానికి ఉపయోగించే ఈ మార్గాన్ని మూసివేయటానికి చైనా ఇటీవలి సంవత్సరాల్లో ప్రయత్నించింది.

నేపాల్ భూభాగాలను చైనా ఆక్రమిస్తోందని గత రెండేళ్లుగా వార్తలు వచ్చాయి. దాంతో నేపాల్ రాజధాని కఠ్మాండులో అప్పుడప్పుడు నిరసన ప్రదర్శనలు జరిగేవి. గత నెలలో కూడా అలాంటి నిరసన జరిగింది.

దీనికి ప్రతిస్పందనగా నేపాల్‌లోని చైనా రాయబార్య కార్యాలయం జనవరి నెలలో ఒక ప్రకటన జారీచేసింది. అందులో.. ‘‘అసలు వివాదమనేది ఏదీ లేదు. బూటకపు వ్యక్తిగత నివేదికలతో నేపాల్ ప్రజలు తప్పుదారిన పడరని ఆశిస్తున్నాం’’ అని చెప్పింది.

అయితే నేపాల్ టాస్క్‌ఫోర్స్ నివేదికలో ప్రస్తావించిన నిర్దిష్ట ఆరోపణల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు.

సరిహధ్దు అంశాన్ని నేపాల్ ప్రభుత్వం చైనాతో చర్చించినట్లు అనుకుంటున్నారు. కానీ జవాబుగా చైనా ఏం చెప్పింది అనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించటం లేదు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)