భారత్‌కు నేపాల్ హెచ్చరిక: ‘మా భూభాగంలో నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయండి’

ఫొటో సోర్స్, ANI
లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలతోపాటు భారత్‌తో కొనసాగుతున్న సరిహద్దు వివాదాలన్నీ చారిత్రక ఆధారాలు, ఒప్పందాల ఆధారంగా పరిష్కృతం కావాలని నేపాల్ ప్రభుత్వం అంటోంది.
తాజాగా వివాదానికి కారణమైన నిర్మాణ పనులు తమ భూభాగంలోనే జరుగుతున్నాయని శనివారం కఠ్‌మాండూలోని భారత్ దౌత్య కార్యాలయ అధికార ప్రతినిధి పునరుద్ఘాటించారు. దీంతో నేపాల్ కూడా దీనిపై స్పందించింది.
తాజా వివాదంపై భారత్ దౌత్య కార్యాలయ అధికార ప్రతినిధి శనివారం స్పందించారు. ‘‘సరిహద్దు వివాదాల విషయంలో భారత్ వైఖరి సుస్పష్టం. దీనిపై మా వైఖరిని ఎప్పుడో నేపాల్ ప్రభుత్వానికి తెలియజేశాం’’అని వివరించారు.
ఆ తర్వాత రోజు దీనిపై నేపాల్ క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అనంతరం ఈ అంశంపై నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి గ్యానేంద్ర బహదూర్ కార్కి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
‘‘చారిత్రక ఆధారాలు, ఒప్పందాలు, మ్యాప్‌ల ఆధారంగా భారత్, నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదాలు పరిష్కృతం కావాలి. వీటిని పరిష్కరించుకునేందుకు నేపాల్ కట్టుబడి ఉంది’’అని ఆయన చెప్పారు.
‘‘మహాకాళి నదికి తూర్పున ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు నేపాల్‌లో అంతర్భాగం. ఈ విషయంలో నేపాల్ వైఖరి ఇదివరకే సుస్పష్టం చేశాం. నేపాల్ భూభాగంలో ఏకపక్షంగా చేపడుతున్న నిర్మాణపు పనులను భారత్ వెంటనే నిలిపివేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, RSS
మోదీ వ్యాఖ్యలతో వివాదం
నెల రోజుల నుంచీ భారత్-నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదంపై వార్తలు పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలతో దీనిపై చర్చ మొదలైంది.
లిపులేఖ్‌లో రోడ్డు విస్తరణ ప్రణాళికలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 30న స్పందించారు. దీనిపై నేపాల్‌లోని రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఆ తర్వాత కాఠ్‌మాండూలోని భారత దౌత్య కార్యాలయం స్పందించింది. తాజాగా నేపాల్ ప్రభుత్వం కూడా స్పందించింది.
డిసెంబరు 30న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. లిపులేఖ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) చేపడుతున్న నిర్మాణపు పనుల గురించి ఆయన ప్రస్తావించారు.
‘‘మీకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అడ్డుపడుతున్నవారే మాన్‌సరోవర్‌కు ముఖద్వారమైన మానస్‌ఖండ్‌లోనూ రోడ్లు నిర్మించకుండా అడ్డుపడుతున్నారు’’అని మోదీ వ్యాఖ్యానించారు.
‘‘అయితే, మేం టనక్‌పుర్-పిథోర్‌గఢ్‌లో అన్ని కాలాల్లోనూ సేవలందించే రోడ్డు మార్గాన్ని నిర్మించాం. లిపులేఖ్‌లోనూ ఓ రోడ్డు మార్గం ఏర్పాటుచేశాం. దాన్ని మరింత విస్తరించే పనులు కొనసాగుతున్నాయి’’అని ఆయన అన్నారు.
అయితే, లిపులేఖ్ తమ భూభాగంలో అంతర్భాగమని నేపాల్ ఎప్పటి నుంచో చెబుతోంది. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతం భారత సైన్యం ఆధీనంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
వరస వివాదాలు..
2018 ఏప్రిల్ 9న కూడా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ధార్‌చులా-లిపులేఖ్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించడంతో నేపాల్ నిరసన వ్యక్తంచేసింది.
రోడ్డు ప్రారంభించిన వెంటనే, కాఠ్‌మాండూలోని భారత రాయబారికి నేపాల్ విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. నేపాల్ గడ్డపై భారత్ నిర్మాణపు పనులు చేపట్టకూడదని నిరసన వ్యక్తంచేసింది.
అయితే, తాము నేపాల్ భూభాగంలో ఎలాంటి నిర్మాణపు పనులూ చేపట్టడంలేదని, ఆ ప్రాంతం తమ భూభాగంలో అంతర్భాగమని భారత్ సమాధానం ఇచ్చింది. అయితే, మోదీ తాజా వ్యాఖ్యలతో ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు.
ఇదివరకు భారత్ ఆధీనంలో ఉన్న కాలాపానీ, లింపియాధురాలను కూడా తమ భూభాగంలో చూపిస్తూ నేపాల్ తమ మ్యాప్‌ను అప్‌డేట్ చేసింది.
సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం చర్చలకు నేపాల్ పిలుపునిచ్చింది. మరోవైపు విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలకు భారత్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఈ చర్చలు వాయిదా పడ్డాయి.
2015లో లిపులేఖ్ పాస్ గుండా వాణిజ్యం కోసం భారత్, చైనాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ విషయంపై నేపాల్‌కు సమాచారం లేదు.
ఈ ఒప్పందాన్ని నేపాల్ వ్యతిరేకించింది. రెండు పొరుగు దేశాలకు దౌత్య ప్రతినిధుల ద్వారా నిరసన కూడా తెలియజేసింది.

ఫొటో సోర్స్, AFP
నేపాల్ ఏం అంటోంది?
1816లో కుదిరిన సుగౌలీ ఒప్పందం ప్రకారం, మహాకాళి నదికి తూర్పునున్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలు తమ భూభాగంలో అంతర్భాగమని నేపాల్ చెబుతోంది.
సుగౌలీ ఒప్పందంతోపాటు నేపాల్-భారత్ సంబంధాల్లో ఒడిదుడుకులను చర్చల ద్వారా పరిష్కరించేందు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారత్‌లో నేపాలీ ప్రధాని పర్యటన సమయంలో ద్వైపాక్షిక అంశాల్లో చర్చల్లో భాగంగా కాలాపానీ వివాదంపైనా చర్చలు జరగాలని నేపాలీ విదేశాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఈ పర్యటన వాయిదా పడింది.
1960ల్లో భారత్-చైనా యుద్ధం తర్వాత, నేపాల్ ఉత్తర సరిహద్దుల్లోని కాలాపానీ నుంచి భారత్ సేనలను ఉపసంహరించుకోవాలని నేపాల్ డిమాండ్ చేసింది.
1994లో అప్పటి నేపాల్ ప్రధాని మన్మోహన్ అధికారి భారత్‌లో పర్యటించినప్పుడు, 1997లో భారత ప్రధాని ఐకే గుజ్రాల్‌లో కాఠ్‌మాండూలో పర్యటించినప్పుడు కూడా నేపాల్ ఈ విషయాన్ని ప్రస్తావించింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తరువాత కూడా మళ్లీ కరోనా సోకవచ్చా? ఒమిక్రాన్ గురించి ఏడు ప్రశ్నలు, జవాబులు
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
- బీజేపీ నుంచి చేరికలతో అఖిలేశ్ యాదవ్‌కు కొత్త తలనొప్పులు - సమాజ్‌వాది పార్టీలో టికెట్ల చిక్కులు
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










