ఈశాన్య భారత్: శాంతి మార్గాన్ని చూపించిన ఖడ్గమృగం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతాంజలీ కృష్ణన్, సాలీ హోవార్డ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్ ప్లానెట్
అది 2008 సెప్టెంబర్ 1 అర్ధరాత్రి. అప్పుడే దేబకుమార్ దత్తా ఇంట్లో ఫోన్ మోగింది. కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానస్ నేషనల్ పార్క్‌కు తరలించిన ఒంటికొమ్ము ఖడ్గమృగాలలో ఒకటి, శివార్లలోని గ్రామం వైపు పరుగెడుతోందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
ఇక్కడ మనుషులకు, జంతువులకు మధ్య మళ్లీ ఏదైనా సంఘర్షణ మొదలైతే, ఖడ్గమృగాలను ఇక్కడికి తిరిగి రప్పించాలన్న ప్రాజెక్టు మొత్తం సమస్యల్లో పడే ప్రమాదముంది.
"ఖడ్గమృగాన్ని చూడటానికి 500 మంది గ్రామస్తులు గుమిగూడారు. అక్కడి పరిస్థితి చూసి నా గుండె వణికింది'' అని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)లో జూనియర్ రీసెర్చర్ దేబకుమార్ దత్తా అన్నారు.
కానీ, దగ్గరికి వెళ్లాక ఆయన మనసు కుదుటపడింది. ''శుభప్రదమంటూ దాని పేడను సేకరించే పనిలో కొందరు ఉన్నారు. మరికొందరు రైనో అడుగులను గుర్తిస్తూ వెదురు కర్రతో నేల మీద గీతలు గీస్తూ చూపిస్తున్నారు'' అని దత్తా వెల్లడించారు.
అక్కడి దృశ్యం చూశాక, మానస్ పార్క్‌లోకి ఖడ్గమృగాలను తిరిగి రప్పించాలన్న తపన తన ఒక్కడిదే కాదని దత్తాకు అర్థమైంది.
రైనోలు ఇక్కడకు రావడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తారని మొదట ఆయన భయపడ్డారు. కానీ, అందుకు విరుద్ధంగా వారు వాటిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు.
14 సంవత్సరాల తరువాత, మానస్ నేషనల్ పార్క్‌లోని ఖడ్గమృగాల పునఃప్రవేశ కార్యక్రమం మరెక్కడా లేని విధంగా అనేక పాఠాలను నేర్పడానికి సిద్ధంగా ఉంది.
స్థానికులు, ఖడ్గమృగాల మధ్య ఉన్న అనుబంధం ఇద్దరినీ ప్రమాదకరమైన గతం నుండి దూరంగా నడిపించడంలో సహాయపడింది.
2003 నుండి, అస్సాం ప్రభుత్వం మానస్ పార్క్‌ను, దానిని ఆనుకుని ఉన్న అడవుల విస్తీర్ణాన్ని క్రమం తప్పకుండా విస్తరింపజేస్తోంది'' అని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ మీనన్ చెప్పారు.
అనాథ ఖడ్గమృగం పిల్లలు, జింకలు, ఎలుగుబంట్లు, ఏనుగులను వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్, అస్సాం అటవీ శాఖలు సంయుక్తంగా రక్షించి వాటిని పెంచాయి.
అస్సాంలోని వివిధ ప్రాంతాల నుంచి అడవి ఖడ్గమృగాలను కూడా పార్కులో తిరిగి ప్రవేశపెట్టారు.
''అవి చిరుతలు కావచ్చు, పులులు కావచ్చు, మరేవైనా కావచ్చు. జంతువులను తిరిగి ప్రవేశ పెట్టడం అనే ప్రక్రియకు మానస్ మంచి మోడల్‌గా నిలిచింది'' అని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధృతి బెనర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గతమంతా అయోమయం
అస్సాంలో నివసించిన తొలి తెగగా బోడోలకు పేరుంది. భాషాపరంగా, జాతిపరంగా వీరు రాష్ట్రంలోని ఇతర ప్రజలకు భిన్నంగా ఉంటారు. ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కావాలంటూ వీరు మొదలుపెట్టిన ఉద్యమం 1980ల చివరి నాటికి హింసాత్మకంగా మారింది.
బోడోలాండ్ లిబరేషన్ టైగర్స్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ వంటి సాయుధ వేర్పాటువాద గ్రూపులు మానస్ పార్క్‌ను షెల్టర్ జోన్‌గా మార్చుకున్నాయి.
"అటవీ సంరక్షణ, అభివృద్ధి పనులు, ఆర్థిక అవకాశాలు ఇక్కడ నిలిచిపోయాయి" అని స్థానిక కన్సర్వేటరీ సంస్థ న్యూ హారిజన్ కార్యదర్శి మహేష్ మోషహరి గుర్తు చేసుకున్నారు. ''అడవుల నరికివేత, వేట ప్రధాన జీవనోపాధిగా మారింది'' అని ఆయన అన్నారు.
అప్పట్లో మానస్‌లో ఉన్న మొత్తం 100 ఖడ్గమృగాలు అదృశ్యమయ్యాయి. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులుల సంఖ్య బాగా తగ్గింది.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ప్రవేశించిన ఏడు సంవత్సరాల తర్వాత, మానస్ పార్క్, అందులో నివసించే బోడో తెగను ప్రమాదంలో ఉన్న వారసత్వ సంపదగా 1992లో యునెస్కో ప్రకటించింది. అప్పట్లో భారతదేశం నుంచి వెళ్లిన ఏకైక ఎంట్రీ ఇదే.
2003లో బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీఆర్) ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, బీటీఆర్‌ల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరిగింది. ఇందులో మానస్ పార్క్ అంశం ప్రధానంగా ఉంది.
"మానస్ విధ్వంసానికి ప్రపంచం మొత్తం బోడో ప్రజలనే నిందించడంతో మేం అవమానానికి గురయ్యాం'' అని బీటీఆర్ డిప్యూటీ చీఫ్, అప్పట్లో అడవులు, విద్యాశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించిన కంపా బోర్గోయరీ అన్నారు.
''మానస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకురావడం మా జాతి ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Rajib Bordoloi/IFAW-WTI
మీనన్ 2006లో మానస్‌లోని పిగ్మీ హాగ్ (పొట్టి పందులు) గురించి పరిశోధిస్తున్నప్పుడు, ఆయనకు నల్లతాచు పాము ఎదురు పడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. దక్షిణ, ఆగ్నేయాసియాలోని దట్టమైన, నిశ్చల అరణ్యాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది.
బయటి ప్రపంచానికి ఎక్కువగా కనిపించని ఈ పాము ఉనికి మానస్‌లో కనిపించడమంటే ఇక్కడ తిరిగి జంతుజాలాన్ని ప్రవేశపెట్టేందుకు అనువైన వాతావరణం ఉందన్న అభిప్రాయం మీనన్‌లో కలిగింది.
ఈ అడవి, గడ్డి భూముల నుంచి మాయమైన జంతువులను మళ్లీ ఇక్కడికి తీసుకురావొచ్చని మీనన్ భావించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు పొడవైన కొమ్మున్న ఖడ్గమృగాలు, ఏనుగులకు అనువైన నివాసం.
మీనన్ , ఆయన సహచరులు కలిసి, స్థానికులకు అటవీయేతర జీవనోపాధిని డెవలప్ చేయడానికి, అడవిని రక్షించడానికి, అలాగే, ఖడ్గమృగాలు, ఏనుగులు, జింకలు, చిరుతలు, అడవి గేదెలను తిరిగి పెంచడానికి కమ్యూనిటీ-ఆధారిత పరిరక్షణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
తూర్పున 250 మైళ్ల దూరంలో ఉన్న కాజీరంగాలోని వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రం నుండి అక్కడి అధికారులు సంరక్షించి పెంచిన అనాథ ఖడ్గమృగాలు, నల్ల ఎలుగుబంటి పిల్లలను మానస్‌లో ప్రవేశపెట్టారు.
అదే సమయంలో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ సంస్థ పెద్ద ఖడ్గమృగాలను అస్సాంలోని ఇతర ప్రాంతాల నుండి మానస్‌కు తరలించడం ప్రారంభించింది. అయితే, మానస్‌కు పూర్వ వైభవం తీసుకురావరడంలో నిజమైన హీరోలు బోడో తెగ ప్రజలేనని అంగీకరించాలి.

ఫొటో సోర్స్, Getty Images
అడవి-అమ్మ
మానస్ మా తల్లి. ఎందుకంటే అది తరతరాలుగా మాకు ఆహారం, నీరు, వంట చెరకుతో మాకు జీవితాన్ని ఇచ్చింది'' అని బోర్గోయరీ అన్నారు.
''దాని విధ్వంసానికి మేమే కారణమన్నారు కాబట్టి, దాని పునరుద్ధరణ బాధ్యత కూడా మేమే తీసుకున్నాం'' అని చెప్పారాయన.
స్థానికులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం మొదటి పని. స్థానికంగా నివసించే 35 ఏళ్ల రాధికా రే అనే మహిళ, తమ గ్రామంలోని మహిళలు కట్టెలు, అటవీ ఉత్పత్తులు, మాంసం కోసం అడవిపై ఎలా ఆధారపడేవారో గుర్తు చేసుకున్నారు.
కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మహిళలు స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన పట్టు, పత్తి నుండి స్థానిక దుస్తులు, శాలువలు, తువ్వాళ్లు సహా అనేక దుస్తులను తయారు చేస్తారు. వాటిని తిరిగి మార్కెట్‌లో అమ్ముతారు.
"అడవితో మా తరతరాల బంధం చెక్కుచెదరనిది" అని రాధికా రే అన్నారు. "మా కమ్యూనిటీలోని చాలా మంది స్త్రీల మాదిరిగానే, నేను నేత పనితో జీవిస్తున్నాను. మన మనుగడ కోసం అటవీ వనరులను నాశనం చేయాల్సిన పని లేదు" అన్నారామె.
ఈ మార్పు ఫలితంగా అడవి తిరిగి పచ్చబడింది.

ఫొటో సోర్స్, Geetanjali Krishna
వేట నిలిపేసిన తర్వాత..
బీటీఆర్, మరికొన్ని సంస్థలు కొందరికి నెలవారీ జీతాలిస్తూ అటవీ సంరక్షణ చేపట్టాయి.
400 మందికి పైగా వేటగాళ్లను అటవీ రక్షకులుగా మార్చారు. మహేశ్వర్ బాసుమతరీ అలాంటి వేటగాళ్లలో ఒకరు. ఆయన మానస్‌లో అవార్డు గెలుచుకున్న జంతు సంరక్షకుడు కూడా.
1980లలో ఆయన అదే అడవిలో వేటాడి డబ్బు సంపాదించేవారు. కానీ, 2005లో ఆయన తన ఆయుధాలను స్థానిక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ బీటీఆర్‌కు అప్పగించారు.
గ్రేటర్ మానస్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా రెండు అనాథ చిరుతపులి పిల్లలకు పునరావాసం కల్పించడంలో బాసుమతారి ముందు నిలిచారు. వేటగాళ్లను పట్టుకోవడం, అక్రమ ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం, వన్యప్రాణుల సర్వేలు నిర్వహించడంలో ఆయనది ప్రధాన పాత్ర.
"నేను చాలా ఖడ్గమృగాలు, ఇతర జంతువుల కూనలకు సీసాలతో పాలు తాగించాను. వాటిని నా సొంత పిల్లల్లా చూసుకున్నాను'' అని బాసుమతారి చెప్పారు.
"వాటిలో కొన్ని జంతువులు ఇప్పుడు పిల్లలను కని పెంచుతున్నాయని తెలిసినప్పుడు నా హృదయం గర్వంతో నిండిపోయింది" అని బాసుమతారి అన్నారు.
చాలామంది వేటగాళ్లు మానస్ చుట్టూ పుట్టుకొచ్చిన అనేక స్థానిక వన సంరక్షణ సంస్థలలో చేరారు.
''వారిలోని ట్రాకింగ్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉపయోపడతాయి'' అని మానస్ మావుజిగేండ్రీ ఎకో టూరిజం సొసైటీ డైరెక్టర్ రుస్తం బాసుమతారి వ్యాఖ్యానించారు.
పర్యావరణ, పర్యాటక పరిరక్షణ రెండూ పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అయితే, సస్టైనబుల్ టూరిజం, దాని వల్ల కలిగే ఆదాయం వల్ల మానస్ లాంటి పార్క్‌లకు మేలు కలుగుతుందని ధృతి బెనర్జీ అంటారు.
"తమ పరిసరాల్లోని సహజ వనరులను అతిగా దోచుకోవడం వల్ల పర్యాటక ఆదాయాలు తగ్గడమే కాకుండా, అధిక పోలీసింగ్‌కు దారి తీస్తుందని స్థానికులు కూడా గ్రహించారు" అని ఆమె వ్యాఖ్యానించారు.
2003లో బోడో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేనాటికి, మానస్‌లోని వందలాది ఖడ్గమృగాలు, జింకలు మాయమయ్యాయి. కానీ, 2021 నాటికి మానస్‌లో 52 ఖడ్గమృగాలు, 48 పులులు, 1,000 కంటే ఎక్కువ ఏనుగులు, చిరుతలు, పిగ్మీ హాగ్‌లు, కుందేళ్లు లాంటి అంతరించి పోతున్న అనేక జంతువులు ఉన్నాయి.
ప్రపంచ వారసత్వ పరిరక్షణ, నిర్వహణ కోసం యునెస్కోలో మానస్ ఒక మోడల్‌గా మారింది. ఇతర ప్రాంతాలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు మొదలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
''రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్), సుందర్‌బన్స్ (పశ్చిమ బెంగాల్), మధ్య భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఇలాంటి ప్రాజెక్ట్‌ల వల్ల ప్రయోజనం ఉంటుంది" అని ధృతీ బెనర్జీ చెప్పారు.
ఇక, ఇక్కడ 2021 ఏప్రిల్‌లో మానస్‌కు వచ్చిన మూడు ఖడ్గమృగాలను ట్రాక్ చేయడానికి తన బైనాక్యులర్లు, ట్రాకింగ్ గేర్ తీసుకుని మహేశ్వర్ బాసుమతారి కుండపోత వర్షంలో బయలుదేరారు.
''మానస్ నా ఇల్లు. అది అభివృద్ధి చెందితే, మేం అభివృద్ధి చెందుతాం. అది నాశనమైతే, మేమూ నాశనమవుతాం'' అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- రిజర్వేషన్లు పదేళ్లు మాత్రమే ఉండాలని అంబేడ్కర్ నిజంగానే అన్నారా
- కాన్పుర్: రిక్షా నడిపే ముస్లిం కూలీపై దాడి, ‘జై శ్రీరాం’అంటూ నినాదాలు చేయాలని ఒత్తిడి
- షెడ్యూల్డు కులాల్లో రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందట్లేదా? ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్ ఎందుకు?
- చిలకలూరుపేట బస్సు దహనం (1993) కేసు: 23 మంది మృతికి కారణమైన దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే...
- ‘‘నా కొడుకు కడుపులో బుల్లెట్ దించారు.. ఛాతీపై తన్నారు’’- అస్సాం దరంగ్ జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













