పొరుగు దేశాన్ని ఆక్రమించినందుకు రూ. 24 వేల కోట్లు పరిహారం చెల్లించండి - యుగాండాకు ఐసీజే ఆదేశం

ఫొటో సోర్స్, AFP
‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో(డీఆర్ కాంగో) యుద్ధానికి కారణమైనందుకు 32.5 కోట్ల డాలర్ల (సుమారు రూ. 24 వేల కోట్లు) నష్టపరిహారాన్ని యుగాండా డీఆర్ కాంగోకు చెల్లించాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే) తీర్పు చెప్పింది.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ 1998 - 2003 మధ్య కాలంలో డీఆర్సీపై యుగాండా ఆక్రమణకు దిగిందని ద ఐజేయూ పేర్కొంది.
డీఆర్ కాంగోలోని తూర్పు ఐటూరీ ప్రాంతంలో దాదాపుగా 10 నుంచి 15 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత యుగాండాదేనని ఐసీజే న్యాయమూర్తులు భావించారు.
డీఆర్ కాంగోలో బంగారం, వజ్రాలు, కలప వంటివి యుగాండా బలగాలు దోచుకున్నాయని కూడా గుర్తించారు.
అయితే డీఆర్ కాంగో మొత్తంగా 1100 కోట్ల డాలర్లను (సుమారు రూ. 8 లక్షల కోట్లు) డిమాండ్ చేసంది. న్యాయమూర్తులు డీఆర్ కాంగో కోరిన కన్నా తక్కువ మొత్తం పరిహారంగా నిర్ణయించారు.
2022 నుంచి 2026 వరకూ ఏడాదికి 65 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 480 కోట్లు) చొప్పున యుగాండా చెల్లించాలని ఆదేశించారు.
ఇందులో మొదటి విడత పరిహారం 2022 సెప్టెంబరుకి చెల్లించాల్సి ఉంది.
అయితే డీఆర్ కాంగో డిమాండ్ చేస్తున్న డబ్బంతా చెల్లించాలంటే తమ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని యుగాండా వాదించింది. దాంతో యుగాండా చెల్లంచగల స్థాయిలోనే జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పరిహారంలో దేనికెంత?
* యుద్ధ బాధితులకు చెల్లించేందుకు 22.5 కోట్ల డాలర్లు * ధ్వంసమైన ఆస్తులకు పరిహారంగా 4 కోట్ల డాలర్లు
* దోచుకున్న వనరులకు 6 కోట్ల డాలర్లు
అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ యుగాండా సాగించిన ఆక్రమణల కారణంగా డీఆర్ కాంగో ప్రజలకు, ఆస్తులకు జరిగిన నష్టం, వారి బాధలు కళ్లకు కడుతోందని తీర్పులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ICJ
1999లో కేసు పెట్టిన డీఆర్ కాంగో
యుగాండా సాయుధ బలగాలు తమ దేశంలోకి చొరబడి ప్రజలపైన హింసకు పాల్పడ్డాయని 1999లో కేసు పెట్టింది డీఆర్ కాంగో. అక్కడ దోపిడీలకూ, మానవ హక్కుల ఉల్లంఘనలకు యుగాండా సైనికులదే బాధ్యతని ఆరోపించింది.
విలువైన ఖనిజ సంపదలుండే తూర్పు డీఆర్ కాంగో ప్రాంతంలో దశాబ్దాలుగా యుగాండా బలగాలు తీవ్ర విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నాయి. 1990లలో యుగాండా, రవాండా దేశాలు వాటికన్నా చాలా పెద్దదైన సరిహద్దు దేశం డీఆర్సీని రెండు సార్లు ఆక్రమించాయి. డీఆర్ కాంగోలోని స్థానిక మిలీషియాతో పనిచేస్తూ, ప్రభుత్వాని దించే ప్రయత్నాలు చేశాయి. కానీ డీఆర్ కాంగోలోని ఉద్రిక్తలు సరిహద్దు దాటి వ్యాపించకూడదనే అలా చేసినట్లు చెప్పుకొంటాయి. దీనిపై అప్పీలు కోరే వీలు లేకుండా కోర్టు తుది తీర్పుని వెల్లడించింది. కానీ ఈ తీర్పుని పాటించేలా చేసే అధికారం ఈ అంతర్జాతీయ కోర్టుకి లేదు.
ఇవి కూడా చదవండి:
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?
- ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









