అమెరికాలోని జూలో కోతుల బోనులో ఆ నల్లజాతి వ్యక్తిని జంతువులా ప్రదర్శించారు... 114 ఏళ్ల తరువాత క్షమాపణలా?

ఫొటో సోర్స్, Library of Congress
ప్రస్తుతం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా ఉన్న ప్రాంతం నుంచి 1904లో ఓటా బెంగా అనే వ్యక్తిని కొందరు అపహరించారు. ఆయన్ను అమెరికాకు తరలించి, అక్కడి జూలోని కోతుల బోనులో ఓ జంతువులా ప్రదర్శనకు పెట్టారు.
అసలు ఓటాను ఎవరు ఎత్తుకువచ్చారు? ఎలా ఎత్తుకువచ్చారు? జూలో ప్రదర్శనకు పెట్టాక ఆయనకు ఏం జరిగింది? ఆయన్ను ప్రదర్శనకు పెట్టిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఏయే ప్రయత్నాలు జరిగాయి?... ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేసిన పమేల్ న్యూకిర్క్ అనే జర్నలిస్ట్ అందిస్తున్న కథనం...
న్యూయార్క్‌కు చెందిన బ్రోంక్స్ జూలో కోతుల బోనులో ఒక ఆఫ్రికన్ వ్యక్తిని ప్రదర్శనకు పెట్టిన ఉదంతం అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కి శతాబ్దం దాటింది. ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆ జూను నిర్వహిస్తున్న సంస్థ క్షమాపణలు చెప్పింది.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత జాత్యహంకార ధోరణులకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో, 1906లో కాంగోకు చెందిన ఓటా బెంగాను బ్రోంక్స్ జూలో ప్రదర్శనకు పెట్టిన విషయంపై ద వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) క్షమాపణలు తెలిపింది.
“దేశమంతా వివక్ష గురించి చర్చ జరుగుతున్న సమయంలో డబ్ల్యూసీఎస్ చరిత్రలో జరిగిన తప్పిదాన్ని అంగీకరించడం, ఈ వ్యవస్థలో ఎప్పటినుంచో వేళ్లూనుకుని ఉన్న జాత్యహంకార ధోరణులను పున:పరిశీలించుకోవడం చాలా ముఖ్యం" అని ద వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు క్రిస్టియన్ శాంపర్ అన్నారు.
ఈ విషయంలో డబ్ల్యూసీఎస్ పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.
1906 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఓటా బెంగాను బ్రోంక్స్ జూలో ప్రదర్శనకు పెట్టారు. అప్పట్లో ఈ ఉదంతం అమెరికా, యూరప్ వ్యాప్తంగా చాలా ప్రధాన పత్రికల్లో పెద్ద వార్తగా నిలిచింది.

ఫొటో సోర్స్, Missouri Historical Society
‘జూలో పనిచేసేవాడని కట్టుకథ’
ఓటాను జూలో పెట్టిన విషయమై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో జూ యాజమాన్యం ఇదివరకు తప్పును కప్పిపుచ్చకునే ప్రయత్నం చేసింది. శతాబ్దకాలంగా నిజం వెలుగులోకి రాకుండా ఉండడానికి రకరకాల కథలు చెప్పింది.
జూ సిబ్బందిలో ఓటా బెంగా ఒకరని కథ అల్లేందుకు కూడా ఆ జూ రంగం సిద్ధం చేసినట్లు 1906 నాటి దస్తావేజుల్లోంచి బయటపడిన ఓ లేఖ ద్వారా తేలింది.
ఆశ్చర్యకరంగా, ఆ జూ చెప్పిన కథలను దశాబ్దాలుగా ప్రపంచం నమ్మింది.
ఇంతకీ ఓటా బెంగా ఎవరు? ఆయన కథేంటి?
మనుషులను బానిసలుగా మార్చి విక్రయించే శామ్యూల్ వెర్నర్ అనే అమెరికన్ వ్యాపారి అప్పట్లో బెల్జియం కాంగోగా పిలవబడిన ప్రాంతం నుంచి ఓటా బెంగాను ఎత్తుకువచ్చారు. అప్పటికి ఓటా బెంగా వయసు ఎంతన్నది స్పష్టంగా తెలియదు. 12 లేదా 13 ఏళ్లు ఉండొచ్చని ఓ అంచనా.
ఓడ ద్వారా ఓటాను న్యూ ఓర్లన్స్‌కు తీసుకువెళ్లారు. ఓటాతో పాటు బంధించి తెచ్చిన మరో ఎనిమిది మంది యువకులను సెయింట్ లూయీస్‌లో ఓ ప్రదర్శనలో పెట్టారు.
ఈ ప్రదర్శన శీతాకాలంలో కూడా కొనసాగింది. చలిలో ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా ఓటా, ఆయనతోపాటు బంధీలుగా ఉన్న యువకులు నిలబడ్డారు.
1906, సెప్టెంబర్‌లో 20 రోజులపాటూ ఓటా బెంగాను న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో ప్రదర్శనకు పెట్టారు. దీన్ని చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు.
క్రైస్తవ మతగురువులు ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఓటా బెంగా నిర్బంధ జీవితం ముగిసింది. తర్వాత ఆయన్ను ఆఫ్రికన్ అమెరికన్ రెవరెండ్ జేమ్స్ హెచ్ గార్డన్ న్యూయార్క్‌లో నడుపుతున్న హోవర్డ్ నల్లజాతీయుల అనాథాశ్రమానికి తరలించారు.
వర్జీనియాలో నల్లజాతి విద్యార్థుల కోసం నిర్మించిన లించ్‌బర్గ్ థియొలాజికల్ సెమినరీ అండ్ కాలేజ్‌లో 1910 జనవరిలో ఓటా బెంగా చేరారు.
అక్కడ ఆయన తన స్నేహితులకు వేటాడడం, చేపలు పట్టడంలాంటివన్నీ నేర్పిస్తూ, కాంగోలో తాను చేసిన సాహసాలను కథలుగా చెప్పేవారు.
ఇంటి మీద, స్వదేశం మీద బెంగతో ఓటా మానసికంగా కుంగిపోయి 1916 మార్చిలో తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకుని మరణించారు. అప్పటికి ఆయనకు 25 ఏళ్లు ఉండవచ్చని ఓ అంచనా.
ఆధారం: స్పెక్టకల్: ది అస్టోనిషింగ్ లైఫ్ ఆఫ్ ఓటా బెంగా

ఫొటో సోర్స్, Getty Images
ఓటా బెంగా మరణం తర్వాత ఆయన్ను జూలో ప్రదర్శనకు పెట్టినట్టు వచ్చిన వార్తలన్నీ కట్టుకథలని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొట్టిపారేసింది.
కానీ, అంతకు పదేళ్ల ముందు చాలా పత్రికల్లో ఓటాను జంతుప్రదర్శనశాలలో బంధించి ఉంచినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి. న్యూయార్క్ టైమ్స్‌లోనే ఈ అంశం గురించి ఒక డజను కథనాలు రావడం గమనార్హం. 1906 సెప్టెంబర్ 9న "బ్రోంక్స్ జూలో కోతులతోపాటు బోనులో ఉన్న యువకుడు" అనే అర్థం వచ్చే శీర్షికతో ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇక 1974లో ఓటా బెంగా విషయంలో "వాస్తవంగా ఏం జరిగిందో ఎవరికీ తెలీదు" అని జూ అధికారుల్లో ఒకరైన విలియం బ్రిడ్జెస్ అన్నారు. ‘గేదరింగ్ ఆఫ్ ఏనిమల్స్’ అనే పేరుతో ఆయన ఓ పుస్తకం రాశారు.
అందులో ‘ఓటా బెంగాను ఒక వింత జంతువును పెట్టినట్టు బోనులో పెట్టారా?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ఒక మనిషిని సందర్శకుల కోసం కటకటాల బోనులో ఒక జంతువులా నిలబెట్టారనడం వాస్తవంలా అనిపించడం లేదు’ అని విలియం రాశారు.
కానీ, బ్రోంక్స్ జూలో ఉన్న పాత దస్తావేజులన్నీ, ఓటా బెంగాను బోనులో పెట్టి ప్రదర్శించడం నిజమేనని సూచిస్తున్నాయి.
ఈ ప్రదర్శన గురించి ఆ జూ అధ్యక్షుడు రాసిన ఒక కథనం అదే జూలాజికల్ సొసైటీవారి సొంత పత్రికలోనే ప్రచురితమైంది.
స్నేహం అంటూ మరో కథ
ఓటా బెంగాను అపహరించి తెచ్చిన శామ్యూల్ వెర్నర్ మనవడు సహరచయితగా 1992లో ఓ పుస్తకం వచ్చింది. అందులో వెర్నర్‌కు, ఓటా బెంగాకు మధ్య స్నేహం ఉండేదంటూ అసంబద్ధమైన విషయాలన్నీ రాశారు.
నిర్బంధాన్ని ఓటా బెంగా తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ, న్యూయార్క్‌లో ప్రదర్శనను ఆయను ఆస్వాదించారని శామ్యూల్ వెర్నర్ మనవడు రాసిన పుస్తకంలో ఉందని ఒక వార్తాపత్రికలో కథనం వచ్చింది.
ఓటా బెంగాను, ఆయన లాంటివారిని దోచుకున్న ఈ వ్యవస్థ, వ్యక్తులు... వందేళ్లపాటు కట్టుకథలు అల్లుతూ, అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు కూడా ఓటా బెంగాను ‘కొన్ని రోజులపాటు ప్రదర్శనకు పెట్టడం’ గురించే డబ్ల్యూసీఎస్ అధ్యక్షుడు శాంపర్ క్షమాపణలు కోరారు. ఆయన్ను జంతువులా కోతులతో పాటు బోనులో ఉంచిన విషయం గురించి మాట్లాడలేదు.
ఈ అంశానికి సంబంధించిన అన్ని దస్తావేజులను డిజిటలైజ్ చేసి బ్రోంక్స్ జూ యాజమాన్యం ఆన్‌లైన్లో పెట్టింది. వాటిల్లో ఓటా బెంగాను బోనులో బంధించినప్పటి విషయాలు, ఆయన రోజువారీ కార్యక్రమాలను, ఆయన్ను బంధించి ఉంచినవారి కార్యకలాపాలను వివరించే లేఖలు కూడా ఉన్నాయి.
ఆ ఉత్తరాల్లో చాలావాటిని 2015లో ప్రచురితమైన "స్పెక్టకల్: ది అస్టోనిషింగ్ లైఫ్ ఆఫ్ ఓటా బెంగా" పుస్తకంలో చదవొచ్చు.
ఈ పుస్తకం బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రోంక్స్ జూ యాజమాన్యం ఈ అంశంపై స్పందించడానికి నిరాకరించింది. ఓటా బెంగాను బంధించి ఉంచిన ప్రదేశాన్ని సందర్శకులు చూడకుండా మూసివేశారు.

ఫొటో సోర్స్, Missouri Historical Society
‘నరమాంస భక్షకుడిగా చిత్రించే ప్రయత్నం’
"ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటూ, అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నో తరాలుగా, ఎంతోమంది వ్యక్తులను బాధపెట్టినందుకు మేం చింతిస్తున్నాం" అని శాంపర్ అన్నారు.
ఓటా బెంగాను ప్రదర్శన పెట్టడానికి కారణమైన జూ వ్యవస్థాపక సభ్యులు మేడిసన్ గ్రాంట్, హెన్రీ ఫెయిర్ఫీల్డ్ ఓస్బోర్న్‌ల చర్యలను కూడా ఆయన తప్పుపట్టారు.
సైన్స్‌ను తప్పుదోవ పట్టిస్టూ జాత్యహంకార ధోరణులతో మేడిసన్ గ్రాంట్ "ద పాసింగ్ ఆఫ్ ఏ గ్రేట్ రేస్" అనే పుస్తకాన్ని రాశారు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ మెప్పు పొందిన పుస్తకం అది.
అయితే, బ్రోంక్స్ జంతుప్రదర్శనశాల వ్యవస్థాపక డైరెక్టర్ విలియం హార్నడే గురించి మాత్రం శాంపర్ ప్రస్తావించలేదు.
ఓటా బెంగాను ఉంచిన బోనులో ఎముకలు జల్లి ఆయన్ను నరమాంస భక్షకుడిగా చిత్రీకరించేందుకు అప్పట్లో హార్నడే ప్రయత్నించారు. ‘కోతుల గదుల్లోకెల్లా మంచి గదిలో ఓటాను పెట్టాం’ అంటూ ఆయన దాన్నో గొప్ప విషయంగా చెప్పుకున్నారు.
ఓటాను బంధించిన వ్యవహారానికి సంబంధించి నిజాలన్నింటినీ బయటపెడుతూ, పూర్తి క్షమాపణ కోరాల్సిన బాధ్యత కన్సర్వేషన్ సొసైటీపై ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికీ ప్రచారంలో ఉన్న అనేక జాత్యహంకార సిద్ధాంతాలకు బ్రోంక్స్ జూ వ్యవస్థాపక సూత్రాలు కారణమయ్యాయి. ఈ విషయంలో జనానికి అవగాహన పెంచేందుకు దీన్నొక మంచి సందర్భంగా మలుచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
బ్రోంక్స్ జూ నడుపుతున్న విద్యా కేంద్రానికి ఓటా బెంగా పేరు పెట్టాలన్న డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓటాకు జరిగిన అన్యాయానికి దీని ద్వారా కొంతైనా ప్రతిఫలం దక్కినట్లవుతుందని ఆ డిమాండ్ చేస్తున్నవారు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








