పిడుగుపాటుతో చనిపోయిన నాలుగు అరుదైన గొరిల్లాలు

ఫొటో సోర్స్, Getty Images
అరుదైన మౌంటెయిన్ గొరిల్లాలు నాలుగు పిడుగుపాటుతో చనిపోయాయని వాటి సంరక్షణకు కృషి చేసే సంస్థ ఒకటి తెలిపింది.
ఆఫ్రికాలో యుగాండాలోని ఎంగహింగా నేషనల్ పార్క్‌లో ఈ జంతువులు చనిపోయాయి. వీటిలో మూడు ఆడవి, మరొకటి చిన్న మగ గొరిల్లా. వీటిలో ఒకటి గర్భంతో ఉంది.
పిడుగుపాటు వల్ల పెద్ద పెద్ద గాయాలైన ఆనవాళ్లు ఈ గొరిల్లాల కళేబరాలపై ఉన్నాయి.


వీటి మరణం మౌంటెయిన్ గొరిల్లా జాతికి అపారమైన నష్టమని 'గ్రేటర్ విరుంగా ట్రాన్స్‌బౌండరీ కొలాబరేషన్ (జీవీటీసీ)' విచారం వ్యక్తం చేసింది.
వీటి మృతి చాలా బాధాకరమని జీవీటీసీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆండ్రూ సెగుయా బీబీసీతో చెప్పారు. చనిపోయిన మూడు ఆడ గొరిల్లాలు బతికి ఉంటే వీటి సంతతి పెరగడానికి ఎంతో దోహదపడేవన్నారు.
ఈ నాలుగు గొరిల్లాల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలతో పోస్టుమార్టం నిర్వహించారని, వీటి మరణానికి కారణం మూడు వారాల్లో నిర్ధరణ అవుతుందని జీవీటీసీ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉన్నవి వెయ్యే
ప్రపంచంలో మౌంటెయిన్ గొరిల్లాలు దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, యుగాండా దేశాల్లోని నిర్ణీత సురక్షిత ప్రాంతాలకే ఇవి పరిమితమయ్యాయి.
అధికారులు హిర్వా కుటుంబం అని పిలిచే 17 గొరిల్లాల సమూహంలో ఈ నాలుగూ భాగంగా ఉండేవి. ఇవన్నీ నిరుడు రువాండా నుంచి యుగాండాలోకి ప్రవేశించాయి. అన్నీ ఎంగహింగా నేషనల్ పార్క్‌లోనే ఉంటున్నాయి.
యుగాండా, రువాండా, కాంగో సరిహద్దుల్లోని విరుంగా మాసిఫ్ పర్వత ప్రాంతంలో ఈ పార్క్ ఉంది.

2008లో ప్రపంచంలో మౌంటెయన్ గొరిల్లాలు ఇంచుమించు ఆరు వందలే ఉండేవి.
సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
'అంతరించిపోయే ముప్పు అత్యంత తీవ్రంగాగల జంతువుల జాబితా' నుంచి 2018లో మౌంటెయిన్ గొరిల్లాలను తొలగించారు.
వీటిని వేటాడటాన్ని అడ్డుకోవడంతోపాటు ఇతర సంరక్షణ చర్యలను పెద్దయెత్తున చేపట్టడంతో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో వీటిని ఈ జాబితా నుంచి 'అంతరించిపోయే ముప్పు గల జంతువుల జాబితా'లోకి మార్చారు.

ఇవి కూడా చదవండి:
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్‌కు 193 కోట్ల జరిమానా
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









