కాంగోలో ఉత్తరాంధ్రుల కష్టాలు: సరైన భోజనం లేదు.. పనిచేస్తున్న కంపెనీ జీతం ఇవ్వడం లేదు.. పైగా ఎబోలా భయం - వీడియో

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్ర నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్లారు

సొంతూళ్లను వీడి ఉపాధి కోసం ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ) వెళ్లిన ఉత్తరాంధ్రులకు అక్కడ కష్టాలు ఎదురవుతున్నాయి.

దేశం కాని దేశంలో తమ గోడు వినేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలంటూ తమ వారికి ఫోన్ చేసి వేడుకుంటున్నారు. ఇప్పటికే కొందరు స్వస్థలాలకు చేరుకోగా మిగతావారినీ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

స్థానికంగా కంటే ఎక్కువ వేతనాలు పొందొచ్చని.. అలా సంపాదించిన డబ్బుతో తమవారిని బాగా చూసుకోవచ్చన్న ఆశతో ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఇతర దేశాల్లో పనులకు వెళ్తున్నారు.

ఇలాంటి ఆశతోనే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన గోపీనాథపురానికి చెందిన కొందరు యువకులు ఇచ్చాపురంలోని ఓ ఏజెంట్ సహాయంతో కాంగో వెళ్లారు.

నెలకు రూ.లక్ష జీతం.. దాంతో పాటు ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో ఒక్కొకక్కరు రూ.లక్షా 20 వేల నుంచి రూ.2 లక్షల వరకూ చెల్లించారు. ఇలా 40 మంది శ్రీకాకుళం జిల్లావాసులు కాంగో వెళ్లారు.

వారంతా అక్కడ వెతలు పడుతున్నారు. వారిలో కొందరు స్వస్థలాలకు తిరిగిరాగా మరికొందరు ఇంకా అక్కడే ఉన్నారు. అధికారులు వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)