బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ తెలుగు ప్రతినిధి
వాసమున్న ప్రతి ఇంటిలోనూ వీసమెత్తయినా బంగారం ఉండాలనేది తెలుగునాట ఓ సామెత. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ప్రస్తుతం బంగారం ధర పెరుగుతోంది. ఆగస్ట్ 8న ఒక్క రోజే 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,113 మేర పెరిగింది.
పుత్తడి జోరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ధర మరింత పెరిగే సూచనలున్నాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తోంది. తాజాగా ఆగస్టు 8న ఒక్క రోజే కిలో వెండి ధర రూ. 650 పెరిగింది.
ఇదే పరిస్థితులు ముందుముందు కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా పది గ్రాముల బంగారం ధర రూ.40 వేలకు చేరే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడే ఎందుకింత పెరిగింది?
శ్రావణ మాసంలో మహిళలంతా బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపించడంతో ధరలు ఇంతలా పెరిగాయని అనుకోవడం సహజమే. కానీ ఇప్పుడు బంగారం రేట్లు పెరగడం వెనుక చాలా కారణాలున్నాయి.
ప్రపంచీకరణ తర్వాత దేశీయ ఆర్థిక పరిణామాలతో పాటు, అంతర్జాతీయ పరిణామాలూ బంగారం ధరను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
మోదీ సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో.. బంగారంపై దిగుమతి సుంకాన్ని10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు.
తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీ రేట్లను వరుసగా నాలుగోసారి తగ్గించారు.
''రెపో రేటును 35 బేస్ పాయింట్ల మేర తగ్గించడం బ్యాంకులకు, రుణ గ్రహీతలకు కాస్తంత సానుకూలంగానే ఉన్నా బంగారం ధరలకు ప్రతికూలంగా మారింది. రెపో రేట్లు అంటే బ్యాంకులు.. ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ. ఈ వడ్డీ తగ్గడం అంటే బ్యాంకులు మరింత ధనాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి. దీనివల్ల బ్యాంకుల దగ్గర నిధుల లభ్యత పెరుగుతుంది. అంటే బ్యాంకులు మరింత వడ్డీతో ఈ నిధుల్ని రుణాలుగా ఇస్తాయి. అంటే వ్యవస్థలో ద్రవ్య లభ్యత మరింత పెరుగుతుంది. దీంతో సంస్థలు, ఇతరులు ఈ నిధుల్ని బంగారం వైపు పెట్టుబడులుగా మళ్లించేందుకు అవకాశాలు పెరుగుతాయి. ఇది కూడా కొంత మేర బంగారానికి డిమాండ్ పెంచుతుందని, ఈ కారణం కూడా బంగారం ధర పెరగడానికి దోహదం చేస్తుంది'' అన్నారు బిజినెస్ అనలిస్ట్ సతీష్ మండవ.

ఫొటో సోర్స్, LS TV
బడ్జెట్ తరువాత పరిస్థితి మారిపోయింది
రెండోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు పతనమవుతూ ఉన్నాయి.
గత నెల రోజుల్లో మదుపరుల సంపద రూ.13 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది.
''వీటితో పాటు కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, కశ్మీర్లో కర్ఫ్యూ వంటి అంశాలు ఇన్వెస్టర్లలో భయాందోళనలకు కారణమవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో డాలరుతో పోలిస్తే రూపాయి కూడా నానాటికీ బలహీనమవుతోంది. మన దేశంలో బంగారం పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకోవడ వల్ల డాలర్ రేటు పెరిగినా బంగారం ధర పెరుగుతుంది. బంగారం ధరను ప్రభావితం చేసే ఈ పరిణామాలన్నీ ఒకటి రెండు రోజుల్లోనే జరగడం వల్ల... ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం రూ.వెయ్యికి పైగా పెరిగింద'ని బిజినెస్ అనలిస్ట్ సతీష్ మండవ విశ్లేషించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కశ్మీర్ అనిశ్చితి సహా మిగిలిన ఆర్థిక పరిణామాలు కూడా ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా పది గ్రాముల బంగారం ధర రూ.40 వేలు దాటే అవకాశముందని చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆజ్యం పోస్తున్న అంతర్జాతీయ పరిణామాలు
మన దేశంలో బంగారం ధరలను అంతర్గత అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలూ ప్రభావితం చేస్తున్నాయి.
అమెరికా చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లపైనా ప్రతికూలంగా ఉంటోంది. 'ద బులియన్ డెస్క్' ప్రకారం చూస్తే సోమవారం నుంచి జరిగిన ట్రేడింగ్ సెషన్లలో నాస్‌డాక్, డోజోన్స్ రెండూ నష్టపోయాయి. నిక్కీ సూచీ, యూరో స్టాక్స్, హాంగ్‌సెంగ్, షాంగై కాంపోజిట్‌లూ దిగజారాయి.
ఆర్బీఐ నిర్ణయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు కూడా గత వారంతో పోలిస్తే నేల చూపులు చూస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో భయాందోళనలు కలిగిస్తున్నాయని, అంతర్జాతీయంగా ఇప్పుడున్నఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి కరెన్సీపై కంటే బంగారం మీదే పెట్టుబడులు పెట్టడం మంచిదన్న భావనతో పెట్టుబడులను గోల్డ్ మీదకు మళ్లిస్తున్నారని తెలిపారు.
మరోవైపు పలు దేశాల కేంద్ర బ్యాంకులూ బంగారం కొనుగోళ్లు మొదలు పెట్టాయని అందుకే బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయిందని ఆయన విశ్లేషించారు.
బంగారం వినియోగంలో భారత్‌తో పాటు చైనా కూడా ముందుంది. అమెరికా దూకుడును అడ్డుకోడానికి చైనా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది వాళ్లకు కలసి రావడం లేదు. తాజాగా చైనా కరెన్సీ యువాన్ మారకం పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

ఫొటో సోర్స్, AFP
బీబీసీ బిజినెస్ అందించిన వివరాల ప్రకారం.. ఒక యూఎస్ డాలర్ మారకం ఏడు చైనా యువాన్లకు పడిపోయింది. 2008 ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు డాలర్‌తో పోలిస్తే యువాన్ విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అప్పట్లో డాలర్ మారకం చైనాలో 7.3 యువాన్లకన్నా దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ యువాన్ అంతలా కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి.
గతంలో అంతర్జాతీయ మార్కెట్లలో బలోపేతం అయ్యుందుకు చైనా తన కరెన్సీని వ్యూహాత్మకంగా తగ్గించుకుంది.
కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి పన్నులు పెంచింది. దీని ప్రభావంతో భవిష్యత్తులో యువాన్ మరో 5 శాతం మేర బలహీనపడే అవకాశాలున్నాయని, ఈ ఏడాది చివరికల్లా చైనాలో డాలర్ మారకం... 7.30 యువాన్లకు పడిపోతుందని బిజినెస్ అనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.
ఇలా భారత్, చైనా వంటి దేశాల కరెన్సీలు బలహీనపడితే అక్కడ బంగారం దిగుమతి మరింత భారమవుతుంది. ఇది కూడా క్రమంగా బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతుంది.
'ద బులియన్ డెస్క్' ప్రకారం.. ప్రపంచ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1497.40 డాలర్లు ఉంది. గత ఆరేళ్లలో ఇదే అత్యధిక ధర.
కానీ 2013 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1696 డాలర్లకు చేరింది. కానీ అప్పట్లో బంగారం ధర గరిష్ఠంగా రూ.35 వేల వరకూ చేరింది.
అప్పటితో పోల్చితే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ధర తక్కువగానే ఉన్నప్పటికీ డాలర్ మారకం విలువ ఇప్పుడు ఎక్కువగా ఉండడంతో భారత్‌లో ధర అధికంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ కొనాలా? అమ్మాలా?
బంగారం ధర పెరుగుతోందంటే సామాన్యుల్లో ఆందోళన మొదలవుతుంది. పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ పరిస్థితుల్లో కాస్తంత వేగంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తారు. 2013లో పది గ్రాముల బంగారం ధర 35 వేలు దాటినప్పుడు చాలా మంది కొన్నారు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలే కానీ ఇంకా పెరిగిపోవచ్చన్న ఆందోళనతో కొనాల్సిన అవసరం లేదంటున్నారు బిజినెస్ అనలిస్ట్ సతీష్.
బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
చిన్న మొత్తంలో కొనుగోలు చేయాలనుకునేవారు వారి అవసరాలను బట్టి వ్యవహరించడం మంచిదన్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








