నరేంద్ర మోదీ హయాంలో ఇస్లామోఫోబియా పెరిగిపోతోంది- నోమ్ చామ్‌స్కీ

ఫొటో సోర్స్, TWITTER/@IAMCOUNCIL
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేధావి నోమ్ చామ్‌స్కీ, భారత్‌లో పెరుగుతోన్న 'ఇస్లామోఫోబియా'పై ఆందోళన వ్యక్తం చేశారు. భారత లౌకిక ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.
''భారత్‌లో విద్వేష ప్రసంగాలు, హింసకు వల్ల తలెత్తిన అధ్వానమైన పరిస్థితి'' గురించి జరిగిన ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో మతవాదం అంశం గురించి, అమెరికాలోని ప్రవాస సంస్థలు ఈ తరహా చర్చా కార్యక్రమాలు నిర్వహించడం ఈ నెలలో ఇది మూడోసారి.
''పశ్చిమాన 'ఇస్లామోఫోబియా' (ముస్లింలంటే అకారణ భయం) పెరిగిపోతోంది. భారత్‌లో ఇది తీవ్రరూపం దాల్చుతోంది. భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం, క్రమపద్ధతిలో లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ హిందూ రాజ్యాన్ని నెలకొల్పుతోంది. ఇది వివిధ రూపాలను తీసుకుంటోంది. ముస్లింలపై వ్యతిరేకత, విద్యా వ్యవస్థపై దాడి రూపంలో కనబడుతోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''కశ్మీర్‌కు హింసాత్మక చరిత్ర ఉంది. మోదీ హయాంలో ఈ హింస మరింత పెరిగింది'' అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''ముఖ్యంగా దక్షిణాసియాలో పరిస్థితులు మరీ విచారకరంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ జరుగుతోన్న వాటి కారణంగా మాత్రమే కాదు, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోని కారణంగా ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ భయానక విపత్తును నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు కానీ అలా జరగడం లేదు. ఇది కేవలం దక్షిణాసియాకే సంబంధించినది కాదు, పశ్చిమాన ఉన్న ధనిక దేశాలు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి'' అని ఆయన వివరించారు.
భారత్ వైఖరి
ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు అని భారత్ పేర్కొంది. ప్రొఫెసర్ చామ్‌స్కీకి వామపక్షవాదిగా గుర్తింపు ఉంది. కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం గురించి ఇతర దేశాలు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం శనివారం తోసిపుచ్చింది.
''కర్ణాటక విద్యా సంస్థల్లో యూనిఫామ్ అంశం, అక్కడి హైకోర్టు పరిశీలనలో ఉంది. మన రాజ్యాంగ విలువలు, వ్యవస్థ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భారత్ గురించి పూర్తిగా తెలిసినవారికే ఈ అంశం గురించి అవగతమవుతుంది. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను మేం స్వాగతించం'' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
'ఇస్లామోఫోబియా' ఆరోపణలను కూడా భారత ప్రభుత్వం పూర్తిగా కొట్టివేసింది. భారత రాజ్యాంగం ప్రకారం మత ప్రతిపాదికగా ఎలాంటి వివక్ష ఉండబోదని చెబుతూ వస్తోంది.
అంతకుముందు, రైతుల ఆందోళన సమయంలో విదేశాల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత అంతర్గత అంశాలపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది.
భారత్‌లో పరిస్థితుల గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ నేరుగా పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన తన సందేశాన్ని వీడియో రికార్డింగ్ ద్వారా పంపించారు.
నోమ్ చామ్‌స్కీ సుప్రసిద్ధ ఆలోచనాపరుడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన గౌరవ ఆచార్యుడు కూడా.
అమెరికాలో నివసిస్తోన్న ప్రొఫెసర్ నోమ్ చామ్‌స్కీ, అక్కడి వామపక్ష రాజకీయ శిబిరంలో ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందారు. అయితే తనను తాను ఉదారవాద సామాజికవేత్తగా చెప్పుకునే ఆయన వామపక్ష మేధావి అనే గుర్తింపును ఖండిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
హర్ష్ మందర్ ఏం చెప్పారు?
సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన కూడా వీడియో ద్వారానే తన సందేశాన్ని పంపించారు.
''భారతదేశం ఈరోజు భయంకరమైన హింస, ద్వేషం, భయంలో ఉంది'' అని ఆయన అన్నారు.
ఒకే మత దేశంగా నిర్వచించే పాకిస్తాన్ మార్గంలోకి వెళ్లకూడదని ఆధునిక భారతదేశ వ్యవస్థాపకులు ఎలా నిర్ణయించుకున్నారో అనే అంశం గురించి ఆయన మాట్లాడారు.
'హిందుత్వ' గురించి మాట్లాడుతూ... ''భారతీయ హిందువులకు, భారత్‌లోని ముస్లింలు క్రైస్తవులను ద్వేషించేవారికి మధ్య ఒక విభజన అవసరం'' అని అన్నారు.
''గాంధీ హత్యకు ప్రేరేపించిన హిందూ భావజాలంలో మునిగితేలుతోన్నవారు ప్రస్తుతం భారత్‌ను పాలిస్తున్నారు. ఇది భారత్ ప్రజలు ఎదుర్కొంటోన్న అతిపెద్ద విషాదం'' అని హర్ష్ వ్యాఖ్యానించారు.
''ఆన్‌లైన్‌లో లేదా పబ్లిక్ సమావేశాల్లో రాడికల్ రైట్ వింగ్ మద్దతుదారులు బహిరంగంగానే ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారు. మారణహోమాలు, గ్యాంగ్ రేప్‌లు, బాయ్‌కాట్‌లకు పిలుపునిస్తారు. కొన్నిసార్లు వీటి గురించి చూసీచూడనట్లు వ్యవహరిస్తారు. ద్వేషాన్ని వెదజల్లేవారిని కొన్నిసార్లు శిక్షిస్తారు. వీరిలో కొందరికి బెయిల్ లభిస్తుంది. మరికొందరికి పార్టీల్లో పదవులు దక్కుతాయి'' అని ఆయన అన్నారు.
17 సంస్థలు, ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. గతం తరహాలో ఈసారి చట్టాలను రూపొందించేవారు ఈ చర్చలో పాల్గొనలేదు.
భారత్‌లో హిజాబ్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతోన్న సమయంలో ఈ చర్చా కార్యక్రమం జరిగింది. హిజాబ్ ధరించడం ప్రాథమిక హక్కు అని, ముస్లిం మహిళల నుంచి ఈ హక్కును లాక్కోవడం అన్యాయమని మద్దతుదారులు పేర్కొంటున్నారు.
విద్యా సంస్థల వెలుపల హిజాబ్ ధరించడంలో తప్పులేదని... కానీ స్కూళ్లు, కాలేజీల ఆవరణలో యునిఫామ్‌ను పాటించడం అత్యవసరమని హిజాబ్‌ను వ్యతిరేకిస్తోన్నవారు వాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- శ్రీకాళహస్తి కలంకారీ: ఈ సంప్రదాయ కళ ఏనాటిది... ఈ వస్త్రాల ప్రత్యేకత ఏంటి?
- యుక్రెయిన్: రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నగరంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
- ‘మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది’ - కేసీఆర్
- బాయ్‌ఫ్రెండ్ ఆమె కొడుకుని చంపేశాడు.. కానీ, ఆమె జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు?
- మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















