కిడ్నీ మార్పిడి: తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఆ టీనేజి కూతురు ఏం చేసిందంటే...

అలియానా డెవేజా తల్లితో

ఫొటో సోర్స్, ALIANA DEVEZA

ఫొటో క్యాప్షన్, అలియానా డెవేజా తల్లితో
    • రచయిత, ఇయాన్ రోజ్
    • హోదా, బీబీసీ బిజినెస్

అలియానా డెవేజా 19 ఏళ్ల అమ్మాయి. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఆమె ఒక చరిత్రాత్మక శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

అపరిచితుల మధ్య అవయవాల మార్పిడి జరిగేలా ఆమె అమెరికాలో ఒక ఆసుపత్రిని ఒప్పించారు. దీంతో, సంబంధీకులు కాని వారి మధ్య వేర్వేరు అవయవాల మార్పిడి జరిగింది.

"శస్త్ర చికిత్స జరగగానే నేను మొదట "మా అమ్మ ఎలా ఉన్నారు? ఆమె బాగానే ఉన్నారా?" అని అడిగాను.

"నాకు నా గురించి దిగులు లేదు. నా నొప్పిని భరించడంపై దృష్టి పెట్టాను. ఈ శస్త్ర చికిత్స జరిగిన వారంతా కోలుకుంటున్నారని విన్న తర్వాత నాకు ఊపిరొచ్చింది."

అలియానా ఆమె తల్లికి అవయవ దానం చేశారు. కానీ, ఈ శస్త్ర చికిత్సలో అలియానా, ఆమె తల్లి మాత్రమే లేరు. వారితో పాటు మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కూడా ఆపరేషన్ జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

అలియానా అవయవాన్ని ఆ అక్కాచెల్లెళ్లలో ఒకరికి అమర్చారు. ఇద్దరిలో ఒకరి మూత్రపిండాలను అలియానా తల్లికి అమర్చారు. దీంతో, రెండు ప్రాణాలను కాపాడినట్టయ్యింది. ఒక కుటుంబంలోని వారిని కాపాడుకునేందుకు ఇద్దరు వ్యక్తులు అపరిచితులకు తమ అవయవాలు దానం చేశారు.

ఈ శస్త్ర చికిత్స అనుకున్న వెంటనే జరగలేదు. దీనికోసం రెండేళ్ల పాటు ప్రయత్నించారు.

తల్లి ఎరోసాలిన్ కిడ్నీలు విఫలం కావడంతో ఆమె ప్రాణాలు పోకుండా కాపాడేందుకు అలియానా కష్టపడ్డారు. ఈ శస్త్ర చికిత్సలతో మరొకరు పూర్తిగా కొత్త జీవితాన్ని గడపబోతున్నారు.

మూత్రపిండాలను బ్రతికి ఉండగానే దానం చేయవచ్చు. ఇది మిగతా అవయవాల దానం కంటే భిన్నంగా ఉంటుంది. ఒక్క మూత్రపిండంతో కూడా జీవించే అవకాశం ఉండడంతో సజీవంగా ఉన్నవారు తమ ఒక మూత్రపిండాన్ని దానం చేయొచ్చు.

అలా అని, కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఆ కిడ్నీని దానం చేయడం కుదరదు. మూత్రపిండం అవసరమైన రోగులకు కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఎవరైనా దానమిచ్చేందుకు ముందుకొచ్చినా అది ఆ రోగికి మ్యాచ్ కాని పరిస్థితి ఏర్పడవచ్చు.

2019లో ప్రపంచ వ్యాప్తంగా 1,50,000 అవయవాలు మార్పిడి చేశారు. వీరిలో అందులో చాలా కొద్దిమందికి మాత్రమే, పూర్తిగా కొత్త అవయవం అవసరం వచ్చింది.

ఆల్విన్ రోత్

ఫొటో సోర్స్, NOBEL MEDIA

ఫొటో క్యాప్షన్, ఆల్విన్ రోత్

ఎక్కువ మంది ప్రజలు కిడ్నీలు దానం చేసేందుకు, అవసరమైన వారు పొందేందుకు ఆల్విన్ రోత్ ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. ఇందుకు గాను, ఆయన 2012లో నోబెల్ ఫౌండేషన్ నుంచి ఎకనామిక్స్ లో బహుమతిని పొందారు.

"తాము ప్రేమించేవారిని, ఆప్తులను కాపాడుకునేందుకు కిడ్నీని దానం చేయవచ్చు" అని ఆయన వివరించారు.

"కానీ, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి కిడ్నీని దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అవతలి వ్యక్తులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండరు. నాకు నచ్చిన వారికి కిడ్నీ ఇచ్చే అవకాశం నాకు ఉండకపోవచ్చు" అని చెప్పారు.

"నా కిడ్నీ మీ రోగికి పని చేయవచ్చు, మీ కిడ్నీ నా రోగికి పని చేయవచ్చు. ఇలాంటి చోట ఆ ఇద్దరు కిడ్నీ దాతలు కలిసి రోగులకు సరిపడే వాటిని పరస్పరం దానం చేసుకోవచ్చు" అని వివరించారు.

ఆల్విన్ రోత్ రూపొందించిన విధానం వల్ల కిడ్నీ మార్పిడి సంఖ్య పెరిగేందుకు తోడ్పడింది. దాంతో, ప్రతీ ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడగల్గుతున్నారు.

కానీ, ఈ అవయవ మార్పిడి ప్రతీ చోటా చట్టబద్ధం కాదు. ఉదాహరణకు జర్మనీలో అవయవ దానం చేయాలంటే వారు కచ్చితంగా కుటుంబ సభ్యులై ఉండాలి. లేదంటే, కొంత మంది డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకునే అవకాశం ఉందనే ఆందోళన ఉంది.

వీడియో క్యాప్షన్, కృత్రిమంగా అవయవాలను ఎలా తయారుచేస్తున్నారు

ఒక్కొక్కసారి కేవలం జంటగా మాత్రమే కాకుండా, కొన్ని కేసుల్లో, 10 మందికి పైగా వ్యక్తులు కలిసి వచ్చి రోగులకు సరిపోయే కిడ్నీల సంఖ్యను పెంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒక కేసులో 70 మంది కిడ్నీ దానం చేసేందుకు రాగా, అందులో 35 మంది పూర్తిగా 35 మంది అపరిచితులకు కిడ్నీలు దానం చేశారు.

అలియానా తన కిడ్నీని వంశపారంపర్య సమస్యల కారణంగా తన తల్లికి ఇవ్వలేకపోయారు.

కానీ, ఆమె తల్లికి ఎలా అయినా సహాయం చేయాలని అనుకున్నారు. దాంతో, ఆమె పరిశోధన చేయడం మొదలుపెట్టి ఆమె అవయవాలను మరొకరికి ఇచ్చి వేరొకరి అవయవాన్ని తన తల్లికి అమర్చాలని ప్రయత్నించారు.

"శరీరంలో ఏ అవయవాలను దానం చేయవచ్చని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అందులో లివర్ ప్రముఖంగా కనిపించింది".

"ఇది తరచుగా చేసే శస్త్ర చికిత్స కాదని అలియానాకు తెలియదు. ఆమె లివర్ ను దానం చేసి, వారి కిడ్నీని ఆమె తల్లికి అమర్చవచ్చేమో నని కనుక్కునేందుకు వివిధ ఆసుపత్రులకు కాల్ చేశారు.

ఆమె అడిగిన విషయాన్ని చాలా ఆసుపత్రులు అర్ధం చేసుకోలేదని అలియానా చెప్పారు. "నేను అడిగేది వారికి అర్ధం కాకపోవడంతో మృతదేహాలను భద్రపరిచే విభాగాన్ని సంప్రదించమని కొంత మంది చెప్పేవారు" అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, అవయవ దానం: ‘‘నాకో శవాన్ని ఇవ్వండి చాలు.. నలుగుర్ని బతికిస్తా’’

చివరకు అలియానా ప్రయత్నాలు ఫలించాయి. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రాబర్ట్స్ ను కలిశారు.

"ఆయన నా మాటలను విని వదిలేయలేదు. నేను పిచ్చిగా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. నేను ప్రమాదంలో పడతానేమో అనే భయంతో నా కుటుంబ సభ్యులు కూడా నా ప్రయత్నానికి వ్యతిరేకంగానే ఉన్నారు" అని అలియానా చెప్పారు.

ఆసుపత్రి సహాయంతో వారు కిడ్నీలు దానం చేసేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లను సంప్రదించారు. ఆ అక్కా చెల్లెళ్ళలో ఒకరికి అలియానా లివర్ ఇస్తుంది. మరొక సోదరి అలియానా తల్లికి కిడ్నీ దానం చేస్తుంది"..

అలియానాకు దీని గురించి ఎటువంటి చింతా లేదు. ఇలాంటి పనిని అవసరమైన వారు ఎందుకు చేయడం లేదని ఆమె ఆలోచిస్తున్నారు.

"అవయవ దానం చుట్టూ అలుముకున్న భయం వల్ల చాలా మంది దానం చేసేందుకు ముందుకు రారు" అని అన్నారు.

"ఇవి చాలా పెద్ద శస్త్ర చికిత్సలు, వీటి వల్ల చాలా ముప్పు కూడా ఉంటుంది. కానీ, వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని నిపుణులైన వైద్య బృందం సహాయంతో ఈ ప్రక్రియను చేయించుకోవడం వల్ల సహాయపడుతుంది" అని అన్నారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)