దిల్లీ: బ్రెయిన్ డెడ్ అయిన బిడ్డ అవయవాలను దానం చేసిన తల్లితండ్రులు... అయిదుగురికి కొత్త జీవితం Newsreel

పసిపాప

ఫొటో సోర్స్, AFP

దిల్లీలోని రోహిణి ప్రాంతంలో జనవరి 8న ఒక 20 నెలల పసి బిడ్డ బాల్కనీనుంచి జారిపడిపోయింది. చికిత్స కోసం ఆ పాపను శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 11న డాక్టర్లు ఆ బిడ్డకు బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. ఇప్పుడు ఆ తల్లితండ్రులు తమ బిడ్డ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో, దేశంలో అతి పిన్న అవయవ దాతగా ఆ పాప పేరు నమోదైంది.

"మా పాప ధనిష్ఠకు బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమె కోలుకోవడం అసాధ్యమని డాక్టర్లు మాతో చెప్పారు. పాపకు చికిత్స జరుగుతుండగా..తమ బిడ్డలకు అవయవ దానం చేసేవారికోసం పరితపిస్తున్న పలువురు తల్లిదండ్రులను మేము కలిసాం. మా పాప బ్రెయిల్ డెడ్ అయింది, తను బతికి ఉండడం అసాధ్యం అని డాక్టర్లు చెప్పినప్పుడు, పాప అవయవాలను దానం చేయవచ్చా అని మేము డాక్టర్లను అడిగాం. మా పాప మరణించినప్పటికీ తన అవయవాలను దానం చేస్తే మరి కొందరికి జీవితం ఇచ్చినట్లు అవుతుందని మాకనిపించింది. డాక్టర్లు దీనికి ఒప్పుకున్నారు" అని పాప తండ్రి ఆశిష్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

"పాపాయి మాతో లేనప్పటికీ తన అవయవాలు దానం చేయడం ద్వారా మరొకచోట, మరికొందరి శరీరాల్లో భాగంగా జీవించి ఉంటుందనే తృప్తి మాకుంటుందని నేను, నా భార్య ఈ నిర్ణయానికొచ్చాం" అని ఆశిష్ తెలిపారు.

ఆశిష్ దంపతుల ఔదార్యాన్ని గంగారాం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా ప్రశంసించారు. ఇది మరికొందరికి ప్రేరణ ఇస్తుందని తెలిపారు.

ధనిష్ఠ గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను మరొక ఐదుగురికి అమర్చారు.

"మన దేశంలో అవయవ దానం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. 20-30 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ డిమాండ్ ఎక్కువగా ఉంది. దాదాపు 20,000 మంది రోగులు లివర్ ప్లాంటేషన్ కోసం వేచి చూస్తున్నారు" అని గంగారాం హాస్పిటల్ కో చైర్మన్ డాక్టర్ నైమేష్ మెహతా తెలిపారు.

దుష్యంత్ దవే

ఫొటో సోర్స్, ANI

సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీనామా

సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ లాయర్ దుష్యంత్ దవే గురువారం రాజీనామా చేశారు.

ఎస్‌సీబీఏ నాయకుడిగా కొనసాగే హక్కును కోల్పోయానని, తన రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని దవే ఎస్‌సీబీఏకు రాసిన లేఖలో తెలిపారు.

"ఎస్‌సీబీఏ కార్య నిర్వాహక కమిటీ పదవీ కాలం ముగిసిపోయింది. కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు వర్చువల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. కానీ మీలో కొందరికి ఉన్న అభ్యంతరాల కారణంగా ఎన్నికల కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వర్చువల్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నాకు ఎటువంటి ఫిర్యాదులూ లేవు. కానీ కమిటీ చైర్మన్‌గా కొనసాగడం నైతికంగా తప్పు అని నేను భావిస్తున్నాను" అని దవే ఎస్‌సీబీఏకు రాసిన లేఖలో తెలిపారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా తమ విధులను నిర్వర్తించేదుకు అవిరామంగా కృషి చేసిన బార్ అసోసియేషన్ సభ్యులందరికి దవే కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)