నిరుద్యోగం: ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోందా.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుమారు ఏడాదిన్నర క్రితం ప్రయాగ్‌రాజ్‌లో సివిల్ సర్వీసు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి కుటుంబం ఆ షాక్ నుంచీ ఇప్పటికీ తేరుకోలేదు.
"మా అన్నయ్య 2011 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ఉంటూ యూపీ-పీసీఎస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. పరీక్షలో విజయం సాధించలేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఇలా చేసి ఉండకూడదు" అని ఆ యువకుడి తమ్ముడు మనోజ్ చౌదరి బీబీసీతో అన్నారు. వారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నివసిస్తోంది.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన మరో యువకుడిదీ ఇదే కథ. ఆయుర్వేద కాంపౌండర్ రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్ అయ్యేవాడు ఆ అబ్బాయి.
"మేం అయిదుగురు అన్నదమ్ములం. తను అందరికన్నా పెద్దవాడు. పరీక్షలో సెలెక్ట్ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ ఇవ్వలేదని, నిరుద్యోగం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్‌లో రాశాడు" అని ఆ యువకుడి తమ్ముడు మదన్ మీణా బీబీసీకి చెప్పారు.
ఈ కథలన్నీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వైపు వేలు చూపిస్తున్నాయి.
నిరుద్యోగం కారణంగా 2018 నుంచి 2020 వరకు 9,140 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో తెలిపారు.
నిరుద్యోగం వల్ల 2018లో 2,741 మంది, 2019లో 2,851 మంది, 2020లో 3,548 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014తో పోలిస్తే 2020లో నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు 60 శాతం పెరిగాయి.
'ఇది ప్రమాద సూచిక'
ఆరేళ్లల్లో నిరుద్యోగం వల్ల ఆత్మహత్యలు 60 శాతం పెరగడం ప్రమాద సూచిక అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని స్కూల్ ఆఫ్ కంప్యూటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్స్ ప్రొఫెసర్ షాందార్ అహ్మద్ అన్నారు.
"2014 నుంచి 2017 వరకు నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు పెద్దగా పెరగలేదు. కానీ, 2020లో ఈ సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. ఇది చాలా పెద్ద మార్పు. దీన్ని విస్మరించలేం" అని ఆయన అన్నారు.
దీనిపై దృష్టి సారించకపోతే సమస్య మరింత జటిలం అవుతుందని ప్రొఫెసర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"2020లో ఆత్మహత్యలు ఇంతలా పెరగడానికి, గత సంవత్సరాలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో పరిశీలించాలి. ఒక్కరోజులో ఉద్యోగం పోవడమో లేదా రాకపోవడమో కారణంగా ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. పరిస్థితులు మెల్లమెల్లగా విషమిస్తాయి. భరించలేక ఏదో ఒకరోజు ఆత్మహత్యకు పాల్పడతారు. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలపై కరోనా ప్రభావం ఎంతుందో ఒకటి, రెండేళ్లల్లో తెలిసిపోతుంది. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారవచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు
నిరుద్యోగమే కాకుండా అప్పులపాలవడం, దివాలా వంటి ఆర్థిక సమస్యల కారణంగా కూడా 2018 నుంచి 2020 మధ్య ఆత్మహత్యలు పెరిగాయి.
ఈ మూడేళ్లల్లో ఆర్థిక సమస్యల కారణంగా 16,091 మంది ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. 2019లో అత్యధికంగా 5,908 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రిపోర్ట్ ఆధారంగా హోం శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.
దేశంలో నిరుద్యోగం పరిస్థితి తీవ్రంగా ఉందని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరెక్టర్ డీఎం దివాకర్ అన్నారు.
"గత కొన్నేళ్లల్లో ప్రజల్లో నిరుద్యోగం, నిరాశ, నిస్పృహలు గణనీయంగా పెరిగాయి. నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు సరికాదు. వాస్తవంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. లక్షల్లో యువత ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. కానీ, వారికి ఉద్యోగాలు దక్కట్లేదు. ప్రతీ ఏడాది వర్క్‌ఫోర్స్ పెరుగుతోంది" అని ఆయన చెప్పారు.

ఖాళీ పోస్టులు
2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటులో వెల్లడించారు.
ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ, 2018 మార్చి 1 నాటికి 6,83,823 ఖాళీ పోస్టులు, 2019 మార్చి 1 నాటికి 9,10,153 ఖాళీలు ఉన్నాయని చెప్పారు.
"మూడు పెద్ద రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు 2018-19 నుంచి 2020-21 వరకు 2,65,468 ఖాళీలను భర్తీ చేశాయి. వీటిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఉన్నాయి" అని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలే కాక గత కొన్నేళ్లుగా ప్రయివేటు ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ప్రభుత్వ శాఖల్లో లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వే వంటి రంగాల్లో ప్రతి సంవత్సరం లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తారు. పోస్టులు ఖాళీ అవుతున్నా భర్తీ చేయడం లేదు. ఎందుకంటే, ప్రభుత్వం ప్రయివేటీకరణ దిశగా సాగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రయివేటు సంస్థలకు పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది" అని డీఎం దివాకర్ అన్నారు.

ప్రభుత్వం సకాలంలో ఖాళీలు భర్తీ చేయాలని ఉత్తరప్రదేశ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడి తమ్ముడు మనోజ్ చౌదరి అన్నారు.
"100 ఖాళీలు ఉంటే 50 ముందే భర్తీ అయిపోతాయి. పరీక్ష పేపర్లు లీక్ అయిపోతాయి. ప్రభుత్వం నిజాయితీగా ఖాళీలు భర్తీ చేయాలి.
"ఆత్మహత్య చేసుకునే ముందు మా అన్నయ్య బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం కూడా పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చాక వ్యవహారం కోర్టుకు వెళ్లింది. బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా జాయిన్ కమ్మని ఉత్తరం వచ్చేసరికి మా అన్నయ్య ఈ లోకంలో లేడు" అని ఆయన అన్నారు.
మనోజ్ అన్నయ్యకు అత్యంత సన్నిహితుడైన రామ్ బహదూర్ యాదవ్ హైదరాబాదులో వెటర్నరీ డాక్టరుగా ఉన్నారు.
"మేం కలిసి చదువుకున్నాం. తను ఆత్మహత్య లాంటి పెద్ద నిర్ణయం తీసుకుని ఉండకూడదు. నేను బాగా చదువుకున్నా ఉత్తరప్రదేశ్‌లో నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం వేటలో హైదరాబాద్ చేరుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బాగానే సంపాదిస్తున్నాను" అని రామ్ బహదూర్ బీబీసీతో చెప్పారు.
"ఒకటే ఉద్యోగం కావాలని చాలామంది మనసులో ఫిక్స్ అయిపోతారు. అది రాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అది కాకపోతే మరొకటి. వేర్వేరు ఆప్షన్లు పెట్టుకోవాలి. మంచి ఉద్యోగం రాకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని ప్రారంభించవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా థెరపిస్టులతో మాట్లాడండి" అని దిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లో సీనియర్ సైకాలజిస్ట్ రోమా కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:
- నాసా: రెండు దశాబ్దాల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 2030లో గుడ్ బై
- IPL-2022 వేలం: ఇషాన్ కిషన్‌కు రూ. 15.25 కోట్లు... దీపక్ చహర్, శ్రేయస్ అయ్యర్‌లకు జాక్‌పాట్
- బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత
- అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువకుడు సత్యకృష్ణ చిత్తూరి
- యుక్రెయిన్ ఉద్రిక్తతలు: 'రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు' - అమెరికా హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











