నాసా: రెండు దశాబ్దాల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 2030లో గుడ్ బై

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కార్యకలాపాలు 2030తో ముగియనున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కార్యకలాపాలు 2030తో ముగియనున్నాయి
    • రచయిత, రెడాక్సియన్
    • హోదా, బీబీసీ ముండో

సుమారు రెండు దశాబ్దాల క్రితం నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) కార్యకలాపాలు 2030తో ముగుస్తాయని నాసా ప్రకటించింది.

1998 నుంచి కక్ష్యలో ఉన్న పెద్ద స్పేస్ మాడ్యూల్ (ఐఎస్ఎస్) 2031 ప్రారంభంలో పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయి, అడుగుకు చేరుతుందని వెల్లడించింది.

దక్షిణ పసిఫిక్‌లో భాగమైన 'పాయింట్ నెమో' అనే ప్రాంతంలో ఐఎస్ఎస్ పడిపోతుందని అంచనా వేస్తున్నట్టు ఈ వారం విడుదల చేసిన ఒక రిపోర్టులో నాసా వెల్లడించింది.

భూమిపై నేలకు సుదూరంలో ఉన్న పాయింట్ ఇది. దీన్ని 'స్పేస్‌షిప్ స్మశానవాటిక' అని కూడా పిలుస్తారు. పాత ఉపగ్రహాలు, అంతరిక్ష శిథిలాలు ఎన్నో ఇక్కడ కుప్పకూలాయి. 2001లో రష్యన్ మిర్ స్పేస్ స్టేషన్‌ కూడా ఇక్కడే కూలింది.

భవిష్యత్తులో భూమికి సమీపంలో అంతరిక్ష కార్యకలాపాలను వాణిజ్య రంగం నిర్వహిస్తుందని నాసా తెలిపింది.

భూమికి సమీపంలోని అంతరిక్షంలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూమికి సమీపంలోని అంతరిక్షంలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి

ఐఎస్ఎస్ చరిత్ర

అయిదు అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా ఐఎస్ఎస్ ప్రాజెక్టును చేపట్టాయి. 1998లో దాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2000 సంవత్సరానికి అక్కడికి అంతరిక్ష సిబ్బంది చేరుకున్నారు.

దాని మైక్రోగ్రావిటీ ప్రయోగశాలలో 3,000 కంటే ఎక్కువ పరిశోధనలు జరిగాయి.

వాస్తవానికి, ఇది 2024 వరకే పనిచేసేలా షెడ్యూల్ చేశారు. దీని కార్యక్రమాలను పొడిగించాలంటే భాగస్వాములందరి అంగీకారం ఉండాలి.

ప్రైవేటు కంపెనీలకు తరలింపు

ఐఎస్ఎస్‌ను ముగించాలన్న ప్రణాళిక.. భూమికి సమీపంలోని అంతరిక్షంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే దిశగా మార్పుకు సూచిక అని నాసా తెలిపింది.

"భూమికి సమీపంలోని అంతరిక్షంలో వాణిజ్య కార్యకలాపాలను నాసా సహాయంతో నిర్వహించగల సాంకేతిక, ఆర్థిక సామర్థ్యం ప్రయివేటు రంగానికి ఉంది" అని నాసా కమర్షియల్ స్పేస్ డైరెక్టర్ ఫిల్ మెక్‌అలిస్టర్ చెప్పారు.

ఐఎస్ఎస్‌లో చేరగలిగేలా కనీసం ఒక నివాసయోగ్యమైన మాడ్యూల్‌ను నిర్మించేందుకు ఆక్సియం స్పేస్ కంపెనీకి నాసా 2020లో కాంట్రాక్ట్ ఇచ్చింది.

స్పేస్ స్టేషన్లు, ఇతర కమర్షియల్ డెస్టినేషన్ల డిజైన్లను అభివృద్ధి చేయడానికి మరో మూడు కంపెనీలకు నిధులు సమకూర్చింది.

ఐఎస్ఎస్‌ కార్యకలాపాలు ముగిసే ముందే ఈ కొత్త ప్రాజెక్టులు కక్ష్యలోకి ప్రవేశిస్తాయని అంచనా.

శ్రమ భారం వలన ఐఎస్ఎస్ 2030 దాటి పనిచేయకపోవచ్చని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, కాలం చెల్లిన పరికరాలు "కోలుకోలేని" వైఫల్యాలకు దారితీస్తాయని హెచ్చరించింది.

అంతరిక్ష అన్వేషణలో రష్యా, అమెరికాల మధ్య సహాకారానికి అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అంతరిక్ష అన్వేషణలో రష్యా, అమెరికాల మధ్య సహాకారానికి అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు

'చాలా డబ్బు ఆదా అవుతుంది'

ఇప్పటికే ఐఎస్ఎస్‌కు సిబ్బందిని, సామాగ్రిని అందించే బాధ్యతను ప్రయివేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. దాంతో, వాణిజ్య రంగం యూఎస్ స్పేస్ ప్రోగ్రాంలో ముఖ్యమైన భాగమైంది. రష్యన్ సోయుజ్, ప్రోగ్రెస్ స్పేస్‌క్రాఫ్ట్‌లను కూడా వినియోగిస్తున్నారు.

ప్రయివేటు రంగానికి అవకాశం ఇస్తే భూమికి సమీపంలోని అంతరిక్ష కార్యకలాపాల నుంచి 1.3 బిలియన్ డాలర్ల (రూ. 9,707 కోట్లు)ను ఆదా చేయవచ్చని, ఆ డబ్బును విస్తృతమైన అంతరిక్ష అన్వేషణకు ఖర్చు చేయవచ్చని నాసా వివరించింది.

డబ్బు ఎందుకు ఆదా అవుతుందంటే, ఐఎస్ఎస్ నిర్వహణ, ఆపరేషన్లకు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా తనకు అవసరమైన సేవలకు మాత్రమే నాసా డబ్బు చెల్లిస్తుంది.

ప్రయివేటు రంగం నుంచి వచ్చే స్పేస్ స్టేషన్లు మరింత అధునాతనంగా ఉంటాయని, వాటికి తక్కువ విడి భాగాలు అవసరమవుతాయని నాసా సూచించింది.

భౌగోళిక రాజకీయాలు

2030 వరకు స్పేస్ స్టేషన్ కార్యకలాపాలను పొడిగించేదుకు అమెరికా సిద్ధంగా ఉందని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం, నాసా తన నివేదికను ఈ వారంలో విడుదల చేసింది.

అయితే, పొడిగింపుకు రష్యా సహా అంతర్జాతీయ భాగస్వాముల అంగీకారం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఐఎస్ఎస్‌కు 2024 వరకే నిధులు అందించేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.

వీడియో క్యాప్షన్, అంగారకుడిపై రోవర్ దిగుతున్న అద్భుత దృశ్యాలు విడుదల చేసిన నాసా

కాగా, 2024 తరువాత కూడా నాసాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా స్పేస్ ప్రోగ్రాం రోస్కోస్మోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ 2021 డిసెంబర్‌లో రష్యన్ ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

"చెప్పడం కన్నా చేసి చూపడం మిన్న. ఈ సంవత్సరం మేం ఒక కొత్త 'నౌక' మాడ్యూల్‌ను ఐఎస్ఎస్‌కు పంపాం. అది కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తుందని అంచనా" అని రోగోజిన్ చెప్పారు.

అయితే, రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు ఆ దేశంలోని అంతరిక్ష పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. ఆంక్షలను ఎత్తివేయకపోతే ఐఎస్ఎస్ ప్రోగ్రాంలో తమ భాగస్వామ్యాన్ని ముగించే అవకాశం ఉందని గతంలో ఆయన చెప్పారు.

యుక్రెయిన్‌పై దాడి చేస్తే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా, దాని మిత్ర దేశాలు హెచ్చరించాయి. కానీ, ఎలాంటి ఆంక్షలు అనేది స్పష్టం చేయలేదు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)