‘ఎటు చూసినా శవాలు, ధ్వంసమైన భవనాలు, రోదిస్తున్న రష్యన్‌లు’.. ఇలాంటి ఫేక్ వీడియోలు చూపించి రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయాలనుకుంటోందన్న అమెరికా

రష్యా సైనికులు

ఫొటో సోర్స్, Reuters

యుక్రెయిన్‌పై దాడికి ఒక సాకును సృష్టించే ప్రయత్నంలో భాగంగా రష్యా యుక్రెయిన్ మిలటరీపై నిందలు మోపేందుకు పథక రచన చేస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు.

రష్యాపై కానీ, రష్యా అండదండలున్న వేర్పాటువాదులపై కానీ యుక్రెయిన్ సైన్యం దాడి చేసిందని తప్పుడు ఆరోపణలు చేసే ఆలోచనలో రష్యా ఉందని అమెరికా ఆరోపించింది.

భారీ పేలుడు జరిగి పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు గ్రాఫికల్‌గా ఒక నకిలీ ఆధారాన్ని సృష్టించే ఆలోచనలో రష్యా ఉందన్నది అమెరికా ఆరోపణ.

అయితే, అమెరికా ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. అలాంటి నకిలీ ఆలోచనలేమీ తమ మదిలో లేవని రష్యా చెప్పింది.

కాగా యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీ ఎత్తున తన బలగాలను మోహరిండచంపై అమెరికా, నాటో ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

రష్యా మాత్రం దాడి సన్నాహాలేమీ జరగడం లేదని మిలటరీ డ్రిల్ కోసమే తమ బలగాలు అక్కడున్నాయని చెబుతోంది. సుమారు లక్ష మంది సైనికులు అక్కడున్నారని రష్యా అంటోంది.

ఎనిమిదేళ్ల కిందట రష్యా యుక్రెయిన్ ద్వీపకల్పం క్రిమినాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా డాన్‌బాస్ ప్రాంతంలోని తిరుగుబాటుదారులకు మద్దతివ్వనారంభించింది.

ఆ తరువాత మళ్లీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.

తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో ప్రజలు మరణించినట్లుగా చిత్రాలు సృష్టించి ప్రజల్లో యుక్రెయిన్ ప్రభుత్వంపై ఆగ్రహం రగిలించేందుకు రష్యా సెక్యూరిటీ సర్వీసెస్ ఈ ఆపరేషన్‌ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు చెబుతున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా చేయబోయే దాడిని సమర్థించుకునేందుకు ఇదంతా ఉపయోగించుకుంటారని వారు అన్నారు.

Putin

ఫొటో సోర్స్, Getty Images

ఒక బూటకపు దాడి, ఆ దృశ్యాలు వ్యాప్తిలోకి తేవడం వంటివన్నీ ఈ ప్లానులో ఉండొచ్చని ఆరోపించారు. శవాలు, ధ్వంసమైన పరిసరాలు, యుక్రెయిన్ మిలటరీ సామగ్రిని పోలిన ఎక్విప్‌మెంట్, టర్కీ తయారీ డ్రోన్లు, రష్యన్‌లో మాట్లాడే నకిలీ బాధితులు వంటివన్నీ ఈ ప్లానులో భాగంగా వ్యాప్తి చేసే దృశ్యాలలో ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు.

అయితే, ఇది రష్యా పథక రచనలోని ఒక ఆప్షన్ మాత్రమేనని.. రష్యాను నిరోధించేందుకు ముందుగానే తాము ఇది బయటపెడుతున్నామని అమెరికా అంటోంది.

మరోవైపు యూకే విదేశీవ్యవహారాల మంత్రి ఎలిజబెత్ ట్రస్ మాట్లాడుతూ....''యుక్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు రష్యా పన్నుతున్న లోపాయికారీ పన్నాగాలకు సంబంధించి అమెరికా నిఘా వర్గాల వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

''ఒక ప్రజాస్వామ్య దేశం పట్ల ఇలాంటి కయ్యాలమారి చర్యలకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీన్ని మేం ఖండిస్తున్నాం'' అన్నారామె.

మరోవైపు రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ అమెరికా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఇదేమీ తొలిసారికాదని... గతంలోనూ ఇలాంటి దుష్ప్రచారం చేసిందని, కానీ, వారు చెప్పిందేమీ జరగలేదని అన్నారు.

యుక్రెయిన్‌పై దాడి చేసేందుకు గాను రష్యా ఎలాంటి తప్పుడు పథక రచనలు చేయడం లేదని యూరోపియన్ యూనియన్ రష్యా రాయబారి వ్లాదిమిర్ చిజోవ్ 'సీఎన్ఎన్ న్యూస్'తో అన్నారు.

రష్యా బలగాల మోహరింపును వివరించే చిత్రం
ఫొటో క్యాప్షన్, రష్యా బలగాల మోహరింపును వివరించే చిత్రం

యూరప్‌లోని నాటో మిత్ర దేశాలకు తమ బలగాలు మరిన్ని పంపిస్తున్నామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఈ కుట్ర కోణం ప్రచారంలోకి తెచ్చింది.

తూర్పు వైపు నాటో విస్తరణకు సంబంధించి తమ ఆందోళనలు సహేతుకమే అనడానికి అమెరికా చర్యలు ఊతమిస్తున్నాయని... అమెరికా వేస్తున్న అడుగులు వినాశకరంగా ఉన్నాయని రష్యా చెబుతోంది.

ప్రపంచంలోని బలమైన అణ్వాయుధ దేశాలైన అమెరికా, రష్యాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి ఈ వైరం కొనసాగుతోంది. అప్పట్లో యుక్రెయిన్ రష్యాలో కీలక ప్రాంతంగా ఉండేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)