అమెరికా, రష్యా, భారత్‌లకు చంద్రుడిపై ఎందుకంత ఆసక్తి

అమెరికా, భారత్, రష్యా సహా అనేక దేశాలు లూనార్ స్పేస్ రేస్‌లో భాగం కానున్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమెరికా, భారత్, రష్యా సహా అనేక దేశాలు లూనార్ స్పేస్ రేస్‌లో భాగం కానున్నాయి

గత ఏడాది కాలంగా ఒక్క అంతరిక్ష నౌక కూడా చంద్రుడిపై దిగలేదు. కానీ, చంద్రుడికి సంబంధించిన వార్తలను వింటూనే ఉన్నాం. ఈ ఏడాది చాలా దేశాలు, సంస్థలు చంద్రయానానికి సిద్ధమవుతున్నాయి.

నాసా తన ఆర్టెమిస్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా తొలిసారిగా ఒక మహిళా వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టనున్నారు. దాంతో పాటు చంద్రుడిపై సుదీర్ఘ కాలం పరిశోధనలు కొనసాగించడానికి అవసరమైన ఉపకరణాలను పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములు వీటిని ఉపయోగించుకోగలరు.

దీని కోసం, చంద్రుడిపై వ్యోమగాములు నివసించగలిగేలా ఆర్టెమిస్ బేస్ క్యాంప్‌ను నిర్మించనున్నారు. అంతరిక్షంలో ఒక గేట్‌వే కూడా సిద్ధం చేస్తారు. చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లే అంతరిక్ష యాత్రికులు అక్కడ ఆగవచ్చు.

ఇక్కడ ఒక అత్యాధునికమైన మొబైల్ ఇల్లు, రోవర్‌ ఏర్పాటు చేస్తారు. చంద్రుడిపై అపూర్వమైన అన్వేషణను ఇక్కడి నుంచి నిర్వహించవచ్చు. భవిష్యత్తులో అంగారక గ్రహం పైకి అడుగుపెట్టడానికి కూడా ఇది దోహదపడుతుంది.

ఆర్టెమిస్-2 క్రూ మాడ్యూల్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఆర్టెమిస్-2 క్రూ మాడ్యూల్

ఏ దేశాలు ఎలాంటి మిషన్లు రూపొందిస్తున్నాయి?

భారతదేశం, జపాన్, రష్యా, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ సంవత్సరం తమ లూనార్ మిషన్లను ప్రారంభించనున్నాయి.

ఇవే కాకుండా, కొన్ని ఇతర దేశాలు, ప్రయివేటు కంపెనీలు కూడా ఈ ఏడాది తమ ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టనున్నాయి.

వీటిలో అధిక భాగం మానవరహిత మిషన్లే. ఇవి, చంద్రుడిపై నివసించడానికి అవసరమైన సామాగ్రిని తీసుకువెళతాయి. తద్వారా మానవులు ఒక దశాబ్దం పాటు చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు రంగం సిద్ధం అవుతుంది.

దీనితో పాటు, చంద్రుడికి సమీపంలోని అంతరిక్షంలో లూనార్ స్పేస్ స్టేషన్‌ను నిర్మించే ప్రణాళిక కూడా ఉంది.

కానీ ఈ మిషన్ల అంతిమ లక్ష్యం ఇది కాదు. వాస్తవానికి, ఇది అంగారక గ్రహంపై అడుగు పెట్టే ప్రణాళికలో మొదటి దశ.

ఈ సంవత్సరం కొత్త రకమైన స్పేస్ రేస్ ప్రారంభమవుతుందని, ఇందులో మరిన్ని దేశాలు పాలుపంచుకునే అవకాశం ఉందని బ్రిటన్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జాయ్ లిన్‌హార్ట్ అన్నారు.

వీటిల్లో చాలావరకు చంద్రుడిపై అన్వేషణ సాగించే కార్యక్రమాలే ఉంటాయి. కొన్ని మాత్రం అంతకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నవి ఉంటాయి.

"భవిష్యత్తులో చేపట్టబోయే భారీ ప్రాజెక్టులకు తొలి అడుగుగా కొన్ని మిషన్లను ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్షంలో కొత్త సాంకేతికత, కొత్త భాగస్వామ్యాలను పరీక్షించేందుకు కూడా ఈ లూనార్ స్పేస్ మిషన్లు మంచి అవకాశం కలిగిస్తాయి" అని డాక్టర్ లిన్‌హార్ట్ అన్నారు.

ఈ ఏడాది ప్రారంభమయ్యే లూనార్ ప్రోగ్రాంలు ఏవి? వాటి లక్ష్యాలు ఏంటి? పరిశీలిద్దాం.

ఓరియన్ నౌక

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఓరియన్ నౌక

నాసా 'ఆర్టెమిస్-వన్', 'క్యాప్‌స్టోన్

2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేపట్టింది. అయితే, అది అంతటితో ముగిసేది కాదు. ఇది విజయవంతమైతే, అంతకన్నా పెద్ద లక్ష్యం వైపు ఇది తొలి అడుగు అవుతుంది.

'ఆర్టెమిస్-వన్‌'లో భాగంగా 'మూనికిన్'ను చంద్రుడిపైకి పంపిస్తారు. దీని ద్వారా స్పేస్‌సూట్‌ను పరీక్షిస్తారు. తరువాత ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు దీన్ని ధరించవచ్చు.

ఈ మిషన్‌ను నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) ద్వారా ప్రయోగిస్తారు. ఇది ఓరియన్ అంతరిక్ష నౌకను చంద్రుడిపైకి తీసుకెళుతుంది. చంద్రుడిపై సిబ్బందిని దించే వాహనాన్ని పరీక్షిస్తుంది.

ఓరియన్‌పై హీట్ షీల్డ్‌ను కూడా నాసా అధ్యయనం చేస్తుంది. తిరుగు ప్రయాణంలో ఓరియన్ ఆధిక వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించగానే సుమారు 2760 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆర్టెమిస్ ప్రోగ్రాంలో భాగంగా తొలుత క్యాప్‌స్టోన్ అంతరిక్ష నౌకను 2022 మార్చి నాటికి పంపిస్తారు. దీని ద్వారా, మైక్రోవేవ్ ఓవెన్ అంత పెద్ద అటానమస్ పొజిషనింగ్ సిస్టం 'క్యూబ్‌సాట్‌'ను ప్రయోగిస్తారు. ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరీక్షిస్తుంది. భవిష్యత్తులో వ్యోమగాముల భద్రతను నిర్థరించడమే దీని లక్ష్యం.

వీడియో క్యాప్షన్, జేమ్స్ వెబ్: హబుల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన టెలిస్కోప్‌

అంగారకుడిపై అడుగు పెట్టే ప్రణాళిక

ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా సేకరించిన సమాచారాన్ని అంతరిక్షంలో గేట్‌వేని నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఈ గేట్‌వే చంద్రుడికి సమీపంలో నిర్మించే అవుట్‌పోస్ట్ లాంటిదని నాసా వివరించింది.

ప్రణాళిక ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే, 2025 నాటికి ఆర్టెమిస్-3 ద్వారా నాసా చంద్రుడిపైకి మానవులను పంపుతుంది.

మళ్లీ చంద్రుడిపైకి అడుగుపెట్టడం అంతరిక్ష పరిశోధనలో ఓ పెద్ద మైలురాయి లాంటిదని అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ప్లానెటరీ సైంటిస్ట్ డాక్టర్ హన్నా సార్జెంట్ అన్నారు.

"అంతరిక్ష పరిశోధనలో నాసా గేట్‌వే కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రుడికి దగ్గరగా స్పేస్ స్టేషన్, చంద్రుడిపై బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు ఇది సహకరిస్తుంది. భవిష్యత్తులో అంగారక గ్రహంపై అడుగుపెట్టడానికి ఇది మార్గం వేస్తుంది" అని ఆమె అన్నారు.

నాసా మాత్రమే కాకుండా, భారతదేశం, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అనేక దేశాలు, కంపెనీలు ఈ సంవత్సరం చంద్రుడిపై దృష్టి సారిస్తున్నాయి. వీటిలో కొన్ని పరిశోధనాత్మక మిషన్లు కాగా, మరి కొన్ని చంద్రుడిపైకి అవసరమైన పరికరాలు, సామగ్రిని అందించేందుకు సహాయపడతాయి.

వీడియో క్యాప్షన్, సూర్యుడికి సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక

భారతదేశం చేపట్టిన చంద్రయాన్

గతంలో చంద్రుడి ఉపరితలంపైకి చంద్రాయన్ పంపించింది భారత్. అయితే, ఈ మిషన్ విఫలమైంది. ఈ సంవత్సరం మళ్లీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 పేరుతో సెర్చ్ మిషన్‌ను చంద్రుడిపైకి పంపాలని యోచిస్తోంది.

ఒక అంతరిక్ష నౌక, ఓ రోవర్, ల్యాండర్‌ సహా చంద్రయాన్-3 మిషన్‌ను ఈ ఏడాది చివరికి చంద్రుడిపైకి పంపే అవకాశం ఉంది. ఇది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ఒక ఆర్బిటర్ మిషన్. చంద్రుడి ఫొటోలను రోవర్ భూమికి పంపుతుంది.

చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి చీకటి వైపున (డార్క్ సైడ్) రోవర్‌ను ల్యాండ్ చేయాలనే ప్రణాళిక ఉంది. కోట్లాది సంవత్సరాలుగా సూర్యకాంతి పడని ప్రదేశం అది. ఈ భాగంలో మంచు, ముఖ్యమైన ఖనిజాలు ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

జపాన్ ప్రణాళికలు

ఈ ఏడాది జపాన్, చంద్రుడికి సంబంధించిన రెండు ప్రాజెక్టులను చేపడుతోంది.

జపాన్ స్పేస్ ఏజెన్సీ (జాక్సా) ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. 'స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ది మూన్' (స్లిమ్) అని పిలిచే ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ టెక్నాలజీని పరీక్షించనుంది. ఈ మిషన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా చంద్రుడిపై ఉన్న బిలాల సమాచారాన్ని సేకరిస్తుంది. దీనికి 'ఎక్స్-రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్' (XRISM) అనే స్పేస్ టెలిస్కోప్ కూడా అమరుస్తారు.

జపాన్‌కు చెందిన ఐస్పేస్ కంపెనీ కూడా ఈ ఏడాది చివర్లో ఒక ల్యాండర్, వచ్చే ఏడాది మరొక ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. 'హకూటో-ఆర్' కార్యక్రమం కింద, ఈ రెండు మిషన్లకు 'మిషన్-I', 'మిషన్-II' అని పేర్లు పెట్టారు. ఇవి చంద్రుడి కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన మిషన్లు. చంద్రుడిపై స్థావరాలు ఏర్పరచుకునే అవకాశాలను ఇవి పరిశోధిస్తాయి.

భవిష్యత్తులో చంద్రుడిపై స్థావరాలను ఏర్పరచుకోగలిగితే, అక్కడ వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చని ఈ కంపెనీ పేర్కొంది. ఈ రెండు మిషన్ల తరువాత, మూడవ మిషన్ నుంచి తొమ్మిదవ మిషన్ వరకూ చంద్రుడిపై పేలోడ్ డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆపై అక్కడ ఇండస్ట్రియల్ ప్లాట్‌ఫారంను నిర్మిస్తుంది.

లూనా 25

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లూనా 25 మిషన్

రష్యా, దక్షిణ కొరియా స్పేస్ మిషన్లు

రష్యా తన లూనా-25 మిషన్‌ను, దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ మిషన్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

ఈ ఏడాది జూలైలో చంద్రుడిపైకి లూనా-25 ల్యాండర్ పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ప్రకటించింది.

దీని తరువాత, 2024లో లూనా-26, 2025లో లూనా-27, 2027, 2028లో లూనా-28 మిషన్లను ప్రయోగించే ప్రణాళికలపై రష్యా కసరత్తు చేస్తోంది.

దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ 'కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' ఈ ఏడాది ఆగస్టులో చంద్రుడిపైకి 'కొరియా పాత్‌ఫైండర్ లూనార్ ఆర్బిటర్' (కేపీఎల్ఓ)ను పంపనుంది. ఇది చంద్రుడిపై వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి పంపే మిషన్లకు సహాయపడుతుంది.

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

నాసా కమర్షియల్ రోబోలు

చంద్రుడిపైకి వెళ్లేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలే కాకుండా పలు ప్రయివేటు సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి.

ఈ రేసులో జపాన్ కంపెనీ ఐస్పేస్ చేరింది. నాసా ప్రోగ్రాం 'కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్' కింద చంద్రుడిపైకి సామాగ్రిని పంపేందుకు అనేక కంపెనీలు పోటీకి సిద్ధమవుతున్నాయి.

అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న ఇంట్యూటివ్ మిషన్స్ అనే సంస్థ, 'NOVI-C' అనే ఆరు కాళ్ల లూనార్ రోబో ద్వారా 2022 ప్రారంభంలో చంద్రుడిపైకి వస్తువులను చేరవేసేందుకు సిద్ధమవుతోంది.

పెన్సిల్వేనియాకు చెందిన ఆస్ట్రోబాటిక్ టెక్నాలజీ, ఈ ఏడాది మధ్యలో ఒక మిషన్‌ను ప్రారంభించబోతోంది. దీని ద్వారా, ఒక నాలుగు కాళ్ల ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ పరిశోధన కోసం సామాగ్రిని అందిస్తుంది.

చంద్రయాన్ -2

ఫొటో సోర్స్, iSRO

ఈ మిషన్ల లక్ష్యాలేంటి?

చంద్రుడిపై వాతావరణం గురించి సమాచారాన్ని సేకరించడమే వీటి ప్రాథమిక లక్ష్యమని డాక్టర్ సార్జెంట్ వివరించారు. తద్వారా భవిష్యతులో చంద్రుడిపై కాలు పెట్టబోయే మానవులు సోలార్ విండ్, లూనార్ డస్ట్ నుంచి రక్షించుకోగలిగే వ్యవస్థను తయారుచేయగలరు. అలాగే, చంద్రుడిపై నీటి వనరులు నిర్మించే అవకాశాలనూ పరిశీలించవచ్చు.

"చంద్రుడిపై మానవులు దిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవడమే వీటి లక్ష్యం. వీటి ద్వారా సేకరించిన సమాచారం ఆ తరువాత అంగారక గ్రహంపై అడుగు పెట్టే మిషన్ల ప్రణాళికకు ఉపయోగపడుతుంది. చంద్ర గ్రహం మనకొక పెద్ద ప్రయోగశాల లాంటిది. భవిష్యత్తులో అంగారక గ్రహంపై ప్రయోగించే సాంకేతికను ముందు చంద్రుడిపై పరీక్షించవచ్చు. చంద్రుడు మనకు కేవలం మూడు రోజుల దూరంలో ఉన్నాడు. కానీ, అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి మనకు కనీసం ఆరు నెలల సమయం పట్టవచ్చు" అని డాక్టర్ సార్జెంట్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)