రష్యా: యుక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగిన ఆత్మహత్యలు ఎందుకు రహస్యంగా మిగిలిపోయాయి

యుద్ధంలో మరణించిన సైనికుల ఫొటోలను చూపిస్తున్న ఫాదర్ దిమిత్రియెవ్
ఫొటో క్యాప్షన్, యుద్ధంలో మరణించిన సైనికుల ఫొటోలను చూపిస్తున్న ఫాదర్ దిమిత్రియెవ్
    • రచయిత, జోయెల్ గుంటెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 2018 ఏప్రిల్‌ నెల. అప్పటికే యుక్రెయిన్ యుద్ధం మొదలై నాలుగేళ్లు దాటింది. ఆ రోజు ఈస్టర్ పండగ. ఫాదర్ సెర్గీ దిమిత్రియెవ్ మార్యింకా నగరానికి సమీపంలో మోహరించిన సైనిక బలగాల దగ్గర ఉన్నారు.

ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. సైనిక బలగాల వెనక భాగంలో నిలబడి ఉన్న ఫాదర్ దిమిత్రియెవ్ ఏదో జోక్ చెబుతున్నారు.

సరిగ్గా దిమిత్రియెవ్ జోక్‌ పూర్తి చేస్తున్న సమయంలోనే భయంకరమైన శబ్ధంతో తుపాకీ పేలింది. దీంతో అప్పటి వరకు అక్కడ ఉన్న ప్రశాంతత చెడిపోయింది. ఫాదర్ దిమిత్రియెవ్ నిలుచుని ఉన్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఒక యువ ఇంజనీర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.

ఫాదర్ దిమిత్రియెవ్, మిలిటరీ సైకాలజిస్టయిన ఆండ్రియ్ కోజిఛుక్, మరికొందరు సైనికాధికారులు బుల్లెట్ శబ్ధం వినిపించిన బిల్డింగ్ వైపు వెళ్లారు. అక్కడ చనిపోయి పడి ఉన్న ఇంజినీర్‌ను చూసి సైనికాధికారులు ఎగతాళిగా కామెంట్లు చేశారని ఫాదర్ దిమిత్రియెవ్ వెల్లడించారు.

''ఈ మూర్ఖుడు తనను తానే కాల్చుకున్నాడు'' అని ఆ అధికారులు వ్యాఖ్యానించినట్లు దిమిత్రియెవ్ గుర్తు చేసుకున్నారు. ''మా వద్ద సైకాలజిస్టు ఉన్నారు. ఇతర ఫైటర్లు కూడా ఆయనతో మాట్లాడితే బావుటుందేమో" అని సైనికాధికారులకు దిమిత్రియెవ్ సూచించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

''ఏమీ అవసరం లేదు. వాడు తాగి ఉన్నాడు. అంతకన్నా ఏమీ లేదు'' అని వాళ్లు చాలా తేలికగా మాట్లాడినట్లు దిమిత్రియెవ్ చెప్పారు.

యుక్రెయిన్ రాజధాని కీవ్‌కు తూర్పు దిక్కున మోహరించి ఉన్న సైన్యం దగ్గర ఫాదర్ దిమిత్రియెవ్ ఉన్నారు. మిలిటరీ ప్రీస్ట్‌గా పని చేస్తున్నారు దిమిత్రియెవ్.

ఫాదర్ అనగానే సంప్రదాయ తెలుపు రంగు దుస్తుల్లో ఉంటాడనుకోనవసరం లేదు. చెవికి పోగు, జీన్ ప్యాంట్, హూడీ ధరించి కనిపిస్తారు దిమిత్రియెవ్. ఆయనకు కార్లంటే చాలా ఇష్టం.

మిలిటరీ ఆత్మహత్యల గురించి దిమిత్రియెవ్ చాలాసార్లు విన్నారు. మార్యింకా నగరంలో ఇంజినీర్ మరణం ఆయనకు పెద్ద ఆశ్చర్యం అనిపించ లేదు.

కానీ, ఆ ఇంజినీర్ ఆత్మహత్యను ఎగతాళి చేసిన ఆ మిలిటరీ అధికారి కూడా గత డిసెంబర్లో చనిపోయాడన్న వార్త తెలిసిన తర్వాత దిమిత్రియెవ్ మళ్లీ ఆ ఇంజినీర్‌ను గుర్తు చేసుకున్నారు. ఆ మిలిటరీ అధికారి కూడా తనను తాను కాల్చుకుని మరణించారు.

యుక్రెయిన్‌లో సైనికుల ఆత్మహత్యల నివారణకు పని చేస్తున్న హెల్ప్‌లైన్‌లో స్వెత్లానా ఓ కౌన్సెలర్
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లో సైనికుల ఆత్మహత్యల నివారణకు పని చేస్తున్న హెల్ప్‌లైన్‌లో స్వెత్లానా ఓ కౌన్సెలర్

పెరుగుతున్న ఆత్మహత్యలు

తూర్పు యుక్రెయిన్లో ముదురుతున్న యుద్ధం తొమ్మిదో ఏడాదిలోకి ప్రవేశించింది. సరిహద్దుల్లో రష్యా బలగాలను పెంచుతోంది. రష్యా సైన్యంలోని ఆత్మహత్యల సంఖ్యను ఇంకా లెక్కించాల్సి ఉంది.

రష్యా సైన్యంలోని ఆత్మహత్యలను నాన్ కాంబాట్ మరణాలుగా నమోదు చేశారు. కానీ, గతంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఆ మరణాల సంఖ్యను బయట పెట్టడానికి నిరాకరించింది. దాంతో మృతుల కుటుంబ సభ్యులు, యుద్ధంలో తమవారు చనిపోతే దక్కాల్సిన గౌరవాన్ని డిమాండ్ చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. అలాగే, వారికి దక్కాల్సిన ఆర్థిక సహాయం కూడా వాళ్లకు అందడం లేదు.

యుక్రెయిన్ మాజీ చీఫ్ మిలిటరీ ప్రాసిక్యూటర్ అనటోలి మాటియోస్ చెప్పినదాని ప్రకారం, 2018 నాటికి మొదటి నాలుగేళ్ల యుద్ధకాలంలో 554 మంది సర్వీస్‌లో ఉన్న సైనికులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ మరణాల సంఖ్యను యుక్రెయిన్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించలేదు.

ఇక మరో డాటా ప్రకారం 2018 నాటికి ఒక వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయని తెలుస్తోంది. అయితే అధికారికంగా నమోదైన సంఖ్య కన్నా ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని, చాలా మరణాలను నమోదు చేయలేదని కొన్ని మిలిటరీ వర్గాలు బీబీసీ తెలిపాయి. ఈ యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య 4619.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

''ఇలా యుద్ధం కొనసాగినంత కాలం వాళ్లు ఈ ఆత్మహత్యల సంఖ్యను బైటపెట్టరు'' అని కీవ్‌‌లోని మిలిటరీ సైకాలజీస్ట్, వొలోదిమిర్ వొలోషిన్ అన్నారు.

ఎందుకంటే రష్యా ఆ సమాచారాన్ని ఉపయోగించి యుక్రెయిన్ బలగాల నైతికతను దెబ్బతీస్తుందనే భయం వారిలో ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే మరణాల సంఖ్యకు సంబంధించిన సమాచారం కోసం కోరగా, డిఫెన్స్ మినిస్ట్రీ స్పందించలేదు. మరణాల సంఖ్యను ఎప్పడూ దాచలేదని, కానీ వాటిని వెల్లడించాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని యుక్రెయిన్ ఆర్మీ అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.

సైనికుల ఆత్మహత్యల నివారణకు పాల్ నిలాండ్ యుక్రెయిన్‌లో తొలి హెల్ప్ లైన్ స్థాపించారు
ఫొటో క్యాప్షన్, సైనికుల ఆత్మహత్యల నివారణకు పాల్ నిలాండ్ యుక్రెయిన్‌లో తొలి హెల్ప్ లైన్ స్థాపించారు

మతపరమైన విశ్వాసాలు-ఇబ్బందులు

తమ రికార్డుల ప్రకారం 2014 నుంచీ దాదాపు 700 మంది వెటరన్స్ ఆత్మహత్య చేసుకున్నారని వెటరన్స్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ ఐన్నా దారాహాంచుక్ అన్నారు.

అయితే అసలైన మరణాల సంఖ్య తెల్సుకోవడం చాలా కష్టమని, చనిపోయిన వారిలో వెటరన్ ఎవరో, వాళ్ల మరణానికి కారణమేంటో తెలియడం చాలా కష్టమని ఆయన చెబుతున్నారు.

ఒక సైనికుడి ఆత్మహత్యకు కారణం యుద్ధమేనని నిరూపిస్తేనే ఆ సైనికుడి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందుతుంది.

కానీ యుద్ధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని నిరూపించలేమని అర్ధం చేసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, మత విశ్వాసాల కారణంగా అది ఆత్మహత్య అన్న విషయాన్ని దాచి పెడతారని దారాహాంచుక్ చెప్పారు.

కఠిన ప్రభుత్వ నిబంధనలకు, మత విశ్వాసాలకు మధ్య వారు నలిగిపోతుంటారని దారాహాంచుక్ అన్నారు.

యుక్రెయిన్లో ఆత్మహత్య చేసుకోవడం నేరం. అక్కడి చర్చ్‌ కూడా దీనిని నేరంగా చూస్తుంది. వాళ్లు పవిత్రంగా భావించే శ్మశాన ప్రాంతాల్లో ఖననాలు చేయడాన్ని నిరాకరిస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ల ఖననానికి మత పెద్దలు కూడా హాజరుకారు.

"ఆత్మహత్య చేసుకున్న వారి అంతిమ సంస్కారాల్లో మత పెద్ద మత గ్రంధాలను చదవరు. వాళ్లసలు ఖననాలకు హాజరుకారు" అని ఫాదర్ దిమిత్రియెవ్ అన్నారు.

చిన్న పట్టణాల్లో మృతుల కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వ్యక్తికి ఖననం చేయబోమని చెప్పేస్తారని దిమిత్రియేవ్ చెబుతున్నారు.

యుద్ధానికి ముందు దిమిత్రియెవ్ ఒక ఆసుపత్రిలో పనిచేశారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు కూడా గౌరవంగా ఖననాలు చేయాలని ఆయన కోరేవారు.''ఆత్మహత్య చేసుకున్న వాళ్లను ఖననం చేయవద్దని నేనెప్పుడూ చెప్పలేదు'' అన్నారు దిమిత్రియెవ్.

ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్ పని చేసే బ్రిగేడ్ సభ్యులతో ఫాదర్ సన్నిహితంగా మెలిగారు. ఇంజనీర్ మృతి, ఆపై మరో అధికారి మృతి తర్వాత వీళ్ల అంత్యక్రియలకు ఇతర సైనికులు హాజరై, పవిత్ర ప్రార్థనలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

రష్యా, యుక్రెయిన్ మధ్య ఘర్షణలు, యుద్ధాల వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు 4వేలమందికి పైగా సైనికులు మరణించారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య ఘర్షణలు, యుద్ధాల వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు 4వేలమందికి పైగా సైనికులు మరణించారు

ఆత్మహత్యలు ఎక్కువే

జనాభా ఆధారంగా ప్రపంచంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న దేశాల్లో యుక్రెయిన్ కూడా ఒకటి. పైగా వీటి చుట్టూ సామాజికంగా అనేక దురాచారాలు అల్లుకుని ఉన్నాయి.

చనిపోయిన మిలిటరీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఈ కథనం కోసం మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

యుక్రెయిన్‌లో కొడుకైనా కూతురైనా ఆత్మహత్య చేసుకుంటే, యుద్ధంలో చనిపోయిన వారితో సమానంగా వాళ్ల పేర్లను స్మరించరని, అలాగే వారి కుటుంబ సభ్యులు మిగతా వారికి దూరంగా వెళ్లిపోతారని యుక్రెయిన్ మీద చిత్రిస్తున్న ఓ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ ఒక్సానా ఇంవాంట్సివ్ వివరించారు.

సైకాలజీ, సైకియాట్రిని శిక్షించేందుకు ఉపయోగించేవారని యుక్రెయిన్ మాజీ హెల్త్ మినిస్టర్ డాక్టర్ ఉలానా సుప్రూన్ చెప్పారు.

యుక్రెయిన్ సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు డాక్టర్ సుప్రూన్ ప్రయత్నిస్తున్నారు.

2018లో మెంటల్ హెల్త్ మూవ్‌మెంట్‌ను సుప్రూనా ప్రారంభించారు. దాంతో యుక్రెయిన్‌ లో మొదటిసారిగా సూసైడ్ హెల్ప్‌లైన్ ప్రారంభమైంది.

ఇటీవల రష్యాతో జరిగిన యుద్ధంలో పని చేసిన వెటరన్స్‌ను ఈ హెల్ప్‌లైన్లో పని చేసేందుకు తీసుకున్నారు. వారికి సైనికుల నుంచి అనేక ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. వారాంతంలో ఈ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయని చెబుతున్నారు.

''పుతిన్‌ కు కావాల్సింది కూడా ఇదే. ఒత్తిడిలో సతమతమయ్యే యుక్రెయిన్‌, భవిష్యత్తువైపు అడుగులు వేయలేని యుక్రెయిన్, సుదీర్ఘ ప్రణాళికలను సిద్ధం చేసుకోలేని యుక్రెయిన్‌ను పుతిన్ కోరుకుంటారు'' అని డాక్టర్ సుప్రూన్ ఆరోపించారు.

యుద్ధం కారణంగా మానసిక ఆరోగ్యం విషయంలో యుక్రెయిన్ పురోగతి సాధించలేకపోయిందని ఆమె అంటున్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)