Body Shaming: ‘హీరోయిన్లు అందంగా, సన్నగా ఉండాలి, పొట్ట ఉండకూడదు అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి?’

ఫొటో సోర్స్, PRAGATI YADATHI
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ కు చెందిన ప్రగతి యదాతి లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో, న్యూ యార్క్ ఫిల్మ్ అకాడెమీలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చారు.
అయితే, ఆమె నేర్చుకోవల్సింది నటన కాదు, మెరుగుపర్చుకోవల్సింది నైపుణ్యం కాదేమో అని ఆమెకు నెమ్మదిగా అర్ధమవుతోంది. ఆమెకు ఎదురైన అనుభవాలు ఆమెనలా ఆలోచించేలా చేస్తున్నాయి.
ఆమె అవకాశాల కోసం సినిమా సంస్థలను సంప్రదించినప్పుడు, "నువ్వు మా సినిమాలో నటించాలంటే కాస్త బరువు తగ్గాలి" అంటూ బరువు తగ్గేందుకు ఏ జిమ్ కి వెళ్ళాలో కూడా సూచించారని ప్రగతి బీబీసీకి చెప్పారు.
ఆ పాత్రలో హీరోయిన్ సన్నగా ఉండాలని స్క్రిప్ట్ లో ఎక్కడా లేదు అని ప్రశించినప్పుడు, "నువ్వింత ఆత్మవిశ్వాసంతో, తెలివితేటలతో మాట్లాడితే అవకాశాలు కష్టం" అని సూటిగా చెప్పినట్లు ప్రగతి బీబీసీకి చెప్పారు.
"సినిమాల్లో నటించాలంటే నటీమణులు సన్నంగా ఉండాలి, పొట్ట ఉండకూడదు లాంటి అంశాలు ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు’’ అని ప్రగతి అన్నారు. ఆమె "స్క్రీన్ ప్లే ఆఫ్ యాన్ ఇండియన్ లవ్ స్టోరీ", "ఇరాదా మామ్ కే' అనే సినిమాల్లో నటించారు.
యాక్టింగ్ కోర్సు పూర్తి చేసినవాళ్లు యాక్టర్లు కాలేరా?
ప్రగతి ఎంసీఎస్ థియేటర్ టైమ్స్ స్క్వేర్ ఆర్ట్స్ సెంటర్లో ఆరేళ్ళ పాటు యాక్టింగ్ కోర్సు చేశారు. న్యూ యార్క్ లో థియేటర్ ప్లేలలో, పలు డాక్యుమెంటరీ తరహా సినిమాల్లో నటించారు. షేక్ స్పియర్ నాటకాలు మాక్ బెత్ ఆంటోనీ & క్లియోపాత్రా, త్రీ సిస్టర్స్, ది సీ గల్, సెవెన్ అనే లఘు చిత్రంలో నటించారు. ఆమె ఒక యాక్టింగ్ స్కూల్ లో నటనను కూడా నేర్పించారు.
అయితే, 2017లో ఇండియా తిరిగి వచ్చి సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో సినిమా దర్శకులను, కొంత మంది మేనేజర్లను కలిసినప్పుడు చేదు అనుభవాలే ఎదురయ్యాయని చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/pragathi.yadhati
"నేనెక్కడ చదివాను, ఎటువంటి పాత్రల్లో నటించాను అనే విషయాలకు ప్రాధాన్యత లేదు. నాతో ఒక సంవత్సరం ఉండు. ఆ తర్వాత చూద్దాం" అని అనేవారు.
"సినీ పరిశ్రమలో మహిళను ఒక వస్తువుగానే చూస్తారు, నటిగా కాదు. కానీ.. నేనొక నటిని, వేశ్యను కాదు" అని ప్రగతి అన్నారు.
"వారి ప్రతిపాదనలకు సుముఖంగా లేకపోవడంతో అవకాశాలు కూడా నన్ను వెన్నంటి రాలేదు. సినిమాల్లో నటించాలనే కోరికను చంపుకోలేదు. స్వతంత్రంగా అయినా చిన్న బృందంతో సినిమా తీయాలనే అనుకుంటున్నాను" అని అన్నారు.
"స్క్రీన్ ప్లే ఆఫ్ ఆన్ ఇండియన్ లవ్ స్టోరీ" 2019లో విడుదల అయింది. అయితే, చాలా మంది ఆ సినిమాలో నటించినట్లు చెప్పవద్దని కూడా సూచించారు. అలా చెప్పడం వల్ల నాకొచ్చే అవకాశాలు చేజారిపోతాయి అన్నారు’’ అని ఆమె ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు.
"డాక్టర్ కోర్సు చేస్తే, డాక్టర్ అవుతారు. మరింకేదైనా విద్యను అభ్యసిస్తే ఆ రంగంలో ప్రవేశించేందుకు మార్గాలుంటాయి. కానీ, ఇక్కడ సినిమాల్లో నటించాలంటే యాక్టింగ్ నేర్చుకోవడం కంటే, శారీరక సౌందర్యం ముఖ్యం అని అర్ధమయింది. ఈ పరిస్థితి మారి నటించాలనుకునేవారికి అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను".
70ల తర్వాత మొదలయిన ఈ పరిణామం సోషల్ మీడియా రాకతో ఒక అసహజ ధోరణిని సంతరించుకుందని ఆమె అంటారు. ఇటువంటి డిమాండ్లు ఒక్క సినిమా వర్గాల నుంచి మాత్రమేనా, ప్రేక్షకుల నుంచి కూడా వస్తున్నాయా?
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
గర్భవతి అయిన కాజల్‌పై బాడీషేమింగ్, ట్రోలింగ్
ఇటీవల నటి కాజల్ అగర్వాల్ గర్భంతో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు ఆమె శరీరాకృతిని నిందిస్తూ నెటిజెన్లు ప్రతికూల కామెంట్లు చేశారు. దీనికి ఆమె తీవ్రంగా స్పందించారు.
"నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంట్లో, పనిలో కొన్ని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు, నా శరీరాకృతిని నిందిస్తూ చేసే వ్యాఖ్యలు, మీమ్ లు నాకే విధంగానూ మేలు చేయవు. దయగా ఉండటాన్ని నేర్చుకోండి. అలా ఉండటం కష్టమైతే, మీరు బ్రతకండి, ఇతరులను కూడా బ్రతనివ్వండి" అని రాస్తూ గట్టిగా సమాధానమిచ్చారు.
"నా లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి నేనీ పోస్టును రాస్తున్నాను. స్వార్ధంతో ఆలోచించే వ్యక్తుల ఈ మాటలను ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు".
"మహిళలు గర్భం దాల్చినప్పుడు శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. బరువు కూడా పెరుగుతారు. హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ము పరిమాణం పెరుగుతుంది. పొట్ట పెరుగుతుంది. పిల్లల్ని సాకేందుకు అనువుగా శరీరం తయారవుతుంది. కొంత మందికి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఏర్పడతాయి. కొంత మందికి మొటిమలు వస్తాయి. సాధారణ సమయంలో కంటే ఎక్కువగా అలిసిపోతాం. మా మూడ్ మారిపోతూ ఉంటుంది. దీంతో మా శరీరం గురించి ప్రతికూల, అనారోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి".
"బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మేము గతంలో కనిపించినట్లుగా మారేందుకు కొంత సమయం పడుతుంది. లేదా మేము మునుపటి ఆకారాన్ని ఎప్పటికీ సంతరించుకోలేకపోవచ్చు. అదేమీ ఇబ్బందికరమైన విషయం కాదు".
"ఈ మార్పులన్నీ సహజం. మా జీవితంలో చోటు చేసుకున్న కొత్త మార్పులను ఎదుర్కొంటున్న సమయంలో మేము అసాధారణంగా భావించాల్సిన అవసరం లేదు. మేమొక నిర్ణీత రీతిలో చేసే ఆలోచనల ఫ్రేమ్ వర్క్ లో బందీ అవ్వాల్సిన అవసరం లేదు".
"మా జీవితంలో బిడ్డకు జన్మనిచ్చే ఒక విలువైన, వింతైన, అందమైన సమయంలో మేము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడాన్ని సంబరంగా భావించాలి. ఈ అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు మనం అదృష్టవంతులం అయి ఉండాలి" అంటూ ఆమె పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, instagram/kajalaggarwalofficial/
కాజల్‌కు మద్దతు ఇచ్చిన నటీమణులు
"నువ్వు జీవితంలో అన్ని దశల్లోనూ పర్ఫెక్ట్ గా ఉన్నావు. నీ చుట్టూ బోలెడంత ప్రేమ ఉంది. ద్వేషించేవాళ్ళు ఎప్పుడూ ద్వేషంతో రగిలిపోతూనే ఉంటారు" అంటూ కాజల్ పోస్టుకు సమాధానంగా లక్ష్మి మంచు కామెంట్ చేశారు.
"నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు" అంటూ సమంత కామెంట్ చేశారు.
"సినీ తారలు అందంగా ఉండాలనే ఒత్తిడి చాలా వర్గాల నుంచి వస్తుంది. అయితే, బాహ్య సౌందర్యాన్ని ఎప్పుడూ ఒకేలా కాపాడుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కొందరికి వయసుతో పాటు కొన్ని మార్పులు వస్తే, హార్మోన్ల మార్పు వల్ల కూడా శరీరాకృతి మారుతూ ఉంటుంది" అని అంటారు ప్రగతి.
అందమంటే తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలనే భావన ఎప్పటి నుంచి మొదలయిందో తెలియదు అని అంటూ, "పాత సినిమాల్లో నటించిన సావిత్రి, కృష్ణ కుమారి, భానుమతి లాంటి అనేక మంది నటీమణుల నటనకే ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ, వారి శరీరాకృతికి కాదు" అని అన్నారు.
ఒక నటి అందంగా ఉండాలనేది ప్రేక్షకులు నిర్ణయించారా? సినీ నిర్మాతలా? అనేది ఒక పెద్ద సందేహం అని అంటూ, "నటించేవారికి అవకాశాలు కావాలి, నిర్మాతలకు డబ్బు కావాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉన్నప్పుడు వారి అంచనాలు కూడా వాణిజ్యపరంగానే ఉంటాయి" అని ప్రగతి అన్నారు.
"సినిమా ఒక వాణిజ్య వస్తువు అయినప్పుడు, అందులో నటించే పాత్రలను మార్కెట్ చేసేందుకు వారిని అందంగా చూపించాలి. సినీ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్నది అదే" అని అన్నారు.

ఫొటో సోర్స్, facebook/SaiPallavi.S
సాయి పల్లవిపై ట్రోలింగ్.. నటికి మద్దతు ఇచ్చిన గవర్నర్ తమిళిసై
శ్యాంసింగరాయ్ సినిమా విడుదల తర్వాత సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఒక వీడియో ఇంటర్వ్యూ ద్వారా సమాధానమిచ్చారు.
ఆమె కూడా ఇటువంటి నిందలు ఎదుర్కొన్నానని అంటూ, పుదియ తలైమరై అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"ఇటువంటి నిందలు ఎంత బాధపెడతాయో అవి ఎదుర్కొన్న వారికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను గాయపరిచారు. కానీ, నా తెలివితేటలు, శ్రమ, కష్టంతో వాటిని అధిగమించాను" అని ఆమె అన్నారు.
"ఇటువంటి నిందలు ఎదుర్కొన్నప్పుడు బాధపడకుండా ఉండేందుకు ఎవరూ మహాత్ములు కారు" అని ఆమె అన్నట్లు ‘ది న్యూస్ మినిట్’ వెబ్ పోర్టల్ పేర్కొంది.
"మహిళలు ఎప్పుడూ ఆత్మ విశ్వాసంతో ఉండాలి. ఇతరులను బాడీ షేమింగ్ చేసే వారికి మహిళల విశ్వాసాన్ని దెబ్బతీయడం, వెనక్కి లాగడం, వారి పురోగతిని నాశనం చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. అటువంటి వారికి అవకాశం ఇవ్వకండి. మానసిక స్థైర్యంతో ఉంటూ వారిని పట్టించుకోకుండా ఉండాలి" అని సౌందర్ రాజన్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఇంటర్వ్యూ ను ట్వీట్ చేస్తూ, "మహిళలెవరూ రూపం, రంగు, ఇతర శరీరాకృతి ఆధారంగా వివక్షకు గురి కాకూడదు" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గర్భం దాల్చిన మహిళలకు కాజల్ అగర్వాల్ ఆరోగ్య సలహాలు..
"నా ఆలోచనలను కట్టడి చేసుకునేందుకు నేను పాటించే సూత్రాలు ఇవి. ఇవి కొంతమందికైనా పనికొస్తాయని అనుకుంటున్నాను. ప్రేమతో" అంటూ కాజల్ గర్భం దాల్చినవారికి కొన్ని సూచనలు కూడా చేశారు.
"ఒక బిడ్డకు జన్మనిచ్చి సాకేందుకు అనువుగా ఉండే స్త్రీ శరీరం అద్భుతమైనది. గర్భం దాల్చడం వల్ల శరీరంలో చోటు చేసుకునే మార్పులు కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవన్నీ మీ బిడ్డ పెరిగేందుకు సహాయపడతాయి. గర్భం కలకాలం ఉండిపోదు".
"మీ శరీరం చేస్తున్న సానుకూల పనుల పై దృష్టి పెట్టండి. మీ బిడ్డ పెరిగేందుకు అనువుగా మీ శరీరం తయారవుతోంది. ఇది సహజం. మీ భావాలను పంచుకోండి. మీ భాగస్వామితో, కుటుంబంతో, స్నేహితులతో మాట్లాడండి. మీ ఆలోచనలను మీలోనే దాచుకోవడం వల్ల మీరు మరింత కుంగిపోతారు".
"వ్యాయామం చేయండి. తేలికపాటి ఈత, లేదా నడక చేయండి. దీంతో, మీ శరీరాకృతి పై మీ దృష్టి పక్కకు తప్పుకుంటుంది.
డాక్టర్ సలహాతో ప్రీ నటల్ యోగ చేయండి. మసాజ్ చేయించుకోండి. దీంతో, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది".
"గర్భం గురించి మరింత తెలుసుకోండి. అవగాహనతో పరిస్థితులను, ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. సహాయం కోరేందుకు సిగ్గు పడాల్సిన పని లేదు. మీ కోసం, మీ బిడ్డ కోసం చేయండి. సహాయం కోసం మీ డాక్టర్ లేదా నర్స్ తో మాట్లాడండి" అని అంటూ కాజల్ తన పోస్టును ముగించారు.
"సినిమాలన్నీ సందేశాత్మకం కానక్కరలేదు. కానీ, సినిమాల్లో చూపించే భావోద్వేగాలను, ప్రేమను, అందాన్ని కూడా జీవితానికి దగ్గరగా చూపించగల్గినప్పుడే అందానికి, శరీరాకృతితో ముడిపడిన సమస్యలు పరిష్కారమవుతాయి" అని అంటారు ప్రగతి.
"తెలుగు సినిమా స్వచ్ఛంగా, సహజంగా మారాలి. సినిమాల్లో చూపించే పాత్రల్లో ఒక వ్యక్తి అంతర్గత సౌందర్యాన్ని చూపించాలి. ప్రేమ అంటే ఏంటి, మహిళ అంటే ఏంటి, అందం అంటే ఏంటి అనేది సినిమాలు పూర్తిగా చూపించకపోవడం వల్ల సినిమాల్లో చూపించేదే నిజం అని, అందులో చూపించేదే అసలైన అందమని" చాలా మంది భావించడానికి కారణం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
- మగ పిల్లాడు పుట్టేలా చేస్తానని తలలో మేకు కొట్టిన భూత వైద్యుడు
- అమరావతి: 407 ఎకరాల రాజధాని భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు తనఖా పెట్టింది?
- సౌర తుపానులో చిక్కుకున్న స్పేస్ ఎక్స్ రాకెట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు
- పాకిస్తాన్లో హిందూ ప్రొఫెసర్‌కు జీవిత ఖైదు, దైవదూషణ కేసులో కోర్టు తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














