చనిపోయిన తమ కుమారుడి వీర్యం కావాలని ఆ తల్లితండ్రులు ఎందుకు కోర్టుకు వెళ్లారు?

ఫొటో సోర్స్, ALEKSANDR ZUBKOV/GETTYIMAGES
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీ హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. చనిపోయిన తమ కుమారుడి వీర్యాన్ని తమకు అప్పగించేలా సర్ గంగారామ్ ఆసుపత్రిని ఆదేశించాలంటూ ఓ వృద్ధ జంట పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై స్పందించిన సర్ గంగారామ్ ఆసుపత్రి అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ (ఏఆర్‌టీ), సరోగసీ, లేదా ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో అవివాహిత వ్యక్తి శుక్రకణాలను తల్లిదండ్రులకు అప్పగించే నిబంధనలు లేవని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.
అసలేంటీ వివాదం?
ప్రస్తుతం ఏ వ్యక్తి వీర్యం కోసం అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారో ఆ వ్యక్తి జీవించి లేరు. ఆయన 2020లోనే క్యాన్సర్‌తో మరణించారు.
ఆ యువకుడికి పెళ్లి కాలేదు. క్యాన్సర్‌కు చికిత్స సమయంలో రేడియో ధార్మికత శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది కాబట్టి కీమోథెరపీకి ముందు రోగి వీర్యాన్ని దాచుకోవచ్చని సలహా ఇచ్చారు.
చికిత్స తర్వాత రోగి వంధ్యుడు అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఆ యువకుడి తల్లిదండ్రులు అతని వీర్యకణాలను భద్రపరచాలని నిర్ణయించారు. వీర్యం సేకరించిన తర్వాత రోగిని మరొక ఆసుపత్రికి తరలించారు. 2020 సెప్టెంబర్‌లో ఆ యువకుడు మరణించారు.
రోగి మరణించిన కొంతకాలానికి, భద్రపరిచిన వీర్యం తమకు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు సర్ గంగారామ్ ఆసుపత్రి అధికారులను కోరారు. కానీ, వారు తిరస్కరించడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.
''మా అబ్బాయి వీర్యాన్ని నాకు ఇవ్వకుండా ఆసుపత్రి యాజమాన్యం నా హక్కులకు భంగం కలిగిస్తోంది అని పిటిషన్‌దారుడు కోర్టులో వాదించారు'' అని న్యాయవాది కుల్దీప్ సింగ్ అన్నారు.
చనిపోయిన తన కొడుకు వీర్యం సహాయంతో తన వంశాన్ని కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు పిటిషనర్ కోర్టులో వాదించారు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా దిల్లీ హైకోర్టు సర్ గంగారామ్ హాస్పిటల్, దిల్లీ ప్రభుత్వాలను కోరింది.
కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని దిల్లీ ప్రభుత్వం చెప్పింది. అయితే, వీర్యాన్ని ఇచ్చే నిబంధనలు లేనందున తాము దాన్ని పిటిషనర్ కు అందించలేమని గంగారామ్ హాస్పిటల్ అఫిడవిట్‌లో పేర్కొంది'' అని న్యాయవాది కుల్దీప్ సింగ్ అన్నారు.
అసిస్టెడ్ రీప్రోడక్టివ్ యాక్ట్ 2021, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్, సరోగసీ యాక్ట్‌ల ప్రకారం, అవివాహితుడైన వ్యక్తి వీర్యానికి చట్టపరంగా ఎవరు హక్కుదారులు అన్నది ఎక్కడా పేర్కొనలేదని గంగారామ్ ఆసుపత్రి వాదించింది.
ఈ ఏఆర్‌టీలో ఐవీఎఫ్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటే అండంలోకి వీర్యాన్ని ఇంజెక్ట్ చేయడం, వీర్యం, అండాలను ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి గర్భంలో ప్రవేశపెట్టడం లాంటి విధానాలుంటాయి.
సరోగసీలో విధానంలో సంతానం లేని లేదా బిడ్డను కనలేని జంటలు సరోగసీ మదర్ అని పిలిచే మరో మహిళ సాయంతో పిల్లల్ని కనవచ్చు. అద్దె గర్భం ద్వారా దంపతులను బిడ్డకు జన్మనిస్తారు.

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES
మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
ఇండియాలోని అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ క్లినిక్‌లకు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, వీర్యాన్ని భద్రపరిచేందుకు ఆయా సంస్థలు ఒక బ్యాంకును ఏర్పాటు చేయవచ్చు. ఈ వీర్యాన్ని అతని భార్య, లేదా దాత నామినేట్ చేసిన మహిళ ఉపయోగించుకోవచ్చు.
ఇలా నిల్వ చేసినందుకు కొంత రుసుము వసూలు చేస్తారు. దాత సజీవంగా ఉన్నప్పుడు వీర్యాన్ని నిల్వ చేసినందుకు రుసుము చెల్లించకపోతే, ఆ వీర్యాన్ని తీసేయవచ్చు, లేదా పరిశోధనల కోసం ప్రామాణికమైన సంస్థలకు ఇచ్చే హక్కు స్పెర్మ్ బ్యాంకులకు ఉంటుంది.
ఒకవేళ దాత మరణిస్తే, అతని వీర్యాన్ని వారి చట్టబద్ధమైన వారసుడు లేదా దాత తరఫు నామినీ దానికి హక్కుదారుడు అవుతారు. నమూనాను ఇచ్చే సమయంలో నమోదు చేసిన నామినీ మాత్రమే హక్కుదారు అవుతారు.

ఫొటో సోర్స్, FITOPARDO/GETTYIMAGES
కానీ, ఆ వ్యక్తి తనకు నచ్చిన మహిళలకు ఈ వీర్యాన్ని ఇవ్వలేడు. దాత మరణానంతరం వీర్యానికి హక్కుదారులు లేకపోతే బ్యాంకు దానిని నాశనం చేయవచ్చు లేదంటే ఏదైనా సంస్థకు పరిశోధన కోసం ఇవ్వొచ్చు.
అయితే, దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ భావోద్వేగాలతో కూడుకున్నది. ఇక్కడ తల్లిదండ్రులు తమ కొడుకును కోల్పోయారు.
ఆరోగ్య కారణాలతో తల్లిదండ్రులు కాలేనివారు, సింగిల్ పేరెంట్ గా ఉండాలనుకున్న వారు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధితో ఆ అవకాశాన్ని పొందవచ్చు. ఏఆర్‌టీ, సరోగసీ చట్టాలలో ఇందుకు సంబంధించిన నిబంధనలున్నాయి.
స్త్రీ పురుషులలో ఎవరైనా ఏఆర్‌టీ సహకారంతో పిల్లలను పొందాలనుకుంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఇలా పిల్లలు కావాలనుకున్న వారు స్త్రీలైతే 18 సంవత్సరాలు, పురుషులైతే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక గరిష్ట వయసు ఇద్దరికీ 55 సంవత్సరాల లోపు ఉండాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, JILL LEHMANN PHOTOGRAPHY/GETTYIMAGES
వీర్యదాతలకు వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. అండాలను దానం చేసే మహిళల వయసు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని బిల్లులో ఉంది.
''ఈ దంపతుల ఆవేదన అర్ధం చేసుకోదగింది. వారికి ఈపాటికి మనవళ్లు ఉండి ఉండాలి. కానీ, కొడుకు చనిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. కానీ, ఈ వయసులో వారు తమ కొడుకు వీర్యంతో సరోగసీ లేదా ఏఆర్‌టీ ద్వారా పిల్లలను పెంచుకోవాలని ఆశించడం అంత మంచిది కాదు. ఇప్పటికే వాళ్లు వృద్ధులు. భవిష్యత్తులో పిల్లల బాగోగులను ఎవరు చూస్తారు'' అని హైకోర్టులో న్యాయవాది సోనాలి కర్వాస్రా అన్నారు.
ఈ కేసులో ఆ తల్లిదండ్రులు వీర్యాన్ని పొందగలిగినా, వారు మళ్లీ తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుందా? మరో న్యాయవాది రాధికా థాపర్ దీనిపై మాట్లాడారు.
''కోర్టు వీరికి వీర్యాన్ని అప్పగించాలని నిర్ణయిస్తే అది విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. వీరు వీర్యాన్ని తీసుకుని అండాలను దత్తత తీసుకోవడం ద్వారా పిల్లలను పొందితే ఇబ్బందే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును వారు ఎక్కువ కాలం చూసుకోలేరు'' అని రాధికా థాపర్ అన్నారు.
ఇక్కడ పిటిషన్ దారుడి వయసు కీలక విషయమని, భారతీయ సమాజంలో పిల్లలకు 20 సంవత్సరాలు వచ్చేదాకా తల్లిదండ్రులదే బాధ్యతగా పరిగణిస్తారని రాధిక అభిప్రాయపడ్డారు.
2018లో మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇదే విధమైన కేసు నమోదైంది. అక్కడ వైద్యులు ప్రథమేశ్ పాటిల్ అనే వ్యక్తి వీర్యాన్ని అతని తల్లి రాజశ్రీ పాటిల్‌కు అందజేశారు. ఆమె అద్దె గర్భం ద్వారా కవలలకు నాన్నమ్మగా మారారు.

ఇవి కూడా చదవండి:
- ‘పొరుగు దేశాన్ని ఆక్రమించినందుకు రూ. 24 వేల కోట్లు పరిహారం చెల్లించండి’
- ‘నేను భారతీయురాలినని నిరూపించుకోవడానికి ఐదేళ్లు కష్టపడ్డాను’
- ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాల్లో దాక్కున్నా వెంటాడి చంపేసే ఆయుధాలు
- ఒమిక్రాన్: కేసులు పెరుగుతున్నప్పుడు ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవడం మంచిదేనా?
- ముఖానికి నల్ల రంగు వేసుకుని ముస్లిం వరుడు, స్నేహితుల సంబరాలు - కర్ణాటకలో మరో వర్గం నుంచి అభ్యంతరం
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















