జగన్ : ‘ఆంధ్రప్రదేశ్‌లో 15 రోజుల పాటు ఇళ్ల పండుగ’

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
పేదలందరికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
15 రోజుల పాటు రాష్ట్రమంతా పట్టాల పంపిణీ కార్యక్రమం సాగుతుందని ప్రకటించింది.

అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటుగా డిసెంబర్ 25న 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతోంది.
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చే బృహత్తర పథకం అని సీఎం ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం జరిగిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సేల్ అగ్రిమెంట్లు కూడా లబ్ధిదారులకు అందిస్తారు.
ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇల్లు అందిస్తున్నట్టు ప్రకటించింది.
365, 430 చ.అడుగుల ఇళ్ల లబ్దిదారులకు కూడా వారి వాటాల చెల్లింపులో 50 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

ముమ్మారు వాయిదాలు..
పేదలకు సొంతింటి సౌకర్యం కల్పించే ఈ కార్యక్రమం మూడుసార్లు వాయిదా వేశారు.
తొలుత ఉగాది సందర్భంగా మార్చి 25 న ముహూర్తంగా నిర్ణయించారు.
అయితే, కరోనా ఉద్ధృతి మూలంగా లాక్ డౌన్ అమలులోకి రావడంతో తొలుత వాయిదా పడింది.
ఆ తర్వాత న్యాయపరమైన ఇక్కట్లు కూడా ఎదురయ్యాయి.
అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14న.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న.. దివంగత సీఎం వైయస్సార్ జయంతి జులై 8, స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15, చివరగా గాంధీ జయంతి రోజు అక్టోబరు 2న కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముహూర్తాలుగా నిర్ణయించినా సాధ్యం కాలేదు.
ఇక దసరా, దీపావళి అంటూ ప్రచారం జరిగినా కోర్టు కేసుల మూలంగా ముందడుగు పడలేదు.
అనేక దఫాలుగా వాయిదాపడిన ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలైంది.

ఫొటో సోర్స్, HTTP://HC.AP.NIC.IN/
కోర్టు ఆదేశాల ప్రకారమే...
ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణ అనేక వివాదాలకు ఆజ్యం పోసింది.
ఎక్కువ ధర చెల్లించి భూసేకరణ పేరుతో అధికారపక్షం నేతలు అవినీతికి పాల్పడ్డారని పెద్ద స్థాయిలోవివాదాలు వచ్చాయి.
నివాసయోగ్యం కాని స్థలాలు కొనుగోలు చేసి, ప్రజాధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలు వచ్చాయి.
రాజమహేంద్రవరం సమీపంలో సేకరించిన ఆవ భూముల్లో అక్కడి ఎంపీ,ఎమ్మెల్యే వంటి వారి పాత్రపై ఆరోపణలు వచ్చాయి."ఎయిర్ పోర్ట్ కి దగ్గర అనే పేరుతో ఎక్కువ ధర చెల్లించారు. మార్కెట్ రేటు కన్నా చాలా ఎక్కువే ఇచ్చారు.
ఎకరాకు రూ. 43 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు రైతుల పేరుతో కాజేశారు.
పైగా అవన్నీ గోదావరికి చిన్నపాటి వరదలు రాగానే మునిగిపోయే భూములు. పంటలు సాగు చేయడానికే అనువుగా ఉండవు.
ఇళ్ల స్థలాల పేరుతో ముంపు ప్రాంతం కేటాయించడం సరికాదు. దీనిపై న్యాయపోరాటం జరుగుతుంది. అవినీతిపై విచారణ చేస్తే వాస్తవాలు వస్తాయి. వైసిపి పెద్దల పాత్ర బయటపడుతుంది" అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook/chelluboinasrinivasavenugopal
ఎన్నికల హామీకి కట్టుబడి చేస్తున్నాం.. వాయిదాలు విపక్షం వల్లనే
ఎన్నికల ముందు పేదలందరికి ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి, దానిని ఆచరణలో చూపుతున్నామని వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు.ఆయన బీబీసీతో మాట్లాడుతూ "ఈ బృహత్తర కార్యక్రమం ఎప్పుడో ప్రారంభం కావాలి. ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విపక్షం కుట్రలు, కుతంత్రాలు చేసి, కోర్టుల్లో కేసులు వేయించి కార్యక్రమాన్ని అడ్డుకుంది. అయినా ప్రజల పట్ల చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేశారు.
ఎన్నో ఏళ్లుగా కేవలం ప్రచారంలో ఉన్న పేదలందరికి ఇళ్ళుఅనే నినాదం ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్న ప్రభుత్వం మాది. ఇప్పటి వరకు మొత్తం 30,75,755 మంది లబ్ధిదారులను గుర్తించాం.
వారిలో 23,37,067 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేసిన 17 వేలకు పైగా 'వైయస్సార్ జగనన్న కాలనీ' లేఅవుట్లలో ఇంటి స్థలం ఇస్తారు.
ఇప్పటికే స్థలాలు అక్రమించి ఉంటున్న 4,86,820 మందికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరిస్తారు. మిగిలిన 2,51,868 మందికి ఏపీ టిడ్కో నిర్మించే ఇళ్లు కేటాయిస్తున్నాం.
లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు భూమి ఇస్తారు. మొత్తం రూ.23,535 కోట్ల విలువైన 68,361.83 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాల రూపంలో ఇవ్వబోతున్నామని" వివరించారు.

రాజధాని ప్రాంతంలో కేటాయింపులేదు..
ప్రస్తుతం కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు మినహా, మిగతా చోట్ల ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తారు.
ఇందులో ప్రభుత్వ భూమి 25,120.33 ఎకరాలను లబ్ధిదారులకు అందిస్తారు. దానివిలువ దాదాపు రూ.8 వేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
మరో రూ.10,150 కోట్ల ఖర్చుతో 25,359.31 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించిన 4457.05 ఎకరాల విలువ దాదాపు రూ.1350 కోట్లు ఉంటుందని, రాజధాని అమరావతి ప్రాంతంలో ఏఎంఆర్‌డీఏకు చెందిన 1074.18 ఎకరాల విలువ దాదాపు రూ.325 కోట్లు ఉంటుందని చెబుతోంది.
- టిడ్కో ఇళ్ల కోసం రూ.810 కోట్ల ఖర్చుతో 2550.96 ఎకరాలు సేకరించగా, ఇళ్ల స్థలాలుగా క్రమబద్ధీకరణ (ఇప్పటికే ఆక్రమించుకుని ఉంటున్న వారికి) చేయనున్న భూమి మరో 9800 ఎకరాలు (విలువ దాదాపు రూ.2900 కోట్లు) గా ప్రకటించారు.అయితే కోర్టు వివాదాల్లో ఉన్న ప్రాంతాల్లో ఇళ్లస్థలాల కేటాయింపు జరగడం లేదు. దాంతో రాజధాని అమరావతి పరిధిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల అంశం ప్రస్తుతానికి పెండింగులో పడింది.

ఇళ్ల నిర్మాణం రెండు దశల్లో..
అర్హులైన నిరుపేదలకు కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చి ఊర్కోకుండా రెండు దశల్లో వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు బీబీసీకి తెలిపారు.
తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం నాడే పనులు ప్రారంభిస్తుండగా, తర్వాత రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆయన వివరించారు. 340 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటిని నిర్మిస్తామన్నారు.. లైట్లు, ఫ్యాన్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్ కూడా ఆ ఇంటిలో ఏర్పాటు చేస్తారు.
నీటి కనెక్షన్, టాయిలెట్ సదుపాయం కూడా ఉంటుంది. పక్కా నాణ్యతతో నిర్మించే ఇళ్లను ఐఐటీ, ఎన్‌ఐటీకి చెందిన నిపుణులతో (థర్డ్ పార్టీ) తనిఖీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే.
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








