దీపావళి: గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, మామూలు టపాసుల మాదిరిగానే పేలతాయా?

దీపావళి టపాసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దీపావళి టపాసులు
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

పిల్లలకు టపాసులు కాల్చనిదే దీపావళి పండగ జరిగినట్లు ఉండదు. ప్రతియేటా దీపావళికి టపాసులతో వందల కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతుంది.

అయితే, టపాకాయలు కాల్చడం వల్ల ధ్వని, వాయు కాలుష్యాలు విపరీతంగా పెరుగుతున్నాయన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కోర్టు వ్యాజ్యాలు కూడా నడుస్తున్నాయి.

దీపావళికి టపాసులు కాల్చడాన్ని సంపూర్ణంగా నిషేధించలేమని సుప్రీం కోర్టు ఇటీవల తేల్చి చెప్పింది. పూర్తి నిషేధం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించింది.

గ్రీన్ క్రాకర్స్‌తో ధ్వని, వాయు కాలుష్యాలు తక్కువగా ఉంటాయి.
ఫొటో క్యాప్షన్, గ్రీన్ క్రాకర్స్‌తో ధ్వని, వాయు కాలుష్యాలు తక్కువగా ఉంటాయి.

గ్రీన్ క్రాకర్స్

ప్రస్తుతం కాలుష్య కారకాలైన టపాకాయలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ క్రాకర్స్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అందించిన కొత్త ఐడియానే ఈ గ్రీన్‌ క్రాకర్స్.

తక్కువ కాలుష్యం కలిగించే ఈ బాణాసంచాలో బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ వంటి కాలుష్యం కలిగించే రసాయనాలు ఉండవు. ఉన్నా అతి తక్కువ మోతాదులో ఉంటాయి.

మాములు టపాసుల కంటే వీటితో దాదాపు ౩౦% తక్కువ కాలుష్యం కలుగుతుంది. అంతేకాదు, శబ్ద కాలుష్యం కూడా తక్కువే. మాములు టపాసులు 160 డెసిబుల్స్‌ శబ్ధంచేస్తే, వీటితో 120 డెసిబుల్స్‌కి మించకుండా శబ్ధం వస్తుంది.

గ్రీన్ క్రాకర్స్ పెట్టెల మీద వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఫొటో క్యాప్షన్, గ్రీన్ క్రాకర్స్ పెట్టెల మీద వివరాలు అందుబాటులో ఉంటాయి.

వీటిని గుర్తించడం ఎలా ?

మనం కొనే టపాసుల ప్యాకెట్ల మీద, ఆకుపచ్చ రంగులో గ్రీన్ ఫైర్ వర్క్స్ అని రాసి ఉంటుంది. అలానే ఈ బాణాసంచా పాకెట్ల పై లోపల ఏయే రసాయనాలు వాడారన్న వివరాలు కూడా ఉంటాయి.

వీటితోపాటు ఇవి 120 డెసిబుల్స్ కంటే తక్కువ శబ్ధాన్ని కలిగిస్తాయని కూడా స్పష్టంగా పేర్కొని ఉంటుంది. ఇంకా వీటిపై NEERI అన్న ముద్ర కూడా కనిపిస్తుంది.

క్రాకర్స్‌ కాల్చడంపై నిషేధం విధించలేమని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది.
ఫొటో క్యాప్షన్, క్రాకర్స్‌ కాల్చడంపై నిషేధం విధించలేమని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది.

బాణాసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

పండగలు సంబరాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ, వాటికోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టరాదని సుప్రీంకోర్టు అక్టోబర్ 28 తీర్పులో పేర్కొంది.

అందుకే పూర్తిగా టపాసుల పై నిషేధం విధించకుండానే, బేరియం వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించని టపాకాయలను కాల్చవచ్చని సూచించింది .

అయితే ప్రజలకి, అలాగే అమ్మే వారికీ దీని పై పూర్తి అవగాహన లేదు. హైదరాబాద్ లో కొన్ని షాపులలో అసలు ఈ గ్రీన్ టపాసులు దొరకడం లేదు. మరోవైపు కొన్నిషాపుల వారికి తమ దగ్గర ఉన్నవి గ్రీన్ టపాసులు అన్న విషయం కూడా తెలియదు.

వీడియో క్యాప్షన్, బాణాసంచా కాల్చినప్పుడు రకరకాల రంగులు ఎలా వస్తాయి?

''మా దగ్గరికి ఎవ్వరూ అలాంటి టపాకాయలు కావాలంటూ రావడం లేదు. పిల్లలకు నచ్చే బాణాసంచా కొనుక్కుని వెళతారు. మాకు కూడా వీటి పై పెద్దగా అవగాహన లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది గిరాకీ బాగానే ఉంది, అది చాలు'' అని టపాసుల అమ్మకాలలో బిజీగా ఉన్న రజిత బీబీసీ తో చెప్పారు .

అలాగే షాపులకు వస్తున్న కొందరిని గ్రీన్ క్రాకర్స్ గురించి అడిగినప్పుడు వాటి గురించి మాకు తెలియదని చెప్పారు.

మరికొంత మంది తమకు కొన్ని షాపులలో అవి దొరకలేదని, వాటిని గుర్తు పట్టడం ఎలా అని ప్రశ్నించారు. మరికొంతమందైతే వీటిని పిల్లలు ఇష్టపడతారో లేదోనని సందేహం కూడా వ్యక్తం చేసారు.

అధికారులు గ్రీన్ క్రాకర్స్ కొనాలని ప్రజలకి సూచిస్తున్నా, వాటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణుల చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)