దీపావళికి కాలుష్యరహిత ఈ-టపాసులు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, పాయల్ భుయన్
- హోదా, బీబీసీ హిందీ ప్రతినిధి
దీపావళి వల్ల తలెత్తే కాలుష్యాన్ని నివారించడానికి దిల్లీలో టపాసుల విక్రయాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 9న ఆదేశాలను జారీ చేసింది.
దీపావళి ముగిసాక, నవంబర్ 1 తర్వాత కొన్ని పరిమితులకు లోబడి టపాసులను విక్రయించుకోవచ్చని తెలిపింది.
అయితే అప్పుడే మార్కెట్‌లో వాటికి ప్రత్యామ్నాయం వచ్చేసింది. సుప్రీం కోర్టు నిషేధంతో చైనా ఈ-టపాసులకు మార్కెట్‌లో హఠాత్తుగా డిమాండ్ పెరిగింది.
ఈ-టపాసులు అంటే ఎలెక్ట్రానిక్ టపాసులు. వీటిని వెలిగించడానికి నిప్పు అక్కర్లేదు. వీటిని విద్యుత్‌తో వెలిగిస్తారు. వీటి వల్ల కాలుష్యం ఉండదు.
ఈ-టపాసులలో శబ్దం పెద్దగా రావడానికి వాటిలో స్పీకర్‌లను అమరుస్తారు. వాటిలో ఉన్న సర్క్యూట్ డివైజ్‌లకు విద్యుత్ సప్లై చేసినపుడు వాటి నుంచి పెద్ద శబ్దం వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ-టపాసులు ఎలా పని చేస్తాయి?
వీటిని రిమోట్ ద్వారా పేలుస్తారు. ఇవి రకరకాల శబ్దాలు, వెలుగులను విరజిమ్ముతాయి.
దిల్లీ ఎలక్ట్రానిక్స్ ట్రేడర్స్ యూనియన్ ప్రతినిధి అరవింద్ ఖురానా బీబీసీతో మాట్లాడుతూ, క్రమంగా ఈ చైనా టపాసులకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.
వీటి వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, ఇది పిల్లలకు కూడా ఎంతో సురక్షితమని ఈ-టపాసుల విక్రేతలు చెబుతున్నారు.
అయితే మామూలు టపాసుల కన్నా వీటి ఖరీదు ఎక్కువ. మార్కెట్‌లో వీటి విలువ రూ.400 నుంచి రూ.2,000 వరకు ఉంటోంది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
సుప్రీం ఆదేశాలు ఏమంటున్నాయి?
టపాసులను నిషేధించాలంటూ ముగ్గురు పిల్లల తరపున దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దీపావళి టపాసుల విక్రయాలపై నిషేధం విధించింది.
ఇప్పటివరకు జారీ చేసిన అన్ని శాశ్వత, తాత్కాలిక లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.
దిల్లీలోని కాలుష్యం కారణంగా తమ ఊపిరితిత్తులు సరిగా ఎదగలేదని ముగ్గురు పిల్లలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
గతంలోనూ ఈ-టపాసులు ఉన్నా, వాటికి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు.
ఇప్పుడు టపాసులపై సుప్రీం నిషేధంతో ఒక్కసారిగా వాటికి డిమాండ్ పెరిగింది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








